సౌదీ
అరేబియాలో మహిళలను 'ముసుగు' (బురఖా)లో మరింతగా బంధించే ప్రయత్నాలు
జరుగుతున్నాయి. ఆడవారి కళ్లు మగవారిని రెచ్చగొట్టే విధంగా ఉంటాయట...!
కాబట్టి బయటకు కనబడకుండా ముసుగులోనే ఉండాలనేది పాలకుల మనోగతం. సౌదీలో
మహిళలు బహిరంగ ప్రదేశాల్లో సంచరించేటప్పుడు విధిగా బురఖా (అబయా)ను
ధరించాలి. బాగా అవసరమైనప్పుడు ముఖం వరకు కనిపించేలా సవరించుకునే అమరిక
బురఖాకు ఉంది. బురఖా ధరించని మహిళల నుంచి అపరాధ రుసుము వసూలు చేయడం కూడా
ఆనవాయితీగా ఉంది. అయితే ముఖం బయటకు కనిపించే సందర్భాల్లో మహిళల కళ్లు
ఇతరులను రెచ్చగొడతాయని భావించిన సౌదీ పాలకులు కళ్లను ముసుగులోనే ఉంచాలని
ఆదేశించే కొత్త చట్టాన్ని తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహిళలను ఈ
విధంగా నిరోధించే హక్కు తమకు ఉందని సంప్రదాయ ఇస్లామిక్ పాలకులు నొక్కి
చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు చట్ట రూపు సంతరించేందుకు రంగం
సిద్ధమైందని డైలీ మెయిల్ కథనం. సౌదీ అరేబియా విలువల అభివృద్ధి, నైతిక పతన
నిరోధక కమిటీ అధికార ప్రతినిధి షేక్ మోతాబల్ నబేత్‌ను ఉటంకిస్తూ శనివారం
డైలీ మెయిల్ కథనం ప్రచురించింది. ఇందుకు దారి తీసిన పరిస్థితులు
విడ్డూరంగా ఉన్నాయి. ఈ కమిటీలోని సభ్యుడు ఒక రోజు బజారులో నడిచి
వెళుతుండగా, ఎదురుగా భర్తతో కలసి వస్తూ ఎదురుపడిన ఒక మహిళ చూపులు తనను
రెచ్చగొట్టాయని ఈ సభ్యుడు భావించాడు. దీంతో సదరు సభ్యుడు ఆమె భర్తతో ఘర్షణ
పడ్డాడు. ఈ ఘర్షణలో సభ్యుని చేతికి బలమైన గాయమైంది. ఇక్కడ భార్య స్థానంలో
నిలిచిన మహిళ తప్పిదమేమిటనే ప్రశ్నకు సమాధానం లభించదని బిక్యామజర్ న్యూస్
వెబ్‌సైట్ సందేహం వ్యక్తం చేసింది.
ఇలాంటి సంఘటనల వల్లనే
కాబోలు ఈ కమిటీ మీద మానవ హక్కుల ఉల్లంఘనలకు తరచూ పాల్పడుతోందనే విమర్శలు
వచ్చాయి. 1940లో స్థాపించిన ఈ కమిటీ లక్ష్యం సౌదీ అరేబియాలో ఇస్లాం మత
చట్టాలు అతిక్రమణకు గురికాకుండా చూడటం వరకే. 2002లో మక్కా నగరంలో ఒక
పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లోపల మంటల్లో చిక్కుకున్న
విద్యార్థినులను బయటకు రానీయకుండా కమిటీ అడ్డుపడింది. విద్యార్థినుల ముఖాలు
బయటకు కనిపిస్తాయని, అందుకే అడ్డుకున్నామనేది కమిటీ వింత వాదన. మత
దురభిమానంతో కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం ఫలితంగా నాటి ప్రమాదంలో కనీసం 15
మంది చనిపోయారు. కాగా సౌదీలో పురుషుల రక్షణ లేకండా మహిళలు సంచరించడానికి
అనుమతి లేని పరిస్థితి నెలకొంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి