న్యూఢిల్లీ : Wed, 2 Nov 2011, IST
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ షూటర్ అభినవ్ బింద్రా ఇక నుంచి అధికారికంగా సైనిక దుస్తుల్లో కనిపించనున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ వికె సింగ్ మంగళవారం వారికి టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ ర్యాంక్‌ను ప్రదానం చేశారు. క్రికెట్‌లో ధోనీ, షూటింగ్‌లో అభినవ్ బింద్రా సాధించిన విజయాలకు గౌరవార్థం వారికి ఈ గౌరవ ర్యాంకులు ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సెప్టెంబర్ 13న ఆమోదం తెలిపారు. 2011 క్రికెట్ వరల్డ్ కప్ సాధించేలా జట్టును ముందుండి నడిపించడంలో, గతేడాది ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో జట్టును అగ్రస్థానానికి తీసుకెళ్లడంలో ధోనీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 2007లో జరిగిన టి20 వరల్డ్ కప్‌లో చాంపియన్‌గా జట్టును నిలపడంలో ధోనీ సఫలమైన విషయం తెలిసిందే. 2008లో బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్‌లో భారత్‌కు కేవలం ఒకే బహుమతి వచ్చింది. అదీ షూటింగ్‌లో బింద్రా బంగారు పతకం సాధించాడు. ఇప్పటికే సైన్యంలో గౌరవ ర్యాంక్‌లు సాధించిన క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ సరసన ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా చేరారు. కపిల్‌కు 2008లో టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్, 2010లో సచిన్‌కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్)లో గౌరవ గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ వచ్చాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి