20, నవంబర్ 2011, ఆదివారం

పుడమిపై ‘జన’ విస్ఫోటనం


ఇది జన విస్ఫోటనం. తరుగుతున్న వనరులపై పెరుగుతున్న అవసరాల తాండవం! కుంగుతున్న పుడమిపై పోటెత్తిన జనభారం. ప్రపంచ జనాభా ఏడొందల కోట్లు దాటడం సమస్యల విలయానికి సంకేతమే. జనాభాను చారిత్రక ఏడొందల కోట్లు దాటించిన బాలికది సవాళ్ల మధ్య సంభవించిన జననమే. ఈ చారిత్రక శిశువువలుయూపీలో జన్మించి, ఫిలిప్పీన్స్‌లో కళ్లు తెరిచి భవిష్యత్ సవాళ్లను కళ్లకు కట్టింది. గతంలో నామమాత్రమే అయిన వైరుధ్యాలు ఇప్పుడు ప్రపంచాన్ని రెండుగా చీల్చేశాయి. ఓ భాగం ఆకలి కేకలు పెడుతూంటే మరో భాగం విలాసాల్లో మునిగి తేలుతోంది. ఓ ప్రాంతం వనరుల్లేక విలవిల్లాడుతూంటే మరో మిగులు వనరులతో వీరంగం చేయడం వైపరీత్యమే. ఏ దేశానికి ఎంత జనాభా అవసరం అన్న దానికి కచ్చితమైన కొలమానం లేదు. వనరులెక్కువున్న దేశంలో తక్కువ జనాభా, వనరులు అట్టడుగుకు చేరిన దేశాల్లో అధిక జనాభా కళ్లకు కడుతున్న వాస్తవం. అందుకే జనాభా సమస్య సంక్లిష్టం. ఆహారం, ఆవాసం, రక్షిత మంచినీరు, ఇంధనావసరాలు తీర్చేందుకు ఎవరి దగ్గరా ఎలాంటి మంత్ర దండం లేదు. పరిమిత వనరులను గరిష్ఠ స్థాయిలో సద్వినియోగం చేసుకోవడమొక్కటే మార్గం. ఆ మార్గాన్ని మనం ఎప్పుడో వదిలేశాం. అందిన మేరకు వనరుల విచ్చలవిడి వినియోగం జరుగుతోంది. బలమున్న వాడిదే రాజ్యం అన్న సామెత ప్రకృతి వనరుల విషయంలో అక్షర సత్యం అవుతోంది. పంక్తి పెరిగితే మజ్జిగ పలుచన అన్నట్టు ఎంతగా జనం పెరిగితే అంతగానూ అరుదైన వనరులు తరిగిపోతాయి. ముఖ్యంగా అంతటా ఆర్థిక అనిశ్చితి అలుముకున్న నేటి వాతావరణంలో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరం. అదుపులేని జన భారంతో అభివృద్ధి నత్తనడక నడుస్తున్న భారత్‌కు భవిష్యత్ మరింత సవాళ్లతో కూడుకున్నదే. అయితే మనకు యువ జనాభా ఎక్కువ కావడం, ఆ విధంగా జనశక్తి అమేయమేనన్న భావన ఆనందకరం. జనాభా ఎంత అన్న మాట పక్కన పెడితే..పనికొచ్చే జనాభా, పనికి రాని జనాభా అన్న విభజన చేస్తే ఎన్నో దేశాల కంటే మనం ముందున్నాం. జనశక్తి అన్న మాటకు సరిపడేలా యువ జనాభా మనకుంది. వారిలో 50శాతం మందిది పునరుత్పాదక వయస్సే! ఈ కోణంలో చూస్తే..ఇప్పటికే 124 కోట్లు దాటిన మనం 2025 కల్లా చైనాను అధిగమిస్తామన్న లెక్కలు కలవర పెడుతున్నాయి.
అధిక జనాభా వల్ల ప్రధానంగా ఆహార సమస్య తలెత్తుతుంది. అసలే పావు వంతు ప్రజలు క్షుద్బాధతో తల్లడిల్లుతున్న తరుణంలో ఇంత మందికి తిండి అన్నది భూమికి మించిన భారం. గత రెండు శతాబ్దాల్లో దశాబ్దాల్లో ప్రపంచ జనాభా పెరిగిన తీరు ఆందోళన కలిగించేదే. రెండున్నర లక్షల సంవత్సరాలు గడిచిన తర్వాత గానీ ప్రపంచ జనాభా 1805లో వంద కోట్లకు చేరుకోలేదు. 1927నాటికి రెండొందల కోట్లు పెరిగిన జనాభా కేవలం నాలుగు దశాబ్దాల్లో 1974నాటికి రెండు రెట్లయింది. 1999లో బోస్నియాకు చెందిన అద్నాన్ నెవిక్‌ను ఆరొందల కోట్ల శిశువుగా ఐరాస ప్రకటించి పనె్నండేళ్లు నిండక ముందే మరో వంద కోట్లు చేరుకుంది! జనాభా పెరగడం అనేక కోణాల్లో మానవాళి విజయం అన్న మాటలో నిజం మేడిపండు చందం. ఆయుప్రమాణం పెరగడం, ఆరోగ్యంగా జీవించడం అన్నది కేవలం కొన్ని దేశాల జనాభాకే పరిమితం. సాంకేతికంగా ప్రపంచం ఎన్నో కొత్త పుంతలు తొక్కినా ప్రతి ప్రాంతంలోనూ పెరుగుతున్న ధనిక-పేద అసమానతలు విస్మయకరం. జన విస్ఫోటానికి తగ్గట్టుగా సుస్థిరమైన జీవన విధానాన్ని ఏర్పరచుకోవడం అవశ్యం. లేని పక్షంలో వనరుల లోటు తొలిచేయడమే కాదు పర్యావరణ వైపరీత్యాలకూ ఆస్కారం ఇచ్చినట్టే. అనేక దేశాల్లో నీరు, ఆహారం, ఇంధన కొరతలు సంక్షోభ స్థాయికి చేరుకున్నాయని చెప్పడం కళ్లకు కడుతున్న నిజం. జన ఆహార అవసరాలు తీరాలంటే ప్రపంచ ఆహారోత్పత్తి 17శాతం పెరిగి తీరాల్సిందే. కానీ, అంతటా ఉత్పాదకత తరిగిపోవడం, వ్యవసాయంపై ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో ఇది పెను సవాలు. ఆహారోత్పత్తే పెద్ద సవాలునుకుంటే పొరపాటే. ఉత్పత్తి చేసిన ఆహారం ఎన్ని అన్నార్త దేశాలకు అందుతోందన్నదీ కీలకం. ప్రస్తుత ఉత్పాదకతతో ఎనిమిది వందల కోట్ల మందికీ ఆహారాన్ని అందించవచ్చు. కానీ అన్ని కోణాల్లోనూ వ్యూహాత్మకత, సమతూకం పరిఢవిల్లినప్పుడే ఇది సాధ్యం. సస్య విప్లవం అనేక కోణాల్లో వ్యవసాయ పంటల్లో వైవిధ్యాన్ని తీసుకొచ్చింది. ఎన్నో రకాలుగా విస్తరించిన ఆహార పంటల్లో మనకు వినియోగమయ్యేది స్వల్పం. జొన్న, సోయాబీన్స్ వంటివి పశుగణాలకే పరిమితం అవుతున్నాయి.
ఏడొందల కోట్ల జన గీతను దాటిన ప్రపంచం దాన్ని బూచిగా భావించే కంటే అవకాశంగా పరిగణిస్తే అభివృద్ధి విస్తరిస్తుంది. సమస్యలు, సవాళ్లు దూదిపింజల్లా ఎగిరిపోతాయి. ఇప్పటికే ప్రపంచాన్ని పీడిస్తున్న సమతూక రాహిత్యం, తీవ్ర పేదరికాలను సమష్టిగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు ఎంత నిబద్ధతతో ముందుకొస్తాయన్న దానిపైనే అంతిమ విజయం ఆధారపడి ఉంటుంది. సంపన్న దేశాలది ఒకరకమైన సమస్య అయితే, పేద దేశాలది మరోరకమైన సమస్య. అక్కడ ఆకలి మంటలతో పాటు జీవన్మరణాల రేటూ ఎక్కువే. వీటన్నింటినీ సమగ్ర దృష్టితో పరిశీలించి ఎదుర్కొనేందుకు పటిష్ఠమైన వ్యూహం కావాలి. అన్ని కోణాల్లోనూ సమస్య తీవ్రతను పరికించి తదనుగుణమైన రీతిలో పరిష్కారం జరగాలి. అంతా సవ్యంగా జరిగితే..పుష్కలంగా ఆహారం ఉన్నా వంద కోట్ల మంది ఆకలి మంటలతో ఎందుకు అలమటిస్తున్నట్టు? ఓ చోట విలాసం..మరో చోట విలాపం ఎందుకు వెక్కిరిస్తున్నట్టు? వైద్యపరంగా ఎన్నో విజయాలు మోత మోగిస్తున్నా ప్రసవ సమయంలో మరణిస్తున్న తల్లులెందరో ఉంటున్నారు. తోటి మనిషిని కాపాడాల్సినంది పోయి వారిని అంతం చేయడానికే ఆయుధాలన్నట్టుగా బిలియన్ల కొద్దీ డాలర్ల ఖర్చు జరుగుతోంది. పెద్దరికం-పేదరికం మధ్య సమతూకం కావాలి. ఆధిపత్యం స్థానే పరస్పరం ఆదుకోవాలన్న ఆరాటం కావాలి. అప్పుడే జన సంఖ్యతో నిమిత్తం లేకుండా విశ్వం సర్వతో ముఖంగా విలసిల్లుతుంది. పెరుగుతున్న జనాభా అవసరాల పరంగా భారత దేశం విజ్ఞతాయుతంగా ముందుకు సాగుతోందని చెప్పడానికి నిదర్శనాలెన్నో ఉన్నాయి. 2045కల్లా జన స్థిరీకరణ దిశగా చర్యలు తీసుకోవడం వాస్తవ స్పృహకు నిదర్శనం. అయితే, జాతీయ జన విధానానికి అనుగుణంగా మరింత ముందుకు వెళ్లడం ద్వారానే జన సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జన విస్ఫోటనానికి కుటుంబ నియంత్రణ విధానాన్ని గతంలో పాటించినా తర్వాత దానికి దిక్కు లేకుండా పోయింది. మారుతున్న కాలానికనుగుణంగా వినూత్న విధానాలను, వ్యూహాలను అనుసరించి లక్ష్యాన్ని చేరుకోవాలి. భారత దేశమైనా మరే దేశమైనా ఉన్న జనాభాకు తగ్గట్టుగా వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిందే. ఆ విధంగా వినియోగానికి ఉత్పాదకతకు మధ్య సమతూకం సాధించి తీరాలి. అప్పుడే అధిక జనాభా భారం కాకుండా ప్రగతికి మూలం అవుతుంది. జన శక్తిని మించిన అభివృద్ధి దోహదకారి లేదన్న భావన సర్వత్రా పరిఢవిల్లాలి. ఇందుకు 700కోట్లవ శిశువుఆలంబన కావాలి. అప్పుడే జన హితం..విశ్వ శ్రేయస్సు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి