13, నవంబర్ 2011, ఆదివారం

మాజీ రాష్ట్రపతి ‘కలాం’ వళ్ళంతా వెతికిన తెల్లతోలు దురహంకారులు


అమెరికా దురహంకారం మరో రెండు సార్లు భారతీయ గౌరవాన్ని తిరస్కరించింది. భారత ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా తన దురహంకారం తగ్గించుకునేదే లేదో పొమ్మంది. అంతర్జాతీయ ప్రొటోకాల్ తన ముందు దిగదుడుపేనని చాటి చెప్పింది. భారత నాయకులు, ప్రభుత్వాధికారుల దేశాభిమానానికి మరోసారి ‘నిరూపించుకొమ్మని’ సవాలు విసిరింది.
సెప్టెబరు నెలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అమెరికా వెళ్ళిన సందర్భంగా న్యూయార్క్ నగరంలోని ‘జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయం’ లో రెండుసార్లు ప్రొటోకాల్ ను ఉల్లంఘిస్తూ ఆయనను ఒళ్ళంతా తడిమి విమానయాన అధికారులు అవమానపరిచారు. భారత మాజీ రాష్ట్రపతి ఐనా, అమలాపురం అప్పారావు ఐనా తనకు లెక్కలేదనీ, తన నిబంధనలముందు అంతర్జాతీయ ప్రొటోకాల్ కూడా దిగదుడుపేనని చాటి చెప్పింది. మాజీ రాష్ట్రపతిగా అంతర్జాతీయంగా విమానాశ్రయాల వద్ద చెకింగ్ నుండి మినహాయింపు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ఆయన తొడుక్కున బూట్లు సైతం విప్పించి తనిఖీ చేసింది.
సెప్టెంబరు 29 న జరిగిన ఈ అవమానం సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సంఘటనను ధృవీకరించింది. పేలుడు పదార్ధాల ఉన్నాయేమోనన్న అనుమానంతో భారత మాజీ రాష్ట్రపతి వళ్ళు తడమడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నట్లుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అమెరికానుండి వచ్చే అధికారులు, నాయకులను సైతం ప్రతీకార తనీఖీలు చేపట్టవలసి ఉంటుందని హెచ్చరించింది. అటువంటి తనిఖీలు కట్టిపెట్టనట్లయితే అటువంటి ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నట్లుగా ప్రకటించింది.
విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎం.కృష్ణ అమెరికాలోని ఇండియా రాయబారి నిరుపరావుతో ఈ విషయమై మాట్లాడాడు. ఈ అంశాన్ని అమెరికాలోని అత్యున్నత స్ధాయిలో లిఖిత పూర్వకమైన ఫిర్యాదు చేయాలని ఆదేశించాడు. ఘోరం ఏమిటంటే అబ్దుల్ కలాం విమానంలో తన సీట్లో కూర్చున్న తర్వాత కూడా ఆయన చేత జాకెట్, బూట్లు విప్పించి వేరే చోటికి తీసుకెళ్ళి అందులో పేలుడు పదార్ధాలు ఉన్నాయేమోనని తనిఖీ చేశారు. సాదా సీదాగా కనిపిస్తున్న అబ్దుల్ కలాం ను అంత త్వరగా వదిలివేయాలని అమెరికా విమానయాన సిబ్బందికి మనస్కరించలేదు.
మొదట విమానాన్ని ఎక్కుతున్న సమయంలో తనిఖీ చేసిన విమాన సిబ్బంది అక్కడ ఆయన జాకెట్, బూట్లు తనిఖీ చేయడాన్ని మర్చిపోవడంతో మళ్ళి వెనక్కి వచ్చి ఆయన చేత జాకెట్, బూట్లు విప్పించి మరీ తనిఖీ చేశారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించవలసిందిగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తన రాయబార కార్యాలయాన్ని కోరింది. ఈ సంఘటన ఆమోదయోగ్యం కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఆచరణ కొనసాగినట్లయితే రాయబార సూత్రాల ప్రకారం అదే పద్ధతి అమెరికా అధికారుల పట్ల కూడా అనుసరించవలసి ఉంటుందని విదేశీ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.
అబ్దుల్ కలాంను వళ్ళంతా తడమడం ఇదే మొదటిసారి కూడా కాదు. అమెరికా ఎయిర్ లైన్ సంస్ధ ‘కాంటినెంటల్ ఎయిర్‌లైన్స్’ 2009లో భారత దేశంలోనే వళ్ళంతా తడిమి తనిఖీ చేసింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియెషన్ సెక్యూరిటీ జాబితాలో చెకింగ్ నుండి మినాయింపు పొందినవారి పేర్లలో కలాం పేరు ఉన్నప్పటికీ వారు ఆ మినహాయింపును పట్టించుకోలేదు. అమెరికా ప్రభుత్వం నుండి అటువంటి మినయాంపులు ఇవ్వరాదన్న ఆదేశాలు ఉండడం వల్లనే అమెరికా సిబ్బంది పదే పదే అటువంటి తనిఖీలు చేస్తున్నారనడంలో సందేహం అనవసరం.
సంఘటన జరిగినప్పుడల్లా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరసన తెలపడం ‘మరొకసారి జరగకుండా చూస్తామని’ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ హామీ ఇవ్వడం, మళ్ళీ అదే పరిస్ధితి కొనసాగడం సాధారణ విషయంగా మారింది. మన విదేశాంగ శాఖ పైకి చెప్పినంత తీవ్రంగా అమెరికాకి హెచ్చరించడం లేదని దీన్ని బట్టి భావించవలసి వస్తున్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి