6, నవంబర్ 2011, ఆదివారం

సకల జనుల సమ్మె విజయమా? వైఫల్యమా?


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం తెలంగాణ రాజకీయ జెఎసి నెలరోజులకు పైగా నిర్వహిస్తున్న సకలజనుల సమ్మె విజయవంతం అయినట్లా? విఫలమైనట్లా? ఈ ప్రశ్నకు ఎవరికి కావాల్సిన సమాధానం వారు చెప్పుకోవచ్చు. సమ్మె విజయవంతం అయిందని తెలంగాణ ఉద్యమ నేతలు ప్రకటిస్తున్నారు. ఒకరకంగా చూస్తే సమ్మె విజయవంతం అయినట్లు తెలంగాణ ఎన్.జీ.ఓలంతా సమ్మెలోకి వచ్చారు. సింగరేణి కార్మికులు, టీచర్లు, విద్యాసంస్థలు ఆయా రంగాలకు చెందిన ఉద్యోగులు, చివరికి ఎక్సైజ్ ఉద్యోగులు సైతం సమ్మెలో పాల్గొన్నారు. అంతవరకు కచ్చితంగా విజయం కిందే తీసుకోవాలి. అంతేకాదు. అసలే నష్టాలలో ఉన్న ఆర్టీసిని మరింత కష్టాలలోకి నెట్టడంలో విజయవంతం అయినట్లే లెక్క. అదే సమయంలో ప్రైవేటు వాహనాల పంట పండింది.విజయవాడ హైవే మినహాయించి మిగిలిన ప్రాంతాలకు అవి ఇబ్బంది లేకుండా నడిచాయి. ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేశారు. హైదరాబాద్ నగరంలో సిటీ బస్ లు లేకుండా చేశారు. తద్వారా ఆటోలు, క్యాబ్ లు వంటివి రేట్లు పెంచి వాహనాలు నడిపారు.సింగరేణి బొగ్గు సరఫరా లేక వేలాది రైతులు తమ పంటలు ఎండబెట్టుకోవలసి వచ్చింది. ఇక విద్యార్ధులు చదువులు లేకుండా ఇళ్లకే పరిమితం అయ్యారు.సమ్మెను స్వచ్చందంగా చేసినవారు ఉన్నారు. భయపడి చేసినవారూ ఉన్నారు. ఏది ఏమైనా సమ్మె జరిగింది. కాని ఎవరికి ప్రయోజనం కలిగింది.సకల జనుల సమ్మెలో అందరూ పాల్గొనడం వల్ల, రైల్ రకోను నిర్వహించడం ద్వారా తెలంగాణ సమస్య తీవ్రతను ,ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లగలిగామని ఉద్యమ నేతలు వాదిస్తున్నారు. ఇందులో కొంత వాస్తవం ఉంది. అయితే ఉద్యోగ సంఘాలు ఒక రాజకీయ అంశంపై సమ్మెలకు దిగితే అవి పరిష్కారం అవుతాయన్న నమ్మకం లేదని గత అనుభవాలు చెబుతున్నా ,తెలంగాణ నేతలు ఈ బ్రహ్మాస్త్రాన్ని వదిలారు. లక్షల సంఖ్యలో ఉన్న వీరు సమ్మె చేశారు కాని, ఆ తర్వాత నెల పూర్తి అయ్యేసరికి ఒక్కక్కరుగా సమ్మెను ఏదో కారణంగా విరమించుకోక తప్పని స్థితి ఏర్పడింది. తెలంగాణ వచ్చేవరకు సమ్మె చేస్తామని ప్రకటించిన కార్మిక నేతలు , ప్రభుత్వంతో చర్చలకు వెళ్లి, తక్షణం తమ ఉద్యోగులకు అడ్వాన్సులు ఇప్పించుకోవడానికి, ఇతర ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి తంటాలు పడ్డారు. ఆర్గనైజ్ డ్ సెక్టార్ లో ఉన్న వీరు సమ్మె చేసినా ఏదో రూపంగా ప్రభుత్వం నుంచి
తమకు కావలసిన డబ్బు సంపాదించుకున్నారు.బాగానే ఉంది. మరి అసంఘటిత రంగంలో ఉన్న లక్షలాది మంది రైతులకుకాని, ఉపాధి దొరకకుండా పోయిన కార్మికులకు కాని అడ్వాన్స్ లు ఎవరు ఇస్తున్నారు?ఇక్కడ విషాదం ఏమిటంటే ఇలా జరుగుతుందని తెలిసి కూడా ఉద్యమ నేతలు కె.చంద్రశేఖరరావు, కోదండరామ్ గాని ఎందుకు తెలంగాణ సమాజాన్ని ఇంతగా యాతన పెట్టారని ప్రశ్నిస్తే సమాధానం దొరకడం కష్టం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చేయడం తప్పు కాదు.అలాగే సమ్మెలను ప్రకటించడం ఆక్షేపణ కాదు.కాని ఇక్కడ మానవీయ కోణం లోపించడం వల్లనే ఉద్యమం దెబ్బతిందనిపిస్తుంది.ఉద్యమాలలో మానవీయ కోణాలు ఉండవని ఎవరైనా వాదించవచ్చు. కాని మానవత్వంతో నడపని ఉద్యమాలేవీ ఎక్కువ సందర్భాలలో విజయవంతం కాలేదన్నది చరిత్ర చెబుతున్న సత్యం. అదెలాగో చూద్దాం. విద్యుత్ కోత కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని, కొన్ని రోజులు సింగరేణి కార్మికుల సమ్మె ను సడలించాలని చాలామంది కోరారు. కాని పట్టించుకోలేదు. చివరికి ఏమైంది. సింగరేణి కార్మిక సంఘాలు నామమాత్రంగా జెఎసికి చెప్పి సమ్మె విరమణపై వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. అదే కనుక ముందుగానే ఉద్యమ నేతలు కనుక రైతులకు, కార్మికులకు నష్టం వచ్చిందని చెప్పి, మనవాళ్లకు నష్టం వచ్చేలా చేసుకుంటే మనకు ఏమి లాభం? అని భావించి ఉంటే ఎంత బాగుండేది. ఒక వారం రోజుల సమ్మె తర్వాత ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని విమర్శించి, తాము మానవత్వంతో ఆలోచించి రైతులకోసం సమ్మెను సడలిస్తున్నామని చెప్పి ఉంటే కోదండరామ్ కు గాని, కెసిఆర్ కు గాని ఎనలేని గౌరవం వచ్చి ఉండేది.అలా ఎందుకు చేయలేకపోయారో తెలియదు.ఇక విజయవాడ హైవే మీద బస్ లపై రాళ్లు విసిరి ప్రయాణికులను గాయపరిచితే , గంటల తరబడి బస్ లను ఆపి మహిళలను, వృద్దులను , పిల్లలను కూడా నరకయాతనలకు గురి చేస్తే పౌర హక్కుల కోసం వాదించిన వ్యక్తిగా కూడా ఉన్న కోదండరామ్ ఒక్కసారి అన్నా విచారం వ్యక్తం చేయలేదు. బస్ లపై రాళ్లు వేసేవారికే మానవహక్కులు ఉంటాయన్నట్లుగా, బస్ లలో ప్రయాణించేవారికి హక్కులు ఉండవన్నట్లుగా ఉద్యమ కారులు అమానుషంగా వ్యవహరించారు. ఇది కూడా లోపంగానే కనిపిస్తుంది. ఉద్యమకారులు బస్ లను ఆపదలిస్తే ఆపమనండి . కాని వారికి అవసరమైన కనీస సదుపాయాలు ఉండేలా చూడగలిగితే ఉద్యమం పట్ల ఎనలేని గౌరవం పెరిగేది. వారు ఒక ఆకాంక్ష కోసం చేస్తున్నదానికి మనం కూడా సహకరించాలన్న భావన అందరిలో మరింత కలిగేది. విద్యాసంస్థల విషయాన్ని చూడండి. విద్యాసంస్థలు మూత పడడం వల్ల వేలాది మంది తెలంగాణ పిల్లలు కోస్తా ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వచ్చింది. ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని చాలామంది ముందుగానే అటువైపు వెళ్లి విద్యాసంస్థలలో చేరారు.సమ్మె ఆరంభంకాగానే రెసిడెన్షియల్ సంస్థలు యధాతధంగా వారి పిల్లలను విజయవాడ, గుంటూరు వంటి పట్టణాలకు తరలించి అక్కడ పాఠాలు చెప్పాయి. అంతేకాదు. అనేక సంస్థలు చాటుమాటుగా తెల్లవారు జామున, సాయంత్రం వేళ క్లాసులు నిర్వహించాయి. కాని ప్రభుత్వ పాఠశాలలన్నీ మూతపడడంతో ఎవరు నష్టపోయారు? బడుగు,బలహీన వర్గాల, దళితుల పిల్లలు అధికంగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. రాజధాని నగరంలో పిల్లల తల్లిదండ్రులు ముఖ్యమంత్రిని కలిసినా, ఎమ్.ఆర్.పిఎస్. నేత మంద కృష్ణ మాదిగా ఏకంగా ధర్నా నిర్వహించినా ఎందుకు ఆదరణ లభించిందో ఉద్యమ నేతలు ఆలోచించాలి. కొందరు మహిళలతో పోటీగా తెలంగాణ వచ్చేవరకు బడులు పనిచేయక్కర్లేదని కొందరు మేధావుల సమక్షంలో చెప్పించి ఉండవచ్చు. కాని అందులో వాస్తవిక లేదని ఆ తర్వాత రెండు రోజులలోనే తేలిపోయింది. అదే కొన్ని రోజులు సమ్మె చేసిన తర్వాత మా పిల్లల భవిష్యత్తును మేమే చెడగొట్టుకుంటామా? ఉద్యమం చేస్తాం, పిల్లల చదువులను కాపాడుకుంటాం అని ఉద్యమ నేతలు చెప్పి ఉంటే తెలంగాణ సమాజం మరింతగా సంతోషపడే సందర్భం అయి ఉండేది.ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం తెలంగాణ సమాజాన్నే హింసించుకోనవసరం లేదు. ఎందుకంటే తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఎన్నోసార్లు వినపడింది. కనపడింది.ఆ సంగతి కేంద్ర నేతలకు తెలుసు. రాష్ట్ర నేతలకు తెలుసు. ఆ విషయంలో ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి అంతకన్నా బాగా తెలుసు. కాని ఉద్యమం ద్వారా రాజకీయంగా బలపడాలన్న లక్ష్యంతో ఆ పార్టీ వ్యూహరచన చేసింది. దానివల్లనే ఇన్ని సమస్యలు వచ్చాయని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. నేతలు చాలామంది పైకి సకల జనుల సమ్మెకు మద్దతు ఇస్తున్నామని చెబుతూనే , ప్రజల కష్ట నష్టాలను ఏకరువు పెడుతూ వచ్చారు. ఎందుకంటే సమ్మె వద్దని చెబితే ఓట్లు రాకుండా పోతాయేమోనన్న భయం వారిది.నిజానికి సకల జనుల సమ్మె అన్న కొత్త పేరును కనిపెట్టిన తీరు బాగానే ఉంది.కాని దాని అమలు చేసే విధానమే సరిగా లేదు. సకల జనులు అంటే ఎవరో ముందుగా నిర్వచించి ఉండాలి.తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు సమ్మె చేస్తారన్నంతగా ప్రచారం చేశారు. కాని అది సాధ్యం కాదు. చివరికి ఎన్జీఓ నేతలే ఇది సకల ఉద్యోగుల సమ్మెగా మారిందని చెప్పారు. రాజకీయ నేతలు ఉదయం వేళ గంట సేపు ధర్నా చేసి, సాయంత్రం తమ వ్యాపారాలు చేసుకున్నారని ఆరోపించారు. ఇది ఎవరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలో కూడా వారు చెబితే బాగుండేది.ఇక్కడ ఉద్యోగుల సంఘాలు కూడా ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే టప్పడు , ప్రతి ఉద్యోగి అభిప్రాయాన్ని ముందుగానే తీసుకుని నూటికి డెబ్బైశాతం లేదా అంతకన్నా ఎక్కువమంది కనుక సమ్మెకు అనుకూలంగా ఉంటేనే సమ్మెలోకి వెళ్లాలన్న నిబంధన పెట్టుకోకపోతే , నాయకుల ఇష్టాఇష్టాలకు ఉద్యోగులు బలి కావలసి వస్తున్నదన్నఅభిప్రాయం కలుగుతుంది.నెల రోజుల క్రితం కెసిఆర్, కోదండరామ్ లకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడాలంటే భయపడే పరిస్థితి నుంచి ఎమ్.ఆర్.పి.ఎస్.కార్యకర్తలు కొందరు జెఎసి సమావేశం జరుగుతున్న చోటే వారికి వ్యతిరేకంగా దర్నా చేసి పరిస్థితి వచ్చిందంటేనే ఉద్యమం ఏ రూపంలోకి వెళుతున్నది అర్ధం చేసుకోవాలి.కేంద్రం రాష్ట్రం ఇస్తుందో లేదో తెలియదు. కోదండరామ్ చెప్పినట్లు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే దీనికి బాధ్యత వహించాలి. వారిని టార్గెట్ చేసుకుంటామని కోదండరామ్ ప్రకటించడం కూడా సమంజసమే. కాని ఇంతకాలం తెలంగాణ సమాజం ఎదుర్కున్న కష్టనష్టాలకు కోదండరామ్, కెసిఆర్ లే బాధ్యులని ఎవరైనా విమర్శిస్తే దానికి కూడా వీరు జవాబు చెప్పుకోవలసిందే.కొంతమంది నేతలు అరవై ఏళ్లుగా పడిన కష్టాలు, జీవితాలు నాశనమైపోయాయి.. అంటూ పడికట్టు నినాదాలు ఇస్తూ జనాన్ని ఆకట్టుకోవచ్చనుకుంటున్నారు.అది ఎల్ల కాలం సాధ్యం కాదని,నినాదాలు ఇవ్వడంలో ఇంతకన్నా సిద్దహస్త పార్టీలుగా ఉన్న కమ్యూనిస్టు పార్టీల అనుభవం ఆ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. తెలంగాణ సకల జనుల సమ్మె తప్పు కాదు. కాని ఎప్పుడు వస్తుందో తెలియని తెలంగాణ ప్రకటన రేపో,మాపో వచ్చేస్తుందన్న చందంగా ప్రకటనలు చేసి ఉద్యోగులను సమ్మెలలోకి దించి, చివరికి వారు విరమించుకుంటుంటే చూస్తూ ఊరుకోవలసిన నిస్సహాయ స్థితిలో పడడం ఉద్యమ నేతల వైఫల్యం కాదని అనగలమా?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి