28, నవంబర్ 2011, సోమవారం

‘కిషన్ జీ’ ఉరఫ్ ‘మల్లోజుల కోటేశ్వర రావు’ ఎవరు?




(మిత్రుడు డేవిడ్ రాసిన వ్యాఖ్యను పోస్టు గా మలిచాను -విశేఖర్)
maoist
ఒక ఉత్తరం, సందేశం (అమ్మను చూడాలను ఉంది -రచన: కిషన్ జీ) ..కంటికి కానరాని, సుదూర తీరాలనుండి, అమ్మ కోసం తపించిన, తల్లడిల్లిన గుండె కాయ..మల్లోజుల కోటేశ్వర రావు, ఉత్తరం చదివిన ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీరు.
దేశ రాజకీయాలని గడ గడ లాడించిన కిషన్ జి కూడ ఒక బిడ్డనే, కన్న తల్లి కోసం తపించిపోయిన గుండెనే.
ఒక గొప్ప ఆదర్శం ముందు, బంధాలను , అనుబందాలను వదులుకొని ప్రాణాలను తను నమ్మిన సిద్దాంతం కోసం ధార పోసిన నాయకుడు. విప్లవ పార్టీలకు వన్నె తెచ్చిన కిషన్ జి, విప్లవాన్ని ఊపిరిగా మలుచుకున్న మనిషి. విప్లవాల గడ్డ, కరీంనగర్ బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ. వెంకటయ్య, మధురమ్మల పుత్రుడు. ఇక్కడ పుట్టి, ఇక్కడి రాజకీయాలలో నాయకుడిగా ఎదిగి, ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన గొప్ప విప్లవానికి ఊపిరిలు ఊదిన కిషన్ జి. కర్కశ ప్రభుత్వాలకు బలి అయిపోయిన అరుణ తార, కొలకత్తా, పశ్చిమ మిడ్నాపూర్ లో చివరి శ్వాస.
ఎక్కడైతే నక్సల్ బరి పుట్టి పురుడు పోసుకుందో, అక్కడనే నాయకుడిగా ఎదిగి, ప్రజలలో ఒదిగి, ప్రభుత్వాల పన్నాగాలకు బలి అయిపోయిన పెద్ద అన్న.
ఇది బూటకపు ఎన్ కౌంటర్ల దేశం. అజాదు ను చంపుతారు. అవును, అయన నక్సల్, వెంటాడి వేటాడి చంపుతారు, హేమచంద్ర పాండే, ఒక జర్నలిస్ట్, ఈయనని కూడ చంపుతారు ఎందుకంటే ఆయనకి వీరితో సంబంధాలు ఉంటాయి కాబట్టి. అయన ఇంట్లో నిషిద్ధ సాహిత్యం ఉంటుందిమ్ అట! పొరపాటు పడవద్దు బూతు సాహిత్యం గురించి కాదు మనం మాట్లాడుతుంది, మార్పును కోరుకునే సాహిత్యం గురించి మాత్రమె. కొన్నిరోజుల తరువాత సుప్రీం కోర్ట్ ఇది అన్యాయం అంటుంది, అది ఏ పత్రికా రాయదు, రాసినా వాటి గురించి పెద్దగా చర్చ జరుగదు.
గుజరాత్ లో మోడి ప్రభుత్వం కూడ ఇష్రత్ అనే విద్యార్దిని , ఆమెతో ఇంకా కొంత మందిని ఎన్కౌంటర్ చేస్తుంది, , ఉగ్రవాదులు అన్నారు కాని ఇపుడు ఇవే కోర్ట్లు కాదు వారిది బూటకపు ఎన్కౌంటర్ అంటుంది, షీలా శూద్ అనే సామాజిక కార్యకర్త, హక్కులు అడిగిన పాపానికి హత్య కావించ బడుతుంది. ఇపుడు లేటెస్ట్ గా జీతెన్ మరాండి, పాటలు పాడుకొని దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అన్నందుకు ఆయనకు ఉరి శిక్ష..వెరసి ఇవి ప్రభుత్వాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. ఇక్కడ ఎవరినైనా చంపొచ్చు దానికి మావోఇస్ట్ అని పేరు పెట్టొచ్చు. ఇక్కడ రాసుకున్న రాజ్య , న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి, ఎవడిని పడితే వాడిని, ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని అన్యాయంగా చంపొచ్చు.
నీచేతిలో తుపాకి ఉంటె దేశ రక్షణ, నాచేతిలో తుపాకి ఉంటె నేనొక నిషిద్ధం. ఇది ఈ దేశ, రాజ్య, ప్రపంచ సూత్రం. దీనిని ప్రశ్నించే వాడు లేదు, ఉన్న కూడా వారు చాల మందికి అర్థం కారు. అభివ్రుది అనే ముసుగులో ఆదివాసీలను, అడవులను, బీద ప్రజలను దేశ సార్వ భౌమత్వాన్ని కార్పొరేటు శక్తులకు తాకట్టు పెడుతున్న రాజకీయ పార్టీలను ఎదిరించకూడదు.
ఆయనెవరో నేటి తరానికి తెలియకపోయి ఉండొచ్చు, చాల మంది తెలంగాణ ఉద్యమకారులకు, ఉద్యమ నినాదాలకి తెలిసే అవకాశం కూడా లేదు. ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఒక రంగు ఉంటుంది, ఒక బ్రాండ్ ఉంటుంది, మావోఇస్ట్, నక్సలైట్, పీపుల్స్ వార్, సాయుధ పోరాటం ఇలాంటివన్నీ వినకూడదు, మాట్లాడకూడదు. మాట్లాడినవాడు కరడుగట్టిన రక్త పిపాసి, మనుషులను ఖండ ఖండాలుగా నరికే కసాయి వాడు. ఇదీ రాజ్యం, రాజ్యానికి కొమ్ము కాసే, పార్లమెంటరీ భక్తులు వాడే భాష.
ఈ దేశ రాజకీయాలని ప్రజా పోరాట రూపం లో ప్రశ్నించిన వ్యక్తీ ఒక తెలంగాణ వాడు, ఇక్కడ జరిగిన అన్యాయానికి సాయుధ పోరాటం తప్ప మరో మార్గం లేదని నమ్మిన వ్యక్తీ. భారత రాజకీయాలలో కేవలం కొన్ని వర్గాల వారికి మాత్రమె న్యాయం చేకూరుతుందని, అధికార దాహం పేద, దళిత, ఆదివాసీ ప్రజలను అణచి వేస్తున్నాయని ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం, గొప్ప విప్లవోద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తీ.
మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్ జి 1956 లో జననం కరీంనగర్ పెద్దపల్లి లో జననం. 1948 తెలంగాణ రైతాంగా సాయుధ పోరాట పటిమని చేత పుచ్చుకొని, 1969 తెలంగాణ ఉద్యమం అణచివేయబడిన తరువాత ప్రత్యామ్న్యా రాజకీయాల్లోకి ప్రవేశించిండు. నక్సలైట్ల ఉద్యమం, శ్రీకాకుళ ఉద్యమం కూడా మొదలై, అణచివెతలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్న చారిత్రాత్మక సందర్భంలో విప్లవోద్యమంలోకి ఉరికి చివరికి ఆ విప్లవోద్యమం కోసమే అమరుడైనాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి