16, నవంబర్ 2011, బుధవారం

బ్రిటన్ లో దారుణ స్ధితికి చేరుకున్న నిరుద్యోగం





యూరప్ రుణ సంక్షోభం బ్రిటన్ పైన దారుణంగా ప్రభావం చూపుతోంది. ఉపాధి అవకాశాలు అక్కడ పూర్తిగా పడిపోయాయని వివిధ సర్వేలు చెబుతున్నాయి. పబ్లిక్, ప్రవేటు రెండు రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. పొదుపు ఆర్ధిక విధానాల పేరుతో ప్రభుత్వరంగాన్ని ప్రవేటుపరం చేస్తుండడంతో ప్రభుత్వరంగంలో ఉపాధి అవకాశాలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. కంపెనీలు ఉద్యోగులను నియమించే ఆలోచనే పెట్టుకోవడం లేదు. ఒకరిద్దరూ ఎవరైనా నియామకాలకు పూనుకున్నా, యూరప్ లోని తాజా పరిణామాలతో ఆ ప్రయత్నాలను రద్దు చేసుకుంటున్నారు. పైగా దేశంలోని ఉద్యోగాలను చౌక శ్రమ శక్తి దొరికే చోట్లకు తరలించడానికి పధకాలు వేసుకుంటున్నట్లుగా ‘ఛార్టర్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ అండ్ డవలప్‌మెంట్’ (సి.ఐ.పి.డి) సంస్ధ సర్వేలో తేలింది.
పబ్లిక్ రంగం, ప్రవేటు రంగం, ఛారిటీ రంగం మూడు రంగాలలోని ఉపాధికర్తలు కొత్త ఉద్యోగులను తీసుకోడానికి వ్యతిరేకత వ్యక్తం చేశారు. “ఉన్న ఉద్యోగులను తగ్గించడానికి వెనకడుగు వేస్తున్నాం, అందుకు సంతోషించడమే” అని వారు తేల్చేస్తున్నారు. “ఉపాధి మార్కెట్టు, నెమ్మదిగా, బాధాకరమయిన సంకోచానికి గురవుతోంది. అనేక కంపెనీలు ‘వేచి చూద్దాం’ అన్న ధోరణిలో తమను తాము బంధించుకున్నాయి. యూరోజోన్ సంక్షోభం ఫలితంగా ఏర్పడిన అనిశ్చితి నేపధ్యంలో అన్నిరకాల ఉపాధి నిర్ణయాలను కంపెనీలు పక్కన పెట్టేశాయి. యూరోజోన్ సంక్షోభం, నెమ్మదించిన అమెరికా వృద్ధి, మొత్తంగా ప్రపంచ వ్యాపితంగా నెలకొని ఉన్న ఆర్ధిక స్తంభన పరిస్ధితులు అన్నీ కలిసి ఇతర దేశాలతో పాటు బ్రిటన్ పరిస్ధితిని కూడా దిగజార్చాయి” అని సి.ఐ.పి.డి విధాన సలహాదారు జర్విన్ డేవీస్ పేర్కొన్నాడు.
“అయితే, ఉద్యోగులను వెళ్ళిపోవాలని చాలా కంపెనీలు కోరడం లేదు. కొద్ది మంది మాత్రమే మానవ శ్రమ చౌకగా దొరికే చోటికి వెళ్తున్నారు. అంతవరకు సంతోషపడవలసిందే” అని సి.ఐ.పిడి నివేదిక పేర్కొన్నది. కాని నియామకాలు తగ్గిపోతున్నాయని, దీనివలన నిరుద్యోగం మరింత ప్రబలుతోందనీ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. “ఆఫీస్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ అంచనా వేసిన దానికంటే పబ్లిక్ రంగ ఉద్యోగాలు వేగంగా తగ్గిపోతున్నాయి. స్వల్పకాలికంగా గానీ, మధ్య కాలికంగా గానీ బ్రిటన్లో ఉపాధి పరిస్ధితి మెరుగుపడుతుందన్న సూచనలేవీ కనిపించడం లేదు” అని నివేదిక తెలిపింది.
రెండో క్వార్టర్లో ఉపాధి అవకాశాలు -1 శాతం ఉండగా మూడో క్వార్టర్లో అది -3 శాతానికి పడిపోయిందని సి.ఐ.పి.డి నివేదిక తెలిపింది. 2010 చివరినుండి ఇదే అత్యంత బలహీనమైనది. సర్వే జరిపిన వెయ్యిమంది ఉపాధి కర్తలలో సిబ్బంది సంఖ్య పెరుగుతుందని చెప్పినవారితో, సిబ్బంధి సంఖ్య తగ్గుతుందని చెప్పినవారితో గల నిష్పత్తిలో తేడాను ఈ అంకెలు సూచిస్తాయి. అంటే వెయ్యిమంది ఉపాధికర్తలలో x శాతం మంది సిబ్బంది సంఖ్య పెరుగుతుందని చెప్పగా, x+3 శాతం మంది సిబ్బంది సంఖ్య తగ్గుతుందని చెప్పారన్నమాట! రానున్న పన్నెండు నెలలలో చూసినప్పటికీ సిబ్బంది సంఖ్య పెరుగుతుందన్న వారి కంటే తగ్గుతుందన్నవారే ఎక్కువగా ఉన్నారని సర్వేలో తేలింది.
రానున్న మూడు నెలల్లో ప్రవేటు రంగం వృద్ధి చెందుతుందని తేలినా వృద్ధి రేటు గతంలో ఎన్నడూ ఎరగనంత నెమ్మదిగా ఉన్నదని సర్వే తెలిపింది. ప్రభుత్వరంగం పరిస్దితి అంతకంటే ఘోరమని సర్వే నిర్ధారించింది. బ్రిటన్ లో నిరుద్యోగం గత 17 సంవత్సరాలలొ అత్యధిక స్ధాయికి చేరుకుంది. ఆగష్టు నెలలో నిరుద్యోగం 8.1 శాతం ఉండగా, సెప్టెంబరు నాటికి అది 8.2 శాతానికి చేరుకుందని రాయిటర్స్ సర్వే తెలిపింది. ఉపాధి దొరకక ప్రభుత్వ సదుపాయాలను కోరుతున్న వారి సంఖ్య అక్టోబరులో గత నెలకంటే 20,000 పెరిగింది.
ఉద్యోగాల రద్దు కంటే, ఉద్యోగాల నియామకం నెమ్మదించినందునే ప్రభుత్వ సదుపాయాలు కోరేవారి సంఖ్య పెరుగుతోందని విశ్లేషకులు కొంతమేరకు సర్ది చెప్పుకుంటున్నారు. 2012 మధ్య నాటికి నిరుద్యోగం 8.7 శాతం వరకూ పెరిగే అవకాశాలున్నాయని సి.ఐ.పి.డి ఛీఫ్ ఆర్ధిక సలహాదారు జాన్ పిల్పోట్ అంచనా వేస్తున్నాడు. అంటే నిరుద్యోగుల సంఖ్య 2.7 మిలియన్లు లేదా 27 లక్షలకు చేరుకోగలదని జాన్ అంచనా. ఆగష్టులో ఈ సంఖ్య 2.57 మిలియన్లు లేదా 25.7 లక్షలుగా ఉంది. 1994 తర్వాత బ్రిటన్ లో ఇదే అత్యధిక నిరుద్యోగం.
ప్రస్తుతం బ్రిటన్ లో అమలు జరుగుతున్న పొదుపు విధానాల వలన నిరుద్యోగం సి.ఐ.పిడి అంచనాను దాటిపోతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. నిరుద్యోగానికి బ్రిటన్ లోని కంపెనీల లాభాపేక్ష, తమ లాభాలను కాపఆదుకోవడానికి ఉద్యోగులను బలిపెడుతున్న వైనాన్ని సి.ఐ.పి.డి లాంటి సంస్ధలు గుర్తించవు, పట్టించుకోవు. నిరుద్యోగం పెరిగిందని చెప్పినా, తగ్గిందని చెప్పినా వీరి దృక్పధం పెట్టుబడిదారుల దృక్పధమే తప్ప ప్రజా దృక్పధం కాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి