28, నవంబర్ 2011, సోమవారం

ఐటి ఉద్యోగులకు అతి తక్కువ వేతనాలు


  • ఘోరమైన జీతాల్లో ఏడో స్థానం
  • స్విట్జర్‌లాండ్‌ మెరుగు
  • ఐదో స్థానంలో అమెరికా
అంతర్జాతీయంగా ఐటి ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాలతో పోల్చితే భారత్‌లోని ఉద్యోగులకు చెల్లిస్తోన్న వేతనాలు దారుణంగా ఉన్నాయి. పశ్చిమ దేశాల్లో మెరుగైన వేతనాలను పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 41 దేశాల్లోని 6,000 ఐటి కంపెనీలను గ్లోబల్‌ రిక్రూట్‌మెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ అయిన మై హైరింగ్‌ క్లబ్‌ డాట్‌ కామ్‌ ఒక సర్వేను నిర్వహించింది. వాల్డ్‌ వైడ్‌ ఐటి సాలరీ-2011 సర్వేలో వివిధ దేశాల్లోని ఆయా కంపెనీల్లోని ఉద్యోగులు ఏడాదిలో తీసుకునే వేతనాన్ని పరిగణలోకి తీసుకుని అంతర్జాతీయంగా ఉద్యోగుల వేతన పరిస్థితిని వెల్లడించింది. సర్వే వివరాలు...
భారత్‌లోని ఐటి రంగంలో పని చేసే మధ్య తరహా సీనియర్‌ ఉద్యోగికి ఏడాదికి సగటున రూ.18.5 లక్షలు (36,120 డాలర్లు) ఆయా కంపెనీలు చెల్లిస్తోన్నాయి. అంతర్జాతీయం చెల్లింపులతో పోల్చితే భారత్‌లోని ఉద్యోగులకు నాలుగవ వంతు మాత్రమే అందిస్తోన్నాయి. స్విజ్జర్లాండ్‌లోని ఐటి ఉద్యోగులకు ఏడాదికి రూ.87 లక్షలు (1,67,890 డాలర్లు) పైగా చెల్లిస్తున్నాయని వెల్లడయ్యింది.
పేలవమైన వేతనాల చెల్లింపులో భారత్‌ తొలి పది స్థానాల్లో ఏడవ ర్యాంకును నమోదు చేసుకుంది. ప్రపంచంలోనే ఐటి ఉద్యోగులకు ఉత్తమమైన వేతనాలు చెల్లిస్తోన్న దేశాల్లో ప్రథమ స్థానాన్ని స్విజ్జర్లాండ్‌ దక్కించుకుంది. ఉద్యోగులను ఆకర్షించడానికి అభివృద్ధి చెందిన దేశాల్లోని ఐటి కంపెనీలు బోనస్‌తో పాటు వివిధ పథకాలను ఉద్యోగులకు అందిస్తోన్నాయి.
అయితే ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో ఐటి కంపెనీల మేనేజర్ల వేతనాలు మాత్రం మెరుగ్గా ఉన్నాయి. భారత్‌ కంటే వియత్నం (28,940 డాలర్లు), బల్గెరియా (32,560 డాలర్లు), పిలిఫిన్స్‌ (33000 డాలర్లు), మలేషియా (35,870 డాలర్లు) దేశాల్లోని మేనేజర్లు తక్కువ వేతనాలు పొందుతున్నారు. ఐటి కంపెనీల్లోని జూనియర్‌, సీనియర్‌ ఉద్యోగులకు చెల్లిస్తోన్న వేతనాల్లో చాలా అంతరం ఉందని సర్వేలో వెల్లడయ్యింది.
మెరుగైన వేతనాల చెల్లింపులో స్విజ్జర్లాండ్‌ తర్వాత బెల్జియం ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ ఏడాదికి సగటున 1,42,570 డాలర్లు చెల్లిస్తోన్నాయి. డెన్మార్క్‌లో 1,32,430 డాలర్లు చెల్లించడంతో మూడవ స్థానంలో నిలిచింది. లండన్‌, అమెరికా దేశాలు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. లండన్‌లో ఏడాదికి సగటున 1,26,570 డాలర్లు, అమెరికాలో 1,21,460 డాలర్లు చెల్లిస్తోన్నట్లు ఈ సర్వేలో వెల్లడయ్యింది.
భారత్‌లో వేతనాలు తక్కువ కాబట్టే ఇక్కడ ఐటి కంపెనీలు ముందుకు సాగడానికి ఇదే కారణమని మై హైరింగ్‌ క్లబ్‌ కమ్‌ సిఇఒ రాజేష్‌ కుమార్‌ తెలిపారు. ఇదే పరిస్థితిని భవిష్యత్తులో కొనసాగించడం ఒక సవాల్‌గా నిలుస్తుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి