పెళ్ళి, హనీ మూన్, విడాకులు ఇవన్నీ డబ్బు వదిలించే పనులు. కానీ ఇది మనలాంటి మామూలు మనుషులకు. సెలబ్రిటీలు, పేజ్-3 జీవులు కొందరు ఉంటారు. వారికి ఇవన్నీ డబ్బులు పుట్టించే వ్యవహారాలు. వాళ్ళు పెళ్ళి గురించి ప్రకటన చేస్తే డబ్బు, పెళ్ళి చేసుకుంటే డబ్బు, హనీ మూన్‌కి వెళ్తే డబ్బు, చివరికి విడాకులు తీసుకున్నా డబ్బే. అమెరికాలో కిమ్ కర్డాషియాన్ అన్న టీవీ రియాలిటీ షో యాక్టర్, మోడల్, అడపా దడపా నటి ఈ విషయాన్ని ఇటీవల నిజం చేసి చూపించింది.
31 సంవత్సరాల ఈ చిన్నది రెండు నెలల క్రితం క్రిస్ హంఫ్రీస్ అనే 26 సంవత్సరాల బాస్కెట్ బాల్ ఆటగాడిని పెళ్ళి చేసుకుంది. ఇది అతనికి మొదటి పెళ్ళి కాగా అమ్మడికి రెండవది.
పెళ్ళి గురీంచిన ప్రకటన తమ పత్రికలోనే రావడానికి ఒక పత్రిక అమ్మడికి మిలియన్ డాలర్లు ఇచ్చిందట. పెళ్ళి ఫోటోల ఎక్స్‌క్లూజివ్ రైట్స్ కోసం పీపుల్ అన్న పత్రిక ఒకటిన్నర మిలియన్లు అంటే అటూ ఇటూగా ఏడున్నర కోట్ల రూపాయలు, సమర్పించుకుంది. ఇక పెళ్ళి తంతు వీడియోని E!న్యూస్ చానల్ మరింత డబ్బు ఇచ్చుకొని కొనుక్కుంది. పెళ్ళికి వచ్చిన బహుమతుల విలువ కూడా కోట్లలో ఉంటుంది.
హనీమూన్ కోసం ఇటలీలో ఒక ఖరీదైన రిసార్టుకి వెళ్ళి ఆ ఫోటోలని పత్రికలకి అమ్మి సొమ్ము చేసుకుంది.
చిలకా గోరింకల్లా పది వారాలు గడిపి సరిగ్గా 72 రోజులకి విడాకులు తీసుకున్నారు. విడాకుల వార్త బయటకి పొక్కగానే వీళ్ల పెళ్ళి వీడియో మళ్ళీ టెలికాస్టు చేసి E!న్యూస్ మళ్ళీ రేటింగులు పెంచుకుంది. పెళ్ళికి బహుమతులు సమర్పించుకున్న వాళ్ళు ఫీలవకూడదని ఓ రెండు లక్షల డాలర్లు చారిటీకి ఇస్తానని ప్రకటించింది ఈ కిమ్ ముద్దుగుమ్మ.
అయితే ఈ కర్డాషియన్‌ల గురించి బాగా తెలిసిన వాళ్ళు ఇదంతా డబ్బు కోసం ఈ చిన్నది ఆడుతున్న నాటకమని మధ్యలో ఈ మొగుడు పాత్ర వేసినవాడు ఫూల్ అయిపోయాడని అంటున్నారు.ఇప్పుడు ఈ విడాకుల వ్యవహారంలో ఇంకెంత డబ్బు పోగేస్తుందో ఈ చిన్నది అని అప్పుడే కొందరు లెక్కలేయడం ప్రారంభించారు.
అయితే ఈ
తొక్కలో పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అంతలా కోట్లు పోసి
కొనుక్కొని చూపించడం, అవి నోళ్ళు వెళ్ల బెట్టుకొని చూసే ప్రేక్షకులు ఉండడం
చూశాక మన టీవీ చానళ్లలో డైలీ సీరియళ్ళు చూసే వాళ్ల మీద నాకున్న దురభిప్రాయం
చాలా వరకూ తొలిగిపోయింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి