3, నవంబర్ 2011, గురువారం

ఆర్ధిక మాంద్యానికి (రిసెషన్) చేరువలో ఇంగ్లండు



యూరప్‌లో అతి పెద్ద ద్రవ్య మార్కెట్ కేంద్రంగా ప్రసిద్ధి చెందిన బ్రిటన్ ఆర్ధిక మాంద్యం కు చేరువలో ఉందన్న భయాలు వ్యాపిస్తున్నాయి. మూడో క్వార్టర్ (జులై, ఆగస్ఠు, సెప్టెంబరు)లో ఆర్ధిక వృద్ధి అనుకున్నదాని కంటె మెరుగ్గానే ఉన్నప్పటికీ నాలుగో క్వార్టర్ లో అది బాగా క్షీణించవచ్చని రాయిటర్స్ వార్తా సంస్ధ మంగళవారం విశ్లేషించింది. యూరోజోన్ రుణ సంక్షోభం ఇంకా శాంతించకపోవడంతో ఆ ప్రభావం బ్రిటన్ పై చూపుతున్నదని ఆ సంస్ధ విశ్లేషించింది.
మూడో క్వార్టర్ లో బ్రిటన్ జిడిపి 0.5 శాతం వృద్ధి చెందింది. అర శాతం జిడిపి వృద్ధినే అంచనాలకు మించి వృద్ధి చెందిందనీ, వృద్ధి బలంగా ఉందనీ వ్యాఖ్యానించడాన్ని బట్టి పశ్చిమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలు ఎటువంటి స్ధితిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. చైనా నమోదు చేస్తున్న 9.5 శాతం వృద్ధి, ఇండియా నమోదు చేసిన 7.6 శాతం వృద్ధిలతో పోలిస్తే ఇంగ్లండు వృద్ధి ఎక్కడో సుదూరాన ఉన్నప్పటికీ అర శాతం పెరుగుదలను సైతం శక్తివంతమైన వృద్ధిగా సంతోషపడవలసిన పరిస్ధితి దాపురించింది.
బడ్జెట్ లోటు తగ్గించే పేరుతో ప్రజలపై ప్రభుత్వం పెట్టే ఖర్చులో తీవ్రమైన కోతలను బ్రిటన్ కన్జర్వేటివ్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. దానితో వినియోగం తగ్గిపోయి ఉత్పత్తి తగ్గిపోవడంతో అది మొత్తంగా జిడిపి తగ్గిపోవడానికి దారి తీస్తోంది. అంటే బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ పొదుపు విధానాల వలన కుదించుకుపోతున్నది. రెండు క్వార్టర్ల పాటు వరుసగా నెగిటివ్ ఆర్ధిక వృద్ధి నమోదు చేసినట్లయితే ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యం (రిసెషన్) లోకి జారినట్లుగా పేర్కొంటారు.

మూడో క్వార్టర్ లో వృద్ధి శక్తివంతంగా ఉందని చెబుతున్నప్పటికీ అక్టోబరు నెలలో పారిశ్రామిక వృద్ధిని సూచించే పి.ఎం.ఐ సూచి బాగా పడిపోయిందనీ, జూన్ 2009 తర్వాత ఇంత తక్కువ నమోదు కావడం ఇదే ప్రధమమని తెలుస్తోంది. జూన్ 2009 లో బ్రిటన్ రిసెషన్ లో ఉండడం గమనార్హం. బ్రిటన్ రెండవ క్వార్టర్ (మే, జూన్, జులై) లో కేవలం 0.1 శాతం వృద్ధి చెందింది. జపాన్ భూకంపం, సునామీల వలన సరఫరా గొలుసు దెబ్బతినడం వలన ఆర్ధిక వృద్ధి పడిపోయిందని విశ్లేషకులు అప్పట్లో పేర్కొన్నారు. మళ్ళీ అదే రేటు నాలుగో క్వార్టర్ లో నమోదు కావచ్చని అనుమానిస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఇంగ్లండ్ సెంట్రల్ బ్యాంకు, తాజాగా కొత్త ‘క్వాంటిటేటివ్ ఈజింగ్’ పధకం మంజూరు చేయడానికి నిర్ణయించుకున్నట్లుగ తెలిసింది. 75 బిలియన్ పౌండ్ల మేరకు ఆర్ధిక వ్యవస్ధలో చొప్పించడానికి బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. యూరో సంక్షోభం బ్రిటన్ ను మాంద్యంలోకి నెట్టే అవకాశం ఉన్నందున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మార్కేట్ విశ్లేషకులు, కంపెనీలు బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరాయి.
యూరో జోన్ దేశాలు గత వారం గ్రీసు సంక్షోభంపై కుదుర్చుకున్న ఒప్పందాన్ని తమ దేశంలో రిఫరెండంకు పెడతామని ప్రభుత్వం ప్రకటించడంతో, అది ఆమోదం పొందుతుందో లేదో అన్న అనుమానంతో మార్కెట్లు పెద్దగా స్తంభించడం లేదని భావిస్తున్నారు. నిరుద్యోగం పదిహేడు నెలల గరిష్ట స్ధాయికి చేరుకోవడంతో ఉద్యోగ భద్రత పెద్ద సమస్యగా ముందుకొచ్చింది. పొదుపు చర్యలను ఆపాలని ప్రజలు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం వినే పరిష్దితిలేదు. బ్రిటన్ మాంద్యం తలెత్తినట్లయితే అది అక్కడితో ఆగబోదు. ప్రపంచంలో న్యూయార్క్ తర్వాత రెండో పెద్ద ద్రవ్య వ్యాపార కేంద్రంగా పేరొందిన లండన్ లో మాంద్యం ప్రపంచవ్యాపితంగా ప్రభావమ్ చూపక మానదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి