‘నీ
కలలు సాకారం కావాలంటే, నువ్వు కలలు కంటూనే ఉండా’లని మాజీ రాష్ట్ర పతి
అబ్దుల్ కలాం ఉద్బోధ. కలలు కనడం చేతకాని జాతికి భవిష్యత్తు ఉండదని ఆయన
అంటారు. ఈరోజుల్లో మెడిసిన్, ఐఐటీ వంటి కోర్సులు చదవాలని విద్యా ర్థులు
కేవలం ‘గాలిలో మేడలు’ కట్టుకుంటూ కూర్చోవడం లేదు. ఆ కలను నిజం చేసుకోడానికి
అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఒక దీర్ఘకాలిక ప్రణాళికగా చదువులను
తీర్చిదిద్దుకుంటున్నారు. తమ పిల్లలు ఒక డాక్టరో, ఐఐటీ నిపుణుడో,
శాస్త్రవేత్తో కావాలనుకునే తల్లిదండ్రులు ఆరో తరగతినుంచే అందుకు సంబంధించిన
శిక్షణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అప్పో సొప్పో చేసైనా పిల్లల చదువులపై
లక్షల రూపాయలు వెచ్చించడానికి ఈరోజున వెనకాడే తల్లిదండ్రులు చాలా అరుదు.
ఉన్నత చదువుల పట్ల ఒక ఆరోగ్యకరమైన స్పృహ ఆర్థిక వ్యత్యాసాలకు అతీతంగా
మేలుకుంటోంది. ఇది దేశాభ్యున్నతికి ఎంతో దోహదపడే పరిణామం. కానీ,
పాలకుల చర్యలు, నిర్ణయాలు ఆ స్పృహపై నిప్పులు పోస్తున్నాయి. పసి కలలను
కసిగా చిదిమేస్తున్నాయి. మన రాష్ట్రంలో గత రెండేళ్లుగా ప్రభుత్వం
విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న తీరు మరింత ఘోరమూ, హేయమూ.
ఉపకారవేతనాలకు, ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికీ భారీ ఎత్తున పెట్టిన కోతా,
ఉపకారవేతనాల విడుదలలో అసాధారణ జాప్యం బడుగు విద్యార్థుల గుండెల్లో ఎంతటి
బడబాలాన్ని నింపాయో, ఎంతమందిని చదువులకు దూరం చేశాయో తెలియనిదికాదు. పులి
మీద పుట్రలా, వైద్యవిద్యా ప్రవేశ పరీక్షకు సంబంధించిన తాజా నిర్ణయం వేలాది
మంది విద్యార్థుల ఆశల కొమ్మపై గొడ్డలి పెట్టు అవుతోంది. తల్లిదండ్రులు,
అధ్యాపకులు, కళాశాలల యాజమాన్యాలు సహా ప్రతి ఒక్కరిలోనూ భయాందోళనలు
నింపుతోంది. వైద్యం, ఇంజనీరింగ్ వంటి కోర్సులలో ప్రవేశానికి ఏ
రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఇప్పటివరకు ఎంసెట్ వంటి అర్హతా పరీక్షను
నిర్వహిస్తున్నాయి. వైద్యవిద్యా ప్రవేశ పరీక్షలో పారదర్శకత ఉండాలనీ, అందుకు
వీలుగా దేశమంతటా ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహించాలనీ ఆమధ్య సుప్రీంకోర్టు
భారత వైద్యమండలి (ఎంసీఐ)ని ఆదేశించింది. తదనుగుణంగా ఎంసీఐ జాతీయ అర్హతా
-ప్రవేశపరీక్ష (నీట్) పేరుతో ఒక విధానానికి రూపకల్పన చేసింది. సీబీఎస్‌ఈ
సిలబస్ వెలుగులో దానికి ఒక పాఠ్యప్రణాళికను కూడా రూపొందించి చాలా రోజుల
క్రితమే వెబ్‌సైట్‌లో ఉంచింది. జాతీయ స్థాయిలో ఉమ్మడి పరీక్ష ఉండాలన్న
నిర్ణయాన్ని సూత్రరీత్యా ఎవరూ వ్యతిరేకించడం లేదు. ఇప్పుడున్న విధానంలో
వైద్యవిద్యలో ప్రవేశం కోసం విద్యార్థులు చాలామంది పది చోట్ల పది పరీక్షలు
రాయవలసివస్తోంది. పది రకాల ప్రశ్నపత్రాలలో తర్ఫీదు
పొందవలసివస్తోంది. వ్యయప్రయాసలకూ లోనవుతున్నారు. కనుక, ఉమ్మడి
పరీక్షావిధానం ఆమేరకు వారికి అనుకూలమే. కానీ, వచ్చే సంవత్సరం నుంచే ఉమ్మడి
పరీక్ష నిర్వహిం చాలని నిర్ణయించడం, దానికి రాష్ట్రప్రభుత్వం తలూపడమే
దారుణం. విద్యార్థుల మనోభావాల పట్ల, భవిష్యత్తుపట్ల బొత్తిగా లక్ష్యం
లేదనడానికి ఇదే నిదర్శనం. ఇంటర్ పరీక్షలు నాలుగు మాసాల దూరంలో ఉన్నాయి.
వాటితోపాటే, ఎంసెట్‌కూ వేలు, లక్షలు ధారపోసి దాదాపు 70 వేల మంది
విద్యార్థులు వైద్య విద్యా ప్రవేశపరీక్షకు సన్నద్ధమవుతున్నారు. వీరిలో 30
వేల మంది తెలుగు మాధ్య మం విద్యార్థులు ఉంటారు. ఉమ్మడి పరీక్షావిధానంలో
ఇంతవరకు ఒక స్పష్టత రాలేదనీ, తుది సిలబస్‌ను ప్రకటించలేదనీ అంటున్నారు.
అదొక సమస్య కాగా, ఉమ్మడి పరీక్షకు ఆధారం చేసుకున్న సీబీఎస్‌ఈ సిలబస్ ఇంటర్,
ఎంసెట్ సిల బస్‌లను మించి 50 శాతం ఎక్కువ ఉంటుంది. పుస్తకాల లభ్యతా
సమస్యే. దీనికి తోడు, తెలుగు మాధ్యమం విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్
అనువాదం సిద్ధం కాలేదని సమాచారం. ఈ పరిస్థితిలో, ఈ
విద్యాసంవత్సరంనుంచే ఉమ్మడి పరీక్ష నిర్వహించడానికి రాష్ట్రప్రభుత్వం ఎలా
ఆమోదించిందన్నదే ఆశ్చర్యకరం. విద్యా ర్థుల ప్రయోజనాలపట్ల ఏమాత్రం స్పృహ,
బాధ్యత ఉన్న ఏ ప్రభుత్వమైనా ఇంత నిష్పూచీగా వ్యవహరిస్తుందా? ఇంత
నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందా? విద్యార్థులు, తల్లి దండ్రులు, అధ్యాపకులను
సంప్రదించకుండానే, సాధకబాధకాలను అన్ని కోణాల నుంచీ పరిశీలించకుండానే ఇంత
కీలక నిర్ణయాన్ని రుద్దే సాహసం చేస్తుందా? ఇతర రాష్ట్రాల
స్పందనను చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవకపోవడం మరింత విస్మయకరం. తమిళనాడు
ప్రభుత్వం ఉమ్మడి పరీక్షను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి
మినహాయింపు సాధించుకుంది. తమ రాష్ట్రంలో ప్రవేశపరీక్షలను మొత్తంగా
రద్దుచేశామన్న కారణంతో ఆ ప్రభుత్వం ఉమ్మడి పరీక్షను వ్యతిరేకించింది.
ఉమ్మడి పరీక్షకు ఆమోదం తెలిపినప్పుడు, అందుకు అవసరమైన సన్నాహాలు చేసుకోవడం
ప్రభుత్వం మౌలికబాధ్యత. కనీసం సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనువాదాన్ని సిద్ధంచేసి
తెలుగు మాధ్యమం విద్యార్థులకు న్యాయం చేయాలన్న ఆలోచన కూడా మన
రాష్ట్రప్రభుత్వంలో అంకురించకపోవడాన్ని ఏమనాలి? పరీక్షావిధానం విషయంలో ఒక
స్పష్టత రాకుండా, తుది సిలబస్ సిద్ధం కాకుండా, అయిదు మాసాల వ్యవధిలో ఉమ్మడి
పరీక్షకు సిద్ధం కావలసిన పరిస్థితిని విద్యార్థులపై రుద్దడమంటే వారి
భవిష్యత్తుతో చెలగాటమాడడమే. వారి కలలను మొగ్గలోనే తుంచివేసే కర్కశత్వమే
అందులో ఎవరికైనా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తల్లిదండ్రులు,
విద్యార్థులు ప్రణాళికాబద్ధమైన చదువుల యుగంలోకి ప్రవేశిం చారనీ; లక్షలు
ధారపోసి అయినాసరే తమ పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయాలన్న చైతన్యం నేడు
అతిసామాన్యులలో సైతం మేలుకున్నదన్న గ్రహింపు ప్రభుత్వంలో ఉంటే ఇంత
ఆషామాషీగా వ్యవహరించేది కాదు. ఇప్పటికైనా తప్పు దిద్దుకోవాలి. ఉమ్మడి
పరీక్ష గండకత్తెర నుంచి విద్యార్థులను కాపాడాలి. తగిన సన్నాహాలు చేసిన
తర్వాతే దానిని తలకెత్తుకోవాలి.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి