28, నవంబర్ 2011, సోమవారం

రిటైల్ ఎఫ్‌డిఐలపై ఏకాభిప్రాయం


*రాజకీయ పార్టీలకు పారిశ్రామిక రంగం విజ్ఞప్తి

న్యూఢిల్లీ, నవంబర్ 28: మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)ను అనుమతించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతివ్వాలని, ఈవిషయంలో అన్ని రాజకీయ పార్టీ లు ఏకాభిప్రాయానికి రావాలని భార త పరిశ్రమల రంగం విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతివ్వాలని రాజకీయ పక్షాలను కోరుతున్నాం. దీనివల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎస్‌ఎంఇ)కు మేలు జరుగుతుంది తప్ప ప్రతికూల పరిణామాలు ఉండవని సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ సోమవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఫిక్కి ప్రధాన కార్యదర్శి రాజీవ్‌కుమార్ కూడా ఇదే తరహాలో విజ్ఞప్తి చేశారు. రిటైల్ ఎఫ్‌డిఐల వల్ల ఎస్‌ఎంఇకి మేలు జరగడమే కాకుండా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
దీనివల్ల దేశ ఎస్‌ఎంఇ సెక్టార్‌కి రిటైల్ దిగ్గజాల నుంచి సాలీనా అదనంగా 60 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు లభించే అవకాశం వుందని అన్నారు. రిటైల్ ఎఫ్‌డిఐల వల్ల ఒనగూరే దీర్ఘకాలిక ప్రయోజనాలను గురించి రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాలని రిటైల్‌పై సిఐఐ జాతీయ కమిటీ చైర్మన్, ఆదిత్య బిర్లా రిటైల్ సిఇఓ థామస్ వర్గీస్ అన్నారు. ఈ అంశంపై ఇరుకుగా యోచించరాదని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా. రిటైల్ ఎఫ్‌డిఐల వల్ల వినియోగదార్లకు, ఎస్‌ఎంఇకి, ఉపాధి కల్పన రంగానికి జరిగే మేలు గురించి ఆలోచించమని కోరుతున్నాని అన్నారు. పారిశ్రామిక చాంబర్ అసోచం సైతం రిటైల్ లో విదేశీ పెట్టుబడులను స్వాగతిస్తూ రాజకీయ పక్షాలు దీనికి ఆటంకం కలిగించరాదని కోరింది. రిటైల్ ఎఫ్‌డిఐ వల్ల పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు ఏర్పడటమే కాకుండా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు సాయపడగలదని పేర్కొంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి