- కుప్పకూలిన మార్కెట్లు
- ‘బేర్’మన్న ఇన్వెస్టర్లు
- 425 పాయింట్లు పతనం
- 16,000 దిగువకు సెన్సెక్స్
- 4,800ను కోల్పోయిన నిఫ్టీ
- అన్ని రంగాలూ నష్టాల్లోనే
- రూ. 5.5 లక్షల కోట్లు ఆవిరి
పలు ప్రతికూలతల మధ్య మరోసారి స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రూపాయి బలహీనత, పెరిగిన వడ్డీ రేట్లు, రెండంకెల ద్రవ్యోల్బణం వంటి అంశాలు దేశీయంగా కార్పొరేట్ ఫలితాలను దెబ్బకొడుతున్నాయి. మరోవైపు యూరోజోన్‌లో చెలరేగిన ప్రభుత్వ రుణాల సంక్షోభం మరింత ముదిరి ఇతర దేశాలకూ పాకుతుండటంతో అంతర్జాతీయంగానూ సెంటిమెంట్ దిగజారింది. దీంతో మరోసారి అన్నివైపుల నుంచీ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితం... సెన్సెక్స్ 425 పాయింట్లు (2.6%) పతనమైంది. 16,000 పాయింట్ల దిగువకు చేరి 15,946 వద్ద ముగిసింది. అక్టోబర్ 5 తరువాత ఇదే కనిష్ట స్థాయి. ఈ బాటలో నిఫ్టీ కూడా 127 పాయింట్లు దిగజారి 4,800 పాయింట్ల దిగువన 4,778 వద్ద ముగిసింది. వెరసి స్టాక్ మార్కెట్లలో మరోసారి బ్లాక్ మండే చోటు చేసుకుంది. వరుసగా 8 రోజుల్లో సెన్సెక్స్ 1,623 పాయింట్లను (9.2%) కోల్పోయింది! మొత్తం రూ. 5.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది!! పతనం వేగమందుకోవడంతో దేశీయ ఇన్వెస్టర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఈ ఏడాది జనవరి 3న గరిష్టంగా 20,664 పాయింట్లను తాకిన సెన్సెక్స్ 4,718 పాయింట్లు పడిపోయింది.
ఏడాది కనిష్టానికి 4 రంగాలు: సెంటిమెంట్ ఎంత బలహీనపడిందంటే... బీఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ 2% చొప్పున నష్టపోగా... మెటల్, బ్యాంకింగ్, రియల్టీ, పవర్ 3.5-2.7% మధ్య పడ్డాయి. ఈ నాలుగు ఇండెక్స్‌లూ ఏడాది కనిష్ట స్థాయిలను తాకాయి! సెన్సెక్స్ 30 షేర్లలో సన్ ఫార్మా, మారుతీ మాత్రమే నిలదొక్కుకున్నాయి. టాటా మోటార్స్, బీహెచ్‌ఈఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజాలు 5% పతనంకాగా, స్టెరిలైట్, డీఎల్‌ఎఫ్, ఎన్‌టీపీసీ, హిందాల్కో, ఎస్‌బీఐ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్, భారతీ, టీసీఎస్ సైతం 4.8-2.2% మధ్య తిరోగమించాయి.
దిక్కుతోచని చిన్న షేర్లు: ప్యాంటలూన్ రిటైల్, అబాన్ ఆఫ్‌షోర్, డెల్టా కార్ప్, సుజ్లాన్ ఎనర్జీ, ఎడ్యుకాంప్, సన్ టీవీ, శ్రేయీ ఇన్‌ఫ్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బీజీఆర్ ఎనర్జీ వంటి షేర్లయితే 6-12% మధ్య దిగజారాయి. వెరసి మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు దాదాపు 2% నీరసించాయి. ట్రేడైన షేర్లలో 786 పెరిగితే 1,974 పడ్డాయ్. కొద్ది రోజులుగా అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్న ఎఫ్‌ఐఐలు సోమవారం రూ. 743 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 596 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనించదగ్గ అంశం. బీఎస్‌ఈ నుంచి రూ. 2,079 కోట్లు, ఎన్‌ఎస్‌ఈ నుంచి రూ. 9,097 కోట్ల టర్నోవర్ జరిగింది. ఇక డెరివేటివ్స్‌లో రూ. 1,72,939 కోట్లు నమోదైంది.
విదేశీ మార్కెట్ల పతనం...
ఓ వైపు యూరోపియన్ దేశాల రుణ సంక్షోభం చల్లారకపోగా... గ్రీస్ నుంచి స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్‌లకు పాకుతోంది. మరోవైపు ఆర్థిక వృద్ధి మందగిస్తున్నదని జర్మనీ ప్రకటించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. ఇది చాలదన్నట్లు... భారీ ద్రవ్యలోటు నేపథ్యంలో వ్యయాలను తగ్గించుకునేందుకు ఏర్పాటైన అమెరికన్ కమిటీ చేతులెత్తేస్తుందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో భయాలను రేకెత్తించాయి. దీంతో సోమవారం ట్రేడింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తిరోగమించాయి. కడపటి వార్తలందేసరికి యూరోపియన్ దేశాలలో ఇటలీ 3.6% పతనంకాగా, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, యూకే తదితరాలు 2.7% నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇక యూఎస్ ఇండెక్స్‌లు డోజోన్స్, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్ 2% క్షీణతతో కొనసాగుతున్నాయి.
అదే బాటలో ఆసియా: ఆసియాలోనూ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఏమీలేవు! జపాన్ ఎగుమతులు నెమ్మదించగా, సింగపూర్ సైతం అదే బాటలో పయనిస్తున్న సంకేతాలు వెలువడ్డాయి. దీంతో సోమవారం ఉదయం జరిగిన ట్రేడింగ్‌లో చైనా, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ 0.5-2.7% మధ్య తిరోగమించాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి