7, నవంబర్ 2011, సోమవారం

లక్షలాది బ్యాంకు ఖాతాల మూసివేత


  • వాల్‌స్ట్రీట్‌ ముట్టడి కార్యకర్తల వినూత్న నిరసన
  • అమెరికాలో లాభాపేక్షలేని చిన్న సంస్థల్లో డిపాజిట్‌
అమెరికావ్యాప్తంగా దాదాపు ఒక నెల కాలంలో 6.5 లక్షల మంది ప్రజలు కార్పొరేట్‌ యాజమాన్యం కింద ఉన్న బ్యాంకుల్లోని ఖాతాలను ఇటీవల మూసేశారు. ఆ డబ్బును క్రెడిట్‌ యూనియన్లు, లాభాపేక్షలేని చిన్న సంస్థల్లో డిపాజిట్‌ చేశారు. దేశవ్యాప్తంగా అనేక విభిన్నమైన గ్రూపులు చేపట్టిన 'జాతీయ బ్యాంకు బదిలీ రోజు'లో భాగంగా ఈ ఖాతాల మార్పిడీలు జరిగాయి. ఆ గ్రూపుల్లో అత్యధిక భాగం వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమానికి అనుబంధంగా ఉన్నాయి. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వందలాది మందిలో గారీ మార్ష్‌ కూడా ఒకరు. 'అతి కొద్ది మంది చేతుల్లో చాలా ఎక్కువ డబ్బు ఉన్నందున నేను ఈ పని చేశాను' అని ఆమె తెలిపారు. పెద్ద బ్యాంకుల్లో నుంచి డబ్బు తీసుకొని స్థానిక సమాజానికి ప్రయోజనం కల్గించే స్థానిక క్రెడిట్‌ యూనియన్లలో పెట్టండి అనే స్పష్టమైన సందేశంతో ఆస్టిన్‌ ముట్టడి గ్రూపు సిటీ హాల్‌ నుంచి ఈ ప్రదర్శనను ప్రారంభించింది. వెల్స్‌ ఫార్గో బ్యాంక్‌ బ్రాంచ్‌ వెలుపల వందలాది మంది నిరసనకారులపై పోలీసులు ఒక కన్నేసి ఉంచారు. నిరసకారుల్లో అత్యధికులు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, వెల్స్‌ ఫార్గో, ఇతర ప్రధాన బ్యాంకుల మాజీ ఖాతాదారులు. 'ఒక సాధికారత సాధనంగా ప్రజలు తమ ఖాతాలు మూసేసి స్థానిక క్రెడిట్‌ యూనియన్లలో జమ చేస్తున్నారు. తమకు మార్పును ప్రభావితం చేయగల సామర్థ్యముందని తెలుసుకునే అవకాశాన్ని ఇది వారికి కల్గించింది' అని ప్రదర్శకుల్లో ఒకరైన డేవ్‌ కార్టెజ్‌ చెప్పారు. తాము గత నెలలో క్రెడిట్‌ యూనియన్లలో పెట్టేందుకు దాదాపు ఐదు లక్షల డాలర్లు బ్యాంకుల నుంచి తీసుకున్నట్లు ఆస్టిన్‌ ముట్టడి ఆర్థిక బృందంలో ఒకరైన కార్టెజ్‌ తెలిపారు. ఖాతాలు తెరిచేందుకు ప్రదర్శకులు వస్తుండటంతో ఆస్టిన్‌కు చెంది యాంప్లిఫై క్రెడిట్‌ యూనియన్‌ బ్రాంచి చాలా ముమ్మరంగా వ్యాపారం సాగిస్తోంది. 'మా బ్రాంచీలన్నింటిలోనూ గత వారం తెరిచినవాటి కంటే చాలా ఎక్కువ ఖాతాలను ఈరోజు తెరిచాం' అని యాంప్లిఫై క్రెడిట్‌ యూనియన్‌ ఉపాధ్యక్షులు జెన్నిఫర్‌ వెంటిమిగ్లియా చెప్పారు. ఫీజులను తప్పించుకొనేందుకే ఇందులో పాల్గొంటున్నట్లు అత్యధికులు చెబుతున్నారు. క్రెడిట్‌ యూనియన్లనేవి ప్రభుత్వ వాణిజ్య బ్యాంకుల మాదిరిగా తన సభ్యులతో నడిపే సహకార సంఘాల వంటివి. వాషింగ్టన్‌లోని సీటిల్‌లో కూడా ఇలాంటి ప్రదర్శనే జరిగింది. పెద్ద బ్యాంకుల్లో తమ ఖాతాలు మూసేసి వెలుపలికి వస్తున్న ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. వారు తన మీద పెద్ద మొత్తంలో ఫీజులు వేస్తున్నారని ఛేజ్‌ బ్యాంకులో ఖాతా మూసేసిన అమెలియా వస్సర్‌ అనే మహిళ చెప్పారు. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా కొత్త డెబిట్‌ కార్డు ఫీజును ప్రకటించిన సెప్టెంబర్‌ చివరి నుంచి దాదాపు ఆరున్నర లక్షల మంది క్రెడిట్‌ యూనియన్లకు మారినట్లు క్రెడిట్‌ యూనియన్‌ జాతీయ అసోసియేషన్‌ తెలిపింది. కాగా జాతీయ బ్యాంక్‌ బదిలీ దినోత్సవాన్ని తాము ప్రయోజనంగా తీసుకున్నట్లు కన్సాస్‌ సిటీ ముట్టడి నిరసనకారులు కొందరు చెప్పారు. తాము పెద్ద బ్యాంకుల ఖాతాలు మూసేసి క్రెడిట్‌ యూనియన్‌లో డిపాజిట్‌ చేసినట్లు తెలిపారు. మీకు గనుక క్రెడిట్‌ కార్డు ఉంటే దాన్ని రద్దు చేసుకొని చెత్తకుప్పలో వేయండని నిరసనకారులు చెప్పారు. వారు మామూలుగా బస చేసిఉన్న లిబర్టీ మెమోరియల్‌ను వదిలి వెస్ట్‌పోర్ట్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా ఎదుట నిలబడ్డారు. కొందరు ప్లకార్డులు, మరికొందరు లౌడ్‌స్పీకర్లతో వచ్చారు. బ్యాంకులు అమెరికా ప్రజలను దోపిడీ చేస్తున్నాయనే అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. 'నేను ఒక ఫీజుతో ఖాతా తెరిచాను. తరువాత మరొకటి వేశారు. కొన్ని సందర్భాల్లో ఆ ఫీజు ఖాతాలో ఉన్న మొత్తంలో రెండు శాతం వరకూ ఉంది. ఫీజులు కట్టీ కట్టీ అలసిపోయాను' అని ఖాతాను రద్దు చేసుకున్న రస్సెల్‌ థెర్పా తెలిపారు. ఇప్పటి వరకూ దాదాపు 6.5 లక్షల మంది క్రెడిట్‌ యూనియన్లలో ఖాతాలు తెరిచినట్లు యునైటెడ్‌ లేబర్‌ క్రెడిట్‌ యూనియన్‌ నేత ఎరిన్‌ విలియమ్స్‌ చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి