27, ఆగస్టు 2013, మంగళవారం

'భాగ్య'మే కీలకం - నీలయపాలెం విజయకుమార్


August 21, 2013

ఈ రోజు అనుభవించిన జీవనస్థాయి కంటే రానున్న రోజుల్లో అంత కంటే మంచి స్థితిని కావాలనుకోవడం సహజం, ధర్మం కూడా. ఒక మనిషికి వర్తించేది, ఒక రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది. మరి, రాష్ట్రాన్ని విడదీస్తున్న నేపథ్యంలో కొత్త రాష్ట్రంగా ఏర్పడబోతున్న ఆంధ్ర-రాయలసీమలు, ఇప్పటి జీవన శైలికి మించికాకపోయినా, కనీసం ఇప్పటి ఆర్థిక స్థితిని కొనసాగించగలవా? ఈ ప్రశ్నకు వెంటనే సానుకూల జవాబు రావడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 సంవత్సరానికి మన ఆదాయం ఒక లక్షా అరవై ఒక్క వేల కోట్లు. ఈ మొత్తాన్ని, మామూలుగా ఇప్పటివరకు పాటిస్తున్న జనాభా దామాషా(సీమాంధ్ర - 58 శాతం, తెలంగాణ - 42 శాతం)తో భాగిస్తే సీమాంధ్రకి 93.38 లక్షల కోట్లు, తెలంగాణకు 67.62 లక్షల కోట్లు వస్తుంది. ఇప్పటిదాకా రెండు ప్రాంతాలకు ఇదే నిష్పత్తిలో ఖర్చు పెట్టారా లేదా అనే విషయం పక్కన పెడితే సీమాంధ్ర రాష్ట్రానికి 93.38 లక్షల కోట్ల ఆదాయం రావడం కష్టంగానే కన్పిస్తోంది. రాష్ట్ర స్వంత ఆదాయంలో సగానికి పైగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచే వస్తున్నది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ని కేంద్రం నిర్వహణ పరంగా తెలంగాణకే ఇచ్చినా లేక ఇంతకు ముందు చెప్పినట్టుగా పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా చేసినా లేక ఒకవేళ కేంద్ర పాలిత ప్రాంతంగా చేసినా ఆర్థికంగా మాత్రం కనీసపక్షం పదేళ్ళు హైదరాబాదు ఆదాయాన్ని ఏర్పడే రెండు రాష్ట్రాలు ఏదో ఒక అంగీకార నిష్పత్తితో పంచుకొనక తప్పేట్లు లేదు. ఎందుకంటే గణాంకాలు చెప్పే సత్యం ఏమిటంటే హైదరాబాద్ రెండు రాష్ట్రాలకి ప్రాణ వాయువు అని.
ఇప్పటి ఉమ్మడి రాష్ట్ర బబ్జెట్ లక్షా అరవై ఒక్క వేల కోట్లు బ్రేకప్ చూస్తే రెవెన్యూ రాబడి లక్షా ఇరవై ఏడు వేల కోట్లుగా ఉంది. దీనిలో అమ్మకపు పన్ను వసూళ్లు 72,000 కోట్లు. కేంద్ర పన్నులలో వాటా 24,000 కోట్లు. పన్నేతర ఆదాయం 15,000 కోట్లు. కేంద్ర గ్రాంటులు 15,000 కోట్లు -మొత్తం వెరసి లక్షా ఇరవై ఏడు వేల కోట్లు. ఇది కాకుండా పెట్టుబడి వసూళ్ల కింద బహిరంగ మార్కెట్‌లో తీసుకొన్న రుణాలు 27,000 కోట్లుగా, ఇతర రుణాలు 8000 కోట్లుగా అంచనా వేశారు. ఇదీ స్థూలంగా లక్షా అరవై ఒక్క వేల కోట్ల మన రాష్ట్ర ఆర్థికం. రాష్ట్రం పూర్తిగా లక్షా అరవై ఒక్క వేల కోట్లు ఆదాయం ఆర్జించడం అనే విషయమై కొన్ని అనుమానాలు వున్నాయి. ప్రతిసారి దాదాపు 20వేల కోట్లు లోటు కనిపిస్తోంది. కానీ ఆదాయం తగ్గినా శాతాల్లో తేడా అయితే రాదు కదా.

ఇప్పుడు ప్రధానంగా రెవెన్యూ వసూళ్ళను పంచుకోవడంలోనే ప్రధాన సమస్య వచ్చేట్టుంది. 2012-13లో మొత్తం 72వేలకోట్ల ఆదాయంలో అమ్మకపు పన్ను 27,000కోట్ల పైచిలుకు. ఇతర పన్నుల ఆదాయంలో 2800 కోట్లు కేవలం హైదరాబాద్ నగరం నుంచే వస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాలన్నీ రంగారెడ్డి జిల్లా పరిధిలోనే వుండటం వలన, అక్కడే ఆదాయం కూడా హెచ్చుగా ఉంది. ఎక్సైజ్, రవాణా, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను తదితరాల నుంచి ఒక్క రంగారెడ్డి జిల్లా ద్వారానే 4600 కోట్లు వస్తుంది. అమ్మకపు పన్ను 2870 కోట్లు కూడా కలిపితే ఏడు వేల కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. రంగారెడ్డి జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కిందనే 1800 కోట్లకు పైగా వచ్చింది. నిర్మాణరంగం శివారు ప్రాంతాల్లో ఎంత పెరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక రవాణాలో క్రితం సంవత్సరం 600 కోట్లకు పైగా రంగారెడ్డిలో వచ్చింది. హైదరాబాదులో వాహనరంగ అమ్మకాలకి ఇది తార్కాణం. తెలంగాణలోని ఏ జిల్లాలో ఇంత ఆదాయం లేదు.

మద్యం విషయంలో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా 2004 కోట్లతో మొదటి స్థానంలో వుంది. రెండో స్థానంలో 1453 కోట్లతో హైదరాబాద్ ఉంది. సీమాంధ్రను చూస్తే రాష్ట్రంలో మూడవ స్థానంలో 1022 కోట్లతో ఉంది. మొత్తం 72,000 కోట్లు రాష్ట్ర సొంత పన్ను అంచనాలో క్రితం సంవత్సరం ఆదాయంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పన్నుల ఆదాయాలు మాత్రమే క్రితం సంవత్సరం 37,555 కోట్లుగా ఉంది. అంటే హైదరాబాద్ ఆదాయం ఒకవేళ సీమాంధ్రకు రాకపోతే కొత్త సీమాంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు సొంత ఆదాయం కేవలం 22,503 కోట్లు మాత్రమే ఉంటుంది. ఈ పరిస్థితి సీమాంధ్ర రాష్ట్రానికే కాదు, తెలంగాణకూ వర్తిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగిలిన తెలంగాణ జిల్లాల సొంత ఆదాయం చూస్తే కేవలం 10,847 కోట్లతో ఉంది. అందువలన హైదరాబాద్ ఆదాయాన్ని, ఒక్క హైదరాబాదు మెట్రో పరిధిగానే కాక రంగారెడ్డి జిల్లా మొత్తం 7,400 కోట్ల ఆదాయన్ని శివారు ప్రాంతాల పరిధిని, జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండీఏ ఆధారంగా తీసుకొని రెండు రాష్ట్రాల మధ్యన దామాషా ప్రకారం నిర్ణయించాల్సిన అవసరం ఉంది.
72 వేల కోట్ల సొంతపన్నుల ఆదాయం పోతే ఇంకా రాష్ట్రానికి దాదాపు 90 వేల కోట్ల ఇతర ఆదాయం ఉంది. దీనిలో 24వేల కోట్లు, కేంద్ర పన్నుల్లో మన వాటాగా వచ్చే ఆదాయం. దీన్ని పంచడం పెద్ద కష్టం కాబోదు.

58:42 నిష్పత్తిలో పంచుకోవచ్చు. పన్నేతర ఆదాయం 15,000 కోట్లుగా ఉంది. డివిడెండ్లు, వడ్డీ వసూళ్లు, సాంఘిక సేవలు మొదలగునవి వస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ లేకపోవడం వలన సీమాంధ్రలో డివిడెండ్లు వచ్చే అవకాశం తక్కువ. అదే విధంగా సాంఘిక సేవలు, ఆర్థిక సేవలు అన్నీ కమర్షియల్‌గా ప్రాంతం బలపడినప్పుడే ఎక్కువ అవుతాయి. అంటే సీమాంధ్ర రాష్ట్రం మొదటి సంవత్సరాలలో అధిక ఆదాయానికి అవకాశం తక్కువ. 58 శాతం దామాషా ప్రకారం దీన్ని లెక్కించడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ పరిస్థితులను బట్టి వసూళ్లు ఉంటాయి. అందువలన 58 శాతం ప్రకారం 8,800 కోట్లు వచ్చే అవకాశం లేదు.

ఇక కేంద్రప్రభుత్వ గ్రాంట్లు వగైరా ఇంకొక 15వేల కోట్లు వస్తాయి. దీనిలో బహుశా పెద్ద కష్టం ఉండకపోవచ్చు. సీమాంధ్ర తన 58 శాతం వాటా 8800 కోట్లు తెచ్చుకోవచ్చు.
ఇక మిగిలింది బహిరంగ మార్కెట్‌లో ప్రభుత్వాలు తెచ్చుకొనే రుణాలు. వీటికోసం ప్రభుత్వ కాలపరిమితి కలిగిన బాండ్లు రిలీజ్ చేస్తుంది. ఈ బాండ్లు స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో మూడు శాతం మించకుండా రాష్ట్రం అప్పులు తెచ్చుకోవచ్చు. ఆ ప్రకారం ఈ సంవత్సరం ఉమ్మడి రాష్ట్రంలో 27,000 కోట్ల అప్పులు తేనున్నారు. కానీ కొత్త రాష్ట్రానికి ఈ విషయంలో చుక్కెదురు అవుతుందేమో అని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రం విడిపోతే స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఎంత ఉంటుంది అని ఇంకా అంచనా వేయలేదు కానీ, ఖచ్చితంగా హైదరాబాదు లేని రాష్ట్రం స్థూల జాతీయ ఉత్పత్తి దారుణంగా తగ్గిపోతుంది. ఇప్పు డు తీసుకోగలిగిన 27వేల కోట్లకి 58 శాతం దామాషా ప్రకారం 15,660 కోట్లు రావాలి. కానీ అప్పటి జీఎస్‌డీపీ కింద అంతరావడం కష్టం. కేంద్రం ప్రత్యేక సౌకర్యం కింద మూడు శాతం పైన ఇంకొక రెండు శాతం ఇస్తే కొంతవరకు పరిస్థితి మెరుగవ్వచ్చు. కానీ అప్పుడు పెట్టుబడిదార్లకి, బాండ్లకి ఎక్కువ వడ్డీ ఇవ్వాల్సి వుంటుంది. అది మళ్ళీ రాష్ట్ర ఆదాయం మీదే ప్రభావం చూపిస్తుంది.

ఇప్పుడు ఆదాయం వస్తున్న ప్రతి దాంట్లో 58శాతం ఇస్తేనే కొంతలో కొంత కొత్త ప్రభుత్వం ఒక 88,000 కోట్ల ఆదాయాన్ని చేరగలదు. అప్పటికి కూడా ఇప్పుడు పెడుతున్న ఖర్చు అంచనాల ప్రకారం ఐదారువేల కోట్లు తక్కువ అవుతుంది. ఈ 58 శాతానికి ఎంత తగ్గితే, ఏర్పడబోయే సీమాంధ్ర రాష్ట్రంలో ఆ మేరకు ఆదాయం తగ్గుతుంది. అటు తెలంగా ణ, ఇటు ఆంధ్ర- రాయలసీమ రాష్ట్రానికి ప్రాణ వాయువు హైదరాబాద్ అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. హైదరాబాద్ రాజధానే కాదు, రెండు రాష్ట్రాల ఇతర ప్రాంతాలకీ ఆర్థికంగా కూడా ఇదే ఆధారంగా తయారైంది.
ఈ లెక్కల ప్రకారం హైదరాబాదు ఆదాయం అసలు లేకుండా, బహిరంగ మార్కెట్‌లో అప్పులు తెచ్చుకొనే సౌకర్యం తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర గ్రాంటులు అన్నీ వచ్చినా సరే, సీమాంధ్ర ఆదాయం 60 వేల కోట్లు దాటే పరిస్థితి కనిపించటం లేదు. తప్పు, ఏర్పడాలని చెప్పబడే ఆ కొత్త రాష్ట్రానిది కాదు. ఎందుకంటే రాజధానిగా ఉండ డం వలన వాణిజ్య కార్యకలాపాలన్నీ హైదరాబాద్‌లోనే కేంద్రీకరింపబడ్డాయి.

కొత్త పరిశ్రమలు, ఐటీ సెక్టార్ వలన పెంపొందిన సర్వీస్ సెక్టార్ - ఇవన్నీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతాల్లో ఆర్థిక బూమ్‌కు దారితీశాయి. ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్రం రెండుగా విడిపోతే కొత్త రాష్ట్రంలో హైదరాబాదు అనేది లేకపోతే ఒక్కమాటలో చెప్పాలంటే ఆ కొత్త రాష్ట్రం మనలేదు. హైదరాబాదు భౌగోళికంగా కలిసివున్నా లేకపోయినా హైదరాబాదు నుంచి వచ్చే ఆదాయం కొత్త రాష్ట్రానికి కనీసం పది సంవత్సరాలు కావాలి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చెప్పినట్టు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాల పాటు ఉండడమంటే కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే కాదు, ఆర్థిక సౌలభ్యం కోసం కూడా. ఒక రాష్ట్రాన్ని రెండుగా విడదీస్తాము అన్న కాంగ్రెస్, రెండు ప్రాంతాల ప్రజలకు ఈ లెక్కలన్నీ స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాంతానికి ఎంత ఇవ్వాలో, ఎందుకివ్వాలో కూడా పారదర్శకంగా ప్రజలకు తెలిసే జరగాలి. మా డబ్బు ఎవరో తీసుకెళ్తున్నారు అని తెలంగాణ వారు, మా డబ్బు ఇక్కడ పెట్టాము, వృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు మేము వెనక్కు ఎలా పోతాము అనే విపత్కర పరిస్థితిలో ఆంధ్రులను నెట్టడం క్రూరత్వం. కాంగ్రెస్ ఈ రహస్య సంభాషణలకి ఇకనన్నా మంగళం పాడాలి. పార్టీ కమిటీలు కాకుండా రెండు ప్రాంతాల వారిని తానే ఒక ప్లాట్ ఫారం పైకి తేవాలి. స్టేక్ హోల్డర్లు అందరితో మాట్లాడాలి. ఆ పనిచేస్తే ఇక ఈ ఉత్తుత్తి ఆంటోనీ కమిటీలు అసలు అవసరం లేదు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి