యూరో గ్రూపు రాజకీయ నాయకుడుగా ఉన్న లక్సెంబర్గ్ ప్రధాని జీన్-క్లాడ్ జంగర్ ఈ మేరకు పత్రికలకు సూచనలు ఇస్తున్నాడు. “గ్రీసు, యూరోజోన్ నుండి బైటికి వెళ్లదలుకున్నట్లయితే దాని ప్రభావం ఇతర యూరోజోన్ దేశాలపై పడకుండా ఉండడం అవసరం” అని జంకర్ గురువారం జెడ్.డి.ఎఫ్ అనే జర్మనీ టెలివిజన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. యూరోజోన్ లో కొనసాగాలనే తాము బలంగా కోరుకుంటున్నామనీ, కాని ఎటువంటి పరిస్ధితుల్లోనైనా కొనసాగాలని కోరుకోవడం లేదని జంకర్ ఇంటర్వ్యూలో తెలిపాడు.
అంతూపొంతూ కనపడని గ్రీసు రుణ సంక్షోభమే యూరోజోన్ విచ్ఛిన్నానికి తక్షణ కారణంగా చూపిస్తున్నారు. యూరో జోన్ లో ఉన్న ఇతర దేశాలు కూడా యూరో జోన్ సమస్యలకు గ్రీసు దేశమే కారణం అన్నట్లుగా మాట్లాడుతున్నాయి. కాని వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. యూరప్ దేశాల పెట్టుబడిదారీ వ్యవస్ధలలో సహజంగా ఉండే అంతర్గత వైరుధ్యాలు ఆ వ్యవస్ధలో అనేక ఆర్ధిక, రాజకీయ, సామాజిక సమస్యలకు ప్రాణం పోస్తాయి. ప్రధానంగా దశలవారీగా వచ్చే ఆర్ధిక సంక్షోభాలు పెట్టుబడిదారీ వ్యవస్ధలను అతలాకుతలం చేయడం చూస్తూనే ఉన్నాం.
పెట్టుబడిదారీ వ్యవస్ధలు పరిపక్వ స్ధితికి వచ్చే కొద్దీ సంక్షోభాలు బలంగా మారుతూ, ఆర్ధిక వ్యవస్ధలు వాటినుండి బైటికి రావడానికి మరింత దీర్ఘకాలం తీసుకుంటాయి. ఈ పరిస్ధితి పోను పోనూ మరింత క్లిష్టతరంగా మారుతుందే తప్ప, పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు ఆశిస్తున్నట్లు ఎప్పుడో ఒకప్పుడు పరిస్ధితులు వాటంతట అవే చక్కబడడం జరగని పని. ఇపుడు అమెరికా, యూరోజోన్ దేశాలలో నెలకొని ఉన్న తీవ్రమైన సంక్షోభ పరిస్ధితులే దానికి ప్రబల తార్కాణం.
అమెరికా నాయకత్వంలో నాటో సభ్య దేశాలుగా ఉన్న యూరప్ దేశాలు గత దశాబ్దకాలంగా రెండు దురాక్రమణ యుద్ధాలు సాగిస్తున్నాయి. యుద్ధాల కోసం విపరీతంగా అప్పులు తెచ్చి ఖర్చు పెట్టాయి. తమ తమ దేశాల్లో బడా ద్రవ్య కంపెనీలు ఆడిందే ఆటగా ఆర్ధిక విధానాలను అమలు చేస్తూ సంపదలను ధనికవర్గాలవారికే దోచి పెట్టడానికి వీలుగా ఆర్ధిక విధానాలు చేపట్టడంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి అధికోత్పత్తి సంక్షోభం పెట్టుబడిదారీ ప్రపంచాన్ని చుట్టుముట్టింది. రెండు దురాక్రమణ యుద్ధాలు, డాట్ కాం సంక్షోభం లాంటి ఆర్ధిక సంక్షోభాలతో పాటు కనీ వినీ ఎరుగని స్ధాయిలో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం అమెరికా, యూరప్ లను బలహీనపరిచాయి.
ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దరిమిలా పంచిన బెయిలౌట్లు, యుద్ధ భీభత్సం మోపిన అప్పులు అన్నింటినీ ప్రజలపైనే మోపుతూ యూరప్, అమెరికాలలో పొదుపు ఆర్ధిక విధానాలకు తెరతీసారు. గ్రీసు బడ్జెట్ లోటును సాకుగా చూపి ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ శక్తియుక్తులపై అనుమానాలు తలెత్తేలా యూరప్ ప్రభుత్వాలు, రేటింగ్ సంస్ధలు చేసిన ప్రకటనలతో గ్రీసుకు అప్పు పుట్టడం కష్టంగా మారింది. గ్రీసుకి అప్పు పుట్టనట్లయితే ప్రధానంగా నష్టపోయేది ఫ్రాన్సు, జర్మనీ, బ్రిటన్, స్పెయిన్ లాంటి దేశాలలోని బడా బహుళజాతి బ్యాంకులే. తమ బ్యాంకులు గ్రీసుకు పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చి ఉన్నందున గ్రీసు అప్పు చెల్లించలేక దివాలా తీస్తే ఆ ప్రభావం తమ బ్యాంకులపైనా, తద్వారా తమ మొత్తం ఆర్ధిక వ్యవస్ధలపైనా పడుతుందని ప్రారంభంలోనే యూరోజోన్ దేశాలు పసిగట్టాయి.
తమ బ్యాంకులను, ఇన్సూరెన్సు సంస్ధలను, ఇతర ద్రవ్య సంస్ధలను కాపాడుకోవడానికి తామే గ్రీసుకి అప్పు ఇవ్వడానికి ఇ.యు దేశాలు సిద్ధపడ్డాయి. దానికి ఐ.ఎం.ఎఫ్ ను తోడు తెచ్చుకున్నారు. ఆ విధంగా ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు కలిసి మొదట గ్రీసుకు, ఆ తర్వాత ఐర్లండు, పోర్చుగల్ లకు బెయిలౌట్ ప్యాకేజి ఇచ్చాయి. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఇచ్చిన బెయిలౌట్ ప్యాకేజీలో అధికభాగం తమ తమ బ్యాంకులకు చెల్లించేలా గ్రీసుపైన షరతులు విధించి అమలు చేయించాయి.
గత సంవత్సర కాలంగా గ్రీసుకి ఇచ్చిన బెయిలౌట్లు ఇతర ఇ.యు దేశాల బ్యాంకులకు వినియోగించడంతో అవి గ్రీసునుండి చాలావరకూ తమ బకాయిలను రాబట్టుకున్నాయి. ఇక గ్రీసుకి బెయిలౌట్లు ఇవ్వాల్సిన అవసరం యూరోప్ దేశాలకు లేకపోయింది. ఫలితంగానే గ్రీసు అప్పు చెల్లింపులు చేయలేక డిఫాల్టు అయినా ఫర్వాలేదు అనే ధోరణిలోకి ఇ.యు దేశాలు వచ్చేశాయి. డిఫాల్టు అవడమే కాక యూరోజోన్ నుండి గ్రీసు బైటికి వెళ్ళినా ఇ.యులోని ప్రధాన దేశాలైన జర్మనీ, ఫ్రాన్సు, ఇంగ్లండు మొదలైన దేశాలు పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. అందువల్లనె ఇప్పుడు ధైర్యంగా గ్రీసు ఇక దయచేయడమే మంచిది అని పరోక్ష ప్రకటనలను ఇ.యు అధికారులు, నాయకులు మొదలుపెట్టారు.
ఇప్పుడిక గ్రీసుని ఎంత త్వరగా వదిలించుకుందామా అని ఇ.యు దేశాలు చూస్తున్నాయి. ఈ పధకంలో గ్రీసు ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉండడమే అసలు విషాధం. గ్రీసు ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉంది కనుకనే గ్రీసు ప్రధాని పపాండ్రూ ఇంతకు ముందు లేని విధంగా గ్రీసు కోసం ఇ.యు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై గ్రీసు ప్రజల్లో రిఫరెండం నిర్వహిస్తానని ప్రకటించాడు. గత రెండు సంవత్సరాల నుండి ఇ.యు దేశాలు అనేక విడతలుగా గ్రీసు పైన పొదుపు విధానాలను అమలు చేసాయి. వేతనాల కోత, సదుపాయాల రద్దు, ప్రభుత్వరంగ ప్రవేటీకరణ, పన్నుల పెంపు, సబ్సిడీల రద్దు లాంటి విధానాలను గ్రీసు ప్రభుత్వం అమలు చేసినా అప్పుడెప్పుడూ గ్రీసు ప్రజల అనుమతి తీసుకుందామన్న ఆలోచన వారికి రాలేదు.
ఇప్పుడిక ఇ.యు దేశాల బ్యాంకులు, ఇతర ద్రవ్య సంస్ధలు గ్రీసు నుండి రాబట్టవలసింది ఏమీ లేదని నిర్ధారణ అయ్యింది కనుక గ్రీసును యూరోజోన్ నుండి సాగనంపవలసిన అవసరం ఉంది. అది నెరవేరడానికే గ్రీసు ప్రధాని కొద్ది రోజుల క్రితం గ్రీసు కోసం ఇ.యు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందంపైన రిఫరెండం జరుపుతానని ప్రకటించాడు. ఆ రిఫరెండంలో గ్రీసు, యూరోజోన్ లో ఉండాలా లేదో కూడా నిర్ణయించాలని యూరో గ్రూపు నాయకుడు జీన్-క్లాడ్ జంకర్ కోరుతున్నాడు. డిసెంబరు 4 వ తేదీన రిఫరెండం జరగనుంది. యూరోజోన్ లో గ్రీసు కొనసాగేందుకు అందులో ఎలాగూ అంగీకరించరు. గత రెండు సంవత్సరాలుగా ఇ.యు కూటమి బలవంతంగా గ్రీసు ప్రజలపై అమలు చేసిన ఆర్ధిక విధానాలు అలా ఉన్నాయి మరి. కనుక గ్రీసు, యూరోజోన్ వదిలిపోవడం ఇక లాంఛనప్రాయమే.
అయితే ఈ ప్రక్రియ గ్రీసుతోనే ఆగుతుందా? ఆగుతుందనే ఇ.యు దేశాలు భావిస్తున్నాయి. అందుకే ధైర్యంగా గ్రీసును సాగనంపే ప్రకటనలు చేస్తున్నాయి. కాని వారు అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగాలన్న రూలేమీ లేదు. ఈ సంక్షోభం ఇతర దేశాల ప్రజలను ప్రభావితం చెయ్యవచ్చు. తమ దేశం కూడా యూరోజోన్ నుండి బైటికి రావాలని ఆందోళనలు చెయ్యవచ్చు. అంటే యూరోను ఉమ్మడి కరెన్సీగా ఆమోదించడం ఆపి సొంత కరెన్సీని పునరుద్ధరించాలని డిమాండ్ చెయ్యవచ్చు. అలా చేస్తే తమ కష్టాలు తీరతాయని భావించితే ప్రభుత్వాలకు మరోదారి లేకపోతే ఇమ యూరోజోన్ పూర్తి స్దాయిలో విచ్ఛిన్నం అయ్యే అవకాశాలు లేకపోలేదు.
యూరోజోన్ విచ్ఛిన్నం అవడం అంటే ఇన్నాళ్లూ డాలర్ కు పోటీగా నిలిచిన యూరో కరెన్సీ బలహీనపడడమే. యూరో స్ధానాన్ని చైనా కరెన్సీ యువాన్ ఆక్రమించే అవకాశాలు కొద్దిగా కనిపిస్తున్నాయి. లేదా తిరిగి డాలర్ ఏకచ్ఛత్రాధిపత్యం పునరుద్ధరించబడవచ్చు. అయితే అమెరికా ఆర్ధిక వ్యవస్ధ సైతం బలహీనంగా ఉండడంతో దానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ప్రపంచ ఆర్ధిక రంగంలో కొన్ని పెద్ద పరిణామాలు చోటు చేసుకోనున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి