10, నవంబర్ 2011, గురువారం

పెట్రో చిచ్చువెనుక అసలు కథేంటీ


* వాషింగ్టన్ లో పెట్రోల్ ధర తక్కువేనా?
* పన్నులు పిండటంలో వాస్తవాలేమిటి?
* `పెట్రో సొమ్ము ఎటుపోతోంది?
* ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
* మనదేశంలో కంటే వాషింగ్టన్ లో పెట్రో కారు నడపడం చవక
* న్యూయార్క్, కరాచీ, ఢాకా, బీజింగ్ లోనూ పెట్రోల్ ధరలు తక్కువే

  1. ఢిల్లీ - రూ. 68.24 * ముంబయి - రూ. 73.57
  2. న్యూయార్క్ - రూ. 44.44 *
  3. కరాచీ - రూ. 44.49 *
  4. బీజింగ్ - రూ. 48.05 *
  5. ఢాకా - రూ. 48.07 *
  6. కొలంబొ - రూ. 53.85
* పెంచిన పెట్రోల్ ధరలో 40శాతం పన్నులు, సుంకాలే
* ఖజానా నింపడానికే పెట్రోల్ ధరల పెంపు
* ప్రజాసంక్షేమ పథకాలకు మళ్లిస్తున్న నిధి
* పెట్రోల్ సొమ్ము సంక్షేమ పథకాల పాలు
* దారుణంగా తగ్గిపోతున్న ప్రభుత్వ ఆదాయం
* ఆర్థిక లోటు : రూ. 4,65,000 కోట్లు

పెంచిన పెట్రోల్ ధరలను కేంద్ర సర్కార్ ఎందుకు తగ్గించడంలేదు? ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లోని నిజం ఎంత? ఇతర దేశాలతో పోలిస్తే, మన పెట్రోల్ ధరల పరిస్థితి ఎలా ఉంది ? ఢిల్లీ పెద్దలు ప్రదర్శిస్తున్న పెట్రో మ్యాజిక్ పై ఓ రిపోర్ట్. చీటికీమాటికీ పెట్రోల్ ధరలు పెరగడం, ప్రజల్లోనూ, అటు ప్రతిపక్షాల్లోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడటం, ఆ తర్వాత అలవాటు పడేలోగానే మరోసారి పెట్రో మంట పుట్టడం మనదేశంలో మామూలైపోయింది. అదేమని నిలదీస్తే, అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతోనే తప్పని పరిస్థితుల్లో పెంచాల్సి వస్తోందంటూ ఢిల్లీ పాలకులు కాకమ్మకబుర్లు చెప్పడం ఓ పెద్ద జోక్ గా మారిపోయింది.

అయితే, ఇదంతా నిజమేనా? మిగతా దేశాల్లో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయా...? అసలు వాస్తవాలేమిటి? దేశంలో వసూలవుతున్న ఎక్సైజ్ సుంకంలో సగం మొత్తం పెట్రోలియం ఉత్పత్తుల వల్ల వస్తున్నదే. 2011 - 2012లో ఈ తరహా సుంకాల నుంచి కేంద్రానికి 82వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరబోతున్నది. పెట్రోల్ పై విధించే సుంకంలో ఒక్క రూపాయి తగ్గించినా అది నాలుగువేల కోట్ల రూపాయల రెవెన్యూకి గండికొట్టినట్టే అవుతుంది. పరోక్షంగా చెప్పుకోవాలంటే ఇది గ్రామీణ ఉపాధి పథకం ఖర్చులో పదిశాతమన్నమాట. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లు తప్పులతడకలా మారిపోవడంతో సంక్షేమ పథకాల అమలుకు నిధులు కేటాయించడం ప్రభుత్వాలకు పెద్ద సవాల్ గా మారిపోయింది.

వ్యవసాయ పన్నుల రూపేణా వచ్చే ఆదాయానికి కూడా బ్రేక్ లు పడుతుండటంతో సమస్య తీవ్రరూపం దాల్చింది. పేదల సంక్షేమ పథకాలు ఎండిపోతే దాని ప్రభావం ప్రత్యక్షంగా ఎన్నికల ఫలితాలమీద పడుతుంది. అందుకే ఢిల్లీ సర్కార్ పెట్రోల్ మంటతోనే సంక్షేమ `పథకాల చలి\' కాచుకోవడం మొదలెట్టింది. సంక్షేమ పథకాల అమలుకు విఘాతం కలగకుండా, ఓటు బ్యాంక్ లకు చిల్లు పడకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం పన్నులు, సుంకాల రూపంలో పెట్రోల్ మంట పుట్టిస్తోందన్నది పచ్చి నిజం.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి