14, సెప్టెంబర్ 2013, శనివారం

తెలంగాణ తేజోమూర్తి బూర్గుల రామకృష్ణరావు


September 14, 2013

నిజాం పరిపాలనలో అణచి ఉంచబడ్డ తెలంగాణ ప్రజల్లో రాజకీయ చైతన్యానికి, సాంస్కృతిక వికాసానికి పాదుకలు వేసిన మహనీయుడు బూర్గుల. సమకాలీన ఉద్యమాలన్నింటిలో రామకృష్ణరావు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ స్వాతంత్య్ర పోరాటం, గ్రంథాలయోద్యమం, స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, విశాలాంధ్ర ఉద్యమం అన్నింటికీ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. ఏ రంగంలోనైనా వాతావరణం కలుషితమైనపుడు ఆయన వాటి నుంచి స్వచ్ఛందంగా వైదొలగారు. రాజకీయ, సాహితీ రంగాలలో ప్రసిద్ధి పొందిన బహుభాషా కోవిదులైన రామకృష్ణరావు కల్వకుర్తి దగ్గరలోని పడకల్ గ్రామంలో 1899 మార్చి 13న జన్మించారు. వీరి స్వగ్రామం బూర్గుల; ఇంటి పేరు పుల్లం రాజు వారు. అయితే స్వగ్రామమైన బూర్గుల నామమే వీరి ప్రఖ్యాత గృహనామమైనది. 1967 సెప్టెంబర్ 14న మృతి చెందారు.

బూర్గుల వారు బొంబాయిలో ఎల్.ఎల్.బి. పట్టాపొంది 1923లో హైదరాబాదులో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఈ వృత్తిని కొన్ని రోజులే కొనసాగించారు. మాడపాటి వారి పరిచయం వల్ల ప్రజాసేవకు అంకితమై వైజ్ఞానిక సాహిత్య రంగాల్లో కృషి సల్పారు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొని రెండు పర్యాయాలు జైలుశిక్ష అనుభవించారు. హైదరాబాదు ప్రధాని మీర్జా యిస్మాయిల్ ఇచ్చిన న్యాయశాఖామాత్య పదవిని వదులుకొని ప్రజాసేవకే అంకితమైన తెలంగాణ వైతాళికమూర్తి రామకృష్ణరావు.

బూర్గుల రామకృష్ణరావు రాజకీయ సాహితీ రంగాలలో ప్రసిద్ధిపొందిన బహుభాషా కోవిదులు. గొప్ప మానవతా వాది, అన్యాయాలను నిలదీసిన ప్రజా ఉద్యమకారుడు. ప్రజాపక్షం వహించి నిజాం నిరంకుశత్వాన్ని ఎదురించిన గొప్ప పోరాట యోధుడు. ఉత్తమ సాహితీవేత్త, గొప్ప సంఘసంస్కర్త, రాజనీతి దురంధరుడు.

తెలంగాణలో సాంస్కృతిక, సాహిత్య చైతన్యాన్ని నింపిన శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి కార్యదర్శిగా పనిచేసి రజతోత్సవ వేడుకలు నిర్వహించడమే కాక ఉత్తమ సాహిత్యం వెలువడాలని ఆశించారు. దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించి తెలంగాణ సమాజానికి దశ దిశ నిర్దేశం చేశారు. రజాకార్ల అల్లర్లలో నలిగిపోయిన తెలంగాణ ప్రాంతంలో సుస్థిరత ఏర్పడడంలో బూర్గుల వారు క్రియాశీలక ప్రాత పోషించారు. పోలీసు చర్య తరువాత ఏర్పడిన వెల్లోడి ప్రభుత్వం (1950)లో రెవెన్యూ విద్యా శాఖా మంత్రిగానూ, 1952లో జరిగిన ప్రథమ సార్వత్రక ఎన్నికల్లో షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి అఖండ విజయంతో గెలుపొంది హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలన అంతమైన కొద్దికాలంలోనే వారు తమ పరిపాలనా దక్షతతో సుస్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పర్చారు. తెలంగాణలో జాగీర్‌దార్, ముఖ్తేదార్ పద్ధతులను నిర్మూలించి కౌలుదారీ చట్టం ప్రవేశపెట్టి భారతదేశంలోనే మొదటి భూ సంస్కరణలకు ఆద్యుడయ్యారు.

అప్పటివరకు తెలంగాణలో ఉర్దూ మాధ్యమంలోనే విద్యా విధానం ఉండేది. తొలిసారిగా ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనకు పునాది వేశారు. ఒక్క తెలంగాణలోనే కాక పొరుగు ప్రాంతాలు కూడా బూర్గుల వారి సేవాభాగ్యాన్ని పొందాయి. ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం కేరళ రాష్ట్ర గవర్నర్‌గా (నవంబర్ 1956 నుంచి జూన్ 1960). వారు కనబరచిన రాజనీతిజ్ఞత రాజకీయ కోవిదుల మన్ననలను పొందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికీ గవర్నర్‌గా ఉండి 1962 ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1967లో రాజకీయ సన్యాసం చేశారు.

న్యాయవాద వృత్తిలో ఉన్నా, స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నా, రాజకీయ వేత్తగా ఉన్నత పదవులను నిర్వహించినా రామకృష్ణరావులోని సాహిత్య అభిలాష కనిపిస్తూనే ఉండేది. అధ్యయనం సాహిత్య పరిశీలన ఆయనకు నిత్య వ్యాపకాలుగా ఉండేవి. వివిధ సందర్భాల్లో వివిధ భాషల్లో రచంచిన కవితలు, వ్యాసాలు అనువాద రచనలే అందుకు సాక్ష్యాలు.

బూర్గుల వారికి విశిష్ట వ్యక్తిత్వం చిన్ననాటి నుంచే అలవడింది. ఇంటర్ దశలోనే బంధుమిత్రులతో కలిసి యంగ్ మ్యాన్ యూనియన్ స్థాపించారు. ఈ సంఘ ఆధ్వర్యంలో గ్రంథాలయ స్థాపన వివిధ సామాజిక అంశాలపై ఉపన్యాసాలు ఇస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. 1921లోనే హైదరాబాద్‌లో బాధ్యతాయుత ప్రభుత్వాలు ఏర్పడాలని రాజకీయ సంస్కరణలు జరగాలని మాడపాటి హనుమంతరావు, రంగారావు గార్లతో కలిసి సంస్కరణ సంఘం (స్టేట్ రీఫామ్స్ అసోసియేషన్) నివేదిక తయారు చేశారు. నిజాం ప్రభుత్వ ఆజ్ఞలను ఉల్లంఘించడం వల్ల 1942లోనూ, 1947లోనూ కొన్ని రోజులు జైల్లో ఉండి కూడా తెలంగాణ సమాజానికి అండగా నిలిచి ఉద్యమాన్ని నడిపారు. 1948 జనవరిలో ప్రభుత్వ ఏజెంట్ జనరల్‌గా హైదరాబాద్ వచ్చిన కె.యం. మున్షీని నిజాం ఆజ్ఞలకు విరుద్ధంగా అందరికన్నా ముందే సందర్శించి పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ సంవత్సరంలోనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడై ప్రజా ఉద్యమానికి సారథ్యం వహించారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి కృషి సల్పిన తీరు విశేషమైనది. రాజకీయ రంగంలోనే కాకుండా సాంఘిక సాంస్కృతిక రంగాల్లో వీరు చేపట్టిన సేవ ప్రత్యేకమైనది. ఖాదీ బోర్డు విచారణ సంఘం, మధ్యప్రదేశ్ విషయ పరిశీలన సంఘం, ఆంధ్రప్రదేశ్ భారత్ సేవక సమాజం అధ్యక్షులుగా ఉన్నారు. చరిత్ర, శాస్త్ర విజ్ఞానాల తెలుగు ఉర్దూ అకాడమీ, భారతీయ విద్యాభవన్, ప్రశాంతి విద్వత్ పరిషత్ అధ్యక్షులుగా గొప్ప సాంస్కృతిక సేవలందించారు. క్లాసికల్ లాంగ్వేజి కమిషన్ సభ్యులుగా, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, సంస్కృత పరిషత్‌ల ఉపాధ్యక్షులుగా భాషా సేవలు అందించారు.

సుదీర్ఘ రాజకీయ, సాంఘిక జీవితంతో ముడిపడిన బూర్గులవారు బహుభాషావేత్తలైన సాహిత్యమూర్తి. అప్పకవి మహబూబ్‌నగర్ జిల్లా వాడని పరిశోధన వ్యాసం ద్వారా నిరూపించారు. వీరు రచించిన వ్యాసాలు 'సారస్వత వ్యాస ముక్తావళి' పేరుతో అచ్చయింది. పండిత రాజ పంచామృతం, కృష్ణశతకం, వేంకటేశ్వర సుప్రభాతం, నర్మద్‌గీతాలు, పుష్పాంజలి, తొలిచుక్క (కవితలు), నివేదన (కవితలు), పారశీక వాఙ్మయ చరిత్ర మొదలైన గ్రంథాలు వెలువరించడమే కాకుండా ఎన్నో కావ్యాలకు పీఠికలు రాశారు. అనువాద రచనలు కూడా చేశారు. వానమామలై, కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డి ప్రోత్సాహంతో 'తెలంగాణ రచయితల సంఘం' ఏర్పాటు చేసి సాహితీలోక ప్రసిద్ధుడయ్యారు.
- డాక్టర్ గుంటి గోపి
తెలుగు ఉపన్యాసకులు
(నేడు బూర్గుల వారి వర్ధంతి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి