August 30, 2013
రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలవుతుందని 2009 డిసెంబరులో ప్రకటన వచ్చినప్పుడు, విభజనను సిడబ్ల్యూసి, కేంద్ర ప్రభుత్వ సమన్వయ కమిటీ అంగీకరించినట్టు 2013 జూలై 30న ప్రకటన వెలువడినప్పుడు సమైక్యరాష్ట్రమే కావాలని ఉద్యమాలు జరిగాయి, జరుగుతున్నాయి. వాటి లోతు పాతుల్లోకి పోకపోయినా విచిత్రంగా కొంతమంది రాజకీయ నాయకులు వ్యక్తిగతమని చెప్పి రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చారు. జెసి దివాకర్‌రెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, టిజి వెంకటేశ్ మొదట ఈ ప్రస్తావన తెచ్చారు. కొంత అటు ఇటుగా ఎంఐఎం కూడా దీన్ని నెత్తికెక్కించుకొంది.
విభజన అంశాన్ని ఎలా పరిష్కరించాలి? హైదరాబాద్ సమస్య ఏమిటి? నీటి పంపకాల స్థితి ఎలా? అన్న వాటికి సమాధానం చెప్పలేని దుస్థితిలో పడిపోయిన కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్ర మంత్రి మండలి సభ్యులు కొంతమంది రాయల తెలంగాణ అయితే ఎట్లా ఉంటుంది? పూర్తిగా కాకపోయినా కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి 12 జిల్లాలతో తెలంగాణ ఇస్తే ఎలా ఉంటుంది? అని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు, చెత్త ప్రశ్నలు వేస్తున్నారు. దీన్ని ఆసారా చేసుకొని దివాకర్ రెడ్డి రోజూ అదే పాటపాడుతున్నారు. తెలంగాణ వాదులు మీరు మాతో వద్దనే వద్దు అంటూ ఉంటే కాదు వెంటపడుతాం అంటున్నారు.
సీమాంధ్ర పదప్రయోగమే రాయలసీమ అస్తిత్వాన్ని మరుగునపర్చుతుంటే ఇక రాయల తెలంగాణ అంటున్న వారు ముందు రాయలసీమ అంటే ఏమిటి? అది ఎలా వచ్చింది? దాని విశిష్టత, ప్రత్యేకత ఏమిటి? అన్న విషయాలను తెలుసుకుంటే ఇలా మాట్లాడరు. 7వ శతాబ్దం నాటి తూర్పు చాళుక్యుల పాలన చూసినా, 15 వ శతాబ్దం నాటి విజయనగర రాజుల పాలన చూసినా, బ్రిటిష్ ఇండియా కాలంలో నిజాం పాలన చూసినా, కంభంపాటి సీనియర్ ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి చూసినా సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రులచరిత్ర చూసినా రాయలసీమ ప్రత్యేకతలు, ప్రజల మధ్య ఉన్న ఆచార వ్యవహారాలు, సాంప్రదాయ సంగీత సాహిత్య ఆదాన ప్రదానాలు, ప్రకృతి పరమైన సారూప్యతలు, సామీప్యతలు, పరాయి పాలకుల దోపిడీ, పీడనలు, పాలెగాండ్ర ఏలుబడులు, పౌరాణిక, ఆధ్యాత్మికతల ఉమ్మడి సంస్కృతి అర్థమవుతుంది. ఇవేమీ పట్టించుకోకుండా నేను, నా రాజకీయ -ఆర్థిక భవిష్యత్తు, నా కులం రాజకీయాలు, మా మత రాజకీయాలు మాత్రమే మనగలగాలని పాకులాడే సంకుచితులు మాత్రమే ఇలాంటి అశాస్త్రీయమైన, అహేతుకమైన, ఆచరణ యోగ్యంకాని మతిలేని ప్రతిపాదనలు తెరపైకి తెస్తారు.
తెలుగువారి మొదటి నివాసం రాయలసీమ అని బళ్ళారిలో లభ్యమైన అత్యంత ప్రాచీన శిలాశాసనం ద్వారా తేలింది. తెలుగునాటక రంగానికి ఎనలేని కీర్తి -ప్రతిష్ఠలు తెచ్చిన బళ్లారి రాఘవ ఆవాసం కూడా బళ్లారే. ఈ బళ్లారి రాయలసీమకు మొదటి సాంస్కృతిక కేంద్రం. సిద్ధమవటం (కడప) పాలనా కేంద్రంగా బ్రిటిష్ వారి హయాంలో పనిచేసింది. వాస్తవానికి సీమ అంటే ఒక పరిపాలనా విభాగం. ఈ సీమను చాళుక్యులు, చోళులు, కాకతీయులు, ఢిల్లీ సుల్తానులు, విజయనగరరాజులు, కుతుబ్‌షాహీలు, మొగల్ చక్రవర్తులు, కడప నవాబులు, టిప్పు సుల్తాన్‌లు, పాలెగాండ్రు పరిపాలించారు. బ్రిటిష్ హయాంలో నైజాం స్టేట్‌లో అంతర్భాగంగా ఉండిన ఈ సీమను దత్త మండలాలు (సీడెడ్ జిల్లాలు) పేరుతో నైజాం నవాబులు బ్రిటిష్ దొరలకు 1800 సంవత్సరంలో 'సైన్య సహకార సంధి' పేరుతో అమ్ముకొని సీమ ప్రజలను అవమానానికి గురిచేశారు.
దత్త మండలాలు అనే ఈ అవమానాన్ని 128 సంవత్సరాలు భరించి తట్టుకోలేక అనేక మంది మేధావులు మథన పడి ఆలోచించి కడకు (1927 నవంబర్ 27, 28 తేదీల్లో) నంద్యాలలో కడప కోటిరెడ్డి అ«ధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభలో ఈ ప్రాంతానికి రాయలసీమ పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు చిలుకూరి నారాయణరావు చేసిన ప్రతిపాదనను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పప్పూరి రామాచార్యులు, గుత్తి కేశవపిళ్ళే, కడప కోటిరెడ్డి, కల్లూరి సుబ్బారావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, టి యస్ రామక్రిష్ణారెడ్డి మొదలైన మొదటి తరం నాయకులూ, రాళ్ళపల్లి, గడియారం వెంకట శేషశాస్త్రి, పుటపర్తి నారాయణాచార్యులు, విద్వాన్ విశ్వం, తిరుమల రామచంద్ర లాంటి కవులు, విద్వాంసులు రాయలసీమ అన్న పేరుకు విస్తృత ప్రచారం కల్పించారు.
గతంలో హిరణ్యక రాష్ట్రం, ములికినాడు, రేనాడు పేర్లు కల్గిన ఈప్రాంత ఆధునిక చరిత్రలో రాయలసీమగా స్థిరపడింది. గత చరిత్ర అంతా కాకపోయినా విజయనగర రాజుల కాలం నుంచి నేటి వరకూ రాయలసీమ చరిత్రను పరికిస్తే ఎన్నో సారూప్యతలు, ఉమ్మడి సంస్కృతులు అవగతమవుతాయి. ఆ విషయాలన్నింటిని చెప్పడం ఈ వ్యాస ఉద్దేశం కాదు. రాయలసీమ ఉమ్మడి సంస్కృతిని ధ్వంసం చేయవద్దు అని చెప్పేటంత వరకే పరిమితం.
పాతకతలొద్దు, ప్రస్తుతం జరుగుబాటు ఎట్లా? అని ఆలోచించినా రాయల తెలంగాణ ఆచరణ యోగ్యం కాదు. కానేరదు కూడా. నీటి వనరులు, భూగర్భ ఖనిజ సంపదలు అటవీ సంపదల విషయంలో ఒక జిల్లా తో ఇంకో జిల్లా ముడివడి పెనవేసుకొని ఉన్నాయి.
విడదీయడం ఎవ్వరికీ ప్రయోజనం కాదు. కాదని మూర్ఖంగా విడగొట్టినా ప్రాంతాల మధ్య నిత్యకలహాలు రాజుకుంటూనే వుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలనాపరంగా ఒకటిగా ఉన్నా -తెలంగాణ, కోస్తా, ఆంధ్ర, రాయలసీమ మూడు ప్రాంతాలు వాటి ప్రత్యేకతలతో విశిష్ట సంస్కృతులతో, ఆచార వ్యవహారాలతో ప్రత్యేకంగానే కొనసాగుతున్నాయి. కోస్తా జిల్లాల్లో ప్రాచుర్యంలో ఉన్న అట్లతద్ది, తెలంగాణ అంతటా వైభవంగా ఆచరించే బోనాల పండుగ రాయలసీమలో లేవు. తెలంగాణ జానపద జీవితంలో ముడిపడిన సమ్మక్క-సారక్క జాతరలు, రాయలసీమలోని గంగజాతరలు కోస్తాంధ్రలో లేవు. అలాంటప్పుడు రాయలసీమలోను రెండుగా చీల్చి ఒక భాగాన్ని కోస్తా సంస్కృతిలో, ఇంకో భాగాన్ని తెలంగాణ సంస్కృతిలో కలపాలని చూడడం అవివేకం.
తుంగభద్ర, పెన్నా బేసిన్‌లు కృష్ణా బేసిన్‌లో కలసి ఉన్నాయి. తుంగభద్ర -పెన్నా బేసిన్‌లు సీమ నాలుగు జిల్లాలతో పాటుగా నెల్లూరు వరకూ విస్తరించింది. శ్రీశైలం నికర, మిగులు జలాల ఆధారంగా ఉన్న ప్రాజెక్టులు: (అ) కెసికెనాలు కడప, కర్నూలు కు పారుదల ఇస్తున్నది; (ఆ) యస్ ఆర్ బిసి కూడా అంతే. కర్నూలు జిల్లాలోని అవుకు రిజర్వాయరు నిండి, అక్కడి నుంచి గోరకల్లు -దాని తర్వాత గండికోటకు నీళ్ళు రావాలి; (ఇ) హంద్రీ-నీవా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు పారుదల సౌకర్యాన్ని ఇస్తుంది; (ఈ) గాలేరు -నగరి, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు; (ఒ) తెలుగు గంగ -కర్నూ లు జిల్లా వెలిగొండ, అటు తర్వాత బి.మఠం, దాని తర్వాత సోమ శిల నుంచి చిత్తూరు జిల్లాకు పారుదల కల్పిస్తుంది. మరి రాయలసీమలో రెండు జిల్లాలు ఒక రాష్ట్రంలో, మరో రెండు జిల్లాలు ఇంకొక రాష్ట్రంలో ఉంటే ఎలా సమస్య పరిష్కారమవుతుంది? ఒకే రాష్ట్రంలో ఉండగానే కర్ణాటక, మహారాష్ట్రల పేచీలతో తగవు నడుస్తూ చస్తూ వుంటే ఆం«ధ్రప్రదేశ్‌లో కోస్తా -తెలంగాణతో తగవునడుస్తూ ఉంటే ఇక రాయల తెలంగాణ అయితే ఏ బావిలో దూకాలో ? విదూషక పాత్ర పోషించే కాంగ్రెస్ నాయకులకే ఎరుక.
ప్రపంచ ప్రపిద్ధి గాంచిన కడప బేసిన్‌లో లభ్యమవుతున్న గ్రానైట్, కడప స్లాబ్స్, ఆజ్ బెస్టాజ్, యురేనియం, లెడ్, మాంగనీసు, డోలమైటు, ఐరన్ఓర్ నిక్షేపాలు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలను కలుపుతూ నాలుగు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఎర్రచందనం, కలప తదితర అటవీ సంపదలు తూర్పు-పడమటి కనుమల గుండా విస్తరించి నాలుగు జిల్లాల్లో లభ్యమవుతున్నాయి. వీటిని ఎక్కడికి అక్కడ తెగ్గొట్టి సొమ్ము చేసుకోవడం అంత సులభం కాదు. సరిహద్దు సమస్యలతో యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంది. చరిత్రలో సీమకు 1937 నుంచి 1956 వరకూ జరిగిన అన్యాయం (శ్రీబాగ్ ఒడంబడిక, విశ్వవిద్యాలయం, రాజధాని), ఆ తర్వాత కృష్ణా -పెన్నార్ కు బదులుగా సిద్దేశ్వరం -గండికోట ప్రాజెక్టుల విషయంలో జరిగిన అన్యాయం పరిశీలిస్తే రాయలసీమ రెండు రాష్ట్రాల్లోకి వెళ్లి పోతే జరిగే అరిష్టం అంతా ఇంతా కాదు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రను తిరగేస్తే దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డి, చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖరరెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (అందరూ రాయలసీమ వారే సుమా!) ఎక్కువ సంవత్సరాలు పరిపాలించారు. అయినా సీమకు ఒరిగిందేమీలేదు. కుడి -ఎడమల దగా తప్ప. ఎంత మంచి వాడి గుణమైనా మాంసం దగ్గర తెలుస్తుందట. అలాగే మన వాళ్ళ గుణం నీళ్ళ దగ్గర, రాజధాని రాయలసీమ నుంచి తరలిపోవడం దగ్గర తెలిసిందని అంటారు పెద్దలు. వనరుల లేమితో, తక్కువ వర్షపాతం (550-650 మిల్లీ మీటర్లు)తో అల్లాడుతున్న రాయలసీమకు రేపు రాయల తెలంగాణ అయినా ఇదే పరిస్థితి.
లబ్ధి జరిగితే జెసి దివాకర్ రెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, టిజె వెంకటేశ్ వంటి వారికి మాత్రమే తప్ప, 67,299 చదరపు కిలో మీటర్ల మేర వ్యాపించిన సీమలో నివసిస్తున్న 1,51,74, 908 మంది ప్రజలకు వొనగూడే ప్రయోజనం శూన్యం. పైపెచ్చు సంఘటితంగా పోరాడే శక్తి, బలంగా వినిపించే గొంతుకలు మూసుకు పోవడం, రేనాటి పౌరుషం, రాయలసీమ ఆత్మాభిమానం అడుగంటిపోవడం జరుగుతుంది. రాయలసీమ వాసులు ఈ కుయుక్తులను తప్పకుండా ప్రతిఘటించాలి.
-జి.ఓబులేసు
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి