విశాఖలో 52 సెకన్ల వ్యవధిలో 6,527 మంది ఒకే శ్రుతిలో జాతీయ గీతాలాపన
పాకిస్థాన్ పేరిట ఉన్న గత రికార్డును అధిగమించామని ప్రకటించిన నిర్వాహకులు
విశాఖపట్నం(కల్చరల్), న్యూస్‌లైన్: ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ బుక్‌లో జనగణ
‘మన’ రికార్డుకు చోటు దక్కనుంది. విశాఖ నగరంలో నిర్ణీత 52 సెకన్ల వ్యవధిలో
6,527 మంది ఒకే శ్రుతిలో(అధికారిక నిబంధనల ప్రకారం) మన జాతీయ గీతాన్ని
పాడటం ద్వారా ఈ ఘనతను సాధించారు. తద్వారా ఈ ఏడాది ఆగస్టులో పాకిస్థాన్‌లో
5,847 మంది ఆ దేశ జాతీయ గీతాన్ని పాడటం ద్వారా నెలకొల్పిన గిన్నిస్
రికార్డును బద్దలుగొట్టారు. సోమవారమిక్కడ పోర్టు స్టేడియం ప్రాంగణంలో
సింపుల్ అండ్ రియలిస్టిక్ ఐడియాస్(సరి) ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నండూరి
ప్రభాకర్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాలల విద్యార్థులు,
పౌరులతో కలిపి మొత్తం 6,527 మంది పాల్గొన్నారు. తొలుత రిహార్సల్స్ చేసిన
అనంతరం వేలాది గొంతులు ఒకే శ్రుతిపై ‘జనగణమన..’ గీతాన్ని ఆలపించాయి. గీతం
పూర్తవగానే స్టేడియం మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. ఈ రికార్డుపై
గత నెల తాము గిన్నిస్ బుక్ నిర్వాహకుల నుంచి అనుమతి తీసుకున్నామని,
ఎడిటింగ్ చేయని వీడియో చిత్రాన్ని వారికి పంపిస్తున్నామని ప్రభాకర్
తెలిపారు. దీన్ని ఆమోదిస్తే.. వెంటనే గిన్నిస్ బుక్‌లో నమోదు చేస్తారని
చెప్పారు. బాలల దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ నెలకొల్పిన గిన్నిస్
రికార్డును అధిగమించడం ముదావహమని కార్యక్రమ కన్వీనర్, విజయ్ నిర్మాణ్
కంపెనీ అధినేత డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి