కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -4
OTPOR మరియు CANVAS (కేన్వాస్)
OTPOR అన్నది సెర్బియా భాషా పదం.
‘ప్రతిఘటన’ అని దాని అర్ధం. సెర్బియాలో 1998లో తలెత్తి 2003వరకూ కొనసాగిన
ఉద్యమంగా ఇది చరిత్రలో రికార్డయి ఉంది. అహింసా పద్ధతుల్లో ఉద్యమించి నాటో
దాడులకు, సామ్రాజ్యవాద ఆక్రమణలకు ఎదురొడ్డి నిలిచిన అప్పటి సెర్బియా
నాయకుడు స్లోబోడాన్ మైలోసెవిక్ ను అక్టోబరు 5, 2000 న కూలదోయగలిగిందని ఈ
సంస్ధకు పేరు ఉంది. మైలోసెవిక్ ప్రభుత్వం కూలిపోయాక కూడా ఈ సంస్ధ కొనసాగి
కొత్త ప్రభుత్వానికి కాపలాగా ఉంటున్నట్లు ఫోజు కొడుతూ వాస్తవంలో మైలోసెవిక్
పైన అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ లో జరిగిన విచారణకు పూర్తిగా
సహకరించింది. ఇది తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాదరణ లేక చివరికి మరొక
రాజకీయ పార్టీలో కలిసిపోయింది.
CANVAS పూర్తి పేరు సెంటర్ ఫర్ అప్లైడ్
నాన్ వయొలెంట్ యాక్షన్ అండ్ స్ట్రేటజీస్. “అహింసాత్మక చర్యలు మరియు వ్యూహాల
కేంద్రం” అని దీనికి అర్ధం చెప్పుకోవచ్చు. OTPOR ఉద్యమంలో నాయకత్వం
వహించిన ఇద్దరు వ్యక్తులు 2003 లో ఈ సంస్ధను స్ధాపించారు. దీని ప్రకటిత
లక్ష్యం ప్రకారం ఇది లాభాపేక్ష లేని, ప్రభుత్వేతర, విద్యాసంబంధిత సంస్ధ.
మానవహక్కులు, ప్రజాస్వామ్యాల స్ధాపనకోసం అహింసాయుత ఘర్షణలను నిర్మించడం పైన
కేంద్రీకరించిన సంస్ధ. సెర్బియాలో మైలోసెవిక్ ను కూలదోయడంలో సాదించిన
అనుభవాన్ని ఉపయోగించుకుని ప్రపంచవ్యాపితంగా ప్రజాస్వామిక ఉద్యమకారులకు శిక్షణ ఇవ్వడానికి ప్రధాన లక్ష్యంగా
ఈ సంస్ధ ఏర్పడింది. అహింసాయుత పోరాటాలను విజయవంతంగా నిర్వహించడానికి
సార్వజనీన సూత్రాల రూపకల్పన కోసం ఈ సంస్ధ కట్టుబడి ఉందట! సెర్బియాలో
ఏర్పాటయిన ఈ సంస్ధ దాదాపు 50 దేశాలలో ప్రజాస్వామ్య ఉద్యమ కార్యకర్తలతో
కలిసి పనిచేస్తున్నట్లుగా ఈ సంస్ధ స్వయంగా చెప్పుకుంటోంది. ఇరాన్,
జింబాబ్వే, బర్మా, వెనిజులా, బెలారస్, పాలస్తీనా, పశ్చిమ సహారా, పశ్చిమ
పాపువా, ఎరిట్రియా, అజర్‌బైజాన్, టోంగా, ట్యునీషియా, ఈజిప్టు దేశాలలో పని
చేసిన అనుభవం ఉన్నట్లుగా కూడా ఈ సంస్ధ తన వెబ్ సైట్ లో చెప్పుకుంది.
జార్జియా (2003), ఉక్రెయిన్(2004), లెబనాన్ (2005), మాల్దీవులు (2008),
ఈజిప్టు (2011) లలో పాల్గొన్న ఉద్యమ గ్రూపులు కేన్వాస్ వద్ద పొందిన శిక్షణ,
పద్ధతులను అమలు చేయడంలో విజయవంతమయ్యాయని సంస్ధ తెలిపింది.
కేన్వాస్ ఏర్పడడానికి ముందు ఉన్న OTPOR
నాయకులు (జినోవిక్) అనేకసార్లు బెలారస్ ప్రయాణించి అక్కడి విద్యార్ధులతో
సంబంధాలు అభివృద్ధి చేసుకున్నాడు. వారిద్వారా ఉద్యమాన్ని అభివృద్ధి చేడాడు.
కాని ఆ విద్యార్ధి ఉద్యమాన్ని బెలారస్ ప్రభుత్వం అణచివేయడంతో తదుపరి
కార్యక్రమాలు కుదర్లేదు. 2002 లో జార్జియాలో విద్యార్ధుల ఉద్యమం, ‘కమారా’
(ఇక చాలు!) ఉద్యమానికి OTPOR, అండదండలు అందించింది. నవంబరు 2003 లో ‘గులాబి
ఉద్యమం’ (రోజ్ రివల్యూషన్) ద్వారా జార్జియా అధ్యక్షుడు ఎడ్వర్డ్
షెవర్దనాడ్జె చేత రాజీనామా చేయించడంలో కమారా సఫలం అయిందని OTPOR తెలిపింది.
ఆ తర్వాత ఉక్రెయిన్ లో ‘పోరా’ (సమయం వచ్చింది!) అనే యువజన ఉద్యమానికి
OTPOR జన్మనిచ్చింది. అహింసాయుత ఉద్యమం ఎలా చేయాలో ట్రైనింగ్ ఇచ్చి కావలసిన
వనరులను సమకూర్చింది. ఈ సంస్ధ ఉక్రెయిన్ లో నవంబరు 2004 జనవరి 2005 నెలల
మధ్య జరిగిన ‘ఆరెంజ్ విప్లవం’ లో ప్రముఖపాత్ర పోషించింది. జింబాబ్వేలో
తెల్లవారి ఆస్తులను, భూములను స్వాధీనం చేసుకోవడంలో చురుకుగా వ్యవహరించిన
ముగాబే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఈ సంస్ధ ఆ దేశస్ధులు కొంతమందికి
శిక్షణ ఇచ్చింది. ఈ శిక్షణ దక్షీణాఫ్రికాలో OTPOR నాయకులైన జినోవిక్,
పొపోవిక్ లు ఇచ్చారు. ఈ శిక్షణ ఇస్తునపుడే ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు
చేయాలని ఆలోచన రావడం ‘కేన్వాస్’ ఏర్పాటు చేయడం జరిగాయి. కేన్వాస్ ఏర్పాటు
సమయానికి పొపోవిక్ సెర్బియా పార్లమెంటు సభ్యుడుగా ఉన్నప్పటికీ దానికంటె
‘అహింసాయుత విప్లవాల వ్యాపారం’ లాభసాటిగా ఉండడంతో పార్లమెంటు సభ్యత్వం
వదులుకుని విప్లవాల నిర్మాణానికి తన పూర్తి కాలాన్ని కేటాయించాడు.
ఈజిప్టులో ప్రజాస్వామిక సంస్కరణల కోసం
జరిగిన ఉద్యమంలో ‘ఏప్రిల్ 6 యువజన ఉద్యమం’ అనే పేరుగల సంస్ధ ప్రముఖ పాత్ర
పొషించింది. ఈ సంస్ధ అనేక సంవత్సరాలపాటు ఈజిప్టు లోని అమెరికా రాయబార
కార్యాలయంతో దగ్గరి సంబంధాలు నెరిపింది. ఏప్రిల్ 6 ఉద్యమ కార్యకర్తలకు
కేన్వాస్ సంస్ధ శిక్షణ ఇచ్చినట్లుగా కేన్వాస్ వెబ్ సైట్ తెలిపింది.
కేన్వాస్ సంస్ధకు కావలసిన నిధులను అమెరికా సంస్ధలు ఫ్రీడం హౌస్ (ఎఫ్.హెచ్),
నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమొక్రసీ లు సమకూర్చిపెడుతున్నాయి. OTPOR సంస్ధకూ,
దానినుండి ఏర్పడిన కేన్వాస్ సంస్ధకు సి.ఐ.ఎ పూర్తి సహకారం అందిస్తూ
వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే OTPOR, కేన్వాస్ సంస్ధలకు జన్మనిచ్చింది
సి.ఐ.ఏ అని చెప్పవచ్చు. సి.ఐ.ఎ అనేక దశాబ్దాలపాటు సాగించిన కుట్రలు,
కుయుక్తుల ఫలితంగా తనను తాను అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది. “మనుగడకోసం
పోరాటం” అన్న సూత్రంపై ఆధారపడి జీవజాలం అభివృద్ధి చెందినట్లుగా అనేక
దేశాలలో అమలు చేసిన కుట్రలలో అనేక పాఠాలు నేర్చుకుంటూ చివరికి ‘అహింసాయుత
విప్లవాలను’ నిర్మించడంలో కూడా సి.ఐ.ఎ మెలకువలను సంపాదించగలిగింది. వివిధ
సంస్ధల లోగోలను పరిశీలిస్తే వాటి మాతృక ఎవరో అర్ధం అవుతుంది. OTPOR సంస్ధ
పిడికిలి చిహ్నంగా పెట్టుకుంది. ఈ చిహ్నమే ఇప్పుడు ఆకుపై వాల్ స్ట్రీట్
ఉద్యమంలో ప్రముఖంగా కనిపిస్తోంది. బిగించిన పిడికిలి ఆకారంలో ఆకుపై వాల్
స్ట్రీట్, ఆకుపై బోస్టన్ లాంటి అనేక నినాదాలను రాసి దాన్ని ప్రముఖంగా
ప్రదర్శిస్తున్నారు. లోగోలను బట్టి సంబంధాలను పసికట్టవలసిన అగత్యం కూడా
లేదు వాస్తవానికి. ఎందుకంటే కేన్వాస్ సంస్ధే స్వయంగా తాను ఎవరెవరికి శిక్షణ
ఇచ్చిందీ చెబుతున్నపుడు వెతుక్కోవలసిన అవసరం ఏముంది?
-
-
యుగోస్లోవియా పైన 1999 లో నాటో ముష్కర
సైన్యాలు బాంబుల వర్షం కురిపించడం ముగిసి రెండు నెలలు తిరగకుండానే
సెర్బియాలో అమెరికా, నాటోల పర్యవేక్షణలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటయ్యింది.
ఆ ప్రభుత్వంలో OTPOR సంస్ధ కేంద్ర పాత్ర పోషించింది. ఈ పరిణామాలు
యుగొస్లోవియా నుండి మాంటెనీగ్రో విడిపోవడానికి మార్గం సుగమం చేశాయి.
సెర్బియాలో అమెరికా ‘బాండ్ స్టీల్’ మిలట్రీ స్ధావరం ఏర్పరుచుకోవడానికి
OTPOR పూర్తిగా సహకరించింది. ఈ సంస్ధ పుణ్యాన కొసొవోలో మాఫియా రాజ్యం
ఏర్పడి వర్ధిల్లుతోంది. OTPOR వద్ద శిక్షణ పొందినవారు ప్రజాస్వామ్య
స్ధాపనలో విజయవంతం అయ్యారని OTPOR చెప్పుకున్నది ఇలాంటి ప్రభుత్వాల
గురించే. మరొక ముఖ్య విషయం ఇక్కడ చెప్పుకోవలసిన అవసరం ఉంది. అదేమంటే,
ఆగస్టు 1999 లో బల్గేరియా రాజధాని సోఫియా లో సి.ఐ.ఏ శిక్షణ శిబిరం
నెలకొల్పి OTPOR కు శిక్షణ ఇచ్చింది. సెర్బియాలో ప్రతిపక్షానికి శిక్షణ
ఇవ్వడం కోసం ఈ శిబిరం నెలకొల్పారు. OTPOR కు చెందిన మిలిటెంట్లకు సోఫియాలో
ప్రత్యేకంగా 10 రోజుల శిక్షణ ఇచ్చిన విషయాన్ని ఆగష్టు 28, 2000 తేదీన
బిబిసి ధృవపరిచింది.
సి.ఐ.ఎ శిక్షణా కార్యక్రమం వివిధ దశలలో
సాగేదని OTPOR విద్యార్ధి ఉద్యమ నాయకులను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టులు
తెలిపినట్లుగా ఇంటర్నేషనల్ యాక్షన్ సెంటర్ (ఐ.ఎ.సి) అనే సంస్ధ వెబ్ సైట్
తెలిపింది. “సెర్బియన్ మిలిటెంట్ల దేశభక్తి గురించీ, స్వాతంత్రం పట్ల
వారికి ఉన్న కాంక్ష గురించీ ఉన్నవీ లేనివీ చెప్పి పొగడడంతో వారి శిక్షణ
ప్రారంభమవుతుంది. అటువంటి గుణగణాల్ని తాము ఎంతో గౌరవిస్తామన్నట్లుగా సి.ఐ.ఎ
ఫోజు పెడుతుంది. ఆ తర్వాత పరిష్కారం విషయంలో వివిధ ఆలోచనలని చొప్పించి
అయోమయాన్ని పెంచడం ఒక ఎత్తుగడగా అమలు చేస్తారు. దేశభక్తి పేరిట వివిధ
జాతులమధ్య ఘర్షణలు రెచ్చగొట్టడం జరుగుతుంది. జాతుల మధ్య ఉన్న ఐక్యతను
విచ్ఛిన్నం చేశాక సి.ఐ.ఏ, నాటోలు సామ్రాజ్యవాద ప్రయోజనాలు నెరవేర్చుకోవడంలో
మరింత ముందుకు వెళ్తాయి. ప్రపంచంలో అత్యంత చెడ్డపేరు తెచ్చుకున్న సి.ఐ.ఎ
వద్ద శిక్షణ పొందడానికి సెర్బియా విద్యార్ధి ఉద్యమం OTPOR నాయకులు తాము
ఇచ్చిన ఇంటర్వ్యూలో సమర్ధించుకున్నారు. ఇంటర్నెషనల్ యాక్షన్ సెంటర్ సంస్ధకు
చెందిన జర్నలిస్టులు గెరార్డ్ ముగెమంగానో, మైఖేల్ కాలన్ లు OTPOR నాయకులు
ఇద్దరిని ఇంటర్వ్యూ చేసి ఆ వివరాలను తమ వెబ్ సైట్ లో అక్టోబరు 6, 2000న
ప్రచురించారు. తాము సి.ఐ.ఏ చేత పాక్షికంగా కంట్రోల్ చేయబడడానికి ఏ మాత్రం
బాధపడబోమని వారు జర్నలిస్టులకు చెప్పారు. బల్గేరియా పత్రిక ‘ది మానిటర్’
కూడా అక్టోబర్ , సెప్టెంబరు 8, 2000 తేదీన ప్రచురించిన వార్తలొ OTPOR కు
సి.ఐ.ఎ శిక్షణ ఇచ్చిన సంగతిని వెల్లడించింది. యుగోస్లోవియా రాజకీయ నాయకులను
అవినీతిపరులుగా మార్చి విచ్ఛిన్నం చేయడానికి అమెరికా వంద మిలియన్ డాలర్లు
ఖర్చుపెట్టిందని OTPOR విద్యార్ధుల ఇంటర్వ్యూలను ఆంగ్లంలోకి అనువదించిన
జేర్డ్ ఇజ్రాయెల్ తెలిపాడు.
‘విప్లవం‘ ఓ లాభసాటి వ్యాపారం
“విప్లవ వ్యాపారంలో నిమగ్నమై ఉన్న
శిక్షకులు మరియు సలహాదారుల అంతర్జాతీయ నెట్ వర్క్” అని తన గురించి కేన్వాస్
సంస్ధ చెప్పుకుంటుంది. అంటే ఇది విప్లవాలకు, విప్లవాల నిర్మాణానికి సలహాలు
ఇవ్వడం, శిక్షన ఇవ్వడం ఒక వ్యాపార కార్యక్రమంగా నిర్వహిస్తున్నదన్నమాట. ఆ
పని చేస్తున్నందుకు గాను సి.ఐ.ఏ తరపున పని చేసే ‘నేషనల్ ఎండోమెంట్ ఫర్
డెమొక్రసీ’ దీనికి నిధులు సమకూర్చుతుంది. అమెరికా ఆధ్వర్యంలోని 40
దేశాలలోని ప్రతిపక్ష గ్రూపులకు శిక్షణ ఇచ్చినట్లుగా ఈ సంస్ధ బహిరంగంగానే
చెబుతోంది. ఏప్రిల్ 6 ఉద్యమంతో పాటు కిఫాయా (ఇక చాలు) ఉద్యమం కూడా సెర్బియా
రాజధాని బెల్‌గ్రేడ్ లో కేన్వాస్ వద్ద శిక్షణ పొందాయి. “అహింసాయుత
విప్లవంలో అనుసరించవలసిన వ్యూహాలపైన” కేన్వాస్ ఈ రెండింటికి శిక్షణ
ఇచ్చిందని ‘ఫారెన్ పాలసీ’ అనే ప్రఖ్యాత వెబ్ సైట్ ఫిబ్రవరి 16, 2011 తేదీన
తెలియజేసింది. “ఏప్రిల్ 6 యువజన ఉద్యమం, కిఫాయా సంస్ధలు అనుసరించిన
ఎత్తుగడలు, కేన్వాస్ రూపొందించిన సిలబస్ నుండి నేరుగా అమలు చేయబడ్డాయి” అని
కేన్వాస్ తెలిపినట్లుగా ‘ఫారెన్ ఫాలసీ’ తెలిపింది. జార్జియాలో జరిగిన
‘గులాబీల ఉద్యమం’ లో పనిచేసిన ‘కమారా’ సంస్ధ పేరుకు అర్ధం ‘ఇకచాలు’ అని.
అదే అర్ధంతో ‘కిఫాయా’ సంస్ధ ఈజిప్టులో ఏర్పడింది. ఈ రెండూ కేన్వాస్ వద్ద
శిక్షణ పొందాయి. అలాగే OTPOR సంస్ధ చిహ్నం అయిన బిగించిన పిడికిలినే
‘గులాబీ విప్లవం’, ‘ఏప్రిల్ 6 ఉద్యమం’ ఇప్పుడు ‘ఆకుపై వాల్ స్ట్రీట్
ఉద్యమం’ వినియోగిస్తుండడం యాదృచ్ఛికం కాదని స్పష్టంగా అర్ధం అవుతోంది.
సెర్బియా పార్లమెంటు సభ్యత్వాన్ని వదులుకుని జినోవిక్ విప్లవ వ్యాపారంలోకి
దిగడాన్ని బట్టి అది ఎంత లాభసాటిగా మారిందో అర్ధం అవుతోంది.
‘ఆకుపై వాల్ స్ట్రీట్‘ ఉద్యమం లో ‘కేన్వాస్‘
ప్రస్తుతం “ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమ” లో
పాల్గొంటున్న అనేక కీలక సంస్ధలు అరబ్ ఉద్యమాల్లో కూడా కీలక పాత్ర
పోషించాయి. ఇంకా పోషిస్తున్నాయి. వాటిలో “ఎనోనిమస్” ఒకటి. ఇది బహిరంగ సంస్ధ
కాదు. కేవలం ఇంటర్నెట్ కే పరిమితమైన సంస్ధ. ప్రపంచవ్యాపితంగా ఉన్న
హ్యాకర్లు ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న సంస్ధ. దీని ఆర్గనైజర్లలో కొద్ది
మంది మాత్రమే ఒకరికొకరు తెలిసే అవకాశం ఉంది. మిగిలినవారంతా వాలంటరీగా
దానిని అనుసరిస్తున్నవారే. ఇందులో సభ్యులుగా చేరడానికి సభ్యత్వం లాంటివేవీ
ఉండవు. కొద్దిమంది తప్ప మిగతావారంతా కేవలం ఇంటర్నెట్ లో ఐడెంటిటీ ఉన్నవారే.
కీలక సభ్యులు ఒక కార్యక్రమం రూపొందించి ప్రకటించినపుడు మిగతావారంతా
అనుసరిస్తారు. తమకు నచ్చని సంస్ధల వెబ్ సైట్లను హ్యాక్ చేయడం వీరిపని.
రకరకాల వైరస లతో తాము టార్గెట్ చేసిన సంస్ధల వెబ్ సైట్లను హ్యాక్ చేయడం,
అందులో సమాచారాన్ని బహిరంగపరచడం ద్వారా ఆయా సంస్ధలకు నష్టం తీసుకు
రావడానికి ప్రయత్నిస్తారు. “ఎనోనిమస్” తో పాటు మరొక ఇంటర్నెట్ సోషల్ మీడియా
సంస్ధ “హాక్టివిస్ట్” గ్రూపు కూడా ఇదే రకం కార్యక్రమాలను నిర్వహించింది.
వికీలీక్స్ సంపాదకుడు జులియన్ అస్సాంజ్ కు
మద్దతుగా వీరు కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు. అమెరికా ప్రభుత్వ వెబ్
సైట్లను హ్యాక్ చేసి అందలి సమాచారాన్ని బహిరంగంగా పొస్ట్ చేసారు. ఆ సమాచారం
పెద్దగా రహస్యమైనది కాకపోయినప్పటికీ వారు అమెరికా ప్రభుత్వ వెబ్ సైట్లను
హ్యాక్ చేయగలగడమే సంచలనానికి కారణమయ్యింది. జులియన్ అస్సాంజ్ కు డొనేషన్లు
గతంలో పే పాల్, వెస్ట్రన్ యూనియన్ లాంటి ఇంటర్నెట్ సంస్ధల ద్వారా అందేవి.
డబ్బులు ఇవ్వాలనుకున్నవారు ఈ వెబ్ సైట్ల ద్వారా తమ ఖాతాలనుంది వికీలీక్స్
ఖాతాకు డబ్బు తరలించే సౌకర్యాన్ని కల్పించబడుతుంది. కాని గత సంవత్సరం
నవంబరు ఆఖరునుండి అమెరికా డిప్లొమేటిక్ కేబుల్స్ ను వికీలీక్స్ ప్రచురించడం
ప్రారంభించాక అమెరికా ప్రభుత్వం పేపాల్, వెస్ట్రన్ యూనియన్, బ్యాంక్ ఆఫ్
అమెరికా, యు.బి.ఎస్ (స్విట్జర్లాండ్ బ్యాంక్), అమెజాన్ సంస్ధలు
ఒక్కటొక్కటిగా వికీలీక్స్ ఖాతాలను స్తంభింపజేశాయి. ఇప్పుడు ఆ సంస్ధలలో
దాదాపు 90 మిలియన్ డాలర్ల నిధుల్ని ఆ సంస్ధలు స్తంభింపజేసినట్లుగా
చెబుతున్నారు. ఆ మొత్తం చాలా ఎక్కువనే చెప్పాలి. దానితో ఎనోనిమస్ సభ్యులు
పేపాల్, అమెజాన్ యు.బి.ఎస్ సంస్ధల వెబ్ సైట్లపైన దాడి చేసారు. ఒకటి రెండు
రోజుల పాటు ఆ వెబ్ సైట్లు వినియోగదారులకి అందుబాటులో లేకుండా చేయగలిగారు.
నిధులు స్తంభించిపోవడంతో తాత్కాలికంగా వికీలీక్స్ వెబ్ సైట్ మూసేయాలని
భావిస్తున్నట్లుగా ఇటీవల జులియన్ అస్సాంజ్ ప్రకటించాడు. ప్రకటన ద్వారా
వికీలీక్స్ మూసేయడం కంటే, దాతలను అప్రమత్తం చేయడానికి జులియన్
ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈజిప్టులో ప్రజాస్వామిక సంస్కరణల కోసం
జరిగిన ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ఎనోనిమస్ సంస్ధ ఈజిప్టు ప్రభుత్వ వెబ్
సైట్లపైన దాడులు జరిపింది. గత ఆగస్టు నెలలో “ఎనోనిమస్’ గ్రూపు వాళ్లు
సిరియా డిఫెన్స్ మినిస్ట్రీ వెబ్ సైట్ పైన అవే తరహా సైబర్ దాడులు జరిపింది.
(హఫ్ఫింగ్టన్ పొస్ట్, ఆగస్టు 8, 2011) ప్రవాసంలో ఉన్న సిరియా
ప్రతిపక్షాలకు మద్దతుగా సైబర్ దాడులు నిర్వహించినట్లు ఎనోనిమస్ తెలిపింది. ఈ
ప్రవాస ప్రతిపక్షాలలో అత్యధికులు ఇస్లామిస్టులే కావడం గమనార్హం.
ప్రపంచవ్యాపితంగా ఉన్న సిరియా ఎంబసీలపై దాడులు చేస్తామని కూడా ఎనోనిమస్
ప్రకటించింది. సిరియా కు సంబంధించి ఎనోనిమస్ చర్యలు గతంలో తలెత్తిన ‘రంగు
విప్లవాల’ ను పోలి ఉన్నాయి. సిరియా ప్రభుత్వాన్ని రాక్షసీకరించే ప్రయత్నం
ఎనోనిమస్ సభ్యుల సందేశాలలో జరుగుతోంది. రాజకీయ అనిశ్చితిని
ప్రోత్సహించేవైపుగా అవి ఉంటున్నాయి.
ఇప్పుడు ఈ ఎనోనిమస్ సంస్ధ తమ సభ్యులు
‘ఆకుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నట్లు చెప్పింది.
కెనడా ఎన్.జి.ఒ సంస్ధ యాడ్ బస్టర్స్ ఇచ్చిన పిలుపును పాటించాలంటూ
‘ఎనోనిమస్’ సంస్ధ గత వాల్ స్ట్రీట్ ఉద్యమ ప్రారంభంలోనే ప్రకటించింది.
టెంట్లు తేవాలనీ, కిచెన్ లు ఏర్పాటు చేసుకోవాలని ప్రకటించింది. ఈజిప్టు
ప్రజాస్వామిక ఉద్యమ తరహాలో ఆందోళన చేయాలని పిలుపునిచ్చింది. ఈజిప్టు
ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాక్ చేసినట్లుగానే అమెరికా, ఇంగ్లండ్ తదితర
దేశాల్లో ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాక్ చేసింది. ప్రస్తుతం ఈ సంస్ధ హ్యాక్
చేయడం మాని ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు తెలిపింది.
‘ఎనోనిమస్’ తో పాటు ‘కేన్వాస్’ సంస్ధ కూడా ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమంలో
చురుకుగా పాల్గొంటోంది. కేన్వాస్ లోగోను ఆ ఉద్యమం ప్రముఖంగా స్వీకరించింది.
అయితే ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమంలో కేన్వాస్ నిర్ధిష్టంగా ఏ పాత్ర
పోషిస్తున్నదన్న విషయం ఇంకా స్పష్టం కావలసి ఉంది అమెరికా వ్యాప్తంగా
జరుగుతున్న ఆకుపై ఉద్యమాలలోనూ, ఆ ఉద్యమాల వెబ్ సైట్లలోనూ ‘కేన్వాస్’ పూర్వ
సంస్ధ OTPOR లోగోనే ప్రముఖంగా వినియోగిస్తుండడాన్ని బట్టి ఆ సంస్ధ పాత్ర
స్పష్టం అవుతోంది.
న్యూయార్క్ నగరంలో ఆకుపై వాల్ స్ట్రీట్
ఉద్యమ కార్యకర్తలను ఉద్దేశించి కేన్వాస్ సంస్ధ నాయకుడు “ఇవాన్ మరోవిక్’
ప్రసంగించాడు. కేన్వాస్ సంస్ధకు సి.ఐ.ఎ ఏర్పాటు చేసిన ‘నేషనల్ ఎండోమెంట్
ఫర్ డెమొక్రసీ’ నిధులను సమకూర్చుతున్న సంగతి ఈ సందర్భంగా గమనంలో
ఉంచుకోవాలి. ఈ ఉపన్యాసంలో మరోవిక్ కళ్ళుతిరిగే వాస్తవాన్ని వెల్లడించాడు.
“ప్రజలు ఉన్నట్లుండి వీధుల్లోకి వచ్చినట్లుగా కనిపిస్తుంది. కాని అది నెలలు
లేదా సంవత్సరాల పాటు జరిగిన ఏర్పాట్ల ఫలితం అని గుర్తించాలి. ఒక పాయింటు
వరకు వచ్చేదాకా ఆ కార్యక్రమం పరమ బోరుగా ఉంటుంది. ప్రజా నిరసనలు లేదా
సమ్మెలు నిర్వహించే సమయం వచ్చేదాకా అలాగే బోరింగ్ గా ఉంటుంది. జాగ్రత్తగా
పధకం రూపొందించుకున్నట్లయితే, అంతా క్కొన్ని వారాలలోపే జరిగిపోతుంది”
(‘రివల్యూషన్ యు’ వెబ్ సైట్ లో ఫిబ్రవరి 16, 2011 తేదీన టినా రోసెన్ బర్గ్
రాసిన ఆర్టికల్ నుండి).
మరోవిక్ ఇచ్చిన ఈ ఉపన్యాసం ద్వారా అరబ్
ప్రజాస్వామిక విప్లవాలు ఉన్నట్లుండి అప్పటికి జరిగిన సంఘటనల ఆధారంగా
జరిగినవి కావని అనుమానించవలసి వస్తోంది. పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు అరబ్
ఉద్యమాలు ‘ఉన్నట్లుండి అనుకోకుండా సంభవించిన’ ఉద్యమాలుగా ప్రచారం చేశాయి.
అసలు ఈ ఉద్యమాలు పుడుతున్నట్లుగా అమెరికా గూఢచార సంస్ధ సి.ఐ.ఎ, ఇజ్రాయెల్
గూఢచార సంస్ధ మొస్సాద్ లు పసిగట్టడంలో విఫలమయ్యాయనీ రాశాయి. ముబారక్
ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి అమెరికా అంత త్వరగా అనుమతించినందుకు
ఇజ్రాయెల్ ఆగ్రహం చెందినట్లుగా వార్తలు రావడం కూడా ఈ సందర్భంగా గమనించాలి.
ఒకదాని తర్వాత మరొక ఉద్యమం రావడం కూడా పధకరచనలో భాగమేనని మరోవిక్ రాతలలో
తెలుస్తోంది.
ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం కూడా అరబ్
ఉద్యమాలలాగే జాగ్రత్తగా పధకం రూపొందించుకుని అమలు చేసినవేనని మరోవిక్
స్టేట్‌మెంట్ ద్వారా తెలుస్తోంది. అనేక కీలక సంస్ధలు దీర్ఘకాలం పాటు
చర్చించుకుని ఎత్తుగడలు, వ్యూహాలూ రూపొందించుకుని అమలు చేసిన ఫలితమే ఆకుపై
వాల్ స్ట్రీట్ ఉద్యమమని మరావిక్ తెలిపాడు. మరోవిక్ తెలిపిన ఎత్తుగడలలో ఒక
భాగం “అరెస్టులను ఎగవేయడానికి ప్రయత్నం చేయకపోవడం” కూడా ఒకటి. పైగా
“అరెస్టులు జరిగేలా పోలీసులను రెచ్చగొట్టి అరెస్టు కావడం, వాటిని
ఉద్యమానికి అనుకూలంగా ఉపయోగించుకోవడం” మరోవిక్ ప్రభోధించిన ఎత్తుగడలలో
ఒకటి. గ్లోబల్ రీసెర్చి సంస్ధ ను నడుపుతున్న మైఖేల్ ఛోసుడోవ్ స్కీ “ఆకుపై
వాల్ స్ట్రీట్” ఉద్యమం గురించిన ఏర్పాట్లు, పధకాలు, వాటి అమలు తదితర
విషయాలపైన సవివరమైన నివేదిక అందజేయనున్నట్లు తెలిపాడు. ఆ నివేదిక వెలువడితే
‘ఆకుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమ వివరాలు మరిన్ని లోకానికి తెలిసే అవకాశం
ఉంది.
అమెరికా ప్రభుత్వం ప్రారంభంలో తమ సంస్ధకు
నిధులు సమకూర్చినప్పటికీ ప్రస్తుతం ఆ పరిష్దితి లేదని కేన్వాస్ నాయకుల్లో
ఒకడైన సెర్బియన్ స్రెడ్జా పొపోవిక్ చెప్పాడు. తాము ప్రవేటుగానే నిధులు
సంపాదిస్తునట్లు ఆయన చెప్పినా అది నిజం కాదు. అసలు అమెరికా ప్రభుత్వమే
ప్రవేటు కంపెనీల చేతుల్లో ఉన్నపుడు ప్రవేటు నిధులే తమకు ఆధారం అనడం
నిజానికి అర్ధం లేని విషయం. అమెరికా ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకున్న
కార్పొరేట్ కంపెనీలే ప్రభుత్వం ద్వారా “విప్లవ వ్యాపార సంస్ధల” ను
పోషిస్తున్నాయనడంలో సందేహం అనవసరం. తమ భాగస్వాములుగా కేన్వాస్ చెప్పే
సంస్ధలన్నీ కార్పొరేట్ కంపెనీల ఫౌండేషన్లే. యునైటెడ్ ఇనిస్టిట్యూట్ ఫర్
పీస్ (అమెరికా కాంగ్రెస్ నిధులు అందిస్తుంది), ఫ్రీడం హౌస్ (రిపబ్లికన్
రాజకీయవేత్తల సంస్ధ), ఇంటర్నెషనల్ రిపబ్లికన్ ఇనిస్టిట్యూట్ (ఒబామా పై
ఓడిపోయిన యుద్ధ పిపాసి మెక్ కెయిన్ దీనికి నాయకుడు), న్యూ టాక్టిక్స్
(ఫోర్డ్ ఫౌండేషన్, జార్జి సోరోస్ ఫౌండేషన్లు దీనికి నిధులిస్తాయి),
హ్యూమానిటీ ఇన్ యాక్షన్ (ఫోర్డ్ కంపెనీ, అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ
దీనికి నిధులిస్తాయి). ఇవన్నీ తమ భాగస్వాములుగా కేన్వాస్ చెప్పుకుంటోంది.
అటువంట్ కేన్వాస్ రూపొందించి నడుపుతున్న వాల్ స్ట్రీట్ ఉద్యమమే ఇప్పుడు
పతాక శీర్షికలకెక్కి వర్ధిల్లుతోంది.
తమ పోషకుల గురించీ, మద్దతుదారుల గురించి
కేన్వాస్ ఎన్నో అబద్ధాలు వల్లించింది ఏర్పడినప్పటినుండీ అబద్ధాలు
వల్లించింది. సెర్బియా ఉక్కుమనిషి మైలోసెవిక్ వ్యతిరేకులందరిలాగే OTPOR
(ఇపుడు కేన్వాస్) అమెరికా ప్రభుత్వం నుండే నిధులు పొంది, పొందలేదని
అబద్ధాలు చెప్పిందని ‘ఫారెన్ పాలసీ’ పత్రిక తెలిపింది. మైలోసెవిక్ పతనం
తర్వాత OTPOR నిజరూపం తెలుసుకుని, దానితో కలిసి పనిచేసినవారు,
మోసపోయినట్లుగా భావించారు. ఈజిప్టులో కేన్వాస్ పాత్ర వెల్లడయ్యాక ఆ సంస్ధ
తన వెబ్ సైట్ లో తన భాగస్వాముల పేర్లు ఉదహరించిన పేజీని తొలగించింది. తాము
ప్రపంచవ్యాపితంగా తలెత్తిన కలర్ విప్లవాలను ఎలా ప్రభావితం చేసిందీ
తెలియజేస్తూ ఒక డాక్యుమెంటరీని కూడా కేన్వాస్ నిర్మింపజేసింది. అయితే
అందులో అది తమకు అమెరికా నిధులు ఇస్తుందనడం నిజం కాదని పేర్కొనడం మరవలేదు.
ఈ డాక్యుమెంటరీలో ఈజిప్టు ఉద్యమంలో
పాల్గొన్న ‘ఏప్రిల్ 6 ఉద్యమ’ నాయకుడు మహమ్మద్ ఆడెల్ కూడా ప్రత్యక్షమై
‘అమెరికా ప్రభుత్వానికి మిలియన్ల మందిని ప్రభావితం చేయగల సామర్ధ్యం లేదని’
చెపుతూ తమ వెనక ఎవరూ లేరని చెప్పడానికి ప్రయత్నించాడు. ముప్ఫై కోట్ల
అమెరికా ప్రజలను అమెరికా ప్రభుత్వాలు వరుసగా మోసం చేస్తూ వస్తున్న సంగతి
ఆడేల్ కు తెలియదని చెప్పలేము. ఒక్క అమెరికా ప్రజలనే కాక ప్రపంచవ్యాపితంగా
అనేక దేశాల ప్రజలను సైతం అది తన పత్రికల ద్వారా ప్రభావితం చేస్తున్న
సంగతిని ఎవరూ కాదనలేరు. మహమ్మద్ ఆడెల్ సైతం సెర్బియాలో శిక్షణ పొందిన
వ్యక్తి కావడం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ట్యునీషియన్లు ఫోన్లలో
మాట్లాడుతూ, పబ్లిక్ స్ధలాల్లో ముచ్చట్లు చెప్పుకుంటున్న దృశ్యాలని ఈ
డాక్యుమెంటరీ చూపించి ట్యునీషియన్లు తమ విప్లవ ఫలాలను ఆస్వాదించడంలో బిజీగా
ఉన్నారని వ్యాఖ్యానిస్తుంది. ఫోన్లలో మాట్లాడ్డం, పబ్లిక్ స్ధలాల్లో
ముచ్చట్లు చెప్పడం స్వేచ్ఛ ఎలా అవుతుందో మాత్రం అది చెప్పలేదు. చివరికి
ఎన్నికల్లో ఓటు వేయడం కూడా స్వేచ్ఛకు చిహ్నం కాదన్నది స్పష్టమే.
కార్మికవర్గ ఉద్యమాలకు చోటేది?
ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం అంతా
బోగస్సేనా? ఖచ్చితంగా కాదు. ఉద్యమంలో ప్రజల పాత్ర బోగస్ కాదు. ఒక్క శాతం
సంపన్నులు అమెరికాను శాసిస్తున్నారనీ, మిగిలిన 99 మందీ తమ స్ధానాలని
ఆక్రమించాల్సిన అవసరం వచ్చిందనీ అమెరికా ప్రజలు భావించడం బోగస్ కాదు.
ఉద్యమానికి ప్రజలనుండి వస్తున్న స్పందన బోగస్ కానే కాదు. అవన్నీ వాస్తవాలే.
ఈ వ్యాసం ప్రారంభంలో చెప్పినట్లుగా బడా బడా ద్రవ్య సంస్ధలైన బ్యాంకులు,
ఇన్సూరెన్స్ సంస్ధలు, హెడ్జ్ ఫండ్ లు, మ్యూచువల్ ఫండ్ లతో పాటు ఇతర
బహుళజాతి సంస్ధలు అనుసరిస్తూ వచ్చిన దోపిడీ విధానాలను తెలుసుకునే
అవకాశాన్ని ప్రపంచ ఆర్ధిక సంక్షోభం, రెండు దురాక్రమణ యుద్ధాలు అమెరికా
ప్రజలకు కల్పించాయి. దశాబ్దాలుగా పేరుకుంటూ వచ్చిన ప్రజాగ్రహం దురాక్రమణ
యుద్ధాల సందర్భంగా, ప్రపంచ ఆర్ధిక సంక్షొభం సందర్భంగా ఒక రూపం తీసుకుంటున్న
పరిస్ధితి ఏర్పడింది. వారి ఆగ్రహం ఎప్పటికైనా బద్దలు కాక తప్పదని
విస్కాన్సిన్ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేయడానికి
వ్యతిరేకంగా చెలరేగిన సుదీర్ఘ సమ్మె తెలియజేసింది. ఆర్ధిక సంక్షోభం దరిమిలా
పెరిగిన నిరుద్యోగం మరింతమంది యువతను రోడ్లపైకి నెట్టింది. వారంతా తమ
దయనీయ పరిస్ధితులకు కారణాలను అన్వేషించేవైపుగా నెట్టబడ్డారు.
అరబ్ ఉద్యమాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు
ఆ ఉద్యమాలన్నీ నిజమైనవే. అందులో ప్రజల పాత్ర నిజమైనదే. వార ఆగ్రహం
నిజమైనదే. కాని ఆ ఆగ్రహానికి ఒక సంఘటిత రూపం ఇచ్చిన శక్తులు మాత్రం నిజం
కాదు. వారే బోగస్ కార్యకర్తలు, నాయకులు. వారంతా శిక్షణ పొందినవారే
కాకపోవచ్చు. నాయకులలో కొందరు నిజాయితీగా పని చేసినవారు, అసలు శక్తుల
నిజరూపం తెలియనివారు పెద్ద సంఖ్యలోనే ఉండగల అవకాశాలున్నాయి. అలా ఉండబట్టే
అరబ్ విప్లవాలు సజీవంగా పదుల రోజులాపాటు కొనసాగాయని చెప్పవచ్చు. కాని ప్రజల
ఆగ్రహాన్ని సంఘటిత రూపానికి తెచ్చిన శక్తులు ఆ ఆగ్రహాన్ని భద్రంగా తెచ్చి
మధ్యధరా సముద్రంలో కలపడంలో విజయవంతం కావడమే ఇక్కడ విషాధం. ఈజిప్టు,
ట్యునీషియా ప్రజల ధర్మాగ్రహాన్ని, నియంతృత్వ వ్యతిరేక చైతన్యాన్ని,
సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న బోగస్
ఉద్యమ శక్తులు దాన్ని లక్ష్యంవైపుకి వెళ్ళకుండా, సరైన ముగింపు లేకుండానే
సమసిపోయేలా చేయడంలో సఫలం అయ్యాయి. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన ఆగ్రహాన్ని,
ఉద్యమ చైతన్యాన్ని పక్కదారి పట్టించాక, ఇక ఇప్పుడు మళ్ళీ నిజాయితిగా
ఉద్యమించాలనుకున్న వారికి స్పందన దొరకడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు.
సామ్రాజ్యవాద శక్తుల ప్రోద్బలంతో సంవత్సరాల తరబడి వేచి చూసి ఉద్యమాల
నిర్మాణానికి పూనుకున్నవారికి కావలసింది అదే.
అమెరికాలో దశాబ్దాల తరబడి ఒక్క న్యాయమైన,
సరైన ఉద్యమం లేకుండా పోయింది. పెట్టుబడిదారీ శక్తులు నిరంతరం అప్రమత్తతతో
ఉండి కార్మిక వర్గం సంఘటితం కాకుండా చేయగలిగారు. కార్మికవర్గాన్ని సంఘటితం
చేయడానికి కూడా తామే పూనుకుని బోగస్ ఉద్యమాలు నిర్మించి కార్మికుల పోరాట
శక్తిని నిర్వీర్యం చెయ్యగలిగారు. కార్మికవర్గం తమకు ప్రాతినిధ్యం వహించే
నిజమైన యూనియన్లను ఏర్పాటు చేసుకున్నచోట నాయకత్వాన్ని తమ వర్గంలోకి
ఆహ్వానించారు. తద్వారా కార్మికవర్గా సంఘాలకు బూర్జువా నాయకత్వాన్ని ఏర్పాటు
చెయ్యగలిగారు. కాగల కార్యం గంధర్వులు చేసినట్లుగా ఇక కార్మికవర్గ
సమ్మెలను, కార్మికవర్గ పోరాటాలను పక్కదారి పట్టించే పనిని కార్మిక యూనియన్ల
నాయకులే చేపట్టి విజయవంతం అయ్యారు. ఫలితంగా అమెరికాలో కార్మికవర్గం
ఒట్టిపోయింది. కోరలు లేని మృగరాజులాగా తయారయ్యింది.
కాని డెబ్భైలనుండీ ప్రారంభమైన వేతనాల
స్తంభన ప్రపంచీకరణ ప్రారంభంతో ముదురు దశకు చేరుకుంది. ప్రపంచ ఆర్ధిక
సంక్షోభం వేతనాల సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. దానికి తోడు ఆర్ధిక
సంక్షోభం నుండి కోలుకోవడానికి అటు పెట్టుబడిదారీ వర్గం కార్మికవర్గంపై
పొదుపు ఆర్ధికవిధానాల ద్వారా దాడులు తీవ్రం చేసింది. ఈ పరిణామాలు
కార్మికవర్గం మరొకమారు సంఘటిత పడడానికి అవకాశాలు కల్పించాయి. ఆ అవకాశాలను
‘ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం’ గద్దలా తన్నుకుపోయింది. సామ్రాజ్యవాద
దోపిడికీ, అణచివేతకూ గురవుతున్న మూడవ ప్రపంచ దేశాలు ట్యునీషియా మొదలుకొని
ఈజిప్టు మీదుగా బహ్రెయిన్, యెమెన్ లవరకూ వ్యాపించిన ప్రజాగ్రహాన్ని
కార్మికవర్గం ఒడిసిపట్టి కార్మికవర్గ పోరాటాలను నిర్మించేలోపే అంతర్గతంగా
నిర్మితమవుతూ వస్తున్న సామ్రాజ్యవాద వ్యతిరేక, నియంతృత్వ వ్యతిరేక
చైతాన్యాన్ని సామ్రాజ్యవాద అనుకూల శక్తులే త్వరపడి చేజిక్కించుకోగలిగాయి.
అరబ్ చైతన్యాన్ని మధ్యధరా సముద్రంలో ముంచినట్లే, అమెరికన్లు, యూరోపియన్ల
చైతన్యాన్ని ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం అట్లాంటిక్ సముద్రంలో కలపడం ఖాయం. ఆ
క్రమం ఇప్పటికే మొదలయ్యింది కూడా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి