28, నవంబర్ 2011, సోమవారం

1న రాష్ట్రంలో ట్రేడ్ బంద్

- టిడిపి మిత్రపక్షాల పిలుపు -
హైదరాబాద్, నవంబర్ 28: చిల్లర వ్యాపారంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా డిసెంబర్ ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్ బంద్ నిర్వహించనున్నట్టు టిడిపి మిత్ర పక్షాలు ప్రకటించాయి. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, మిత్రపక్షాల నాయకులు సోమవారం విలేఖరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. అంతకుముందు రైతుల సమస్యలపై ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు అధ్యక్షతన మిత్రపక్షాల సమావేశం జరిగింది. ఎన్‌డిఏ పక్షాలు, వామపక్షాలు వేర్వేరుగా ఉద్యమిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా జరిగే ఉద్యమంలో భాగంగా డిసెంబర్ ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్ బంద్ నిర్వహించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశ వ్యాప్తంగా ఐదు కోట్ల మంది చిల్లర వ్యాపారులు దెబ్బతింటారని, ఆందోళన వ్యక్తం చేశారు. చిల్లర వ్యాపారంలోకి బహుళ జాతి కంపెనీలు ప్రవేశించిన తరువాత పాశ్చాత్య దేశాల్లో చిన్న వ్యాపారులు దెబ్బతిన్నారని, ఇప్పుడు మన దేశంలో సైతం అదే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. సన్న, చిన్నకారు రైతులు, చిన్న వ్యాపారులు నష్టపోతారని, ఐదారు బహుళ జాతి కంపెనీలకు మాత్రమే ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. అయితే అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న లోక్‌సత్తా ప్రతినిధి కఠారి శ్రీనివాస్ చంద్రబాబు సమక్షంలోనే ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పోటీ ఏర్పడుతుందని, తద్వారా వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. టెలికాం రంగంతో పాటు వివిధ రంగాల్లో పోటీ వల్ల వినియోగదారులకు మేలు జరిగినట్టు దీని వల్ల కూడా మేలు జరుగుతుందని కఠారి తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి