21, నవంబర్ 2011, సోమవారం

జీఎస్‌ఎం వినియోగదారులు @ 62.54 కోట్లు


అక్టోబర్‌లో 71.2 లక్షల మంది కొత్తగా జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ...

న్యూఢిల్లీ: అక్టోబర్‌లో 71.2 లక్షల మంది కొత్తగా జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) తెలిపింది. సెప్టెంబర్‌లో చేరిన కొత్త మొబైల్ వినియోగదారుల సంఖ్య(65.2 లక్షలు)తో పోల్చితే ఇది 1.5 శాతం అధికమని వివరించింది. సీఓఏఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం....ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి దేశంలో మొత్తం జీఎస్‌ఎం వినియోగదారుల సంఖ్య 62.54 కోట్లకు చేరింది. యూనినార్‌కు అత్యధికంగా 26.6 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు.

దీంతో ఈ సంస్థ మొబైల్ వినియోగదారుల సంఖ్య 3.23 కోట్లకు చేరింది. అక్టోబర్‌లో 3 కోట్ల వినియోగదారుల మైలురాయిని సాధించామని, 2013లో బ్రేక్ ఈవెన్ సాధిస్తామని కంపెనీ పేర్కొంది. 16.3 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఐడియా సెల్యులర్ మొత్తం వినియోగదారుల సంఖ్య 10.18 కోట్లకు పెరిగింది. భారతీ ఎయిర్‌టెల్ సంస్థకు 9.4 లక్షల మంది కొత్త వినియోగదారులతో మొత్తం వినియోగదారుల సంఖ్య 17.37 కోట్లకు పెరిగింది. అక్టోబర్ చివరి నాటికి ఈ కంపెనీ మార్కెట్ వాటా 27.78 శాతానికి చేరింది. ఇక 9.2 లక్షల మంది కొత్త వినియోగదారులతో వొడాఫోన్ మొత్తం వినియోగదారుల సంఖ్య 14.59 కోట్లకు చేరింది. మొత్తం 22 టెలికాం సర్కిళ్లలో ఉత్తరప్రదేశ్(తూర్పు) టెలికాం సర్కిల్‌లో అత్యధిక మంది అక్టోబర్‌లో మొబైల్ వినియోగదారులయ్యారు. ఈ సర్కిల్‌లోనే దేశంలోనే అత్యధికంగా (5.2 కోట్ల మంది)జీఎస్‌ఎం వినియోగదారులున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి