గురువారం, నవంబర్ 10, 2011,
8:27 [IST
]
తెలుగువాడు ఉపేంద్ర జోగి చివుకుల వరుసగా ఆరోసారి అమెరికాలోని న్యూజెర్సీ అసెంబ్లీకి ఎన్నికై తన సత్తా చాటాడు. నెల్లూరు జిల్లాలో జన్మించి అమెరికా వెళ్లిన ఆయన డెమోక్రటిక్ పార్టీ నేతగా ఎదిగారు. తొలుత కౌన్సిల్ సభ్యుడిగా, అనంతరం డిప్యూటీ మేయర్, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. న్యూజెర్సీ జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో 17వ లెజిస్లేటివ్ డిస్ట్రిక్ట్ ప్రతినిధిగా మాత్రం బుధవారం వరుసగా మూడోసారి జయకేతనం ఎగురవేశారు. నెల్లూరు జిల్లా కావలి వాస్తవ్యులైన బ్రహ్మానందం, సత్యనారాయణమ్మ ఐదుగురి సంతానంలో ఆఖరివాడైన ఉపేంద్ర 1950 అక్టోబర్ 8న జన్మించారు.
ఆయనకు రెండేళ్ల వయసులో బ్రహ్మానందం కుటుంబ సమేతంగా చెన్నై వెళ్లిపోయారు. అక్కడ ఓ మిత్రుడి కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చినా, చదువుపై ఉపేంద్ర శ్రద్ధను పసిగట్టి ప్రోత్సహించారు. దీంతో స్కాలర్‌షిప్పులతోనే బీఈఈ పూర్తిచేశారు. ముంబై వ్యాపారితో ఏర్పడిన పరిచయం 1974లో అమెరికాకు చేర్చింది. న్యూయార్క్ సిటీ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎంఈఈ) పూర్తి చేశారు. సహాధ్యాయి డైసీని పెళ్లాడారు. అమెరికా పౌరుడిగా స్థిరపడ్డారు.
ఫ్రాంక్లిన్ టౌన్‌షిప్ కౌన్సిల్‌కు 1997లో ఎన్నికవడం ద్వారా ఘనంగా రాజకీయ అరంగేట్రం చేశారు. తర్వాత 1998 నుంచి 2000 వరకు డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే వివిధ రంగాలకు చెందిన కమిటీల్లో సేవలందించారు. డెమోక్రటిక్ పార్టీ నేతగా న్యూజెర్సీలోని 17వ జిల్లా అసెంబ్లీ ప్రతినిధిగా ఇప్పటికి మూడు దఫాలుగా అప్రతిహత విజయం సాధిస్తూ వస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి