పాపం అంతా యూరోజోన్‌దే -నిరుద్యోగం పై బ్రిటన్ ప్రభుత్వం
కన్సర్వేటివ్
ల నాయకత్వంలోని కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న బ్రిటన్ ప్రభుత్వం బ్రిటన్
నిరుద్యోగం పాపం అంతా యూరోజోన్ సంక్షోభందేనని చేతులు దులుపుకుంది. బ్రిటన్
లో నిరుద్యోగం పెరగడానికి దేశీయంగా ప్రభుత్వ రంగం, ప్రవేటు రంగం, ఛారిటి
రంగాల నిర్వాకాలే కారణమని సి.ఐ.పి.డి నివేదిక చెబుతుండగా ట్రెజరీ కి
ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న మార్క్ హోబన్ మాత్రం పాపం అంతా యూరోజోన్
సంక్షోభంపైకి నెట్టేసి దులుపుకున్నాడు.
యూరప్ లో
27 దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్ గా ఏర్పడ్డాయి. అందులో 17 దేశాలు
మాత్రమే ‘యూరో’ ను తమ ఉమ్మడి కరెన్సీగా అంగీకరించి అమలు చేస్తున్నాయి. అంటే
యూరోపియన్ యూనియన్ లోని మిగిలిన పది దేశాలూ తమ తమ కరెన్సీలలోనే
వ్యాపారాలను నిర్వహించుకుంటాయి. ఈ పది దేశాల వాళ్లు ఆర్ధిక యూనియన్ లో భాగం
పంచుకోకుండా రాజకీయ యూనియన్ లో మాత్రమే భాగం పంచుకుంటున్నాయి. ఈ పది
దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. యూరో కరెన్సీగా చేసుకున్న 17 దేశాలను కలిపి
యూరోజోన్ గా పిలుస్తారు. బ్రిటన్ తన సొంత కరెన్సీలోనే వాణిజ్య వ్యాపారాలు
నిర్వహిస్తుంది. దేశీయంగా పౌండ్ స్టెర్లింగే కరెన్సీగా చెలామణీలో ఉంది.
అయినప్పటికీ యూరోజోన్ సంక్షోభమే బ్రిటన్ నిరుద్యోగానికి కారణమని ప్రభుత్వం
నెట్టేస్తోంది.
బ్రిటన్
లో ప్రతిపక్ష పార్టీ అయిన లేబర్ పార్టీ ప్రభుత్వ వాదనను కొట్టిపారేసింది.
యూరోజోన్ లో సంక్షోభం తీవ్రం కాకముందునుండే బ్రిటన్ లొ నిరుద్యోగం పెరగడం
ప్రారంభం అయ్యిందని ఆ పార్టీ గుర్తు చేసింది. “ప్రభుత్వ ఆర్ధిక విధానాలు
-ప్రభుత్వ ఖర్చుల కోత, పన్నుల పెంపు, ధనికులకు పన్నుల రాయితీ- చాలా దూరం
వెళ్లిపోయాయి. అవసరమైన దాని కంటే తీవ్రస్ధాయిలో వాటిని ప్రభుత్వం అమలు
చేస్తోంది. వాటివలన ఆర్ధిక వృద్ధి మందగించింది. ఫలితంగా రికార్టు
స్ధాయిల్లో నిరుద్యోగం ప్రబలింది. యువతలో నిరుద్యోగం మరింతగా తీవ్రం
అయ్యింది” అని ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు లియామ్ బైర్న్ పేర్కొన్నాడు.
ప్రభుత్వం తన ఆర్ధిక విధానాలని మార్చుకోవాలని చెప్పడానికి తగిన సాక్ష్యాలు
గుట్టలుగా పేరుకుంటున్నాయని లియామ్ హెచ్చరించాడు. లేబర్ పార్టీ
ప్రతిపాదించిన ఐదు సూత్రాల ఫార్ములా అమలు చేయాలని ఆయన చెబుతున్నాడు.
ప్రభుత్వం
అనుసరిస్తున్న పొదుపు విధానాలు ‘అతి’ అయ్యాయని చెబుతున్నాడే తప్ప లేబర్
నాయకుడు, పొదుపు విధానాలు అమలు చెయ్యొద్దు అని మాత్రం చెప్పడం లేదు. ఈయన
అభ్యంతరమల్లా పొదుపు విధానాలను నెమ్మదిగా ప్రజలకు నొప్పి తెలియకుండా అమలు
చేయాలన్నదే తప్ప ఆ విధానలపైన ఆయనకి వ్యతిరేకత ఏమీ లేదు. ప్రజలను తీవ్రంగా
బాదాలా లేక ఒక మాదిరిగా మాదాలా అన్నదే ప్రతిపక్ష పాలక పార్టీల మధ్య తేడా.
కాని ఇరువురూ ప్రజల్ని బాదాలన్న విషయంలో ఏకాభిప్రాయంతోనే ఉన్నారు.
ఉద్యోగాలన్ని రద్దు చేసి పనికిరాకుండా తయారు చేసిన పబ్లిక్ రంగ పరిశ్రమలను
కొనుక్కోవడానికి ప్రవేటు రంగ పెట్టుబడిదారులు సిద్ధంగా లేరని యూనియన్ల
నాయకులు వాపోతున్నారు. “మిలియన్ల మంది యువకులు, పబ్లిక్ రంగ కార్మికులు,
దీర్ఘకాలిక నిరుద్యోగులు తాము కారణం కాని ఆర్ధిక సంక్షోభం ఫలితాలను
అనుభవిస్తున్నారు” అని యూనిసన్ యూనియన్ నాయకుడొకరు అన్నాడు. అయితే పొదుపు
విధానాలపైన వీరు పోరాడిన దాఖలాలేవీ లేవు.
మూడేళ్ల
క్రితం సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం అనంతరం యూరప్, అమెరికా
ప్రభుత్వాలు ప్రవేటు కంపెనీలకు పెద్ద ఎత్తున బెయిలౌట్లు పంచి పెట్టాయి. ఆ
బెయిలౌట్లు ఇవ్వడానికి బాగా అప్పులు చేశాయి. సదరు అప్పులు మెక్కిన ప్రవేటు
కంపెనీలు సంక్షోభం నుండి కోలుకున్నాయి. కాని వాటికోసం చేసిన అప్పులను
ప్రజలనుండి రాబట్టడానికి ప్రభుత్వాలు పూనుకున్నాయి. దాని ఫలితంగానే
ప్రజలపైన పొదుపు విధానాలను అమలు చేస్తున్నారు. అప్పులు తగ్గించుకుని
బడ్జెట్ లోటు తగ్గించాలని చెబుతూ ఉద్యోగాలు కత్తిరిస్తున్నారు. ప్రభుత్వ
రంగాన్ని ప్రవేటోళ్ళకు అమ్మేస్తున్నారు. ప్రభుత్వ, ప్రవేటు రంగాలు రెండూ
ఉద్యోగాలను రద్దు చేస్తున్నారు. బ్రిటన్ లో కూడా ఇవే విధానాలు అమలు
జరుగుతున్నాయి. నిరుద్యోగం పెరగడానికి ఇదే కారణం తప్ప వేరొకటి కాదు. యూరప్
రుణ సంక్షోభం అన్నది యూరప్ ప్రభుత్వాలు పైకి చూపుతున్న పెద్ద బూచి. ఆ
బూచికి కారణం కూడా ప్రభుత్వ విధానాలే. అది కనపడకుండా ఉండడానికి యూరప్
సంక్షోభమే సకల దరిద్రాలకు కారణంగా ఊదరగొడుతున్నారు. యూరప్ రుణ సంక్షోభం
ముందునుండీ పెరుగుతూ వస్తున్న నిరుద్యోగానికి సంక్షోభమే కారణంగా చూపుతూ
గుర్రం ముందు బండిని నిలబెడుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి