30, ఆగస్టు 2013, శుక్రవారం

విలీనం వివాహం వంటిది


-సంకుచిత తత్వాలను వదలాలి
-ఉదారంగా వ్యవహరించాలి
-దురహంకారం తగదని ఉద్బోధ
-ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో నాటి ప్రధాని నెహ్రూ వ్యాఖ్యలు
-సూచనలు పట్టించుకోని ఆంధ్ర నేతలు
-అడుగడుగునా తెలంగాణకు అన్యాయం
-దశాబ్దాల పోరాటాలతోనే సీడబ్ల్యూసీ నిర్ణయం
సెంట్రల్ డెస్క్:1956 నవంబర్ 1న గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో నెహ్రూ ప్రసంగం నవంబర్ 3వ నాటి ఆంధ్రపత్రికలో ఇలా రిపోర్టయింది..తెలంగాణ అనే అమాయక పడుచుకు ఆంధ్రా అనే గడుసరి కుర్రాడికి వివాహం జరిగిందని.. విలీనం సందర్భంగా నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చెప్పారు. నూతన సంబంధాలకు మూలమైన మసస్తత్వ సమస్యలన్నింటినీ గమనించి వ్యవహరించకపోతే వివాహం దుఃఖ హేతువు అవుతుందని కూడా హెచ్చరించారు. కొత్త ఆంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇది పరీక్షా సమయమని చెప్పిన నెహ్రూ.. ఉదారంగా వ్యవహరిస్తారో లేక.. సంకుచితంగా వ్యవహరిస్తారోనని ఆనాడే సందేహం వ్యక్తం చేశారు. అందరినీ కూడగట్టుకుని పోతారో లేక దురహంకారంతో వ్యవహరిస్తారోనని అనుమానాలూ వ్యక్తం చేశారు! కానీ.. నెహ్రూ అనుమానాలు నిజమయ్యాయి! ఆయన సందేహించిందే జరిగింది! విలీనం తర్వాతి దాదాపు ఆరు దశాబ్దాల కాలంలో తెలంగాణ నిలువునా మోసపోయింది! బంధం ముసుగులో బాధలు అనుభవించింది.

సంకుచితత్వాలను వదలాలని నెహ్రూ చేసిన ఉద్బోధలు గాలికి కొట్టుకుపోయి.. తెలంగాణపై తీవ్ర వివక్ష సాగింది. వర్గ కక్ష విభేదాలు మానాలన్న నెహ్రూ సూచనలను బుట్టదాఖలు చేసిన సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతంపై కక్షగట్టి.. వెనుకబాటుకు గురి చేశారు. భయాలు, సందేహాలు తొలగించాలని ఆనాడు ప్రధాని కోరితే.. వాటిని కొనసాగించిన పాలకులు.. పైగా రెట్టింపు చేశారు. తెలంగాణకు కల్పించిన రక్షణలన్నీ నీటిమూటలయ్యాయి. పెద్ద మనుషుల ఒప్పందం.. కాగితాలకే పరిమితమైంది. నీళ్లలో నిధుల్లో.. నియామకాల్లో పెద్ద ఎత్తున వివక్ష కొనసాగింది. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులు నిండిపోయారు. సొంత నేలపైనే తెలంగాణ యువకులు, విద్యాధికులు నిరుద్యోగులుగా తిరిగారు. కడపుమండి.. ఆందోళనలకు దిగారు. అవి ఇంతింతై.. అన్నట్లు పెరిగాయి. అన్యాయాలపై బలమైన పోరాటాలు నిర్మితమయ్యాయి. లెక్కకు మిక్కిలి ఆందోళనలు జరిగాయి.

ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన తొలి దశ పోరాటంలో దాదాపు 360 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. ఆ తర్వాత మళ్లీ 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావం అనంతరం పుంజుకున్న తెలంగాణ ఉద్యమం.. అన్యాయాలపై ప్రజలను చైతన్యం చేసే రీతిలో ఆందోళనలు నిర్వహించింది. పోరాటాల్లో ప్రజలను భాగస్వాములను చేసింది. 2009లో కేసీఆర్ నిరాహార దీక్ష నేపథ్యంలో డిసెంబర్ 9 ప్రకటన వెలువడినా.. సీమాంధ్ర నేతలు అడ్డం పడటంతో నోటిదాకా వచ్చిన కూడు.. దూరమైంది. తెలంగాణ కలతపడింది. వెయ్యికిపైగా యువత ఆత్మబలిదానాలు చేసింది. ఈ ఉద్యమ పునాదులపైనే జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నది.
-ఆంధ్రప్రదేశ్ మంత్రులకు నెహ్రూ హితవు
-ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కేంద్రం తీసుకుంటుంది
‘భారతదేశంలోని రాష్ట్రాల స్వరూపమే మారిపోయినవి. కాని, ఈ మార్పులన్నీ ఒక ఎత్తూ హైదరాబాదులో జరిగిన మార్పులు మరొక ఎత్తూను. ఒక శతాబ్దంగాపైగా హైదరాబాద్ ప్రత్యేక సంస్థానంగా విరాజిల్లుతూ వచ్చింది. nehru
అతి దీర్ఘమైన ఈ కాలంలో కొన్ని ప్రత్యేక ఆచార సంప్రదాయాలు ఇక్కడ ఏర్పడినవి. వీటిని పోషిస్తూ వచ్చిన వ్యవస్థ నేటితో అంతరిస్తున్నది. హైదరాబాదు నగరం ఇక విస్తృత ఆంధ్రరాష్ట్రానికి రాజధాని అవుతుంది. మహత్తరమైన ఈ తరుణం, ఆంధ్రప్రదేశ్ మంత్రులకూ, శాసనసభ్యులకూ పరీక్షా సమయం. సంకుచిత తత్వాలను వదలి వర్గ కక్ష విభేదాలను మాని, అందరి భయ సందేహాలనూ తొలగించి ప్రజలందరి విశ్వాసాన్ని పెంపొందించినప్పుడే వారు విజయం పొందినవారవుతారు. ఆంధ్ర మంత్రులకూ శాసనసభ్యులకూ ఇదే నా హితవు’ అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శాసనసభ్యుల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు.

ప్రధానమంత్రికి స్వాగతం చెబుతూ డాక్టరు బూర్గుల రామకృష్ణారావు ఇట్లా అన్నారు. ‘దేశమంతటా నేడు కొత్త రాష్ట్రాలు ఏర్పడినవి. కొత్తగా కొన్ని భూభాగాలు కలిసో, లేక కొన్ని భూభాగాలు విడిపోవడం వల్లను ఇవన్నీ ఏర్పడితే, ఒక రాష్ట్రంగా తన ఉనికిని కోల్పోవడం హైదరాబాదు ప్రత్యేక. ఇటువంటి సమయంలో ప్రధాన మంత్రి వచ్చి మనకందరికీ వారి సందేశాన్ని వినిపించే అవకాశం కలిపించినందుకు కృతజ్ఞులం. ప్రధానమంత్రి వస్తారో రారో అనుకున్నాం. వాతావరణం కూడా విషమించింది. అయినా మనలనూ, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నీ ఆశీర్వదించేందుకు ఆయన నేటి ఉదయం వచ్చారు.

మహత్తరమైన సందర్భం
ప్రధాని నెహ్రూ ప్రసంగం ఇట్లా ఉన్నది : నేను నేడిక్కడికి వచ్చిన సందర్భం మహత్తరమైనది. ఈ రోజులలోనే ప్రపంచంలో వేరొక చోట కొన్ని ఘటనలు జరిగి పరిస్థితిని చిక్కుపరుస్తున్నదవి. ఇవి హఠాత్తుగా, పిడుగులాగా మనపై పడినవి. వీటి ప్రభావం భారతదేశం మీదనూ, ప్రపంచమంతటిమీదా పడక మానదు’.

అక్టోబరు సూర్యుడు అస్తమించాడు
‘అక్టోబరు సూర్యుడు నిన్నటితో అస్తమించాడు. ఇవాళ్ల నవంబరు మొదటి తేదీ. నవంబరు సూర్యుడు నూతన భారతి చిత్రపటంపై ఉదయించాడు. ఈ మార్పులు చడి చప్పుడూ లేకుండా ఎంత నిశ్శబ్దంగా వస్తున్నవో! గత సంవత్సరం ఈ సమస్య కారణంగానే దేశమంతటా వాదోపవాదాలూ కొన్ని చోట్ల అల్లర్లూ కూడా జరిగినయి. ఈ నాడు కొత్త పరిస్థితులు కొత్త రూపాలు ఏర్పడినయి. పాత రాష్ట్రాలు ఎన్నో పోయి, కొత్తవి ఏర్పడినయి. బహుశా వీటన్నింటికంటే ముఖ్యమైన, మహత్తరమైన పరిణామం ఆంధ్రలో ఇక్కడ హైదరాబాదులో జరుగుతున్నది. మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న మార్పులు కూడా ముఖ్యమైనవే కాని, హైదరాబాదులో మార్పులు నిరుపమానమైనవి.ఇక హైదరాబాదు విస్తృత రాష్ట్రానికి రాజధాని అయినది. స్వాతంత్య్రం సంపాదించుకున్న తర్వాత సంస్థానాల సమస్య మొట్టమొదటి సారిగా మనలను ఎదుర్కొన్నది. జమీందారీ, భూస్వామ్య సమస్యలను కూడా పరిష్కరింప సంకల్పించాం. ఇక సామ్యవాద సరళి సమాజాన్ని నెలకొల్పడం మనం ధ్యేయంగా నిర్ణయించుకున్నాం.

పటాలోపం లేకుండా మార్పులు
సంస్థానాలకంటే చిక్కు సమస్యను ఇంత ప్రశాంతంగా ఇంత వరకూ మరెవరైనా పరిష్కరించారేమో నాకు తెలియదు. జమీందారీల సమస్యను కూడా ఇదే విధంగా పరిష్కరించ సంకల్పించినాము. ఇందువల్ల కొందరికి ఇబ్బందులు కలుగుతున్న మాట నిజమే. అన్యాయార్జితాలననుభవిస్తున్నవారికే ఈ ఇబ్బందులు. అటువంటివారికి కలిగే ఇబ్బందులను మనం లెక్కచేయనవసరం లేదు. సామ్యవాద వ్యవస్థ నెలకొల్పడానికి పారిశ్రామికాభ్యున్నతికీ కూడా మనం కొన్ని ఏర్పాట్లు చేశాం. మహత్తరమైన ఈ మార్పులూ, సంస్కరణలన్నీ హడావిడీ, పటాటోపమూ లేకుండా సాధించాలి. ఇక రాష్ట్రాల సమస్య కొన్ని తాలూకాలూ లేక గ్రామాలు ఈ రాష్ట్రంలో ఉండాలని కొందరు అభిప్రాయపడవచ్చు. ఏ భూభాగం ఏ రాష్ట్రంలో ఉన్నా నా మటుకు పేచీ ఏమీ లేదు. ఇవన్నీ పరిపాలనా నిర్వహణకు సంబంధించినవి. ప్రజలలో కూడా పొటమారిస్తున్న రాష్ట్రీయ సంకుచిత తత్వం మనందరినీ కలవరపెడుతోంది. స్వరాష్ట్రాభిమానం అభిలషణీయమే. కాని మితిమీరితే చేటు కలుగుతుంది. ఈ దురభిమానాన్ని అంతమొందించేందుకు గట్టి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కొందరికి కష్టం
బ్రిటిషు పాలకులు ఈ సరిహద్దులను ఏర్పాటు చేశారు. కొంతకాలంగా అవి అమలులో ఉన్నాయి. ఇప్పుడు వాటిని మార్చితే కొందరికి బాధ కలగవచ్చు. అయితే దేశాభ్యున్నతికి అవసరమైన మార్పులనే మనం ప్రవేశపెడుతున్నాం. దైనందిన జీవితానికి అవరోధం కలిగించకుండా మార్పులను తీసుకురావడమే మన విధానం. గత శతాబ్దంగా హైదరాబాద్ ఒక పెద్ద సంస్థానంగా ఉంటూ వచ్చింది. ఆ కాలంలో ఇక్కడ కొన్ని సంప్రదాయాలూ, ఆచార వ్యవహారాలలో ఒక రకమైన సంస్కృతి ఏర్పడినాయి. ఈ సంస్కృతిలో బూజుపట్టి ఈ కాలానికి పనికిరాని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. వీటికి ఆలవాలమైన వ్యవస్థలను మనం రూపుమాపుతున్న మాట నిజమే.

ఎందుకంటే దేశంలో కొంత భాగం పాత పద్ధతిలోనూ దాని పక్క భాగం నూతన పద్ధతులలోనూ ఉండజాలదు. హైదరాబాదు సంస్థానంలో ముఖ్యంగా తెలంగాణకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ ముస్లిమ్ జనాభాకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలూ, అవకాశాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా జమీందారీ, జాగీర్దారీ వ్యవస్థలకు సంబంధించినవి. ఇవి పోక తప్పదు. వారి భయాందోళనలను తొలగించక తప్పదు. ఈ సందర్భంలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కేంద్రం ఆధీనంలోకి తీసుకుని పెద్ద విద్యా కేంద్రంగా రూపొందించాలని కొంత కాలం కిందట ఆలోచించాం. ఇందులో తప్పు ఏమీలేదు. ఈ ప్రతిపాదన సరి అయినదే. ఉచితమైనదీ కూడా. ఇక దీనిని అమలు పరచవలసి ఉన్నది’

వివాహం వంటిది
‘తెలంగాణా ఆంధ్ర ప్రాంతాలు కలిసిపోయినాయి. ఇదోరకం వివాహం వంటి ఏర్పాటు. వివాహం ఎంత సంతోషవూపదమైనదో అంత ప్రమాదకరమైనది కూడా. (నవ్వు)’ నూతన సంబంధాలకు మూలమైన మసస్తత్వ సమస్యలన్నింటినీ గమనించి వ్యవహరించకపోతే వివాహం దుఃఖ హేతువు అవుతుంది. కొత్త ఆంధ్ర మంత్రులూ, శాసనసభ్యులూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ ఇది పరీక్షా సమయం. ఉదారంగా వ్యవహరిస్తారో లేక సంకుచితంగా వ్యవహరిస్తారో ఇక చూడవలసి ఉన్నది. అందరినీ కూడకట్టుకునిపోతారో లేక దురహంకారంతో వ్యవహరిస్తారో చూడవలసి ఉన్నది. అందరి భయాలనూ తొలగించి అందరికీ న్యాయం చేకూర్చి రక్షణ సమకూరడానికి అనుగుణంగా పరిపాలించి ప్రజల విశ్వాసాన్ని పెంపొందించుతారో లేదో చూడవలసి ఉన్నది. శత్రువుతోనూ మైత్రిని కాంక్షించేవాడే ఘనమైన వ్యక్తి. హైదరాబాదులో ఇక ముందు ఏమి జరుగుతుందోనని కేవలం హైదరాబాదు వాసులే కాదు ఇతర ప్రాంతాల వారెందరో శ్రద్ధగా గమనిస్తూంటారు. మనం విశాల హృదయంతో వ్యవహరిస్తేనే దేశం అభ్యున్నతి చెందడమే కాక ప్రపంచంలో మన కీర్తిప్రతిష్ఠలూ, గౌరవమూ పెంపొందుతాయి. ఆంధ్ర శాసనసభ్యులూ మంత్రులూ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను.

అటు తర్వాత ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రసంగిస్తూ ఇట్లా అన్నారు :
‘ప్రధాన మంత్రి ఇచ్చిన సలహాలను తప్పకుండా పాటించి వారు చూపిన మార్గాన నడుస్తామని హామీ ఇస్తున్నాను. అట్లా చెయ్యలేకపోతే మా ఉద్యోగాలకు రాజీనామాలు ఇచ్చి వైదొలుగుతాము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి