8, నవంబర్ 2011, మంగళవారం

ఆల్‌ ఖైమా


  • ఎమ్మార్‌ నిధులు అక్కడికే ?
  • కోనేరు ప్రదీప్‌ను ప్రశ్నించిన సిబిఐ అధికారులు
  • వాన్‌పిక్‌ కేటాయింపులపై ఐఎఎస్‌ అధికారి శామ్యూల్‌కు ప్రశ్నలు
  • 'గాలి' పిఎ కోసం గాలింపు
  • లుక్‌ అవుట్‌ నోటీస్‌ జారీ
  • ముమ్మరమవుతున్న దర్యాప్తు
ఎమ్మార్‌, ఓఎంసి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు ముమ్మరమైంది. విదేశీ బ్యాంకు ఖాతాలపైనా సిబిఐ దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఎమ్మార్‌ విల్లాల అమ్మకాలకు సంబంధించిన పెద్దమొత్తం రస్‌ఆల్‌ఖైమాకు చెందిన ప్రభుత్వ బ్యాంకు తరలివెళ్లినట్లు సిబిఐ గుర్తించింది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో చేపట్టిన వాన్‌పిక్‌లో రస్‌ఆల్‌ఖైమా భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు వ్యవహారాలకు సంబంధించిన లింకులపైన సిబిఐ ఆరా తీస్తోంది. దర్యాప్తు అధికారులు సోమవారం నాడు ఈ వ్యవహారాలపైనే కసరత్తు చేశారు. ఎమ్మార్‌ కేసులో ఇప్పటికే అరెస్ట్‌యైన స్టైలిష్‌ హోమ్స్‌ ఎండి కోనేరు ప్రసాద్‌ కుమారుడు కోనేరు ప్రదీప్‌ను విచారించారు. మరో కుమారుడు మధుకు కూడా నోటీసులు జారీ చేశారు. ఒకటి,రెండు రోజుల్లో ఆయన సిబిఐ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు గత ప్రభుత్వ హయంలో అడ్డగోలుగా జిఓలు జారీ చేసిన అధికారుల విచారణనూ సిబిఐ కొనసాగిస్తోంది. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి శామ్యూల్‌ను ఈ విషయమై వరుసగా రెండవరోజు అధికారులు ప్రశ్నించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో వేలాది ఎకరాలను వాన్‌పిక్‌కు కేటాయించడంపై శామ్యూల్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. భారీ కేటాయిపుల వెనుక ఎవరి ప్రమేయం ఉందన్న విషయమై సిబిఐ అధికారులు కూపీ లాగుతున్నట్లు తెలిసింది. . ఓఎంసి అక్రమాలకు సంబంధించి ఇప్పటికే సిబిఐ అదుపులో ఉన్న గాలి జనార్ధన్‌రెడ్డి పిఎ ఆలీఖాన్‌కోసం గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. గాలి అరెస్ట్‌ అయినతరువాత నుండి కనపడకుండా పోయిన ఆలీఖాన్‌ కోసం సోమ వారం నాడు సిబిఐ లుక్‌అవుట్‌ నోటీసును జారీ చేసింది. విదేశాలకు పారిపోయే అవకాశం ఉండటంతో అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద అప్రమత్తంచేశారు.
150 కోట్లు రస్‌ఆల్‌ఖైమా బ్యాంకుకు ...?
స్టైలిష్‌ హోమ్స్‌ ద్వారా జరిగిన ఎమ్మార్‌ విల్లాలకు చెందిన పెద్దమొత్తం విదేశీబ్యాంకులకు తరలివెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే 150 కోట్లరూపాయల మొత్తం దుబారులోని రస్‌ఆల్‌ఖైమాకు చెందిన బ్యాంకుకు తరలివెళ్లినట్లు సిబిఐ అధికారులకు సమాచారం అందినట్లు చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారించేందకు కోనేరు ప్రసాద్‌ కుమారులు ఇద్దరికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. వీరిద్దరు దుబారు కేంద్రంగానే 'కోనేరు'కు సంబంధించిన ఇతర వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తున్నారు. సోమవారం విచారణకు హాజరైన కోనేరు ప్రదీప్‌ ట్రైమాక్స్‌ కంపెనీకి సిఇఓగా వ్యవహరిస్తున్నారు. నిధుల తరలింపుపైనే సిబిఐ ఆయనను ప్రశ్నించినట్లు సమాచారం. రస్‌ఆల్‌ఖైమా బ్యాంకుతో పాటు మరికొన్ని విదేశీ బ్యాంకులకు కూడా నిధులు తరలివెళ్ళి ఉంటాయని సిబిఐ అనుమానిస్తోంది. దర్యాప్తు జరిగే అన్ని రోజులు అందుబాటులో ఉండాలని ప్రదీప్‌కు సిబిఐ సూచించినట్లు సమాచారం. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి శామ్యూల్‌ విచారణ సమయంలోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయంలో వాన్‌పిక్‌కు గుంటూరు. ప్రకాశం జిల్లాల్లో 15వేల ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మూడు జిఓలను అప్పట్లో శామ్యూల్‌ జారీ చేశారు. నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్‌లో అప్పట్లో రస్‌ఆల్‌ఖైమా కూడా భాగస్వామి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ తరహా జిఓల జారీకి సంబంధించి మరికొందరు ఉన్నతాధికారులను కూడా సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంది.
గాలి కేసులో కీలకంగా మారనున్న ల్యాప్‌టాప్‌
ఓఎంసి అక్రమాలకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్‌ అయిన గాలి జనార్ధన్‌రెడ్డి కేసులో ఓ ల్యాప్‌టాప్‌ కీల కంగా మారనుంది. గాలి జనార్ధన్‌రెడ్డికి చెందిన ఈ ల్యాప్‌టాప్‌ సిబిఐ నిర్వహించన సోదాల్లో అధికారులకు దొరకలేదు. ల్యాప్‌టాప్‌తో పాటు 'గాలి' వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారం ఆయన పిఎ ఆలీఖాన్‌ ఉన్నట్లు సిబిఐకి సమాచారం అందింది. దీంతో ఆయన కోసం గాలింపు చర్యలను సిబిఐ ముమ్మరం చేసింది. ఆ ల్యాప్‌టాప్‌ దొరికితే 'గాలి' అక్రమవ్యాపారాలతో పాటు, విదేశాల్లో దాచి ఉంచిన నిధుల రహస్యం బట్టబయలయ్యే అవకాశం ఉందని సిబిఐ అధికారులు భావిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి