మాజీ
రాష్ట్రపతి అబ్దుల్ కలాం తనకు మాలిన ధర్మాన్ని నెత్తిన వేసుకున్నట్లు
కనిపిస్తోంది. తమిళనాడులోని కుదంకుళం అణు విద్యుత్ కర్మాగారానికి మద్దతుగా
ప్రకటనలు జారీ చేస్తూ ఆయన, ప్రముఖంగా వార్తలలో నిలుస్తున్నాడు. ఆదివారం
ఏకంగా కుదంకుళం ప్లాంటు సందర్శించి ప్రభుత్వం తరపునా, కంపెనీ తరపునా
వకాల్తా పుచ్చుకుని ప్లాంటులో భద్రతా ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని
సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు.
కుదంకుళం
అణు విద్యుత్ కేంద్రం లో భద్రతా ఏర్పాట్లపైన ఏర్పడిన భయాలను పారద్రోలే
పనిలో అబ్దుల్ కలాం బిజిగా ఉన్నాడు. ‘ప్లాంటు పూర్తిగా భద్రత కలిగి ఉంది’
అని ఆదివారం ప్లాంటు సందర్శించాక ప్రకటన జారీ చేశాడు. తక్కువ భూకంప స్ధాయి
కలిగి ఉన్న ప్రాంతంలో ప్లాంటు ఉన్నదని అబ్దుల్ కలాం చెబుతున్నాడు. కాని ఆయన
అభిప్రాయాన్ని స్ధానికులు కొట్టిపారేస్తున్నారు. ఎవ్వరు ఎన్ని చెప్పినా
ప్లాంటు నెలకొల్పడానికి అనుమతించేది లేదని దృఢంగా చెబుతున్నారు. ఆ మేరకు
కుదంకుళంలో ఆదివారం పెద్ద ప్రదర్శన నిర్వహించారు.
“ప్లాంటుకు
సంబంధించి భద్రత విషయంలో అందోళన అనవసరం. తక్కువ భూకంప స్ధాయి ప్రాంతంలో
ప్లాంటు ఉంది. భూకంప కేంద్ర పాయింటు ప్లాంటుకు 1300 కి.మీ దూరంలో ఉన్నందున
సునామీ వచ్చే అవకాశాలు కూడా లేవు. అదీ కాక అణు ప్లాంటు సముద్ర మట్టానికి
13.5 మీటర్ల ఎత్తులో ఉంది” అని కలాం తెలిపాడు. అబ్దుల్ కలాం, అణు విద్యుత్
వినియోగానికి గట్టి మద్దతుదారు. రు.13,600 కోట్ల విలువ గల ఇండో-రష్యన్
ప్రాజెక్టు నిర్మాణం ప్రజల ఆందోళనలతో అనిశ్చితిలో పడింది. మొదటి యూనిట్
ప్రారంభం డిసెంబరులో జరగవలసి ఉండగా అది సాధ్యమయ్యేట్లు కనిపించడం లేదని
అధికార్లు చెబుతున్నారు.
సమస్త
బద్రతా అంశాలను పరిగణలోకి తీసుకుని ప్లాంటు నిర్మిస్తున్నారని అబ్దుల్ కలాం
వివరిస్తున్నాడు. విద్యుత్ సరఫరా విఫలమయిన పక్షంలో కూలింగ్ వ్యవస్ధ
పనిచేయడం కొనసాగడానికి జనరేటర్ ఉన్నదనీ, జనరేటర్ పని చేయకపోయినా ఆటోమేటిక్
కూలింగ్ వ్యవస్ధ పని చేయడం ప్రారంభించే ఏర్పాట్లు ఉన్నాయనీ అబ్దుల్ కలాం
చెప్పాడు. లోపలా, బైటా కార్మికుల రక్షణ కొసం జంట గోడల రక్షణ ఏర్పాటు
ఉన్నదనీ, ప్లాంటునుండి వెలువడే అణు వ్యర్ధంలో 25 శాతం నిలవ చేయడానికి
నిర్మాణపరమైన భద్రతతో పాటు కంటెయినర్ కూడా ఉన్నదనీ ఆయన తెలిపాడు. ప్లాంటు
నెలకొల్పడం వలన పర్యావరణానికి హాని ఏమీ జరగదన్న నమ్మకం తనకు ఉందని
తెలిపాడు.
“అణు
పదార్ధం వేడి అయ్యాక మిగిలే ద్రవ వ్యర్ధం నెట్టివేయడానికి బాత్ టబ్ సౌకర్యం
ఉన్నది. రేడియేషన్ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి బాత్ టబ్ లో ఒక ద్రవ
పదార్ధం ఉంది. అసలు రేడియేషన్ అనేదే ఉండదు. లోపలా, బైటా పని చేసే
కార్మికులకు వంద శాతం భద్రత ఉంది” అని కలాం తెలిపాడు. అబ్దుల్ కలాం అణు
ప్లాంటు భద్రతా ఏర్పాట్ల భాద్యతను అంతా నెత్తిన వేసుకుని మాట్లాడాడు.
ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద కూడా భద్రతా ఏర్పాట్లన్నీ బాగా ఉన్నాయనీ,
వందశాతం భద్రత ఉన్నదనీ అది నడిచినన్నాళ్లూ భావిస్తూ వచ్చారు. భూకంపం,
సునామీల వల్ల కూడా భద్రత ఉందని వారు భావించారు. కాని వారి అంచనాలన్నింటిని
తలకిందులు చేస్తూ జరిగిన ప్రమాదం వల్లనే ఫుకుషిమా ప్రమాదం సంభవించింది.
కుదంకుళం వద్ద కూడా అనుకోని ప్రమాదం జరగదని గ్యారంటీ ఏమీ లేదు.
జపాన్ లో
భూకంపాలు సహజం. కనుక భూకంపం తట్టుకునేలా ప్లాంటు నిర్మించారు. సునామీని
తట్టుకోవడానికి పది మీటర్ల ఎత్తున రక్షణ గోడ నిర్మించారు. కాని సునామి అలలు
ఇరవై మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. ఫుకుషిమా వద్ద విద్యుత్ సరఫారా
విఫలమైతే అటోమేటిక్ గా ప్రారంభం అయ్యే జనరేటర్లు ఉన్నాయి. భూకంపం వచ్చిన
వెంటనే ప్లాంటు పని చెయకుండా ఆగిపొయ్యే ఏర్పాట్లు ఉన్నాయి అయినా పెద్ద
ప్రమాదం సంభవించింది. సునామీ అలల ద్వారా వచ్చిన సముద్రనీటిలో జనరేటర్లు
నిండా మునిగిపోవడంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడలేదు. దానితో కూలింగ్
వ్యవస్ధ పని చేయడం మానేసింది. ఫలితంగా రియాక్టర్లలో ఇంధనం వేడెక్కి
కరిగిపోయి బైటికి లీకు కావడంతో పెద్ద ఎత్తున రేడియేషన్ వాతావరణంలోకి
విడుదలయ్యింది.
కుదంకుళం
వద్ద ఏ కారణం వల్లనైనా విద్యుత్ సరఫరా ఆగిపోతే జనరేటర్లు ఉన్నాయని కలాం
తెలిపాడు. జనరేటర్లు మహా అయితే కొద్ది కొద్ది గంటలపాటు మాత్రమే విద్యుత్
అందిస్తాయి తప్ప నిరంతరాయంగా సూదీర్ఘకాలం పాటు విద్యుత్ అందించలేవు. ఆ
తర్వాత ఏమిటన్నదీ సమాధానం లెదు. జనరేటర్లు పని చెయ్యకపోయినా ఆటోమేటిక్ గా
కూలింగ్ వ్యవస్ధ పని చేసే ఏర్పాట్లు ఉన్నాయని కలాం చెబుతున్నాడు. ఆ
ఏర్పాట్లు ఏమిటన్నదీ కలాం వివరించలేదు. అసలు విద్యుత్ లేకుండా కూలింగ్
వ్యవస్ధ ఎలా పనిచేసేదీ ఊహకు అందని విషయం. అదేమిటో వివరించవలసిన బాధ్యతను
కలాం తీసుకున్నట్లు లేదు.
“అంతా
సవ్యంగా ఉంది” అని భరోసా ఇవ్వడం వేరు, నిజంగానే అంతా సవ్యంగా ఉండడం వేరు
అని ఫుకుషిమా ప్రమాదం తెలియజెప్పింది. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంటును పని
చేయకుండా చేసి, పూడ్చిపెట్టి, పరిసరాలు శుభ్రం చేయడానికి 30 సంవత్సరాలు
పడుతుందని జపాన్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. కుదంకుళం
వద్ద సైతం అనుకోని ప్రమాదాలు సంభవించవన్న గ్యారంటీ లేదు. అటువంటి
గ్యారంటీలు ఇవ్వలేకనే జర్మనీ ప్రభుత్వం పూర్తిగా అణు విద్యుత్ వినియోగానికి
స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది.
నిజానికి,
ఇంకా కొత్త అణు కర్మాగారాలు నిర్మించాలనీ, పాత అణు కర్మాగారాల జీవితకాలం
మరో పదేళ్లపాటు పొడిగించాలనీ జర్మనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోగా
ఫుకుషిమా ప్రమాదం సంభవించడంతో ఉన్నపళంగ తన పధకాలూ, నిర్ణయాలన్నింటినీ
జర్మనీ ప్రభుత్వం రద్దు చేసుకుంది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో
ముందంజ సాధించిన జర్మనీయే అణు విద్యుత్ వల్ల ప్రమాదం లేదని గ్యారంటీ
ఇవ్వలేక అణు వినియోగాన్నే రద్దు చేసుకోగా, అంతకంటే మెరుగైన వ్యవస్ధలు
ఇండియా వద్ద ఉన్నాయని భావించగలమా?
పాలకవర్గాలను
అణు విద్యుత్ కర్మాగారం నిర్మాణం అంటే అణు రియాక్టర్లు తయారు చేసే బడా
బహుళజాతి సంస్ధలకు కాంట్రాక్టులు ఇవ్వడం, ఆ కాంట్రాక్టుల ద్వారా వచ్చే
కమీషన్లను జేబులో వేసుకోవడమే తప్ప దానివల్ల ప్రజలకు విద్యుత్ వస్తుందన్న
ఆలోచన వారికి లేదు. ప్రజల ప్రయోజనాల కోసమే అయితే ఆ ప్రజలకు నచ్చజెప్పిన
తర్వాత మాత్రమే అణు ప్లాంటును పని చేయించడం ప్రారంభించవలసి ఉంటుంది. అంతా
సవ్యంగ ఉందని ప్రకటనలు ఇవ్వడం కాక, ఎలా సవ్యంగా ఉన్నదీ చెప్పాలి. గతంలో
ప్రమాదాలు ఎందుకు సంభవించిందీ, ఆ ప్రమాదాలు ఇక్కడ సంభవించే అవకాశం ఎందుకు
లేదో ప్రజలకు వివరించాలి. ఆ తర్వాతే అణు ప్లాంటు ప్రారంభించాలి. అదేమీ
లేకుండా కలాం లాంటివారిని తెచ్చి అంతా బాగానే ఉంది అని చెప్పించడం
ప్రభుత్వాని తగినది కాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి