10, నవంబర్ 2011, గురువారం

సొంతింటి కల ఇక పెను భారం


  • తర తరాలకు తరగని అప్పుగా గృహ రుణం
  • వడ్డీ రేట్లను విపరీతంగా పెంచేసిన బ్యాంకులు
లాభాలకు నిర్దిష్ట హామీ ఉన్న వ్యాపారాల్లో స్థిరాస్థి వ్యాపారం ఒకటి. అందుకే ప్రైవేటు రుణదాతలతో పోటీ పడి మరీ వాణిజ్య బ్యాంకులు ఈ రంగంలో రుణాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా గృహరుణాల విషయంలో గత దశాబ్దకాలంలో వాణిజ్య బ్యాంకులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. 'సొంతింటి కల' నిజం చేసుకోమంటూ కోటి మందిలో కోటిన్నర ఆశలు రేకెత్తించిన ఘనత కూడా వాణిజ్య బ్యాంకులదేననడం అతిశయోక్తి కాదు. అలాంటి వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకునే గృహ రుణాలు ఇకమీదట పెను భారంగా మారనున్నాయి. కారణం... ఆయా గృహ రుణాలపై వడ్డీ రేట్లును 250 నుంచి 300ల బేసిస్‌ పాయింట్ల మేర వాణిజ్య బ్యాంకులన్నీ భారీగా పెంచేశాయి. గత ఏడాదిన్నర కాలంలో చోటు చేసుకున్న వడ్డీరేటు పెంపుదల తరాల తరబడి అప్పులు చెల్లించేందుకు దోహదపడేదిగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రుణాలపై పెరిగిన వడ్టీ రేట్ల కారణంగా నెలవారీ కిస్తీ(ఇఎంఐ)ల చెల్లింపు భారం చిరుద్యోగుల పిల్లల మీద పడనుంది. 20 సంవత్సరాల కాలపరిమితిలో చెల్లించే ప్రాతిపదికన అమల్లో ఉన్న తొమ్మిది శాతం వడ్డీ రేటుకు రూ.75 లక్షలు తీసుకున్నాడనుకుందాం. ఈ లెక్కన చిరుద్యోగి ప్రతి నెల చెల్లించాల్సిన కిస్తీ (ఇఎంఐ) రు.67,480 అవుతుంది. 35 ఏళ్ల వయసులో తీసుకున్న రుణాన్ని ఇదే విధానం కొనసాగించదనుకుంటే రిటైర్‌ కావడానికి ముందుగా తన 55వ ఏట పూర్తిగా చెల్లించి రుణ విముక్తుడవుతాడు. ఇదే చిరుద్యోగి తీసుకున్న రుణం మీద వడ్డి 12.25 శాతానికి పెరిగిందనుకుందాం. అపుడు నెలవారీ కిస్తీ ఏకంగా రు., 15,000 పెరిగి రమారమి రూ.83.803 చెల్లించాల్సి వస్తుంది. అనూహ్యంగా పెరిగిన ఈ భారం తన ముందస్తు రుణ ఒడంబడిక చెల్లుబాటుకు మార్గాన్ని కష్టతరం చేస్తుంది. మరో మాటలో వినియోగదారు జేబుకు చిల్లు పెట్టినట్లే. పర్యవసానంగా అతని హయాంలో చెల్లించలేని బ్యాంకు రుణాన్ని చెల్లించే భారం అతని వారసులపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

కారణం... నెల కిస్తీ తగ్గించుకునే క్రమంలో కాలపరిమితి గరిష్టంగా అవకాశమున్న 30 సంవత్సరాలకు చేరుతుంది. అంటే రిటైరైన తరువాత గృహ రుణాన్ని ప్రతి నెల చెల్లించాల్సిన బాధ్యత చిరుద్యోగి సంతతి మీద అనివార్యంగా పడుతుంది. దీని నుంచి తప్పించుకునేందుకు నెలవారీ కిస్తీలు (ఇఎంఐ) కాలపరిమితి కుదింపునకు రుణగ్రస్తులు మొగ్గు చూపుతున్నారని నిపుణుల విశ్లేషణ. రుణం తీసుకున్న నాటికి నిర్ణయించిన కాలం 20 సంవత్సరాలనుకుంటే మారిన అధిక వడ్డీ రేట్ల మూలాన 15 లేదా అంతకు తక్కువ కాలంలోనే బ్యాంకు వడ్డీరేటును చెల్లించాల్సిన పరిస్థితి రుణగ్రస్తుని మీద పడుతుంది. నిర్ణయించిన కాలానికి చెల్లించేద్దామనే ఉదాసీనతకు లోనైతే వడ్డీల భారంతో చెల్లించాలని తొలుత అంచనా వేసిన దాని కన్నా అధిక మొత్తాన్ని చెల్లించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురువుతుంది. పెరిగిన వడ్డీ రేట్లతో పాటుగా పెరిగిన మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలంటే కాలపరిమితి కుదించుకుకోవడం, నెలవారీ కిస్తీల మొత్తాన్ని పెంచుకోవడం అనే రెండు మార్గాలే ఉన్నాయి.

వినియోగదారులను ఆదుకుంటున్నామనే పేరిట గృహరుణాల జారీలో పేరెన్నిక గన్న భారతీయ స్టేట్‌ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకుల్లాంటివి తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు గరిష్టంగా 30 సంవత్సరాలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించాయి. ఇతర జాతీయ బ్యాంకులూ ఇదే బాటన నడుస్తాయని జాతీయ బ్యాంకులో పని చేసే సీనియరు అధికారి ఒకరు చెప్పారు. తాజా పరిణామాలు తమనే చికాకు పరుస్తున్నాయని గృహ రుణాల్లో పేరుమోసిన హెచ్‌డిఎఫ్‌సి అధికారి ఒకరు చెప్పారు. వడ్డీరేట్లు పెరిగాయి కదాని అధిక మొత్తంలో కిస్తీలను చెల్లించగల అనుకూలత అందరు వినియోగదారులకు ఉండదు.

ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే వడ్డీరేట్లు ఏ మార్గాన పెరిగాయో అదే మార్గంలో తగ్గడమొక్కటే పరిష్కారమని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌డైరెక్టర్‌ ఎం నరేంద్ర వివరించారు.ఈ సమస్యల నుంచి వినియోగదారులను బయటపడేయగల సత్తా, అధికారాలు ఉన్నది ఒక్క రిజర్వు బ్యాంకుకే. వచ్చే నెలలో ఇండియన్‌ బ్యాంకర్ల అసొసియేషన్‌ (ఐబిఎ)తో ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నరు డాక్టర్‌ కెసి చక్రవర్తి నిర్వహించే సమావేశంలో గృహ రుణాల మీద పెరిగిన వడ్డీ అంశంపై ఒకింత సానుకూల కసరత్తు జరగడానికి అవకాశాలున్నాయని ఆర్‌బిఐ గవర్నరు దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి