తేదీ కోసం కొందరి ఎదురుచూపు... మరికొందరికి
అపనమ్మకాలు
11-11-11. ఈ సంఖ్యను చూడగానే మీకు ఈపాటికే విషయం తెలిసిపోయి
ఉంటుంది కదా! అదేనండీ...సంవత్సరం, నెల, తేదీ ఒకే సంఖ్యతో శుక్రవారం ప్రపంచాన్ని
పలకరించనుంది. ప్రతి 100 ఏళ్లకు ఒకసారి వచ్చే ఇటువంటి తేదీని పాలిన్‌డ్రోమ్ అంటారు.
సంఖ్యాశాస్త్ర రీత్యా కూడా ఇలా అన్నీ ఒకట్లు రావడం అత్యంత అరుదైన విషయంగా
భావిస్తున్నారు. అయితే ఈ సంఖ్యను కొందరు శుభసూచికంగా భావిస్తే మరికొందరు అరిష్టమని
నమ్ముతున్నారు.
చైనాలో 3,200 జంటల పెళ్లిళ్లు: జీవితకాలంలో ఒకసారి మాత్రమే
చూడగల ఈ తేదీన ఒక్కటి కావడం ఎంతో మంచిదని చైనీయులు విశ్వసిస్తున్నారు. అందుకే
11-11-11న పెళ్లిళ్లు చేసుకునేందుకు బీజింగ్‌లో 3,200కుపైగా జంటలు సిద్ధమయ్యాయి.
కొందరేమో మరో అడుగు ముందుకేసి 11-11-11 ఉదయం 11 గంటల 11 నిమిషాల 11 సెకన్లను పెళ్లి
ఘడియలుగా నిర్ణయించుకున్నారు. మరోవైపు స్కాట్లాండ్‌లోనూ 50కిపైగా జంటలు శుక్రవారం
ఒక్కటికానున్నాయి. స్కాట్లాండ్, ఇంగ్లండ్ సరిహద్దున ఉన్న గ్రెట్నా గ్రీన్ అనే
పట్టణం ఇందుకు వేదికగా నిలవనుంది.
ఆరు ఒకట్లు శుక్రునికి సంకేతం: ఈ తేదీలోని
అన్ని ఒకట్లను కలిపితే 6 అవుతుంది. ఈ సంఖ్య శుక్రునికి సంబంధించినదని జ్యోతిష్య
పండితులు చెబుతున్నారు. పైగా ఈ రోజు శుక్రవారం కావడం... ఉదయం 6.57 గంటల వరకూ భరణీ
నక్షత్రం ఉండటం...కూడా శుక్రునికి చెందినవేనంటున్నారు. అయితే ఈ తేదీ శుభకార్యాలకు
పనికిరాదని పేర్కొంటున్నారు. కేవలం క్రయ విక్రయాలకు, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి
మాత్రం పనికి వస్తుందంటున్నారు. అదృష్ట సంఖ్య 6 గల వారికి కలిసి వస్తుందని
చెబుతున్నారు.
ప్రకృతి ప్రకోపిస్తుందని భయాలు: ఈ తేదీ ప్రపంచానికి కీడు
చేకూరుస్తుందని కొందరు ప్రజలు ప్రత్యేకించి పశ్చిమ దేశాలవారు భయపడుతున్నారు.
ప్రకృతి ప్రకోపిస్తుందేమోనని కలవరపడుతున్నారు. ఇందుకు ఉదాహరణలు చూపుతున్నారు.
11-11-1911న అంటే...సరిగ్గా 100 ఏళ్ల కిందట ఇటువంటి తేదీ రోజునే అమెరికాలో
విపరీతమైన వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు. గ్రేట్ బ్లూ
నార్తర్‌గా పేర్కొన్న దీనివల్ల అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా
పడిపోయాయని...ఉదయం 24 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత రాత్రికల్లా -12 డిగ్రీలకు
పడిపోయిందని గుర్తుచేస్తున్నారు.
సినీ ప్రయోగాలు: అరుదైన ఈ తేదీపై అటు
హాలీవుడ్ నుంచి మన బాలీవుడ్ వరకూ అప్పుడే సినిమాలు సిద్ధమయ్యాయి. బాలీవుడ్‌లో
‘ప్రాజెక్ట్ 11’ అనే షార్ట్ ఫిల్మ్ శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. ఇందులోని
కథాంశం, నటించిన వ్యక్తులు, దీన్ని తీసిన దర్శకులు, చిత్రీకరించిన ప్రాంతాలు అన్నీ
కూడా 11 కావడం మరో విశేషం. కేవలం రూ. 9 లక్షల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని
పూర్తిచేసినట్లు నిర్మాతల్లో ఒకరైన రంజన్‌సింగ్ తెలిపారు. మరోవైపు హాలీవుడ్‌లో
‘11-11-11’ పేరుతో శుక్రవారం సినిమా విడుదలవుతోంది. హీరో కుటుంబం సరిగ్గా 11 గంటల
11 నిమిషాలకు రోడ్డు ప్రమాదంలో మరణించడం...అప్పటి నుంచి 11 సంఖ్య హీరోను వెంటాడటం
అనేది ఈ చిత్ర కథాంశం.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి