* రెండెకరాల నుంచి వేలాది కోట్లకు ఎదిగిన వైనాన్ని తేల్చనున్న విచారణ
* డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఈడీకి కూడా విచారణ ఆదేశాలు
* నాలుగు సంస్థలూ విడివిడిగా స్వతంత్ర విచారణ జరపాలని స్పష్టీకరణ
* మూడు నెలల్లోగా సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలన్న న్యాయస్థానం
* అక్రమాలకు పిటిషన్లో ఆధారాలున్నాయన్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి
* బినామీల కార్యకలాపాలు, వారి ఆస్తులపై కూడా కొనసాగనున్న విచారణ
* బినామీల్లో రామోజీ, సుజనా చౌదరి, మురళీమోహన్ సహా పలువురు ప్రముఖులు
ఈ కేసులో పలు వాస్తవ ప్రకటనలు, న్యాయపరమైన అంశాలు ఉన్నాయి.
చంద్రబాబునాయుడి అధికార దుర్వినియోగం, ఇతర చర్యల్లో ఆయన జోక్యానికి
సంబంధించిన ఆధారాలను పిటిషనర్ కోర్టు ముందు ఉంచారు. అందుకే ఈ వ్యాజ్యాన్ని
విచారణకు స్వీకరిస్తున్నాం..
-హైకోర్టు ధర్మాసనం
పాపం పండింది..! అక్రమాల పుట్ట పగలబోతోంది..!! అక్రమాలకు ఆద్యుడంటూ
ఎందరెన్ని విమర్శలు చేస్తున్నా... తనకు మాత్రమే చేతనైన పద్ధతుల్లో
తప్పించుకుంటూ... ఆఖరికి అన్నా హజారే వారసుడిననే స్థాయికి తెగించిన
చంద్రబాబునాయుడి నిజస్వరూపం లోకానికి వెల్లడి కాబోతోంది. అధికారాన్ని
అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్న తెలుగుదేశం పార్టీ అధిపతి
తోటలు, కోటల రహస్యాలన్నీ రెక్కలు తెంచుకుని బయటకు రాబోతున్నాయి.
రాజకీయాల్లో అడుగిడింది మొదలు... అబద్ధాలమీద అబద్ధాలు చెబుతూ... మోసం మీద
మోసానికి తెగిస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దేశ విదేశాల్లో విపరీతమైన
ఆస్తులు పోగేసుకున్నారని... ఎప్పుడూ తన చెప్పుచేతల్లో ఉండే తైనాతీలను
చుట్టూ బినామీలుగా పెట్టుకుని వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నారని...
వీటన్నిటిపై సమగ్రమైన విచారణ జరపాలంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్
రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని
రాష్ట్ర హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది.
దాదాపు 2,500
పేజీలున్న పిటిషన్‌ను, అందులోని సాక్ష్యాధారాల్ని పరిశీలించిన మీదట...
కేసులో గట్టి సాక్ష్యాలున్నట్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితో కూడిన
ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్‌లోని ఆరోపణలకు ఆధారాలున్నాయని భావించిన
కోర్టు.. దీనిపై విచారణ జరపాలంటూ అత్యున్నత దర్యాప్తు సంస్థయిన సీబీఐని,
మనీల్యాండరింగ్ వ్యవహారాల్ని విచారించే ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌ను,
రాష్ట్ర డీజీపీని, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. దీనికి మూడు
నెలల గడువిస్తూ... ఈ నాలుగు సంస్థలూ విడివిడిగా నివేదికలు సమర్పించాలని
స్పష్టంచేసింది.
హైదరాబాద్, న్యూస్‌లైన్: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ
అధినేత చంద్రబాబుకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. చంద్రబాబు అక్రమాస్తుల
కేసులో సోమవారం సీబీఐ విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో
చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి భారీస్థాయిలో ఆస్తులు
కూడబెట్టారని, కుటుంబ సభ్యులకు పలు ప్రయోజనాలు చేకూర్చారని, ఈ మొత్తం
వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ హైకోర్టులో ప్రజా
ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో
పిటిషనర్ వాదనలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గులాం మహ్మద్,
న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావులతో కూడిన ధర్మాసనం ఇటీవల విన్నది.
సోమవారం
మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్
డెరైక్టర్ (ఈడీ), రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీలను కూడా విచారణ
జరపాలని ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు
లోకే్‌శ్, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్,
హెరిటేజ్ ఫుడ్స్, అహోబిలరావు, వి.నాగరాజనాయుడు, టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి,
నామా నాగేశ్వరరావు, టీడీపీ నేత మురళీమోహన్, కర్నాటి వెంకటేశ్వరరావు,
టీడీపీ ఉపాధ్యక్షుడు సీఎం రమేశ్‌ల అక్రమాలపై స్వతంత్రంగా అవసరమైన
విచారణలు/దర్యాప్తులు జరపాలని స్పష్టం చేసింది.
విచారణలు/దర్యాప్తులను
మూడు నెలల్లో పూర్తి చేసి వేర్వేరుగా నాలుగు నివేదికలను తమ ముందు ఉంచాలని
ఆదేశించింది. ఈ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడానికి గల కారణాలను ధర్మాసనం
వివరించింది. ‘‘ఈ కేసులో పలు వాస్తవ ప్రకటనలు, న్యాయపరమైన అంశాలు ముడిపడి
ఉన్నాయి. నారా చంద్రబాబునాయుడి అధికార దుర్వినియోగం, ఇతర చర్యల్లో ఆయన
జోక్యానికి సంబంధించిన ఆధారాలను పిటిషనర్ (వైఎస్ విజయమ్మ) కోర్టు ముందు
ఉంచారు. అందుకే ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నాం’’ అని ధర్మాసనం
తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విజయమ్మ హైకోర్టుకు సమర్పించిన ఆధారాల్లో
పలు అంశాలను ధర్మాసనం తన ఉత్తర్వుల్లో ప్రముఖంగా ప్రస్తావించింది. ఆ
వివరాలు ఇవీ...
ప్రజాప్రతినిధిగా ఉంటూ సంపాదించినవే..
1951లో
మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రబాబునాయుడు యూనివర్సిటీలో
చదువు పూర్తి చేసిన తరువాత నేరుగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ సమయానికి
ఆయనకు కుటుంబానికి సంబంధించిన చిన్నపాటి పొలం ద్వారా వచ్చిన ఆదాయం మినహా,
స్వతంత్ర ఆదాయమేమీ లేదు. 1978 తరువాత ఆయన కూడబెట్టిన ఆస్తులు, సంపాదన
మొత్తం ప్రజా ప్రతినిధిగా (పబ్లిక్ సర్వెంట్‌గా) ఉన్నప్పుడు సంపాదించినవే.
1978లో ఎమ్మెల్యేగా ఎన్నికై, 1980-81, 81-82ల మధ్య మంత్రి పదవులు
చేపట్టారు. 1983 ఎన్నికల్లో ఓటమిపాలై, 1989 ఎన్నికల్లో గెలుపొందారు. 1994లో
కేబినెట్ మంత్రిగా పనిచేశారు.
1995లో అప్పటి ముఖ్యమంత్రి
ఎన్‌టీఆర్‌ను పదవీచ్యుతుణ్ణి చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఈ
మొత్తం ప్రక్రియలో చంద్రబాబుకు రామోజీరావు దన్నుగా నిలిచారు. ఎన్‌టీఆర్
తనకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించలేదనే ఉద్దేశంతో రామోజీ ఇలా చేశారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఆయన తీసుకున్న అరాచక విధాన నిర్ణయాలను
రామోజీ ఎన్నడూ విమర్శించలేదు. ఎన్‌డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వం
మద్దతు ఉపసంహరించకుండా ఉండే విషయంలో రామోజీ కీలక పాత్ర పోషించారు. సీపీఎం,
సీపీఐ, బీజేపీ తదితర పార్టీలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికార
దుర్వినియోగంపై, ఆశ్రీతపక్షపాతంపై, అవినీతిపై పలు పుస్తకాలు ప్రచురించాయి.
అయితే రామోజీరావు ఈ అంశాలన్నింటినీ తక్కువ చేసి చూపారు. సాధారణ ప్రజల్లో
చంద్రబాబు ప్రతిష్టను కాపాడేందుకే ఇలా చేశారు.
రాజకీయాల్లోకి వచ్చేనాటికి రెండెకరాలే..!
రాజకీయాల్లోకి
వచ్చే నాటికి చంద్రబాబు ఆస్తి కేవలం రెండెకరాలు. 1986లో తన కుటుంబం
మొత్తానికి 70 ఎకరాల భూమి ఉండేదని, అప్పట్లో కుటుంబం విడిపోయాక తన వంతుగా
వచ్చిన సొమ్ముతో నెల్లూరు జిల్లా బాలయ్యపల్లిలోని నిందాలిలో భూములు
కొన్నానని 1988లో కోర్టులో వేసిన ఒక అఫిడవిట్లో చంద్రబాబు స్వయంగా
పేర్కొన్నారు. ఆ భూముల ద్వారా తనకు ఏడాదికి రూ.36,000 ఆదాయం వచ్చేదని, తాను
స్వయంగా వ్యవసాయం చేస్తూ హైబ్రిడ్ వేరుశనగ పండించేవాడనని ఆ అఫిడవిట్లో
బాబు పేర్కొన్నారు. నిందాలి, వాక్యం గ్రామాల్లో తన బంధువుల నుంచే అతితక్కువ
రేటుకు అంటే ఎకరా రూ.1,000 చొప్పున 1985లో తొలుత 65 ఎకరాలు కొనుగోలు చేసిన
చంద్రబాబు... ఆ తరవాత బినామీ పేర్లతో మరో 250 ఎకరాలు కొన్నారు. ఈ మొత్తం
315 ఎకరాల భూముల చుట్టూ 12 కిలోమీటర్ల మేర ప్రహరీ నిర్మించటమే కాదు ఈ
భూముల్లోని ప్రభుత్వ భూముల్ని, నాలుగు పెద్ద చెరువుల్ని ఆక్రమించి మరీ తోట
నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ఆస్తులు..
చంద్రబాబు
తల్లి అమ్మణ్ణమ్మకు 2 ఎకరాల భూమి మినహా సొంతంగా పెద్ద ఆస్తులేమీ లేవు. కానీ
2000 సంవత్సరంలో హైదరాబాద్‌లోని మదీనాగూడ సర్వే నంబర్ 59లో ఆమె రూ.40
లక్షలు పెట్టి ఐదెకరాల భూమిని జాస్తి పాండురంగ విఠల్ నుంచి కొన్నారు.
అప్పుడే బంజారాహిల్స్‌లో రూ.35 లక్షలు పెట్టి మరో భవనాన్ని కూడా కొన్నారు.
తరవాత ఏడాది తిరక్కముందే ఆ రెండు ఆస్తులనూ చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు
బహుమతిగా ఇచ్చేశారు. కనీస ఆదాయం లేని అమ్మణ్ణమ్మ రూ.75 లక్షలు వెచ్చించి
ఇంత స్థాయిలో ఆస్తులు కూడబెట్టడం సాధ్యం కాదు. చంద్రబాబు చాలా తెలివిగా పలు
ఆస్తులను కూడబెట్టేందుకు తన తల్లిపేరును వాడుకున్నారు.
ఇందులో
భాగంగా తన మైనర్ కుమారుడు పేరు మీద హైదరాబాద్ సిటీ చుట్టపక్కల ఆస్తులు
కూడబెట్టారు. అమ్మణ్ణమ్మ గిఫ్ట్‌గా ఇచ్చిన బంజారాహిల్స్ భవంతిని
జె.సత్యనారాయణ అనే వ్యక్తికి లోకేశ్ విక్రయించారు. మళ్లీ ఆ సత్యనారాయణ తన
కుమార్తె అయిన వి.సుధాశారదకు దాన్ని గిఫ్ట్‌గా ఇచ్చేశారు. సుధాశారద వేరెవరో
కాదు. చంద్రబాబు వ్యాపార భాగస్వామి అయిన నాగరాజనాయుడి భార్య. ఈమె
మదీనాగూడలో అమ్మణ్ణమ్మ కొన్నచోటే ఐదెకరాల భూమి తొలుత కొన్నారు. తరవాత ఆ
భూమిని భువనేశ్వరికి విక్రయించారు. అక్రమాస్తులను కూడబెట్టేందుకు చంద్రబాబు
ఈ మార్గాలను ఎన్నుకున్నారు.
లోకేశ్‌కు బెంగళూరు, ముంబైల్లో ఆస్తులు..
చంద్రబాబు,
భువనేశ్వరిల కుమారుడు నారా లోకేశ్ ఇంటర్ పరీక్షల్లో సాధారణ మార్కులు
సాధించారు. అలాంటి వ్యక్తి అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్,
కార్నెగీ మిలన్ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి
చేశారు. ఇందుకు సంబంధించి నిధులను భారతదేశానికి చెందిన కొందరు అందజేశారు.
ఆరు సంవత్సరాల పాటు అమెరికాలో విద్యాభ్యాసం చేసేందుకు సుమారు 2.40 లక్షల
అమెరికన్ డాలర్లు ఖర్చవుతాయి. కాని చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్‌లు
ఎక్కడా ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన అకౌంట్లలో ఈ నిధుల వివరాలను
పేర్కొనలేదు. లోకేశ్‌కు నెల్లూరు జిల్లా నిందాలి గ్రామం, బెంగళూరు, ముంబై
వంటి నగరాల్లో దాదాపు రూ.100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా
అక్రమాస్తులే.
రామోజీని మధ్యవర్తిగా వాడుకున్నారు..
కేజీ
బేసిన్లో ఎంతో విలువైన అపార నిక్షేపాలు ఉన్నాయి. ఈ విషయం తెలిసి కూడా...
రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అంతేకాక రామోజీరావును తనకు లబ్ది చేకూర్చేందుకు ఓ మధ్యవర్తిగా
వాడుకున్నారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సూచనల్ని చంద్రబాబు పెడచెవిన
పెట్టి బిడ్ వేయకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పరోక్షంగా సహకరించారు.
అన్వేషణలో ఎన్ని ఉల్లంఘనలు జరిగినా కిమ్మనకుండా ఊరుకోవటమేగాక అప్పట్లో
రిలయన్స్ గ్రూప్‌లో ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు కనీవినీ ఎరుగని
రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చారు.
అందుకు ప్రతిగా (క్విడ్ ప్రో
క్వో) రిలయన్స్ నుంచి రామోజీరావుకు చెందిన ఉషాకిరణ్ ఎంటర్ ప్రైజెస్
ప్రైవేట్ లిమిటెడ్‌లోకి రెండు విడతలుగా రూ.2,600 కోట్లు అక్రమ మార్గాల్లో,
డొల్ల కంపెనీల ద్వారా వచ్చాయి. ప్రతి ఏటా పీకల్లోతు నష్టాల్లో ఉన్న
ఉషోదయాలో రూ.100 విలువైన ఒక్కో షేరును రూ.5.28 లక్షలు పెట్టి రిలయన్స్
కొనుగోలు చేయటం వెనక చంద్రబాబు పాత్ర ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో రామోజీరావు
పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు. రామోజీ, చంద్రబాబుల అక్రమాలు
పూర్తిస్థాయి దర్యాప్తుతోనే వెలుగులోకి వస్తాయి. అంతేకాక నిధులు ఏ విధంగా
మళ్లింపు జరిగిందో కూడా తెలుస్తుంది.
బోగస్ లావాదేవీల్లో బాబుకు భారీ లంచం
చంద్రబాబు
1998లో డాక్టర్ రెడ్డీస్ కంపెనీకి ట్యాక్స్ డిఫర్‌మెంట్‌ను వర్తింపజేసి
రూ.25 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. అటు తరువాత 2000వ సంవత్సరంలో ఈ భూమిని
ఎకరా రూ.కోటికి డాక్టర్ రెడ్డీస్ అధిపతి అంజిరెడ్డి కొడుకు సతీష్‌రెడ్డి,
ఆయన భార్య దీప్తిరెడ్డికి విక్రయించారు. అదే ఏడాది మదీనాగూడలో అమ్మణ్ణమ్మ
ఎకరా రూ.8 లక్షలకు కొన్నారు. కానీ దానికి కొంచెం దూరంలో ఉన్న కొండాపూర్‌లో
మార్కెట్ విలువ ఎకరా రూ.12 లక్షలుండగా ఎకరా కోటి రూపాయలకు అమ్మారు. ఇది
పూర్తిగా బోగస్ లావాదేవీ. దీని ద్వారా చంద్రబాబుకు భారీ లంచం ముట్టింది.
ఆ
తరవాత ఈ భూమి డెవలప్‌మెంట్ కోసం దివ్యశ్రీ గ్రూప్‌తో సతీష్‌రెడ్డి కుటుంబం
ఒప్పందం చేసుకుంది. ఈ దివ్యశ్రీ గ్రూప్‌కు చంద్రబాబు హైటెక్ సిటీ లే
అవుట్‌లో ఏకంగా ఏడెకరాల భూమి కేటాయించారు. దివ్యశ్రీ గ్రూప్‌నకు భూమి
కేటాయించినందుకు ప్రతిగా అది డెవలప్ చేసిన భవనంలో భారీ వాటా బాబుకు
దక్కింది. ‘ఐఎంజీ అకాడమీస్ భారత’ పేరిట బోగస్ సంస్థను ఏర్పాటు చేసిన తన
బినామీ బిల్లీరావు అలియాస్ అహోబిలరావు, పేట్‌రావులకు చంద్రబాబు 2003లో
సెంట్రల్ యూనివర్సిటీ, మామిడిపల్లి గ్రామ సమీపాల్లో 850 ఎకరాలు
కేటాయించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు సైతం
ఆదేశించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి