20, నవంబర్ 2011, ఆదివారం

మా అంచనా తప్పే...

  • ద్రవ్యోల్బణంపై మాంటెక్‌ సింగ్‌
  • మా విశ్వసనీయతే ప్రశ్నార్థకమైంది
  • 'రిటైల్‌'లో ఎఫ్‌డిఐలపై నెలాఖరులోగా నిర్ణయం
ఇప్పటికీ రెండంకెల స్థాయిలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణాన్ని తాను తప్పుగా అంచనా వేసిన మాట వాస్తవమేనని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా అంగీకరించారు. ఆదివారం ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని తాను తొలుత భావించానని, అయితే ఇప్పుడది తమ విశ్వసనీయతనే ప్రశ్నార్థకంగా మార్చిందని అన్నారు. ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం వేసిన అంచనాలు పలుమార్లు తప్పుగా రుజువయ్యాయా? అనే ప్రశ్నకు జవాబు చెబుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. స్వల్పకాలిక అంచనాలెప్పుడూ తప్పొప్పులకు లోబడి వుంటాయని గుర్తుంచుకోవాలని అన్నారు. అయితే వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ద్రవ్యోల్బణం 7-7.5 శాతం మధ్యకు రాగలదని భావిస్తున్నానన్నారు. గత కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణం 9 శాతానికి ఎక్కువగానే వుంటున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌ నెలలో ఇది 9.73 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం ఈ నెల 5వ తేదీతో ముగిసిన వారాంతానికి 10.63 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ నేతలు పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ ఇది రెండంకెల స్థాయికి తగ్గకపోవటం గమనార్హం. ప్రభుత్వంలో ప్రతిష్టంభన ఏర్పడిందన్న కార్పొరేట్‌ సంస్థల విమర్శలపై అహ్లూవాలియా స్పందిస్తూ పారిశ్రామిక రంగం మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాలపైనే దృష్టి పెడుతోంది తప్ప ఆర్థిక సంస్కరణలపై దృష్టి పెట్టటం లేదన్నారు. ప్రభుత్వం సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలన్న కృతనిశ్చయంతో వుందని, జిఎస్‌టి, డిటిసి తదితర ఆర్థిక సంస్కరణల విషయంలో ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తోందని వివరించారు. మల్టీబ్రాండ్‌ రిటైల్‌ వ్యాపారంలో విదేశీ పెట్టుబడులను అనుమతించే విషయమై ప్రభుత్వం ఈ నెలాఖరులోపుగా ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ అంశంపై కేంద్ర నిర్ణయం దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న విషయం తెలిసిందే. ఆర్థికాభివృద్ధిపై ఆయన స్పందిస్తూ వర్ధమాన ప్రపంచం ఇప్పుడిప్పుడే ఆర్థిక మాంద్యం నుండి కోలుకుంటున్న నేపథ్యంలో మన ఆర్థికాభివృద్ధి కొంత మందగమనంలోనే వుందని భావిస్తున్నానన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థికాభివృద్ధి 7-7.5 శాతం మేర వుంటుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. పెరుగుతున్న ధరలను, సబ్సిడీల భారాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జిడిపిలో 4.6 శాతం వద్ద స్థిరీకరించటం ప్రభుత్వానికి కష్టసాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ రేటింగ్‌ను మూడీస్‌ సంస్థ తగ్గించటంపై ఆయన స్పందిస్తూ అది కేవలం చిన్న కుదుపు మాత్రమేనన్నారు. ఈ ఏడాది వాణిజ్యలోటు 15 వేల కోట్ల డాలర్ల స్థాయికి చేరనుందని, అటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశంలో తగినంత నగదు నిల్వ వుందని ఆయన చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి