24, నవంబర్ 2011, గురువారం

ఇరాక్‌లో లక్షన్నర అమెరికా సైన్యం, కాశ్మీర్ లో ఏడు లక్షల ఇండియా సైన్యం -అరుంధతి రాయ్




అమెరికా నాయకత్వంలోని నాటో బలగాలు ఇరాక్ లో లక్షన్నర వరకూ ఉండగా, చిన్నపాటి కాశ్మీరు లోయలో మాత్రం భారత సైన్యాలు ఏడు లక్షలకు పైగా మొహరించాయని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ పేర్కొంది. న్యూయార్క్ నగరంలోని ఆసియా సొసైటీ వారు నిర్వహించిన ఒక కాన్ఫరెన్సులో కాశ్మీరు విషయమై మాట్లాడుతూ ఆమే ఈ వ్యాఖ్యలు చేశారు. “కాశ్మీర్: ద కేస్ ఫర్ ఫ్రీడం” అన్న అంశంపై ఈ కాన్ఫరెన్సు జరిగింది. ప్రపంచంలోనే అత్యంత రక్తపూరితమైన ఆక్రమణలలో కాశ్మీరు ఒకటని అరుంధతి రాయ్ చర్చలో పాల్గొంటూ అభివర్ణించింది. కాశ్మీరులో విధించిన ‘సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం’ (ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ) ను వెంటనే ఉపసంహరించాలను ఆమే డిమాండ్ చేసింది. కాశ్మీరు ప్రజలకు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోగల స్వయం నిర్ణయాధికార హక్కు ఉన్నదని ఆమె నొక్కి చెప్పింది.
“ప్రపంచంలోనే అత్యంత రక్తపూరితమైన, సుదీర్ఘమైన ఆక్రమణలలో కాశ్మీరు ఆక్రమణ ఒకటి. ప్రపంచం విస్మరించిన వాటిలో కూడా కాశ్మీరు ఒకటి. భారత దేశం కాశ్మీరును క్రూరమైనదిగా చేస్తుండగా, ఆ ఆక్రమణ భారతీయులను క్రూరులుగా చేస్తోంది. కాశ్మీరు ప్రజలకు తమ భవిష్యత్తుని నిర్ణయించుకునే హక్కు ఉంది. వారికి తాము ఎలా ఉండాలో నిర్ణయించుకునే హక్కుంది. ఆ దిశలో మొదటి అడుగు కాశ్మీరునుండి మిలట్రీని ఉపసంహరించాలి. నమ్మడానికి వీలు లేని ‘ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ’ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి” అని అరుంధతి రాయ్ పేర్కొంది.
“కాశ్మీరులో భారత మిలట్రీ పాలనలో మాట్లాడే స్వేచ్ఛ లేదు. మానవ హక్కుల ఉల్లంఘనలు సర్వ సామాన్యం. ఎన్నికలు రిగ్గింగ్ కు గురవుతాయి. పత్రికలను అదుపు చేస్తారు. తుపాకులు ధరించి ఉండే భద్రతా బలగాల వలన కాశ్మీరు ప్రజల బ్రతుకులు కనా కష్టంగా తయారయ్యాయి. ఎటువంటి చట్టాల భయం లేకుండానే భద్రతా బలగాలు కాశ్మీరి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వ్యక్తులు మాయం కావడం అక్కడ దాదాపుగా రోజువారీ కార్యక్రమం. కిడ్నాప్, అరెస్టులు, బూటకపు ఎన్‌కౌంటర్‌లు, చిత్ర హింసలు సర్వ సాధారణం. సామూహిక సమాధులను కనుగొన్నారు. కాని ప్రపంచం యొక్క చేతన స్పందన లేకుండా పడి ఉంది” అని అరుంధతి చర్చల సందర్భంగా తెలిపింది.
“అర మిలియన్ పైగా గల భారత సైన్యం కాశ్మీరులో పాల్పడుతున్న అత్యాచారాల గురించి బైటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ.  నిరంతర నిర్భంధం కొనసాగుతోంది. పురుషులు, స్త్రీలు, పిల్లలను అగౌరవపరచడం మామూలు దిన చర్య. ఆ చిన్న లోయలో ఏడు లక్షలకు పైగా భారత సైన్యం మొహరించి ఉంది. కాశ్మీరులోని పట్టణాలు, నగరాలన్నింతిలో ప్రతి అడుగుకి, ప్రతి మూలా ఒక చెక్ పాయింటు దర్శనమిస్తుంది. ఇరాక్ లో అమెరికా సైన్యం లక్షా అరవై వేల సైన్యం ఉంది. కాశ్మీరులో మొహరించి ఉన్న ఏడు లక్షల భారత సైన్యాన్ని ఇరాక్ తో పోల్చి చూడండి” అని అరుంధతీ రాయ్ వివరించింది.
ఇలా ఉండగా న్యూయార్క్ నగరంలో కాశ్మీరు విషయమై జరిగిన కాన్ఫరెన్సు లో అరుంధతీ రాయ్ ప్రసంగాన్ని పురస్కరించుకుని ముగ్గురు కాశ్మీరీ పండిట్లు జమ్మూ కాశ్మీరు హైకోర్టు కి చెందిన జమ్ము బెంచిలో ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’ దాఖలు చేశారు. విజయ్ కుమార్ కష్కారి, అజయ్ కుమార్ భట్, వీర్ జి సరాఫ్ అను ముగ్గురు ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాశ్మీరు ప్రజల కష్టాలను చెప్పటం వల్ల కాశ్మీరు ప్రజల ప్రయోజనాలకు ఏమన్న జరిగితే లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. కాశ్మీరు పండిట్లను కాశ్మీరు లోయకు తిరిగి రమ్మని కాశ్మీరు ప్రజలు, హురియత్ కాన్ఫరెన్స్, జె.కె.ఎల్.ఎఫ్ లాంటి సంస్ధలు అనేక సార్లు విజ్ఞప్తి చేశాయి. కాశ్మీరీ పండిట్లను చూపి కాశ్మీరీ ప్రజలపై భద్రతా బలగాలు జరుపుతున్న అత్యాచారాలను సమర్ధించలేరు. సంస్కృతీపరంగా కాశ్మీరీలు సెక్యులరిస్టులు. మతతత్వ చరిత్ర వారికి లేదు. పాకిస్ధాన్ ను బూచిగా చూపి కాశ్మీరుని భారత సైన్యాలు ఆక్రమించి కాశ్మీరీలకి ఇచ్చిన వాగ్దానాన్ని భారత్ తుంగలో తొక్కింది.
కాశ్మీరు భారత దేశంలో భాగంగా ఉండాలంటే భారత ప్రభుత్వం గానీ అక్కడి సైన్యం గానీ కాశ్మీరీల హృదయాలను గెలుచుకోవాలి తప్ప భూభాగాలను ఆక్రమించి నిర్భందం అమలు చేయడం వల్ల ధన ప్రాణ నష్టాలే సంభవిస్తున్నాయని అనుభవం రుజువు చేస్తోంది. భారత ప్రభుత్వ ఇప్పటికైనా కాశ్మీరీల మనసులను గెలుచుకునేందుకు చర్యలు చేపట్టాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి