అకస్మాత్తుగా దాడి చేసిన యువకుడుఅవినీతి, ధరల పెరుగుదలకు నిరసనగానేనిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులుఇటీవల సుఖ్‌రామ్‌పై దాడి చేసింది అతడేదాడిని తేలిగ్గా తీసుకున్న పవార్
న్యూఢిల్లీ,
న్యూస్‌లైన్: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌కు అనూహ్య పరిణామం
ఎదురైంది. హర్వీందర్‌సింగ్ అనే యువకుడు ఆయనపై దాడిచేసి చెంపదెబ్బ కొట్టాడు.
దేశంలో పెరిగిపోతున్న ధరలు, అవినీతి కుంభకోణాలకు నిరసనగానే ఈ పనిచేసినట్లు
అతడు వెల్లడించాడు. కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌రామ్‌పై శనివారం కోర్టు
ఆవరణలో దాడిచేసింది కూడా ఇతడే కావడం గమనార్హం. కేంద్ర మంత్రి శరద్ పవార్
గురువారం ఎన్డీఎంసీ సెంటర్‌లో ఇఫ్కో నిర్వహించిన శ్రీలాల్ శుక్లా సాహిత్య
సమ్మాన్ కార్యక్రమంలో పాల్గొని, తిరిగి వెళుతుండగా ఆయనను మీడియా
ప్రతినిధులు చుట్టుముట్టారు. వారి ప్రశ్నలకు బదులిస్తూ, ఆయన ముందుకు
నడుస్తుండగా, హర్వీందర్ ఒక్కసారిగా అక్కడ ఉన్న అధికారులను, జర్నలిస్టులను
తోసుకు వచ్చి, రాజకీయ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పవార్ చెంపపై
చాచికొట్టాడు.
దీంతో కిందపడబోయిన మంత్రి తమాయించుకున్నారు. వెంటనే
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అంతలోనే అతడు
తన చేతిని కోసుకునేందుకు ప్రయత్నించగా, వారు అతడి వద్దనున్న చాకును
స్వాధీనం చేసుకుని, బారాబంఖా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాజకీయ నేతల
అవినీతికి విసిగి వేసారి ఈ దాడికి పాల్పడ్డానని, ఇందుకు తానేమీ చింతించడం
లేదని హర్వీందర్ చెప్పాడు. ఉపన్యాసాలు దంచడం, అవినీతికి పాల్పడటం తప్ప ధరల
నియంత్రణకు ఎవరూ ప్రయత్నించడం లేదని అతడు ఆరోపించాడు. ‘ఒకవేళ ఈ రోజు
గురుతేజ్ బహదూర్ వర్ధంతి కాకపోయి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది’
అని అతను వ్యాఖ్యానించాడు. మంత్రిని కొట్టినందుకు క్రిమినల్ కేసుతో పాటు,
అతడిపై పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు. అతడి మానసిక
పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు ఒక పోలీసు అధికారి వెల్లడించారు. కాగా,
తనపై జరిగిన దాడిని పవార్ తేలిగ్గా తీసుకున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి
చేసిన పనికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన పనిలేదన్నారు. నిందితుడిపై చర్యల
సంగతి పోలీసులే చూసుకుంటారని ఒక ప్రశ్నకు బదులుగా అన్నారు.
మన్మోహన్, సోనియా ఖండన... శరద్
పవార్‌పై దాడిని ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా
గాంధీ సహా పార్టీలకు అతీతంగా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రధాని,
సోనియా ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. హోంమంత్రి చిదంబరం వెంటనే పవార్
నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. కాగా, తనపై దాడికి ఏ పార్టీనీ
తప్పుపట్టబోవడం లేదని పవార్ అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటూ
ఎన్సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘కొట్టింది ఒక్కదెబ్బేనా?’ అన్న
అన్నా హజారే వ్యాఖ్యలను దృష్టికి తేగా, ఇదోరకమైన ‘గాంధీగిరీ’ కావచ్చని
వ్యంగ్యంగా బదులిచ్చారు. పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సులే ఈ సంఘటనను
దురదృష్టకరమైనదిగా అభివర్ణించారు. పవార్‌పై దాడికి వ్యతిరేకంగా
మహారాష్ట్రలో నిరసనలు వెల్లువెత్తాయి. ముంబై సహా పలు ప్రాంతాల్లో ఎన్సీపీ
కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహించారు. పుణెలో శుక్రవారం బంద్‌కు
పిలుపునిచ్చారు. మరోవైపు పవార్‌పై దాడి బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల
యుద్ధానికి దారితీసింది. ధరల పెరుగుదల కొనసాగితే ప్రజాగ్రహం హింసాత్మక
చర్యలకు దారితీస్తుందంటూ బీజేపీ ఇటీవల చేసిన రెచ్చగొట్టే ప్రకటనల వల్లే
పవార్‌పై దాడి జరిగిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ
ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను దురదృష్టకరమని బీజేపీ నేత రవిశంకర్
ప్రసాద్ వ్యాఖ్యానించారు.
కొట్టింది ఒక్క దెబ్బేనా: హజారే
శరద్ పవార్‌పై నిందితుడు దాడి చేసి ‘కొట్టింది ఒక్కదెబ్బేనా?’ అంటూ
సామాజిక కార్యకర్త అన్నా హజారే తొలుత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
కొద్దిసేపటి తర్వాత, ఆయన దాడిని ఖండించారు. ‘దాడి చేసిన వ్యక్తి చాలా
కోపంగా ఉన్నట్లున్నాడు. ఎవరిపైనైనా దాడులు చేయాల్సిందిగా మన రాజ్యాంగం
చెప్పడం లేదు’ అని వ్యాఖ్యానించారు. తొలుత స్పందించిన తీరుపై విమర్శలు
వెల్లువెత్తడంతో హజారే తర్వాత వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు తప్పుగా
అనిపించినట్లయితే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమన్నారు. ‘నేను సందర్శకులతో
మాట్లాడుతుండగా, పవార్‌పై దాడి గురించి చెప్పాడు. చెంపదెబ్బ మాత్రమే
కొట్టారా? ఇంకేమైనా జరిగిందా? అని అడిగాను’ అని వివరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి