సోషలిజం
ప్రాశస్త్యాన్ని సగర్వంగా చాటడానికి సోవియట్ యూనియన్, చైనా దేశాల ప్రజల భౌతిక జీవనం
ఒకప్పుడు నిలువెత్తు నిదర్శనంగా ఉండేది. నేడు ఆ సోవియెట్ యూనియన్ దానితోపాటు అక్కడి
సోషలిజం ప్రపంచ పటం నుండే మాయ మైంది. చైనాలో నేడు సోషలిస్టు సమాజం ఉనికిలో ఉన్నదని
గుండెపై చేయివేసుకుని చెప్పలేనిస్థితి! దీంతో సోషలిజాన్ని వ్యతిరేకించే వారందరూ
‘మేధో మథనాలు’ చేసి ‘‘ఇంకెక్కడి సోషలిజం? ఇంకెక్కడి మార్క్సిజం? మానవ నైజానికి
మార్క్సిజానికి పొసగదని చెప్పాముగదా! నేనూ, నా వాళ్లు అనే స్వార్థం, మానవ సహజ
స్వభావమండీ! అలాంటప్పుడు ఈ ప్రజలందరూ అందునా కష్టజీవులందరూ ఏకమై మొత్తం మానవ సమాజ
విముక్తి కోసం పోరాడి, మనిషిని మరో మనిషి, ఏ విధంగానూ అణచివేయ కుండా, సమానత్వం
సౌభ్రాతృత్వం విలసిల్లే కమ్యూనిస్టు సమాజం సృష్టించి తీరుతారని బల్లగుద్ది ఎలా
చెబుతారు? మీరంతా స్వాప్నికులు, నేలమీద కాళ్లు లేని ఊహాజనిత విహారులూను’’ అనే
పండితులు ఇప్పుడు అధికమయ్యారు.
‘‘అంతదాకా ఎందుకండి మన దేశమే తీసుకోండి. 1857 తర్వాత, ఎన్నదగిన వీరతెలంగాణ
విప్లవ సాయుధపోరాటమని ఎంతో గొప్పగా చెప్పుకునే వారు కదా! ఆ పోరాట విరమణ జరిగి 60
సంవత్సరాలు దాటాయి. అయినా అటు వంటి సాయుధ విప్లవాన్ని మీరు తీసుకురాగలిగారా?
అక్కడక్కడా, అప్పుడ ప్పుడూ తుపాకీ చప్పుళ్లు చేస్తున్న విప్లవ కమ్యూనిస్టుల చర్యలనే
విప్లవ దశ అని అనగలరా? విప్లవం లేదు సరే! ఎన్నికలలో సైతం మీ కమ్యూనిస్టుల ప్రభ,
ప్రభంజనం తగ్గిపోవడం లేదా? కేరళ, బెంగాల్‌లలో ఏమైంది? అంటూ మహ దానందపడే కమ్యూనిస్టు
వ్యతిరేకులు పెరిగారు.
అంతేకాదు కష్టజీవులూ, పేద రికమూ ఇవన్నీ కమ్యూనిస్టుల
కల్పనలుగానే ఉండిపోతాయి చూడండి? దేశం, ప్రపంచం శాస్త్రసాంకేతిక అభివృద్ధితో ఎంతో
పురోగమిస్తున్నది. మీరనే పెట్టు బడిదారీ విధానం ఇప్పుడు లేదండి. ఇప్పుడున్నది ఉదార
పెట్టుబడిదారీ ఆర్థిక విధానం, పేదరికం కూడా ఇక ఉండదు. ఇక మీ కమ్యూనిస్టులకు
చోటెక్కడ? మీ మార్క్సిజానికి భవిష్యత్తు ఏమిటి?’’ ఇలా ప్రశ్నల పరంపర
వింటున్నాం.
ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు ఆత్మరక్షణలో పడుతున్న తరుణంలో-
‘‘వాల్‌స్ట్రీట్‌ను ఆక్రమించండి! మేము 99 మందిమి మీరు ఒక్కరు’’ అన్న నినా దం
వెల్లువెత్తడం ముదావహం. ప్రపంచ పోలీసుగా తనను తానే నియమిం చుకుని, ప్రపంచంలో
దోపిడీవర్గాలకు అండదండగా నిలిచిన అమెరికాలో ఈ ఉద్యమం వాల్‌స్ట్రీట్ వద్ద 16 మంది
నిరసనకారులతో ఆరంభమై నేడు ప్రపం చంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న బ్రిటన్,
ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇటలీ. ఒకటేమిటి 70 దేశాలలో 1,000కి పైగా నగరాల్లో
దావానలంలా వ్యాపించింది. వివిధ ప్రాంతాలలో వందల వేల సంఖ్యలో ప్రపంచవ్యాపితంగా
లక్షలాది ప్రజా నీకం వీధులలోకి వచ్చి, రోజుల తరబడి అక్కడే తిష్టవేసి, అవధులు లేని
ఆర్థిక దోపిడీకి, అవినీతికి ఆలవాలమైన కేవలం ఒక్క శాతం మంది దోపిడీదారుల, వారి
ఆర్థిక సంస్థలకు అండగా ఉన్న ఐఎంఎఫ్ ఆగడాలు ఇంకానా... ఇకపై చెల్లవు అని చెవులు
చిల్లులుపడేట్లు నినదిస్తున్నారు.
సముద్రంలా జనఘోష! ఈ దృశ్యాన్ని చూసేందుకు
మార్క్స్, ఎంగెల్స్‌లు జీవించి ఉంటే ఎంత పొంగిపో యేవారో! తాము ప్రతిపాదించిన
కమ్యూనిస్టు సమాజ ఆవిర్భావ దిశగా పడు తున్న అడుగుజాడలు కావా ఇవి! ఈ పరిణామక్రమం,
అప్పుడప్పుడు ఆటు పోట్లు ఎగుడుదిగుళ్లు ఎదురైనా ఈ దశలో తాము సూచించిన
మహాప్రస్థానాన్ని మరింత వేగవంతం చేసేందుకు ఏ సందేశం ఇచ్చి ఉండేవారో! మరెంత విశ్వాసం
నింపి ఉండేవారో!
మార్క్సిజానికి ఈ ఉద్యమానికి సంబంధం ఏమిటి? ఈ ఉద్యమానికి,
మార్క్స్ చెప్పిన శ్రామికవర్గ నాయకత్వమేది? పోనీ ఈ ఉద్యమకారులలో ఎవరైనా, తాము
మార్క్సిస్టులమని, తమ లక్ష్యం సోషలిజమనీ, కమ్యూ నిజమనీ ప్రకటించిన వారున్నారా? వీరి
డిమాండ్లలో ఎక్కడా రాజ్యాధికార ప్రసక్తిలేదే? ఈ మహా ప్రజానిరసన వెనుక ఒక
సిద్ధాంతంగానీ, ఒకపార్టీ గానీ, ఒకే నాయకత్వం కాని లేనిమాట నిజమే! కానీ ఒకసారి ఈ
ఉద్యమకారుల స్వరూప స్వభావాలను విశ్లేషించి మార్క్స్ ప్రవచించిన సిద్ధాంతాన్ని అన్వ
యించే ప్రయత్నం చేద్దాం. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని జుకోటి పార్కు వద్ద కూడిన
1,631 మంది నిరసనకారులు అక్టోబర్ 18వ తేదీన సర్వే రూపంలో వెల్లడించిన కొన్ని
అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
ఆ సర్వేలో 40 శాతం మంది- ఒబామా
మంచివాడని నమ్మాం, ఆయన ముంచాడు అన్నారు. 20 శాతం మంది- ఒబామాను అసలు ఎప్పుడూ నమ్మనే
లేదని చెప్పగా, 22 శాతం ఇప్పటికీ నమ్ముతున్నాం అన్నారు. ఉద్యమకారులలో 50 శాతం మంది
పూర్తి కాలం ఉద్యోగులు. 13 శాతం 75,000 డాలర్లు (సుమారు 32 లక్షల రూపాయలు)
సంపాదిస్తున్నారు. అవసరమైతే తమ ఆశయసాధన కోసం హింసామార్గాన్నయినా అనుసరించేందుకు
సిద్ధమేనని అనేవారు 37 శాతం దాకా ఉన్నారు. 46 శాతం మంది పెట్టుబడిదారీ విధానం
మంచిదే కానీ, అది విశృంఖలంగా ఉండరాదు, క్రమబద్ధీకరణ జరగాలి అంటు న్నారు.
37
శాతం మంది ఈ పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించడం అసాధ్యం అంటుండగా 4 శాతం మంది అసలీ
వ్యవస్థలో సంపద పునఃపంపిణీ మరో రకంగా జరిగితీరాలని అంటున్నారు. అయితే, ఈ
పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించడం అసాధ్యం అంటున్న వారిని మరి ఏం చేయాలి? అని
అడిగితే - రిపబ్లికన్ - డెమొక్రటిక్, ఈ రెండు పార్టీల గుత్తాధిపత్య పాలన పోవాలనీ,
లేదా డెమొక్రటిక్ పార్టీని మరింత ప్రజానుకూలంగా మార్చి బలోపేతం చేయా లనీ, ఇలా
చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ చేరిన నిరసనకారులలో 27 శాతం తాము డెమొక్రటిక్ పార్టీ
వారమనగా, 2.5 శాతం తాము రిపబ్లికన్లమని చెప్పు కున్నారు. 70 శాతం తాము
స్వతంత్రులమని చెప్పారు. 2010 మధ్యంతర ఎన్నికల్లో ఓటు వేసినవారు 39 శాతం. ఓటు వేయని
వారు 50 శాతం. అప్పటికింకా తమకు ఓటు హక్కు రాలేదన్న వారు 5 శాతం. ఇదే సమయంలో
వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక విశ్లేషకుడు.
‘‘ఈ ఉద్యమంలో కొందరు సాధారణ
అమెరికన్ల భావనకు విరుద్ధంగా, ప్రమాదకరంగా వామపక్ష భావజాలానికి తీవ్రంగా ప్రభావితమై
ఉన్నారు. వారు మన స్వేచ్ఛా వాణిజ్య అవగాహననే అంగీకరించడం లేదు’’ అని రాయగా ఆయన
గణాంకాలు సరైనవే అయినా దానిపై ఆ విశ్లేషణ సరికాదు’ అని మరొకరు ఖండించారు. ఇంకొకరు
‘క్యాపిటలిస్ట్ విధానాలకు సోషలిస్టు’ స్ఫూర్తి కావాలని నిరశనకా రులు
భావిస్తున్నట్లున్నది అని రాశారు. పైన పేర్కొన్న గణాంక విశ్లేషణకున్న పరిమితులను
దృష్టిలో ఉంచుకునే మార్క్స్ సూత్రీకరించిన గమ్యం దిశగానే మన సమాజ ప్రస్థానం
జరుగుతున్నదనడానికి ఈ సమకాలీన వాల్‌స్ట్రీట్ ఆక్రమణ ఉద్యమం ఒక సజీవ
ఉదాహరణ.
మార్క్స్ ‘కమ్యూనిస్టు మ్యానిఫెస్టో’లో ఇచ్చిన పిలుపు ‘‘ప్రపంచ
కార్మికు లారా ఏకంకండి’’! అని. నేడు జరుగుతున్నది అదే. ఇటీవలనే ఈజిప్టు తదితర
అరబ్బు దేశాలలో లక్షలాది మంది వీధులలోకి రావడం చూశాం! అంతెందుకు మన దేశంలో కూడా
ఇటీవలనే అన్నా హజారే నడిపిన అవినీతి వ్యతిరేక ఉద్య మానికి బాసటగా లక్షలాది ప్రజలు
ప్రదర్శనలలో పాల్గొనడం మనమెరిగినదే! ఆ ప్రదర్శకులలో అత్యధికులకు తెలియకపోయినా’’
‘‘అవినీతి పెట్టుబడిదారీ విధానం రెండూ అవిభక్త కవలలే’’ అనే వాస్తవాన్ని ఆ ఉద్యమం
తిరుగులేని విధంగా నిరూపించింది.
‘‘ఊహాతీతంగా సంపదను సృష్టిస్తున్నప్పటికీ
సంక్షోభాలకు గురవడం పెట్టుబడిదారీ విధాన సహజలక్షణం’’. ఇది మార్క్స్ ప్రవచనం.
ఇప్పుడు అమె రికా, యూరప్ ఇతర పెట్టుబడిదారీ ప్రపంచం అంతా సంక్షోభాన్నే ఎదుర్కొం
టున్నది. తత్ఫలితమే విశ్వవ్యాపితంగా నిరుద్యోగం, ఆహార ధాన్యాల ధరల పెరుగుదల, జీవన
ప్రమాణాలు తగ్గడం, ఇటీవల అమెరికా ఎంతటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నదో
చూశాం. ‘‘సర్వసంపద సృష్టికర్తలైన శ్రామిక వర్గమే నూతన సమాజ నిర్మాణానికి
చోదకశక్తిగా ఉంటుంది’’ అని మార్క్సిజం చెబుతున్నది.
ఇప్పుడు మనం
ప్రస్తావించుకుంటున్న ఉద్యమంలో శ్రామికులు ఎక్కడ? అని ప్రశ్నించడం సాధారణంగా
సబబుగానే తోస్తుంది. కానీ, మార్క్స్ ఆనాడే శ్రమను- శారీరక శ్రమ, మేధోశ్రమగా
విభజించారు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో ఇటీవల జరిపిన ఒక సర్వే ప్రకారం
5-10 శాతం ప్రజలు వ్యవసాయం మీద జీవిస్తున్నారు. పరిశ్రమలలో శారీరక శ్రమ చేసే
కార్మికులు 20-30 శాతం, ఇక సేవారంగాలు (శాస్త్రసాంకేతిక రంగాలను కూడా కలుపుకుని)
60-65 శాతం మధ్య ఉన్నాయి. ఈ 60-65 శాతం మంది ఎవరు? వారు కూడా ఉత్పత్తి సాధనాలపై
యాజమాన్యం లేనివారే. మేధోశ్రామికులే కోట్లలో అదనపు విలువను స్పృజిస్తున్నవారే.
పెట్టుబడిదారీ విధానం గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్న వారిని, మధ్యతరగతిలో ఉన్నవారిని
కూడా రోడ్డు మీద పడేసి కలవారు లేని వారు అనే రెండు వర్గాలుగా విభజిస్తుందని కదా
మార్క్స్ చెప్పింది.
పెట్టుబడిదారీ విధానం తనకు తెలియకుండానే తనకు గోరీ
కట్టగల కార్మిక వర్గాన్నీ సృష్టిస్తుందని మార్క్స్ చెప్పారు. అంతేకాదు తన ప్రయోజనాల
కోసం పెట్టుబడిదారీ వర్గం ఉత్పత్తి శక్తులను అభివృద్ధి చేసుకుంటూ వెళ్లే ప్రక్రియలో
భాగంగా శాస్త్రసాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చింది.
నేటి మన సెల్‌ఫోన్లు,
ఇంటర్‌నెట్, కంప్యూటర్లు ఆ కోవకు చెందినవే! నేటి ఈ ఉద్యమంలో నిరసనకా రుల ప్రధాన
సాధనాలు అవే! ఇక మిగిలింది విప్లవమే. రానున్నది విశ్వవ్యాప్త సోషలిజమేననీ కాదు దీని
అర్థం. ఆ దిశగా సమాజ పురోగమనానికి, ఇదొక చిహ్నం. పుడమితల్లి దోపిడీ రహిత
కమ్యూనిస్టు సమాజాన్ని గర్భాన దాల్చి ఆ శిశువు ప్రసవం కోసం పడుతున్న పురిటి
నొప్పులు. ప్రతి నొప్పీ శిశువును బయటపడవేయగల ఆఖరి నొప్పికాదు. అంతేకాదు... ప్రసవం
సవ్యంగా జరిగి తల్లీ బిడ్డా క్షేమంగా ఉండాలంటే ప్రసవించే తల్లికి తగురీతిలో
సుఖప్రసవానికి సహకరించే సహాయకులో, మంత్రసానో ఉండాలి! ఆ మంత్రసాని పాత్రా
కమ్యూనిస్టు పార్టీది. ఈ ఉద్యమంలో ఆ పార్టీ పాత్ర లేదు! నిజానికి ఆ చైతన్యం కూడా
ఉన్నట్లు తోచదు. ‘సోవియెట్ యూనియన్‌లో, చైనాలో సోషలిజం ఏమైంది? పెట్టుబడిదారీ
విధానం పూర్తిగా అభివృద్ధి చెంది సర్వశక్తులూ కోల్పో యిన తర్వాత మాత్రమే ప్రపంచంలో
సోషలిజం సాధ్యమని మార్క్సిస్టు సిద్ధాం తం చెప్పింది. కానీ రష్యా, చైనాలలో అలా
కాకుండా ఇంకా భూస్వామ్య వ్యవస్థ ప్రధానంగా ఉన్న దశలోనే సోషలిస్టు వ్యవస్థ
ఏర్పడింది. ఏదేమైనా మార్క్స్ మాటల్లోనే చెప్పాలంటే ‘‘ఈ పరిస్థితి ఎంతో సంతోషం
కలిగిస్తున్నది. సముద్ర స్నానం చేసినంత హాయిగా ఉంది’’
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి