23, నవంబర్ 2011, బుధవారం

రెండేళ్ళ కనిష్ట స్ధాయికి భారత షేర్ మార్కెట్లు, వెంటాడుతున్న మాంద్యం భయాలు


బుధవారం భారత షేర్ మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. సోమవారం వరకూ వరుసగా ఎనిమిది రోజులు నష్టాలను ఎదుర్కొన్న షేర్లు మంగళవారం 0.75 శాతం లాభపడి ఇన్వేస్టర్లను ఆశలను కొద్దిగా చిగురింపజేసాయి. అయితే అది తాత్కాలికమేనన్న విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ బుధవారం భారత షేర్లు మళ్లీ ఘోరంగా పతనం అయ్యాయి. ఈ సారి రెండేళ్ల కనిష్ట స్ధాయిని తాకి ఇన్వెస్టర్లకు చెమటలు పుట్టించాయి.
బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ 2.3 శాతం పతనం అయ్యాయి. అధిక ద్రవ్యోల్బణం, నెమ్మదవుతున్న ఆర్ధిక వృద్ధి, రూపాయి నిరంతర పతనం షేర్ల పతనానికి కారణమయ్యాయని రాయిటర్స్ సంస్ధ పేర్కొంది. ఈ కారనాలు మదుపుదారుల విశ్వాసాన్ని బలితీసుకుంటున్నాయని అది పేర్కొంది. జర్మనీ, చైనా, అమెరికా ల నుండి వెలువడిన గణాంకాలు బలహీనంగా ఉండడంతో ప్రపంచవ్యాపితంగా కూడా షేర్లు పతన దిశలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచవ్యాపితంగా కూడా పరిస్ధితులు అదుపులో లేకపోవడంతో ప్రపంచ స్ధాయి మాంద్యం తప్పదన్న భయాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.
ముప్ఫై షేర్ల సూచి సెన్సెక్స్ 2.3 శాతం పతనమై 15699.97 పాయింట్ల వద్ద ముగిసింది. ఒక దశలో 15478.69 పాయింట్ల వరకూ సెన్సెక్స్ పతనమయ్యింది. నవంబరు 3, 2009 తర్వాత ఇదే అతి తక్కువ స్ధాయి కావడం గమనార్హం. మార్కెట్లలో విశ్వాసం సన్నగిల్లిందనీ, పార్లమెంటులో కూడా కార్యకలాపాలు స్తంభిస్తుండడంతో సంస్కరణల ఆమోదంపైన కంపెనీలు బెంగపెట్టుకున్నాయనీ, నిర్ణయాలు చేసే సామర్ధ్యం కొరవడుతున్నదని అవి భావిస్తున్నాయనీ వీటికి తోడు కరెన్సీ పతనం సెంటిమెంట్ ను దెబ్బతీస్తున్నదనీ వివిధ విశ్లేషకులు బుధవారం పతనం పై భాష్యం చెప్పారు.
కొత్త పెట్టుబడుల ప్రాజెక్టులు వాయిదా పడుతుండడం, ఆర్.బి.ఐ రేట్ల పెంపు వలన రుణాల ఖరీదు పెరిగిపోవడం వల్ల వ్యాపార వర్గాల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని భావిస్తున్నారు. ప్రపంచ స్ధాయి పరిణామాలు భారత్ పై ప్రభావం చూపుతుండగా దేశీయంగా కూడా పరిస్ధితులు అందుకు భిన్నంగా లేకపోవడంతో వారి విశ్వాసం సన్నగిల్లుతోందని భావిస్తున్నారు. రూపాయి విలువ 2011 సంవత్సరంలోనే దాదాపు 17 శాతానికి పైగా పడిపోయింది. ఎఫ్.ఐ.ఐ లు పెద్ద ఎత్తున ఉపసంహరణకు గురయ్యాయి. ఈ సంవత్సరం ఎమర్జింగ్ దేశాల్లో ఇండియా పనితీరే అత్యంత అధ్వాన్నంగా ఉంది.
వాణిజ్య లోటు పెరుగుతుండడం, అప్పులు, ఈక్విటీ పెట్టుబడులు (ఎఫ్.ఐ.ఐలు) ఘోరంగా పడిపోవడం తదితర కారణాల వల్ల రూపాయి పతనం అవుతోందని క్రెడిట్ సుశీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు విశ్లేషించింది. అయితే, రూపాయి విలువ పతనం వల్ల కూడా వాణిజ్య లోటు పెరుతుంది. రూపాయి విలువ పతనం, వాణిజ్య లోటు పరస్పరం ప్రభావితం చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. సోమవారం తో ముగిసిన ఐదు రోజుల్లో విదేశీ మదుపుదారులు 450 మిలియన్ డాలర్లు వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకూ 2011 లో నికర విదేశీ పెట్టుబడులు కేవలం 300 మిలియన్ డాలర్లు మాత్రమేననీ 2010 లో విదేశీ పెట్టుబడులు 29 బిలియన్ డాలర్లనీ రాయిటర్స్ తెలిపింది.
బ్యాంకింగ్ రంగం షేర్లు బుధవారం బాగా పతనం అయ్యాయి. హె.డి.ఎఫ్.సి షేరు 3.85 శాతం, ఐ.సి.ఐ.సి.ఐ షేరు 2.5 శాతం, ఎస్.బి.ఐ షేరు 2.03 శాతం పతనం అయ్యాయి. భారత ఐ.టి రంగం యూరప్, అమెరికా సంక్షోభాల వల్ల తీవ్రంగా దెబ్బతింటుందని విశ్లేషకులు ఏకాభిప్రాయంతో ఉన్నారు.
రూపాయి పతనం ఆపడానికి బుధవారం ఆర్.బి.ఐ జోక్యం చేసుకుందని అనుమానిస్తున్నారు. జోక్యం చేసుకున్నట్లుగా ఆర్.బి.ఐ చెప్పలేదు. గతంలో కూడా జోక్యం చేసుకున్న సందర్భాల్లో తాను జోక్యం చేసుకున్నట్లుగా ఆర్.బి.ఐ చెప్పలేదు. ఆర్ధికమంత్రి మాత్రం ఆర్.బి.ఐ జోక్యం ద్వారా రూపాయి విలువ పతనం ఆగదని మంగళవారం పేర్కొన్నాడు. బైటికారణాలపైన నెపం నెడుతున్న ప్రభుత్వం బైటి కారణాల ప్రభావాన్ని అడ్డుకోవడానికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి ఉంటుందన్న సంగతిని నిరాకరిస్తున్నాడు. భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను నియంత్రణనుండి తొలగించి పూర్తిగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ లోని ఆటగాళ్ళ దయ దాక్షిణ్యాలకి వదిలివేయాలని ఎప్పటినుండో పశ్చిమ దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. దానిని ఆర్ధిక మంత్రి అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి