6, నవంబర్ 2011, ఆదివారం

డబ్బులు చెట్లకు కాయడం లేదు, పెట్రోల్ రేట్లు పెంచాల్సిందే -ప్రధాని


ప్రధాని మన్మోహన్ మరొకసారి తాను ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకిననీ నిరూపించుకున్నాడు. తనకు కావలసిందల్లా కార్పొరేట్ల ప్రయోజనాలు వారి బాగోగులేననీ వారి ప్రయోజనాల కోసం ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదనీ తన వ్యాఖ్యల ద్వరా నిరూపించుకున్నాడు. పెట్రోల్ ధరలు ప్రభుత్వం నియంత్రించడానికి వీలు లేదనీ పెట్రోల్ ఉత్పత్తుల ధరలను మార్కెట్ లో ఉండే కంపెనీలే నిర్ణయించాలి తప్ప ప్రభుత్వం కాదనీ నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. ప్రస్తుతం ఫ్రాన్సులో కేన్స్ నగరంలో జరుగుతున్న జి20 సమావేశాలలో పాల్గొంటున్న ప్రధాని అక్కడే ఈ ప్రకటన చేశాడు.
ప్రధాని మన్మోహన్ ఇంతవరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని గెలిచింది లేదు. ప్రజలతో సంబంధాలు ఉన్న జీవితం గడిపిందీ లేదు. అటువంటి వ్యక్తి గనకనే ప్రధాని మన్మోహన్ ప్రజల సమస్యల గురించి ఎకసక్కెంగా, హేళనగా మాట్లాడగలుగుతున్నాడు. పెట్రోల్ ధరల్ని పెంచే హక్కు కంపెనీలకు ఉండాలని గట్టిగా చెబుతున్న ప్రధాని ప్రజలకు ఉన్న హక్కుల గురించి ఏనాడూ మాట్లాడలేదు. ఎంతసేపటికీ రెండంకెల జిడిపి వృద్ధి రేటు, బడ్జెట్ లోటు, ప్రవేటీకరణ, కంపెనీలపై నియంత్రణల ఎత్తివేత, కంపెనీలకు విద్యుత్, పన్నుల రాయితీలు… ఇవే ప్రధానికి ఆసక్తికరమైన చర్యలు తప్ప ప్రజల బాగోగులు ఆయనకు పట్టదు. ఆయన దృష్టిలో ప్రజలు అంటే ధనికులు, కార్పొరేట్ కంపెనీలు, స్వదేశీ, విదేశీ బహుళజాతి సంస్ధలు, బడా పెట్టుబడిదారులు, భూస్వాములూ… వీళ్ళే.
“ఆయిల్ సబ్సిడీలు ప్రభుత్వాలు భరించకూడదు. మార్కెట్ లో కంపెనీల వ్యాపారాల అవసరాల ప్రకారం పెట్రోల్ తదితర ఆయిల్ ఉత్పత్తుల ధరలు మార్పు చెందవలసిందే. సబ్సిడీలు భరించడానికి డబ్బులు చెట్లకు కాయడం లేదు” అని ప్రధాని మన్మోహన్ భారత దేశంలో కోట్లాదిగా గల పేద, మధ్య తరగతి ప్రజానీకాన్ని హేళన చేస్తున్నాడు. అది కూడా జి20 సమావేశాల కోసం పరాయి దేశానికి వెళ్ళి అక్కడినుండే భారత దేశ ప్రజల జీవన స్ధాయిని పరోక్షంగా హేళన చేశాడు. డబ్బులు చెట్లకు కాయడం లేదు, పెట్రోల్ రేట్లు మొత్తం ప్రజలే చెల్లించాలి అని చెప్పడం అంటే అది అధిక ధరలు చెల్లించలేని పేద, మధ్య తరగతి ప్రజలను పరోక్షంగా ఎకసక్కేం చేసినట్లే.
సబ్సిడీలు భరించడానికి డబ్బులు చెట్లకు కాయకపోతే, మరి కంపెనీలకు పన్నులు రాయితీలు ఇవ్వడానికి ఏ చెట్టుకు డబ్బులు కాస్తున్నాయో ప్రధాని చెప్పవలసి ఉంది. ఎగుమతులు తగ్గితే జిడిపి వృద్ధి రేటు తగ్గుతుంది కనుక ఎగుమతులకు ప్రోత్సాహకాలుగా పలు రాయితీలు కంపెనీలకు ఇస్తున్నారు. సెజ్ లు నెలకొల్పి రైతుల దగ్గర్నుండి భూములు లాక్కొని కంపెనీలకు కారు చౌకకు అప్పజెపుతున్నారు. అడవుల్ని నాశనం చేస్తూ ప్రజా వనరులైన గనుల్ని స్వదేశీ, విదేశీ కంపెనీలకు అప్పజెపుతున్నారు. రైతుల భూముల్ని లాక్కుని కనీస నష్టపరిహారం చెల్లించకుండా ప్రవేటు కంపెనీలకు ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ ఎవడబ్బు సొమ్మని ప్రధాని మన్మోహన్ ప్రవేటు దొంగలకు ఇస్తున్నాడో చెప్పవలసి ఉంది.
సబ్సిడీలు ఇచ్చినా, పన్నుల రాయితీలు ఇచ్చినా, ఎగుమతి ప్రోత్సాహకాలు ఇచ్చినా అన్నీ ప్రజలనుంది వసూలు చేసిన పన్నుల ఆదాయం తప్ప బడా కార్పొరేట్ కంపెనీలకు పన్నులు చెల్లించే అలవాటు ఎక్కడైనా ఉన్నదా? ఎంత సేపటికీ ప్రభుత్వం (అంటే ప్రజలు) నుండి ఎన్ని వందల, వేల కోట్ల రాయితీలు వస్తాయా, ఏ పన్నులు ఎగవేసి సొమ్ము మిగుల్చుకుని స్విస్ ఖాతాలకు తరలిద్దామా అని ఆలోచించే కంపెనీలే తప్ప ప్రజల పట్లా దేశం పట్లా బాధ్యతగా వ్యవరించే ధనికులు, వ్యాపారులు, కంపెనీలు ఎన్నడైనా చూశామా? ఏ అడవికి డబ్బులు కాశాయని లక్షా డెబ్భై వేల కోట్ల రూపాయల స్పెక్ట్రం సొమ్ముని టెలికం కంపెనీలకి దోచి పెట్టారు? రాజా, కనిమొళి, మారన్ లాంటి వాళ్ళు లక్షల కోట్ల ధనం కంపెనీలకు దోచిపెడుతూ, కమిషన్లు మేస్తుంటే ముంగిలాగా నోరు కట్టేసుకుని కూర్చున్న మన్మోహన్ ప్రజల జీవనస్ధాయిని ఎగతాళి చేయడం సహించరాని విషయం.
అరవై సంవత్సరాలనుండి ఈ కంపెనీలు, భూస్వాములు, ధనవంతుల జాతి ఈ దేశాన్ని పాలించి కోట్ల కోట్ల సొమ్ముని స్విస్ బ్యాంకులకు తరలించుకెళ్తే ఏ చెట్లకి కాస్తే తరలించుకెళ్ళినట్లు? స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్నవారి పేర్లు ప్రజలకు వెల్లడించమని అడుగుతుంటె ప్రధానితో సహా ఎందుకు నిరాకరిస్తున్నారు? ఏ చెట్లకు కాసాయని వారి దోపిడీని కప్పిపుచ్చుతున్నారు? కామన్ వెల్త్ కుంభకోణం, ఆదర్శ్ కుంభకోణం, మైనింగ్ కుంభకోణాలు ఇవన్నీ జరుగుతున్నపుడు ప్రధాని “డబ్బులు చెట్లకు కాయడం లేదు” అని చెప్పగలిగాడా?
ప్రజా సొమ్ముని కార్పొరేట్లకు దోచిపెడుతూ, తమ సొమ్ము తమకు ఇమ్మని అడుగుతున్న ప్రజానీకాన్ని ఎగతాళి చేస్తున్న ప్రధాని మన్మోహన్ ఎంత త్వరగా ప్రధాని పదవి నుండి తొలగిస్తే ఈ దేశ ప్రజలకు అంత మంచిది.

1 కామెంట్‌:

  1. మీ వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను.1.P.M.కార్పొరేట్ రంగానికి విశ్వాసపాత్రుడు.2.చమురు ప్రాడక్టులపై పన్నుల వల్లనే ధర జాస్తి.పన్నులు తగ్గించాలి.3.ముడిచమురు ఎంతకు కొంటున్నారు,రెఫైన్ చెయ్యడానికి ఎంత, రవాణాకి ఎంత అవుతుంది లెక్కలు చెప్పరు.4.డాలర్ సంక్షోభం లో ఉంటే రూపాయి విలువ హెచ్చాలి గాని ఎందుకు తగ్గిస్తున్నారు?5 .కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతివల్ల ఎప్పుడూ ధరలు పెరుగుతూనే ఉంటాయి.

    రిప్లయితొలగించండి