24, నవంబర్ 2011, గురువారం

రికార్డు స్ధాయిలో రూపాయి పతనం


మంగళవారం రూపాయి రికార్డు స్ధాయిలో పతనం అయ్యింది. ఒక దశలో డాలరుకు రు.52.73 పై.ల విలువకు రూపాయి పతనం అయ్యింది. మంగళవారం వ్యాపార సమయం ముగిసే నాటికి అత్యల్ప స్ధాయి డాలరుకు రు.52.73 పై ల నుండి కొద్దిగా కోలుకుని డాలరుకు రు.52.32  పై.ల స్ధాయికి రూపాయి విలువ చేరుకుంది. అంటే సోమవారం ముగింపు డాలరుకు రు.52.16 పై.ల స్ధాయితో పోలిస్తే మంగళవారం రూపాయి 16 పైసల విలువ కోల్పోయింది. ముప్ఫై షేర్ల సెన్సెక్స్ మంగళవారం ఎనిమి రోజుల వరుస పతనం నుండి కోలుకుని 0.75 శాతం లాభంతో ముగిసినప్పటికీ రూపాయి పతనం కొనసాగడం గమనార్హం.
అయితే, ఈక్విటీ మార్కెట్లు మంగళవారం చవి చూసిన లాభం తాత్కాలికం మాత్రమేననీ రూపాయి పతనం కొనసాగుతున్నందున షేర్లు మళ్ళీ పతనం అవుతాయనీ విశ్లెషకులు అంచనా వేస్తున్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు రూపాయి విలువ పతనం కేవలం అంతర్జాతీయ ఆర్ధిక పరిస్ధితిని మాత్రమే సూచిస్తున్నదని చెప్పాడు. ఆయన అంచనా ప్రకారం రూపాయి మళ్ళీ కోలుకుంటుంది. అవును. రూపాయి ఈ రోజు కాకపోతే రేపయినా, ఈ నెల కాకపోతే వచ్చే నెలయినా, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా రూపాయి కోలుకోవడం తధ్యం. కాని పతనానికి ఆయన (మాంటెక్ సింగ్ అహ్లూవాలియా) చెప్పే కారణాలే నమ్మదగినవిగా లేవు.
గతంలో కూడా ప్రపంచ ఆర్ధిక పరిస్ధితి ఇంతకంటే ఘోరంగా తగలడిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. అప్పుడెప్పుడూ పతనం కాని రూపాయి ఇప్పుడెందుకు పతనం అవుతోందో ప్రణాళికావేత్త చెబితే బాగుండేది. మన ఆర్ధిక వ్యవస్ధలో సానుకూల మార్పులు సంభవిస్తే -ఆర్ధిక వృద్ధి పెరిగితేనో, ద్రవ్యోల్బణం పొరబాటున తగ్గితేనో, ఎగుమతులు పెరిగితేనో లేదా షేర్ మార్కెట్లు రయ్యి మని దూసుకు పోతేనే- అందుకు కారణం మన ఆర్ధిక వేత్తలు, పాలకుల ప్రతిభే కారణం అవుతుంది. అదే రూపాయి విలువ పతనం ఐనా, ద్రవ్యోల్బణం పెరుగుతున్నా, షేర్ మార్కెట్లు పతనం అవుతున్నా… అటువంటి వాటికి మాత్రం ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో జరుగుతున్న పరిణామాలు కారణంగా నిలుస్తాయి. లేదా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మందగమనం, యూరప్ రుణ సంక్షోభం ఇవి కారణంగా నిలుస్తాయి. గొప్పలన్నీ మనవీ, తిప్పలన్నీ ఇతరులవి.
సోమవారం అయితే రూపాయి 81 పైసల విలువ నష్టపోయింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ పతనం అవడం వల్ల పెట్రోలియం ధరలు ఇండియాకి పెరుగుతాయి. అదే కాక ద్రవ్యోల్బణం పెరగడానికి కూడా దోహదపడుతుంది. ఏడు రోజూల వరుస పతనంలో రూపాయి మొత్తం 217 పైసలు నష్టపోయింది. అది 4.34 శాతం పతనంతో సమానం. రూపాయి విలువ పతనం వల్ల డాలర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఆయిల్ దిగుమతిదారులు డాలర్ల కొనుగోలుకి పోటీపడుతున్నారు. పెట్టుబడులు తరలిపోవడం కూడా పెరిగిపోయింది. పెట్టుబడుల తరలింపు మళ్ళీ రూపాయి విలువ పైన ఒత్తిడి పెంచుతోంది. నవంబరు 15 నుండి ఐదు రోజుల్లో 460.40 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఎఫ్.ఐ.ఐ లు ఉపసంహరించుకున్నారని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.
ఆర్.బి.ఐ జోక్యం చేసుకోవచ్చు అని పుకార్లు వ్యాపించాకనే మంగళవారం రూపాయి పతనం ఆగి కొంచెం కోలుకుంది. కాని విదేశీమార్క ద్రవ్య మార్కెట్ లో ఆర్.బి.ఐ జోక్యం చేసుకున్నంత మాత్రాన రూపాయి పతనం ఆగదనీ, ఎఫ్.ఐ.ఐ ల ఉపసంహరణ, ప్రపంచ కారణాలు రూపాయి పతనానికి కారణాలుగా నిలవడమే అందుకు కారణమని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పాడు. “ఆర్.బి.ఐ జోక్యం వల్ల లాభం ఉండదు” అని ముఖర్జీ అన్నాడు. వెరసి రూపాయి పతనానికి అంతర్జాతీయ కారణాలే దోషులని భారత ఆర్ధిక వ్యవస్ధ కాపలాదారులు నిశ్చయించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి