14, నవంబర్ 2011, సోమవారం

నవంబరు 16 నుండి పెట్రోల్ ధర తగ్గుతుందట!!!



అవును. అనుమానం లేదు. మీరు చదివింది నిజమే. పెట్రోల్ ధరలు నవంబరు 16 తేదీ నుండి తగ్గించడానికి ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఆ మేరకు రాయిటర్స్ సంస్ధ ఓ వార్త ప్రచురించింది. తగ్గించడం అంటూ జరిగితే దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా తగ్గించినట్లు అవుతుంది. అంతేకాక, పెట్రోల్ రేట్లపై నియంత్రణ ఎత్తేసిన 18 నెలల తర్వాత మొదటిసారిగా తగ్గించినట్లు అవుతుంది. నియంత్రణ ఎత్తివేసేటప్పుడు ఏం చెప్పారంటే అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగినప్పుడు దేశీయంగా పెట్రోల్ ధరలు పెరుగుతాయనీ, అంతర్జాతీయంగా తగ్గినపుడు ఇక్కడ కూడా తగ్గుతాయని చెప్పారు. కాని అంతర్జాతీయ ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నప్పటికీ ఇక్కడ పెట్రోల్ ధరలు ఇంతవరకూ పెరుగుడే తప్ప తగ్గుడే జరగలేదు. ఈ నెల పదహారవ తారీఖున తగ్గిస్తామని కంపెనీలు చెబుతున్నాయి.
సింగపూర్ ధరలు రూపాయి విలువ తగ్గుదలతో పోలిస్తే ఎక్కువగానే తగ్గడం వల్ల ఈ తగ్గుదల సాధ్యపడుతున్నదని కంపెనీల అధికారులు చెబుతున్నారు. జూన్ 2010 లో పెట్రోల్ ధరలపైన ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేసింది. అప్పటినుండీ ధరలు పెరుగుతూనె ఉన్నాయి. “రూపాయి విలువ ప్రస్తుత స్ధాయిలో ఉండడం కొనసాగితే, సింగపూర్ గాసోలిన్ స్పాట్ ధరలు బ్యారెల్ కి 115.80 డాలర్ల ధర కూడా కొనసాగితే, ఆయిల్ కంపెనీలు ఒక శాతం మేరకు తగ్గించగల అవకాశం ఉంటుంది” అని పేరు చెప్పడానికి ఇష్టపడని కంపెనీల అధికారి ఒకరు తెలిపినట్లు రాయిటర్స్ తెలిపింది.
గత వారమే ప్రభుత్వ కంపెనీలు పెట్రోల్ ధరలను లీటర్ కి రూపాయిన్నర పెంచాయి. అది స్ధానిక పన్నులతో కలుపుకుని ఢిల్లీలో లీటరుకి రు.1.80 పై.లు పెరిగింది. ఈ సంవత్సరం ఇది నాలుగోసారి పెంచడం. ఓవైపు అన్ని సరుకుల ధరలు పెరుగుతున్నందున ద్రవ్యోల్బణం పెరుగుతున్నదనీ, దాన్ని తగ్గించడమే తమ కర్తవ్యమనీ ప్రభుత్వం, ఆర్.బి.ఐ చెబుతూనే, మరొకవైపు పెట్రోల్ ధర పెంచి తద్వారా అన్ని సరుకులధరలూ పెరగడానికీ, మరింత ద్రవ్యోల్బణ పెరగడానికీ దోహదపడే చర్యలను ప్రభుత్వం తీసుకోవడం ప్రభుత నిజాయితీ రాహిత్యాన్ని తెలియజేస్తోంది. అంతర్జాతీయంగా తగ్గితే తగ్గిస్తామన్న కంపెనీలు జనవరి 2009 నుండీ తగ్గించలేదు.
పెట్రోల్ ప్రధానంగా మధ్య తరగతి ప్రజానీకం వాడే ఇంధనం. ద్విచక్ర వాహనదారులకు ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది. కొన్ని పెట్రోల్ కార్లు, ద్విచక్రవాహనాలకు తప్ప పెట్రోల్ వినియోగం ఇతర ఏ రంగంలోనూ పెద్దగా వాడరు. డీజెల్ రేట్లు తక్కువగా ఉండడంతో డీజెల్ వాడకం పెరిగి ఆ మేరకు పెట్రోల్ వాడకం తగ్గుతోంది. ప్రస్తుతం లీటరుకు పెట్రోల్ రిటెయిల్ ధర రు.68.60 పై.లు పలుకుతోంది. గత వారం ఆసియా పెట్రోల్ ధరలు బ్యారెల్ కు 121 డాలర్ల లెక్కన, రూపాయికి రూ.49.30 పై.లు విలువ ఉన్నట్లుగా అంచనా వేస్తూ పెట్రోల్ ధరలను నిర్ణయించారు. ఇప్పుడు బ్యారెల్ కి 115.80 డాలర్లకు తగ్గగా, రూపాయి విలువ కూడా రు.49.30 పై.లు కు తగ్గింది. రూపాయి విలువ తగ్గడం వల్ల కూడా పెట్రోల్ ధర పెరుగుతుంది. కాని ఆ పెరుగుదలను దాటి అంతర్జాతీయంగా బ్యారెల్ పెట్రోల్ ఖరీదు (‌$121.00 – $115.80 = $5.20) తగ్గడంతో దేశీయంగా పెట్రోల్ ధరలు తగ్గించగల అవకాశం వచ్చిందన్నమాట.
భారత ఇంధన కంపెనీలు పక్షం రోజులకొకసారి సమావేశం అయ్యి ధరల తీరుతెన్నులు పరిశీలించి తగ్గించేదీ, పెంచేదీ నిర్ణయిస్తాయి. పెద్దగా పెరక్కపోతే, బాదగల స్ధాయికి పెరిగేదాక ఓపిక పట్టి అప్పుడు పెంచుతాయి. పెంచాలనుకున్నపుడు పత్రికలకు మెల్లగా సమాచారం ఇచ్చి వాటి ద్వారా బీద పలుకులు పలుకుతాయి. అమ్మో నష్టాలు, ఇంక ఏ మాత్రం భరించలేము అని పత్రికల చేత చెప్పిస్తాయి. పత్రికలు కూడా యధా శక్తి వారికి సహకరిస్తాయి. ఇప్పటికే ప్రజలపై భారాన్ని పడకుండా ఆపాయనీ, ఇంక భరించడం కష్టమనీ, వినియోగదారులపైన మోపితే తప్ప కంపెనీలు బతకడం కష్టమనీ పత్రికలు రొద పెడతాయి. ఈ లోపు ప్రతిపక్షాలు ప్రతిజ్ఞలు చేస్తాయి. పెంచితే సహించేది లేదు అంటాయి. అసలు బుద్ధుందా మీకు ప్రజలపై భారం మోపడానికి? అని ప్రశ్నిస్తాయి. మమత లాంటివాళ్ళు మద్దతు ఉపసంహరించేస్తాం అని హెచ్చరిస్తాయి. ఐనా ప్రభుత్వం తన దారిన తాను కంపెనీలకి పెంచుకోండి అని చెబుతుంది. ఇక ప్రతిపక్షాలు రెండు, మూడు రోజులు బిజీ అవుతాయి. చంద్రబాబు లాంటి వాళ్లు, ఏ ఎద్దుల బండి ఎక్కి రావడమో, ఎద్దుల బండితొ కార్లు లాగించడమో చేస్తే వామ పక్షాలు జిల్లా కేంద్రాల వద్ద పోలీసుల్తో కుస్తీలు పట్టి అరెస్టయ్యి సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు. అంతటితో పెట్రోల్ ధరల పెంపుపై ఆగ్రహం చల్లారుతుంది. ఇక మళ్లీ పెంచేదాకా అందరూ ప్రశాంతంగా ఎవరి పన్లు వారు చూసుకుంటారు.
ఇంతకీ నవంబరు 16 తేదీన పెట్రోల్ ధర లీటర్ కి ఎంత తగ్గుతుంది? కేవలం రు.0.60 పై.లు మాత్రమే. అర్ధ రూపాయి కంటే ఎక్కువే అని చెప్పుకుని సంతృప్తిపడవలసిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి