13, నవంబర్ 2011, ఆదివారం

వాల్ స్ట్రీట్ ఆందోళనా శిబిరాల్లో హత్యలు, ఆత్మహత్యలు





‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమాల నిమిత్తం వివిధ నగరాల కూడళ్ళలో ఆందోళనకారులు గుడారాలు వేసుకుని రాత్రింబవళ్ళూ అక్కడే గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ శిబిరాల్లో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు ఇపుడు సమస్యగా మారాయి. ఈ చావులు అటు నిరసనకారులకూ, ఇటు పోలీసులకు కూడా సమస్యలుగా మారాయి. ఆకుపై వాల్ స్ట్రీట్, ఆకుపై ఓక్లాండ్ లాంటి నగరాల్లో నిరసన కారులు వేసుకున్న శిబిరాల్లో ఒకరు తెలియని కారణాల వల్ల చనిపోగా, మరొకరు తనను తాను కాల్చుకుని చనిపోయారు. మరో ఇద్దరు వేరే వ్యక్తులు చేసిన కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులను అడ్డు పెట్టుకుని పోలీసులు శిబిరాలను ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారు.
‘ఆకుపై సాల్ట్ లేక్ సిటీ’ శిబిరంలో శుక్రవారం ఒక వ్యక్తి చనిపోయి కనిపించాడు. అతను చనిపోయి అప్పటికే రెండు రోజుల అవుతోందని ఆందోళనకారుల్లో కొందరు తెలిపారు. డ్రగ్స్ ఉపయోగించడం వల్ల కానీ, లేక ప్రొపేన్ హీటర్ నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వలన గానీ చనిపోయినట్లు కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు. గురువారం కాలిఫోర్నియా లోని ‘ఆకుపై ఓక్లాండ్’ శిబిరం వద్ద ఒక వ్యక్తిని కాల్చి చంపారు. వెర్మోంట్ లోని ‘ఆకుపై బర్లింగ్టన్’ వద్ద మిలట్రీ నుండి రిటైరైన వ్యక్తి తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ చావులు ఆకుపై నిరసనకారులపైన ఒత్తిడిని పెంచడానికి సాధనాలుగా మారాయి. ఇమ నిరసనకారులు తమ శిబిరాలను ఎత్తివేసి ఇళ్ళకు చేరుకోవాలని పోలీసులు నగర ప్రభుత్వాలు కోరుతున్నారు.
మంగళవారం 53 ఏళ్ళ వ్యక్తి ‘ఆకుపై న్యూ ఓర్లేన్స్’ శిబిరం వద్ద తన గుడారంలో చనిపోయి కనిపించాడు. ఈ చావు తర్వాత వరుసగా మూడు చావులు సంభవించడంతో నిరసనకారులు ఖాళీ చేయాలని విజ్ఞప్తులు చేస్తూ, ఆదేశాలు కూడా జాతీ చేసారు. నేరస్ధులతో జరిగే పోరాడవలసిన పోలీసులు అది వదిలి పెట్టి ‘ఆకుపై’ శిబిరాల వద్ద కేంద్రీకరించవలసి వస్తున్నదనీ, వారు ఖాళీ చేసి వెళ్ళీనట్లయితే తమ పని తాము చేసుకోవడానికి వీలు కలుగుతుందనీ పోలీసులు చెబుతున్నారు. ఆ మేరకు ఓక్లాండ్ లో నిరసన కారులకు పోలీసు విభాగం బహిరంగ ఉత్తరం రాసింది. ఇక్కడే గురువారం ఒక వ్యక్తిని కాల్చి చంపారు. “శాంతియుతంగా వెళ్ళిపొండి. మీతలలు ఎత్తుకుని దర్జాగా వెళ్ళండి. ఓక్లాండ్ లో నేరస్ధులతో పోరాడటానికి పోలీసు అధికారులకు అవకాశం ఇవ్వండి” అని బహిరంగ లేఖలో పోలీసు విభాగం కోరింది.
ఓక్లాండ్ లో ఆకుపై ఉద్యమం ఇక ఎంతమాత్రం ‘ఆకుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమం కాదనీ, దానివల్ల ఓక్లాండ్ ప్రజలకు అసౌకర్యంగా ఉందనీ సిటీ మేయర్ ప్రకటిస్తూ వెంటనే ఖాళీ చేయాలని కోరింది. ఆమెకూ నిరసనకారులకూ వాగ్వివాదం జరిగి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. లైంగిక అత్యాచారాలు చేసేవారికీ, మానసిక వికలాంగులకూ, ఇళ్ళు లేనివారికీ, అనార్కిస్టులకూ ఆందోళనా శిబిరాలు నిలయంగా మారాయనీ దానివల్ల నేరస్ధులను కనిపెట్టడం కష్టంగా మారిందనీ పోలీసులు చెబుతున్నారు. కాల్పులు జరిగి చంపిన కేసులో ప్రాధమిక విచారణ జరిగింది. రెండు పరస్పర వ్యతిరేక గ్రూపుల మధ్య జరిగిన తగాదా కాల్పులకు దారితీసిందని విచారణలో తేలింది. అయితే ఆ గ్రూపులకూ ఆందోళనకారులకూ సంబంధం లేదనీ వారు బైటి వారనీ నిరసనకారులు చెప్పారు.
అదే రోజు ఓక్లాండ్ లో ఒక మిలట్రీ రిటైరీ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. దీనితో శిబిరం కొనసాగనిస్తారా లేదా అన్నదానిపై అనుమానాలు తలెత్తాయి. ఆకుపై సాల్ట్ లేక్ సిటీ లో ఒక వ్యక్తి చనిపోయి కనిపించాక అందరూ ఖాళీ చేయాలని స్ధానిక ప్రభుత్వం కోరింది. కాని ఆందోళనకారులు అందుకు నిరాకరించారు. జైళ్ళకైనా వెళ్తాము కాని ఖాళీ చేయం అని వారు ప్రకటించారు. శాంతియుతంగా చేసిన ఉద్యమం ఏదీ హింసను చవి చూడకుండా విజయవంతం కాలేదు అని ప్రదర్శకుల నాయకుడు వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. 150 మందివరకూ నిరసనకారులు తాము జైళ్ళకు వెళ్లడానికి సిద్ధం అని ప్రకటించారు. ఒరెగాన్ రాష్ట్రం లోని ‘ఆకుపై పోర్ట్‌లాండ్’ వద్ద ఉద్రిక్తతలు తలెత్తాయి. నగర మేయర్ శిబిరం ఖాళీ చేయాలని కోరడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి.
దాదాపు 300 మందివరకూ ఆందోళనకారులు పోర్ట్ లాండ్ శిబిరంలో ఉన్నారు. శనివారం అర్ధ రాత్రికల్లా ఖాళీ చేయాలని మేయర్ కోరడంతో ఆందోళనకారుల్లో కలకలం బయలు దేరింది. శిబిరంలో ఇళ్ళులేనివారు, డ్రగ్స్ కు అలవాటు పడ్డవారు వచ్చి చేరుతున్నారని మేయర్ చెబుతున్నాడు. అయితే తమను ఖాళీ చేయించే ఏ ప్రయత్నాన్నయినా తాము ప్రతిఘటిస్తామని నిరసనకారులు ప్రకటించారు. పోలీసులు బలవంతంగా ఖాళీ చేయిస్తే గట్టిగా ప్రతిఘటించే బలం గానీ, శక్తి గానీ, నిబద్ధత గానీ నిరసనకారుల వద్ద కనిపించడం లేదన్నది వాస్తవం. ఒక డ్యూటీ లాగా వారి నిరసన ప్రకటనలు, ప్రతిఘటన ప్రకటనలు ఉంటున్నాయే తప్ప అందులో స్ఫూర్తి కనిపించడం లేదు.
అన్ని నగరాల్లో ఉన్న ఉద్యమాలని బౌతికంగానూ, భావత్మకంగానూ ఐక్యపరచగల నిర్ధిష్ట డిమాండ్లు గానీ, అవగాహన గానీ ఆందోళనకారులవద్ద లేవు. ఈజిప్టు ఆందోళన ఇదమిద్ధంగా ఎటువంటి పరిష్కారం దొరకకుండానే చల్లబడిపోయింది. ట్యునీషియాలోనూ అదే పరిస్ధితి. ఈ రెండు దేశాల్లోనూ పాత ముఖాలే కొత్త పేర్లతో కనిపిస్తున్నాయి తప్ప ప్రజలు కొరుకున్న ప్రజాస్వామిక పాలన ఇవ్వడానికి ప్రయత్నాలేవీ జరగడం లేదు. పశ్చిమ రాజ్యాల చేతుల్లోని ఎన్.జి.ఓ సంస్ధల ఆదేశాల ప్రజల్లో వ్యాపించిన ఉన్న ఆగ్రహ జ్వాలలను హైజాక్ చేసి పక్కకు మళ్లించి మధ్యధరా సముద్రంలో కలపడం వల్లనే అక్కడ పాత పరిస్ధితే కొనసాగుతోంది. ప్రజలు నిబద్ధత కలిగిన కార్మిక వర్గ పోరాటాల వైపు మళ్లకుండా ఉత్తుత్తి ఉద్యమాలు చప్పబరచడంలో సఫలం అయ్యాయి. ఈ ఉద్యమాల నాయకులకూ, ఎన్.జి.ఓ సంస్ధలకూ అమెరికా, యూరప్ ల నుండి నిధులు అందాయని తెలిస్తే, అవి చప్పగా ముగియడానికి కారణం ఇట్టే అర్ధం అవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి