ఉపోద్ఘాతం
ఒక సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి, మార్చడానికి, మార్పుకు దోహదం చేయడానికి ఆ సమాజానికి సంబంధించిన నాలుగు ప్రధానాంశాలను వివరంగా తెలుసుకోవడం అవసరం. అవి ఒకటి, ఆ సమాజానికి అందుబాటులో ఉన్న వనరులు; రెండు, ఆ సమాజంలోని ప్రజలు; మూడు, ఆ ప్రజలు నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు; నాలుగు, ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు, పోరాటాలు. ఒక సమాజాన్ని నిర్వచించే, నడిపించే, మార్చే, అభివృద్ధిచేసే, ధ్వంసం చేసే అంశాలన్నిటినీ కూడ ఈ నాలుగు ప్రధాన విభాగాల కిందనే అధ్యయనం చేయవచ్చు. వీటిలో ఏ ఒక్కదాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోకపోయినా, ఏ ఒక్కదాని గురించి పొరపాటు నిర్ధారణలకు వచ్చినా ఆమేరకు ఆ సమాజం గురించిన మౌలిక అవగాహన అసమగ్రమవుతుంది. ఆ మేరకు ఆ సమాజంతో వ్యవహరించడంలో లోపాలు తలెత్తుతాయి.
ఒక సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి, మార్చడానికి, మార్పుకు దోహదం చేయడానికి ఆ సమాజానికి సంబంధించిన నాలుగు ప్రధానాంశాలను వివరంగా తెలుసుకోవడం అవసరం. అవి ఒకటి, ఆ సమాజానికి అందుబాటులో ఉన్న వనరులు; రెండు, ఆ సమాజంలోని ప్రజలు; మూడు, ఆ ప్రజలు నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు; నాలుగు, ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు, పోరాటాలు. ఒక సమాజాన్ని నిర్వచించే, నడిపించే, మార్చే, అభివృద్ధిచేసే, ధ్వంసం చేసే అంశాలన్నిటినీ కూడ ఈ నాలుగు ప్రధాన విభాగాల కిందనే అధ్యయనం చేయవచ్చు. వీటిలో ఏ ఒక్కదాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోకపోయినా, ఏ ఒక్కదాని గురించి పొరపాటు నిర్ధారణలకు వచ్చినా ఆమేరకు ఆ సమాజం గురించిన మౌలిక అవగాహన అసమగ్రమవుతుంది. ఆ మేరకు ఆ సమాజంతో వ్యవహరించడంలో లోపాలు తలెత్తుతాయి.
మళ్లీ ఈ నాలుగు అంశాలలో కూడ వనరులు, ప్రజలు
అనే రెండు అంశాలు ప్రాథమికమైనవి. వనరులు లేకుండా ప్రజలు మనుగడ సాగించలేరు.
వనరులలో భూమి, అడవి, నీరు, ఖనిజాలు వంటివి ప్రకృతి సహజమైనవి. అవి మనుషుల
మనుగడకు ముందునుంచీ ఉన్నవి. అవి ఏర్పడిన కొన్ని కోట్ల ఏళ్ల తర్వాత పరిణామ
క్రమంలో మనుషులు వచ్చారు. అలా రూపొందిన మానవ సమాజం ప్రకృతి వనరులతో ఎలా
వ్యవహరించాలో వేల సంవత్సరాల ప్రయాణంలో తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, ప్రయోగాలు
చేస్తూ ముందుకు సాగుతోంది. మొత్తం మీద వనరుల వినియోగం మీదనే మనుషుల మనుగడ
ఆధారపడి ఉంది. వనరుల వినియోగంతోనే మనుషులు తమ జీవితాలను మార్చుకుంటారు,
సుఖవంతం చేసుకుంటారు, అభివృద్ధి చెందుతారు. ఆ వనరులకు విభిన్న ఉపయోగాలను
కనిపెట్టి ఏ ప్రయోజనానికి ఉపయోగించడం ఎక్కువ సార్థకమో తేల్చుకుంటారు. ఏ
వనరును ఎప్పుడు ఎలా ఎంత ఉపయోగించాలో తేల్చుకుంటారు. వేల సంవత్సరాలుగా
ఉనికిలో ఉన్న ప్రకృతి వనరులకు కొత్త ఉపయోగాలు కూడ ఈ అన్వేషణా క్రమంలోనే
వెలికివస్తుంటాయి. కొన్ని వనరులకు పునరుత్పత్తి అయ్యే స్వభావమూ, కొన్ని
వనరులకు వినియోగంతోపాటు రద్దయిపోయే స్వభావమూ ఉంటాయి. అందువల్ల వనరుల కొరత
ఉన్న సమాజంలోనైనా, వనరులు పుష్కలంగా ఉన్న సమాజంలోనైనా ప్రతి వనరుకూ
ప్రత్యామ్నాయ ఉపయోగాలు ఏమిటో, వాటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తేల్చుకోవలసి
ఉంటుంది. ఈ ప్రత్యామ్నాయాల అన్వేషణనే సాధారణంగా సాంకేతిక పరిజ్ఞానంగా
పరిగణిస్తుంటాం.
అయితే మనిషికీ ప్రకృతికీ మధ్య ఉన్న ఈ
సంబంధం, వైరుధ్యం సమన్వయపూరితంగా పరిష్కారం కాకముందే మనుషుల మధ్య విభజన
జరిగింది. ప్రకృతి వనరులను ఉపయోగించి మనుషులు సాగించిన ఉత్పత్తిలో మిగులు
ఎవరి అధీనంలో ఉండాలనే విషయంలో మనుషుల్లో వైరుధ్యం తలెత్తింది. మనిషికీ
ప్రకృతికీ వైరుధ్యం అలా ఉండగానే, మనిషికీ మనిషికీ మధ్య వైరుధ్యం ప్రధానం
అయింది. మానవజీవితానికి అవసరమైన ఉత్పత్తి సాధనాల యాజమాన్యం ప్రాతిపదికగా ఈ
వైరుధ్యాన్ని గుర్తించడం జరుగుతుంది. మరొకమాటల్లో చెప్పాలంటే దీన్ని వనరుల
మీద యాజమాన్యంగా కూడ చూడవచ్చు. ఏ సమాజంలోనైనా మౌలికమైన ఆ వైరుధ్యాన్ని
స్థూలంగా వర్గ వైరుధ్యం అంటారు. అది వేరు వేరు సమాజాలలో, వేరు వేరు కాలాలలో
ఇతర వైరుధ్యాలుగా కూడ వ్యక్తీకరణ పొందవచ్చు. ప్రజల గురించి అర్థం
చేసుకోవాలంటే వర్గ వైరుధ్యం పరిణమించిన చరిత్రనూ, అది పొందిన వేరువేరు
రూపాలనూ తెలుసుకోవలసి ఉంటుంది. మొత్తం మీద వర్గ వైరుధ్య క్రమంలో, వనరుల
వినియోగాన్నీ, వనరులపై యాజమాన్యాన్నీ, వనరుల వినియోగ నిర్ణయాధికారాన్నీ ఒక
చిన్న వర్గం తన గుప్పెట్లో పెట్టుకుని బలప్రయోగం ద్వారా
కొనసాగించుకుంటోంది. ఆ వర్గ వైరుధ్యం వల్ల ప్రకృతి వనరుల వినియోగమూ,
సాంకేతిక పరిజ్ఞానమూ, అసలు మొత్తం సామాజిక జీవనమే ప్రత్యక్ష, పరోక్ష సమస్యల
నిలయమైపోయింది.
అందువల్ల సమాజంలో వనరులు, ప్రజలు అనే
అంశాలతో పాటే తప్పనిసరిగా అధ్యయనం చేయవలసిన అంశంగా ప్రజాసమస్యలు వచ్చి
చేరుతాయి. ఆ సమస్యలు వేరువేరు ప్రజా సమూహాలకు, వేరువేరు సమయాల్లో
వేరువేరుగా ఉండవచ్చు. ఆ సమస్యల తీవ్రత వేరువేరుగా ఉండవచ్చు. ఆయా
ప్రజాసమూహాలు తమ సమస్యల పరిష్కారాన్ని అన్వేషించే క్రమంలో వేరువేరు
పద్ధతులు అనుసరించవచ్చు. వేరు వేరు ప్రయత్నాలు చేయవచ్చు. వాటి రూపాలు
ఏమయినప్పటికీ, వాటిలో ప్రజల భాగస్వామ్యం, వాటి విస్తృతి ఏమయినప్పటికీ, వాటి
లక్ష్యాలు ఏమయినప్పటికీ స్థూలంగా ఆ పరిష్కార ప్రయత్నాలన్నిటినీ ప్రజా
పోరాటాలు అనవచ్చు. అందువల్ల సమాజ అధ్యయనంలో మరొక తప్పనిసరి అంశంగా ప్రజా
పోరాటాలు వచ్చి చేరుతాయి.
కనుక ఒక సమాజం గురించి సమగ్రంగా అర్థం
చేసుకోవాలని ప్రయత్నించేవారెవరయినా ఆ సమాజానికి ఉన్న వనరులు, ఆ సమాజంలో
ఉన్న ప్రజలు, ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యలు
పరిష్కరించుకోవడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు, సాగిస్తున్న పోరాటాలు అనే
నాలుగు అంశాలను తప్పనిసరిగా అధ్యయనం చేయవలసి ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అనే పాలనాపరమైన ప్రాంతంలోని సమాజం గురించి అధ్యయనం చేద్దాం.
ఆంధ్రప్రదేశ్ చారిత్రక నేపథ్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వనరుల గురించీ,
ప్రజల గురించీ, ప్రజల సమస్యల గురించీ, ప్రజాపోరాటాల గురించీ
మాట్లాడుకునేటప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడిన పూర్వరంగాన్ని గమనంలో ఉంచుకోవడం
అవసరం. ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో 1956 నవంబర్ 1న మనుగడలోకి వచ్చిన రాష్ట్రం
అంతకు రెండు శతాబ్దాలకు పైగా వేరువేరు వనరులతో, వేరువేరు ఉత్పత్తి విధానాల
కింద, విభిన్న పాలనల కింద, భిన్నమైన సంస్కృతులతో కొనసాగుతూ వచ్చిన ప్రాంతాల
కలయిక. అటు బ్రిటిష్ పాలనలోని మద్రాసు రాష్ట్రంలోని తెలుగు జిల్లాలను
విడదీసి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతకు
ముందే మద్రాసు రాష్ట్రంలోని తెలుగు జిల్లాలలోనే ఇటు రైత్వారీ విధానమూ, అటు
విజయనగరం, బొబ్బిలి, మందసా, పిఠాపురం, చల్లపల్లి, వెంకటగిరి వంటి చోట్ల
జమీందారీ విధానమూ కూడ కొనసాగుతూ ఉండింది. 1948 మద్రాస్ జమీందారీ, ఎస్టేట్స్
(రద్దు) చట్టం ద్వారా జమీందారీలు, ఎస్టేట్లు రద్దయిపోయాయి. ఇటు హైదరాబాదు
సంస్థానంలో జాగీర్దారీ విధానమూ, రైత్వారీ విధానమూ కూడ కొనసాగుతుండేవి.
హైదరాబాదు మీద భారత ప్రభుత్వం ‘పోలీసుచర్య’ జరిపి విలీనం చేసుకున్న తర్వాత,
1949లో ప్రవేశపెట్టిన హైదరాబాద్ జాగీర్ రద్దు నిబంధనలు, 1950లో
ప్రవేశపెట్టిన కౌల్దారీ రక్షణ చట్టం హైదరాబాదు రాష్ట్రంలో కూడ మొత్తంగా
రైత్వారీ విధానం మొదలయింది. ఆ తర్వాత హైదరాబాదు రాష్ట్రాన్ని మూడు భాషా
ప్రాంతాలకింద విడదీసి, తెలుగు మాట్లాడే తెలంగాణ జిల్లాలను ఆంధ్ర రాష్ట్రంతో
కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. ప్రధానమైన జీవన వనరు అయిన భూమితో
ప్రజల సంబంధం చరిత్ర ఇది. కాగా, బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు రాష్ట్రంలో
1850లలోనే కృష్ణా, గోదావరి నదుల మీద ఆనకట్టల వల్ల ఆధునిక నీటి పారుదల
సౌకర్యాలు ఏర్పడ్డాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వాణిజ్య పంటలు మొదలయ్యాయి.
వ్యవసాయాదాయంలో మిగులు ఇతర రంగాలలోకి ప్రవేశించడం మొదలై పారిశ్రామిక, సేవా
రంగాల విస్తరణ, పట్టణీకరణ మొదలయ్యాయి. హైదరాబాదు రాజ్యంలో 1920లలో మొదటి
ఆధునిక నీటి పారుదల పథకంగా మంజీరా నది మీద నిజాం సాగర్ ఏర్పడింది గాని
అత్యధిక భాగం వర్షాధార వ్యవసాయం కిందనే ఉండిపోయింది. ఎంతో కొంత వ్యవసాయ
మిగులు ఉన్నప్పటికీ అసమ భూసంబంధాల వల్ల ఆ మిగులు భూస్వాములకు,
జాగీర్దార్లకు, రాజకుటుంబానికి మాత్రమే దక్కింది. పారిశ్రామిక, సేవా రంగాలు
కొంత అభివృద్ధి చెందినప్పటికీ అవి రాజ వంశీకులకు, ఆశ్రితులకు మాత్రమే
చెంది ఉండేవి.
అంటే 1956 నాటికి ఈ సమాజంలోని వనరులలో
ప్రధానమైన భూమి భిన్నమైన వ్యవస్థలలో ఉంది. నీటిని వినియోగించుకునే పద్ధతులు
భిన్నంగా ఉన్నాయి. ఖనిజాల వినియోగం, పారిశ్రామికీకరణ, సేవారంగ అభివృద్ధి,
పట్టణీకరణ వేరువేరు స్థాయిలలో, భిన్నమైన ఏర్పాట్లతో ఉన్నాయి. పాలనలు
భిన్నంగా ఉన్నాయి. ప్రజా సమూహాల జీవన స్థితిగతులూ, అవకాశాలూ, ఆకాంక్షలూ
భిన్నంగా ఉన్నాయి. ప్రజల సమస్యలు ఒకచోట వలస పాలన, వలసానంతర స్థితి వల్ల
తలెత్తినవి కాగా, మరొకచోట నిరంకుశ రాచరికం, రాచరిక అనంతర స్థితి వల్ల
ఏర్పడినవి. ప్రజా పోరాటాలు ఒకచోట వలస వ్యతిరేక జాతీయ పోరాటంగానూ, జమీందారీ
వ్యతిరేక పోరాటాలుగానూ ఉండగా, మరొకచోట రాచరిక వ్యతిరేక ప్రజాస్వామిక
ఆకాంక్ష గానూ, భూమి-భుక్తి-విముక్తి పోరాటంగానూ ఉన్నాయి.
యాభై సంవత్సరాలు గడిచిన తర్వాత
ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని చూస్తే, ఈ చారిత్రక పూర్వరంగం విధించిన పరిమితులూ,
కల్పించిన అవకాశాలూ అన్నీ కూడ ఏదో ఒక స్థాయిలో వనరుల మీద, ప్రజల మీద, ప్రజల
సమస్యల మీద, ప్రజా పోరాటాల మీద ప్రభావం చూపడం కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ – ఇవాళ్టి స్థితి
ఆరు కోట్ల ఎనభై లక్షల ఎకరాల భూమి, అందులో
రెండుకోట్ల ఎనభై లక్షల ఎకరాల వ్యవసాయం సాగుతున్న భూమి, ఒక కోటీ యాభై లక్షల
ఎకరాల అడవులు, సాలీనా మూడువేల శతకోటి ఘనపుటడుగులకన్న ఎక్కువగా నీరు
ప్రవహించే నదులూ, ఉప నదులూ, వాగులూ, సాలీనా పోగయ్యే మరొక వెయ్యి శతకోటి
ఘనపుటడుగుల భూగర్భ జలాలు, వెయ్యి కిలోమీటర్ల సముద్రతీరం, లక్షల టన్నుల,
అన్ని రకాల ఖనిజాలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న వనరులలో
ముఖ్యమైనవి. ఈ వనరుల మీద ఆధారపడి రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం
అభివృద్ధి చెందాయి, సాగుతున్నాయి. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలకు
అవసరమైన నీటి పారుదల సౌకర్యాలు, విద్యుదుత్పత్తి, రహదారుల నిర్మాణం,
గృహవసతి కల్పన, ఉపాధి కల్పన అంతా కూడ ఈ వనరుల ఆధారంగానే జరుగుతున్నాయి. ఈ
వనరులతో వచ్చిన ఆదాయంతోనే రాష్ట్రంలో పాలన సాగుతున్నది. రాష్ట్ర ప్రజలకు
అవసరమైన విద్యా, వైద్య, ఆరోగ్య, రవాణా, వినోద, విజ్ఞాన సేవలు ఎలా అందాలనేది
ఆ పాలనా విధానాల వల్లనే నిర్ణయమవుతున్నది.
నిజానికి ఈ వనరులను సక్రమంగా, హేతుబద్ధంగా,
సామాజిక అవసరాల కోసమే వినియోగిస్తే, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జనాభా
(2001 జనగణన ప్రకారం ఏడు కోట్ల అరవై లక్షలు, 2011 జనగణన జరగవలసి ఉండగా,
2010 అంచనాల ప్రకారం ఈ జనాభా ఎనిమిది కోట్ల నలభై లక్షలు) అంతా కూడ ఇప్పుడు
ఉన్న స్థితి కన్న మెరుగైన జీవితం గడపవచ్చు. కాని కొనసాగుతున్న
రాజకీయార్థిక, సామాజిక వ్యవస్థ ఈ వనరుల మీద సమాజం మొత్తానికీ సమాన
అధికారాన్ని ఇవ్వడం లేదు. వనరుల పంపిణీ సక్రమంగా లేదు. ఆ వనరులను
హేతుబద్ధంగా, సామాజిక శ్రేయోదాయకంగా వినియోగించడం లేదు. ఈ వనరులలో అత్యధిక
భాగం సమాజంలోని కొద్దిమంది గుప్పెట్లో ఉన్నాయి. ఆ వనరులను ఎలా
వినియోగించాలో నిర్ణయించే అధికారం కూడ ఆ కొద్దిమంది చేతుల్లోనే ఉంది. వనరుల
యాజమాన్యంలోని అసమానత వల్ల, వనరుల వినియోగ నిర్ణయాధికారంలోని
అప్రజాస్వామికత వల్ల సమాజంలో అంతరాలు మరింతగా పెరుగుతున్నాయి. చారిత్రకంగా
ఉన్న అంతరాలు, సామాజిక అంతరాలు, పాలనావిధానాల వల్ల తలెత్తిన సమస్యలు, వనరుల
వినియోగంలో అసమానత వల్ల తలెత్తిన సమస్యలు, కొత్తగా పెరుగుతున్న అంతరాలు
కలగలసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని రంగాలలోనూ అసంఖ్యాక సమస్యలు
ఎదుర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నప్పుడు వారిలో
ఉత్తరాంధ్ర, గోదావరి లోయ, నల్లమల అడవులలో నివసిస్తున్న ఆదివాసుల నుంచి
రాష్ట్రమంతా వ్యాపించిన దళితుల దాకా, బంగాళాఖాతం సముద్రతీరం పొడవునా ఉన్న
మత్స్యకారుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జీవనవృత్తులలో ఉన్న వెనుకబడిన
కులాల దాకా అనేక సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారు. మహిళలు, పురుషులు,
పిల్లలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాలను పాటించేవారు,
కార్మికులు, రైతుకూలీలు, భూమిలేని నిరుపేదలు, చిరుద్యోగులు, ఏ పూటకు ఆ పూట
తిండి కోసం వెతుక్కునే అభాగ్యులు, మధ్యతరగతి వంటి ఇతర విభజనల కింద కూడ ఈ
ప్రజాసమూహాలను చూడవచ్చు. ఈ అన్ని సమూహాలకూ సమానంగా ఉన్న రాష్ట్రవ్యాపిత
సమస్యలూ ఉన్నాయి. ఆయా సమూహాలకో, బృందాలకో, ప్రాంతాలకో ప్రత్యేకమైన సమస్యలూ
ఉన్నాయి. వీటిలో దీర్ఘకాలికమైన, లోతైన పరిష్కారం కోరుతున్న సమస్యలూ
ఉన్నాయి. తాత్కాలికమైన, అప్పటికప్పుడు ఉపశమనం కోరుతున్న సమస్యలూ ఉన్నాయి.
ఈ అంశాలను మరికొంచెం వివరంగా పరిశీలిద్దాం.
ఆంధ్రప్రదేశ్ వనరులు – భూమి
ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తీర్ణం
2,75,04,500 హెక్టార్లు (6,79,65,000 ఎకరాలు) కాగా అడవులు 62,10,369
హెక్టార్లు (1,53,46,156 ఎకరాలు), సాగుయోగ్యం కాని భూమి 20,55,568
హెక్టార్లు (50,79,419 ఎకరాలు), వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి 26,51,817
హెక్టార్లు (65,52,782 ఎకరాలు), సాగుకు యోగ్యమైన బంజరు, పచ్చిక బయళ్లు,
తోటలు, బీడు భూములు వగైరాలన్నీ కలిసి 56,28,474 హెక్టార్లు (1,39,08,262
ఎకరాలు), ఇవన్నీ పోగా నికర సాగుభూమిగా ప్రభుత్వం ప్రకటిస్తున్న భూమి
1,09,58,272 (2,70,78,479 ఎకరాలు). ఒకసారి కన్న ఎక్కువ పంటలు తీసే డెబ్బై
లక్షల ఎకరాలను కూడ కలుపుకుంటే మొత్తం సాగుభూమిగా ప్రభుత్వం గుర్తిస్తున్నది
మూడున్నరకోట్ల ఎకరాలు.
ఈ గణాంకాలను విప్పి చూసి కొంచెం వివరంగా
అర్థం చేసుకుంటే గుర్తించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. మొత్తం రాష్ట్ర
విస్తీర్ణం ఆరుకోట్ల ఎనభై లక్షల ఎకరాలు కాగా అందులో కేవలం రెండు కోట్ల
డెబ్బైలక్షల ఎకరాలలో (39 శాతం) మాత్రమే వ్యవసాయం సాగుతున్నది. సాగుకు
యోగ్యమై కూడ సాగులోకి రాకుండా ఉండి పోయిన భూమి కనీసం మరొక యాభై లక్షల
ఎకరాలు ఉంటుంది. ప్రతి సంవత్సరంలోనూ బీడుగా నమోదవుతున్న భూమి ముప్పై లక్షల
ఎకరాల దాకా ఉంటున్నది.
ఆశ్చర్యకరంగా నికర సాగుభూమి విస్తీర్ణం
1956-57లో ఎంత ఉందో (2,81,06,325 ఎకరాలు) 2008-09లో దాదాపు అంతే, కాస్త
తక్కువ కూడ ఉంది. ఈ సాగులోకి వచ్చిన భూమి కూడ ఎవరి చేతుల్లో ఎంత ఉన్నదనే
విషయం తర్వాత చర్చిద్దాం గాని, అసలు సామాజిక అవసరాలు పెరుగుతుండగా, నికర
సాగుభూమిగాని, మొత్తం సాగుభూమిగాని పెరగకపోవడం ఎందుకు జరిగిందో చూడవలసి
ఉంది. నిజంగా సాగుకు యోగ్యమైన భూమి అందుబాటులో లేకపోతే, ఉన్న భూమి నుంచే
మరింత ఫలసాయం తీసి సమాజపు ఆహార అవసరాలను తీర్చడం జరగవచ్చు. కాని
ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో అదనంగా వ్యవసాయం కిందికి తేదగిన భూమి కనీసం యాభై
లక్షల ఎకరాలు ఉంటుంది. దాన్ని వ్యవసాయ యోగ్యం చేయడానికి, అంటే నీటిపారుదల
సౌకర్యాలు కల్పించడానికి, ఆ భూములలో సాగుచేయగల ప్రత్యేక పంటలను అభివృద్ధి
చేయడానికి ఎటువంటి ప్రయత్నమూ జరగలేదు.
ఒకవేళ కొత్తగా భూమి అందుబాటులోకి రాని
పరిస్థితి ఉంటే, ఉన్న భూమికే రక్షిత నీటిపారుదల సౌకర్యాలు కల్పించి, రెండవ,
మూడవ పంటలకు అవకాశం ఇచ్చి, ఇతోధిక సాగు ద్వారా మొత్తం సాగుభూమి పెంచే
ప్రయత్నాలు చేయవచ్చు. (ఒక ఎకరంలో ఒక పంట మాత్రమే పండుతుంటే అది ఒక ఎకరం
సాగుభూమిగా, రెండు పంటలు పండుతుంటే అదే భూమి రెండు ఎకరాలుగా, మూడు పంటలు
పండుతుంటే మూడు ఎకరాలుగా గణాంకాలకు ఎక్కుతుంది). ఇప్పటికీ కేవలం ముప్పై
లక్షల ఎకరాలలో మాత్రమే ఒకటి కన్న ఎక్కువ పంటలు పండుతున్నాయి.
ఇలా భూమి పెరగకపోవడం ఒక ఎత్తయితే,
సాగుతున్న వ్యవసాయంలో కూడ పంటల నిష్పత్తి మారడం మరొక ఎత్తు. ఒకప్పుడు
ఆహారధాన్యాలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ రంగంలో మార్కెట్
కు అవసరమైన పంటల వ్యవసాయం పెరుగుతూ వచ్చింది. ఆ మేరకు ఆహార భద్రతలో కొరత
ఏర్పడుతూ వచ్చింది. గణాంకాలలో చెప్పాలంటే 1956-57లో సాగుభూమిలోని 76.4
శాతంలో ఆహారపంటలు పండించగా, 2008-09 నాటికి అది 65.9 శాతానికి పడిపోయింది.
దీన్ని మరికొంచెం వివరంగా చూస్తే, వరి సాగు 1956-57లో 72 లక్షల ఎకరాల్లో
ఉన్నదల్లా, 2008-09 నాటికి ఒక కోటీ ఎనిమిది లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే
వరి సాగులో 36 లక్షల ఎకరాల పెరుగుదల కనబడుతుంది. కాని ఇతర తిండిగింజల
విస్తీర్ణం అంతకన్న ఎక్కువగానే తగ్గిపోయింది. ఉదాహరణకు 1956-57లో 62 లక్షల
ఎకరాల్లో ఉండిన జొన్న 2008-09 నాటికి ఎనిమిది లక్షల ఎకరాలకు పడిపోయింది.
మిగిలిన తిండిగింజల విస్తీర్ణం లెక్కలు అలా ఉంచినా, పెరిగిన వరి
విస్తీర్ణం, తగ్గిన జొన్న విస్తీర్ణం కన్న తక్కువ. మరొకవైపు అప్పటికీ
ఇప్పటికీ జనాభా రెండున్నర రెట్లు పెరిగిందంటే, వరి ఉత్పాదకత ఆ స్థాయిలో
పెరగలేదంటే, మొత్తంగా తెలుగు సమాజానికి 1956లో ఉన్నంత ఆహారభద్రత 2008లో
లేదన్నమాట. ఇక వ్యవసాయాన్ని మార్కెట్ తో ముడివేసి, వ్యవసాయదారుల జీవితాలను
అంతర్జాతీయ దళారీవ్యాపారుల లాభనష్టాల క్రీడకు బలి చేసే వాణిజ్యపంటల
విస్తీర్ణం ఈ యాభై సంవత్సరాలలో విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క ఉదాహరణ
చూడాలంటే 1956-57లో పత్తి పంట విస్తీర్ణం ఏడు లక్షల ఎకరాలు ఉన్నదల్లా
2008-09 నాటికి 35 లక్షల ఎకరాలకు పెరిగింది.
ఈ గణాంకాలన్నీ కూడ రాష్ట్రంలో భూమి అనే
ప్రధాన వనరు వినియోగంలో ఉన్న సక్రమంగా వినియోగంలోకి తేకపోవడం, ఎక్కువ
భూమిని సాగు యోగ్యం చేయకపోవడం, సాగుభూమిలో కూడ సమాజానికి అవసరమైన ఆహారపంటల
స్థానంలో మార్కెట్ ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అవకతవకలను
చూపుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వనరులు – అడవి
జాతీయ అటవీ విధానం ప్రకారం మూడో వంతు (33
శాతం) అడవులు ఉండవలసి ఉండగా రాష్ట్రంలో కేవలం 22.5 శాతం మాత్రమే
అడవులున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గిపోతున్నదని ప్రతిఒక్కరికీ తెలిసిన
వాస్తవం ప్రభుత్వ గణాంకాలకు మాత్రం తెలియదు. రాష్ట్రం ఏర్పడిన నాటికీ
ప్రస్తుతానికీ అడవుల విస్తీర్ణం పదిహేను లక్షల ఎకరాలకు పైగా పెరిగిందని
ప్రభుత్వ గణాంకాలు చెపుతున్నాయి. అడవి అంటే ఏమిటి అనే నిర్వచనాన్ని
ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చి, తుప్పలను, పొదలను, చెట్ల గుబుర్లను కూడ
అడవులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఈ అంకెల గారడీని సాధించినప్పటికీ,
ఉండవలసినంత, పర్యావరణ పరిరక్షణకు, వర్షపాతం సక్రమంగా ఉండడానికి అవసరమైనంత
అడవి లేదు. అటవీ వనరులను రక్షించి, పెంపొందించవలసిన ప్రభుత్వాలు ఆ పని
చేయలేదు సరిగదా, అటవీ వనరులను పారిశ్రామిక వేత్తలకు, గనుల తవ్వకాలకు,
పట్టణీకరణకు అప్పగిస్తూ ఇష్టారాజ్యంగా దోపిడీ చేయనిచ్చాయి. పైగా అడవి
తగ్గిపోవడానికి బాధ్యతను ఆదివాసుల మీదికి, అడవి అంచు గ్రామాల ప్రజల మీదికి
నెడుతున్నాయి. నిజానికి ఆ ప్రజలు అడవిని, కలపను వాడుకున్నారనుకున్నా
అందువల్ల జరిగే అటవీ విధ్వంసం, పరిశ్రమల విధ్వంసంతో పోలిస్తే చాల తక్కువ.
ప్రభుత్వాలు అంతర్జాతీయ పర్యావరణ సంస్థల ఒత్తిడికో, పర్యావరణ ఉద్యమ
ఒత్తిడికో లొంగి అర్భాటంగా అడవుల పెంపకం కార్యక్రమాలు చేపట్టినా, ఈ కొత్త
అడవులు, మొక్కల సముదాయాలు ఈ నేలకు తగినవి కాకపోవడమో, పర్యావరణాన్ని
విధ్వంసం చేసేవి కావడమో, బహుళజాతి సంస్థల పారిశ్రామిక అవసరాలను తీర్చేవి
కావడమో ఆనవాయితీ అయింది. మొత్తంగా అటవీ వనరులు ఏ ప్రజలవో ఆ ప్రజలకు మాత్రం
అందుబాటులో లేకుండా పోయాయి.
ఆంధ్రప్రదేశ్ వనరులు – నీరు
ఇక నీరు అనే మరొక ప్రధాన వనరు వినియోగం
గురించి చూస్తే, వ్యవసాయం సాగుతున్న భూమిలో నీటిపారుదల సౌకర్యాలు అందిన
భూమి వివరాలు చూస్తే ఆంధ్ర ప్రదేశ్ సమాజం అరవై సంవత్సరాలలో ఏమి సాధించిందో,
ఏమి సాధించలేదో తేటతెల్లమవుతుంది.
మొత్తంగా రాష్ట్రానికి అందుబాటులో ఉన్న
నదీజలాలన్నిటినీ వాడుకుంటే కనీసం మూడు కోట్ల ఎకరాలకు రక్షిత నీటి పారుదల
సౌకర్యాలు కల్పించవచ్చు. కాని రాష్ట్రం ఏర్పడిన 1956-57లో మొత్తం
సాగుభూమిలో 70 లక్షల ఎకరాలు (23.8 శాతం) మాత్రమే నీటి పారుదల సౌకర్యం ఉన్న
భూమిగా నమోదయింది. అది 2008-09 నాటికి ఒక కోటీ పందొమ్మిది లక్షల ఎకరాలకు
(34.8 శాతం) పెరిగినట్టు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. అంటే స్థూలంగా
చూస్తే యాభై సంవత్సరాలలో నీటి పారుదల సౌకర్యాలు పెరిగినది అదనంగా యాభై
లక్షల ఎకరాలకు మాత్రమేనన్న మాట.
కాని ఈ గణాంకాలను కూడ విప్పి చూడవలసి ఉంది.
1956-57 నాటి డెబ్బై లక్షల ఎకరాలలో ప్రభుత్వ కాలువల ద్వారా 31 లక్షల
ఎకరాలు, ప్రైవేటు కాలువల ద్వారా 34 వేల ఎకరాలు, చెరువుల ద్వారా 29 లక్షల
ఎకరాలు, బావుల ద్వారా ఎనిమిది లక్షల ఎకరాలు, ఇతర వనరుల ద్వారా రెండు లక్షల
ఎకరాలకు సాగునీరు అందేది. 2008-09 నాటి ఒక కోటీ పందొమ్మిది లక్షల ఎకరాలలో
కాలువల ద్వారా నలభై ఒక్క లక్షల ఎకరాలు, చెరువుల ద్వారా పదహారు లక్షల
ఎకరాలు, బావుల ద్వారా యాభై ఏడు లక్షల ఎకరాలు, ఇతర వనరుల ద్వారా నాలుగు
లక్షల నలభైనాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. అంటే ప్రభుత్వం
ఏర్పాటు చేసిన భారీ, మధ్యతరహా, చిన్న తరహా నీటి పారుదల సౌకర్యాల కాలువలన్నీ
కలిసి గత యాభై సంవత్సరాలలో అదనంగా నీరు కల్పించినది కేవలం పది లక్షల
ఎకరాలకు మాత్రమేనన్నమాట. పైగా అది కూడ చెరువులను నిర్లక్ష్యం చేసి,
వాటికింద సాగయ్యే భూమిని పదమూడు లక్షల ఎకరాలు తగ్గించడం ద్వారా
జరిగిందన్నమాట. ఇక నీటి పారుదల పెరిగిందని చూపిన అంకెల గారడీ అంతా కూడ
రైతులు స్వయంగా తాము పెట్టుబడులు పెట్టి బావులు తవ్వుకుని, వాటికి అవసరమైన
విద్యుత్తు కోసం అనేక తంటాలు పడి అదనంగా సృష్టించిన యాభై లక్షల ఎకరాల
ద్వారా మాత్రమే.
ఆంధ్రప్రదేశ్ వనరులు – సముద్రతీరం
సముద్రతీరం అనే వనరుకు అనేక
ఉపయోగాలున్నాయి. అనాదిగా ఆ తీరప్రాంతాలలో జీవిస్తున్న మత్స్యకారులు సముద్రం
మీద జలచరాల వేటతో సమాజపు ఆహార అవసరాలలో గణనీయమైన భాగాన్ని తీరుస్తూ, తమ
జీవనోపాధి సాధించుకుంటున్నారు. ఆ సముద్రతీరం విదేశీ వాణిజ్యానికి, పర్యటనకు
ఒక వనరుగా ఆదాయాన్ని సమకూరుస్తుంది. ఆ సముద్ర తీర ఇసుకలో ఎన్నో విలువైన
ఖనిజాలు ఉన్నాయని వాటిని వినియోగించుకోవచ్చునని తెలుస్తోంది. కాని
ప్రస్తుతం ఈ వనరును కొత్తగా ప్రజోపయోగానికి తేవడం అలా ఉంచి, అక్కడి
మత్స్యకారులను వెళ్లగొడుతున్నారు. అంతకంతకూ ఎక్కువగా ఓడరేవులను
నిర్మించడానికి బహుళజాతి సంస్థలకు సముద్రతీరాన్ని అప్పగిస్తున్నారు.
సముద్రపు ఆటుపోట్ల నుంచి సహజ రక్షణగా ఉండే మడ అడవులను ధ్వంసం చేసి, ఆ
సముద్ర తీరాన్ని కార్పొరేట్ సంస్థలకు విలాసకేంద్రాలు ఏర్పాటు చేయడానికి
అప్పగిస్తున్నారు. సముద్రతీరాన్నీ, సముద్ర జలాల్లో చేపల వేటనూ కార్పొరేట్
వ్యాపార సంస్థల చేతుల్లో పెట్టిన ప్రభుత్వాలు ఈ వనరును, ఈ వనరు
వినియోగాన్ని ప్రజల నుంచి దూరం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వనరులు – ఖనిజాలు
ఇక ఖనిజాల కథ చాల పెద్దది. ఈ రాష్ట్రంలో
దాదాపు 50 పారిశ్రామిక ఖనిజాలు ఉన్నాయని అంచనా. వాటి వెలికితీత, ఉత్పత్తి,
వినియోగం జరుగుతున్నాయి. బొగ్గు, సహజవాయువు, సున్నపురాయి, అభ్రకం, బరైటిస్,
బాక్సైట్, సముద్రతీరపు ఇసుక, స్టియటైట్, క్వార్ట్ జ్, ఫెల్డ్ స్పార్,
మాంగనీస్, డోలమైట్, గ్రానైట్ వంటి ఖనిజాలెన్నో రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకా
వెలికితీయని, అన్వేషించవలసిన ఖనిజ నిలువలు కూడ ఉన్నాయి. ఆదిలాబాద్,
కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలోని గోదావరి – ప్రాణహిత పరీవాహక ప్రాంతంలో
కొన్ని లక్షల ఎకరాలలో విస్తరించిన సింగరేణి బొగ్గుగనులు కాక
రాష్ట్రవ్యాప్తంగా మరొక ఐదు లక్షల ఎకరాలలో వివిధ గనుల తవ్వకాలు ప్రైవేటు
వ్యక్తుల, వ్యాపారసంస్థల చేతుల్లో ఉన్నాయి.
ఈ ఖనిజాలన్నిటినీ ప్రజల ఉమ్మడి వారసత్వ
సంపదగా గుర్తించి, వాటిని ప్రజల అవసరాల కోసం, అభివృద్ధికోసం
ప్రణాళికాబద్ధంగా వినియోగించాలి. దొరికే ఖనిజ సంపదనంతా సమీక్షించి, పద్ధతి
ప్రకారం వెలికితీస్తూ, రాష్ట్రంలోనే ఆ ఖనిజాల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు
చేసి, ఒకవైపు ప్రజల పారిశ్రామిక ఉత్పత్తుల అవసరాలు తీర్చడంతో పాటు వేలాది
మందికి ఉపాధి కల్పించ వచ్చు. అ పారిశ్రామిక ఉత్పత్తుల వ్యాపారం ద్వారా
ఆదాయం సంపాదించవచ్చు. దొరికే ఖనిజాలను ఉపయోగించి విద్యుదుత్పత్తి, సిమెంట్,
ఎరువులు, సెరామిక్స్, గ్లాస్, ఉక్కు, గృహ నిర్మాణ పరికరాలు,
వినియోగవస్తువులు తయారుచేసే పరిశ్రమలు ఎన్నో స్థాపించవచ్చు. గనుల
తవ్వకాన్ని ప్రభుత్వరంగంలోనే నిర్వహిస్తూ ఖనిజాల విలువనంతా రాష్ట్ర ఖజానాకే
చేర్చవచ్చు. ఎక్కడైనా సాంకేతిక కారణాల కొద్దీ ప్రైవేటు వ్యక్తులకు,
సంస్థలకు లీజు ఇవ్వవలసి వచ్చినా ప్రజాధనం ప్రైవేటు వ్యక్తుల, సంస్థల
కైంకర్యం కాకుండా రాయల్టీలు, పన్నులు శాస్త్రీయంగా విధించి ప్రభుత్వాదాయం
పెంచవచ్చు. కాని ఈ విలువైన వనరును ప్రజల కోసం ఉపయోగించడం కాకుండా
బడావ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకుల ఆశ్రితులకు, బహుళజాతిసంస్థలకు
అప్పగించడం జరుగుతోంది.
ఎవరివీ వనరులు?
ఒక్క ఖనిజాలు మాత్రమే కాదు, వనరులన్నీ కూడ ఈ
రాష్ట్ర ప్రజలవి. శ్రమజీవులవి. భూమి పుత్రులవి. అవి ఎవరికీ సొంత ఆస్తిగా
మారిపోవడానికి వీలు లేదు. భూమి పుత్రులకైనా వాటిని వినియోగించుకునే హక్కు
మాత్రమే ఉంటుంది. వారికి కూడ వాటిని దుర్వినియోగం చేసే, పనికి రాకుండా
చేసే, ధ్వంసం చేసే హక్కు లేదు. వారు తమ జీవనానికి అవసరమైనంతవరకు వాటిని
వాడుకుని, వాటిలో పునరుత్పత్తి చేయగలిగినవాటిని పునరుత్పత్తి చేసి భవిష్యత్
తరాలకు అందజేయవలసి ఉంటుంది. శ్రమజీవులకే అటువంటి హక్కు లేదన్నప్పుడు, ఇక
శ్రమలో భాగం పంచుకోని వారికి, పాలకులకు, సంపన్నులకు వాటిమీద హక్కు ఉండే
అవకాశం ఎంత మాత్రం లేదు. కాని చరిత్ర పొడుగునా పిడికెడు మంది సంపన్నులు,
పాలకులు, మిగులు ఉత్పత్తిని తమ సొంతం చేసుకున్న వారు ఈ వనరులన్నిటి మీద తమ
గుత్తాధిపత్యాన్ని స్థాపించుకున్నారు. పాలన ద్వారా, తామే రూపొందించిన
చట్టాల ద్వారా, సాంఘిక వ్యవస్థలో తామే నిర్ణయించిన అంతరాల ద్వారా, మతాచారాల
ద్వారా, బలప్రయోగం ద్వారా ఈ వనరుల మీద అధికారాన్ని నిలుపుకుంటున్నారు. ఆ
అధికారాన్ని నిలిపి ఉంచుకోవడానికి దౌర్జన్యం సాగిస్తున్నారు. మరొకవైపు
వనరుల వినియోగంలో గాని, నిర్ణయాధికారంలోగాని తమ వాటా తమకు దక్కాలని, ఆ
వనరుల వినియోగం ద్వారా తమ జీవనం మెరుగుపడాలని కోరుకునే శ్రమజీవులు ఆ
కోరికను అనేక రూపాల్లో ప్రకటిస్తున్నారు. మనకు కనబడినా కనబడకపోయినా ఇలా
ఎదురెదురుగా మోహరించిన రెండు వర్గాల మధ్య సామాజిక వనరుల వినియోగం మీద హక్కు
కోసం, ఆ వినియోగం ఎలా ఉండాలనే నిర్ణయాధికారం కోసం ఘర్షణ ప్రత్యక్షంగానూ
పరోక్షంగానూ సాగుతోంది. “ఇంతవరకూ నడిచిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే”
అని మార్క్స్, ఎంగెల్స్ లు ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో రాసిన ప్రారంభ
వాక్యానికి అర్థం ఇదే.
ఆంధ్రప్రదేశ్ – ప్రజలు
ఆంధ్రప్రదేశ్ సమాజంలో కూడ ప్రజల చరిత్రలో ఈ
ఘర్షణ స్పష్టంగా కనబడుతుంది. ఈ సమాజానికి అందివచ్చిన వనరులలో తమ వాటా తమకు
దక్కాలని శ్రమజీవుల ఆకాంక్ష ఎన్నో దశాబ్దాలుగా వ్యక్తమవుతోంది. అసలు వారి
వాటా వారికి దక్కడం మాత్రమే కాదు, సామాజిక వనరుల వినియోగం, నిర్ణయాధికారం
మొత్తంగా వ్యక్తిగతంగా జరగగూడదని, సామాజికంగానే జరగాలనే సైద్ధాంతిక ఆకాంక్ష
తెలుగు సమాజంలో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడడానికి కనీసం నాలుగైదు దశాబ్దాల
ముందునుంచే ఉన్నాయి.
ఆర్థికంగానూ, సామాజికంగానూ,
సాంస్కృతికంగానూ అంతరాల దొంతరగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ సమాజంలో ఒక కొసన
ఎటువంటి ఆధునిక సౌకర్యాలూ అందని నిరుపేద ఆదివాసులు ఉండగా మరొక కొసన సకల
సౌకర్యాలూ అనుభవిస్తూ, అధికారం చలాయిస్తూ, అంతర్జాతీయ సమాజం అనబడేదానిలో
చేరడానికి ఉవ్విళ్లూరుతున్న శతకోటీశ్వరులయిన పిడికెడు మంది ఉన్నారు.
ఆదిలాబాదు నుంచి శ్రీకాకుళం దాకా విస్తరించిన గోదావరీ తీర అరణ్యం, దాని
కొనసాగింపుగా తూర్పు కనుమల దాకా సాగిన అరణ్యంలో గోండు, కోలాం, పరధాను, కోయ,
గొత్తికోయ, కొండరెడ్డి, గదబ, వాల్మీకి, ఖోండ్, సవర, జాతాపు వంటి అనేక
ఆదివాసి సమూహాలు ఉన్నాయి. రాష్ట్రం మధ్య భాగంలో కృష్ణాతీరంలో నల్లగొండ,
మహబూబ్ నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో విస్తరించిన నల్లమల
అడవులలో చెంచులు ఉన్నారు. మైదాన ప్రాంతాలలో, చిట్టడవులలో ఎరుకల, లంబాడా,
సుగాలీ, యానాది వంటి ఆదివాసి తెగలు ఉన్నాయి. ఈ ఆదివాసులు మొత్తం రాష్ట్ర
జనాభాలో 6.6 శాతం ఆక్రమిస్తున్నారు. రాష్ట్రంలోని వనరుల మీద ఈ ఆదివాసులకు
వారి జనాభా నిష్పత్తిలో కాదు గదా, కనీసం మనుగడకు సరిపోయే స్థాయిలో కూడ
అధికారం లేదు. అంటే వారికి నిత్యజీవితంలో బతుకే ఒక సమస్య. అక్కడినుంచి
విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా, సమాచార సంబంధాలు, వ్యవసాయం, ఉపాధి,
రాజకీయాధికారం అన్నీ సమస్యలే. ఈ సమస్యలు ఇలా ఉండగా ఈ ఆదివాసుల భూములను,
అడవులను, అక్కడ ఉన్న జల, ఖనిజ వనరులను ఆక్రమించుకోవడానికి మైదాన ప్రాంతాల
నుంచి ప్రభుత్వం, పెత్తందార్లు, బహుళజాతి సంస్థలు సాగిస్తున్న దురాక్రమణ
కూడ వీరికి ఇటీవలి కాలంలో పెద్ద సమస్యగా మారింది. వీటిలో కొన్ని సమస్యలమీద
ఆయా ఆదివాసి తెగలు విడివిడిగానో, ఉమ్మడిగానో ఆందోళనలు జరపడం, తమ ఆకాంక్షలు
వ్యక్తీకరించడం సాగుతోంది. ఆ సమస్యల మీద మాత్రమే కాదు, బయటి సమాజపు సమస్యల
పరిష్కారం కోసం కూడ పోరాటాలు ప్రారంభించిన, నడిపిన, నడుపుతున్న ఉజ్వల పోరాట
చరిత్ర ఈ ఆదివాసులది.
ఆ తర్వాత చెప్పవలసిన శ్రమజీవులు దళితులు.
మాల, మాదిగ అనే రెండు ప్రధాన కులాలలో, యాభై తొమ్మిది ఉపకులాలలో ఉన్న
దళితులు రాష్ట్ర జనాభాలో 16.2 శాతంగా ఉన్నారు. కాని రాష్ట్రంలోని ఏ ఒక్క
వనరు మీద వాళ్ల అధికారం అందులో సగం కూడ లేదు. వనరుల వినియోగం ఎలా జరగాలనే
నిర్ణయాధికారమైతే వాళ్ల చేతిలో లేనేలేదు. విద్యలోనూ, ఉద్యోగాలలోనూ రాజ్యాంగ
బద్ధంగా వారికి 15 శాతం వాటా ఉన్నప్పటికీ, దళితులలోని కొన్ని ఉపకులాలు
వాళ్ళ జనాభాకు మించి ఆ అవకాశం పొందాయని, మిగిలిన ఉపకులాలకు జనాభా నిష్పత్తి
ప్రకారం వాటా దక్కలేదని, అందువల్ల షెడ్యూల్డ్ కులాలు అనే గుర్తింపులో కూడ
వర్గీకరణ జరపాలని గత రెండు దశాబ్దాలుగా ఉద్యమం నడుస్తోంది. అది అలా ఉంచి,
ఎంతో కొంత వనరుల మీద హక్కు, నిర్ణయాధికారం సంపాదించి, అధికారవర్గంలోకి
ప్రవేశించగలిగిన దళితులు కూడ ఈ ప్రజాస్వామిక, జనాభా-నిష్పత్తి ఆధారిత
పంపిణీకి దోహదం చేసే బదులు, పాలకవర్గ అనుకూల వైఖరులు తీసుకుంటున్నారు.
చరిత్రవల్ల, పాలకులవల్ల, సొంత సమూహంలో పైకి ఎదిగివచ్చిన నాయకులవల్ల కూడ
భంగపడుతున్న కోట్లాది మంది దళిత ప్రజలకు జీవితమంతా సమస్యల మయంగా, ఆ సమస్యల
పరిష్కారానికి పోరాడడం తప్ప గత్యంతరం లేని స్థితిగా ఉంది.
ఇక వివిధ వృత్తికులాలుగా, శూద్రకులాలుగా,
శ్రామిక కులాలుగా, వెనుకబడిన కులాలుగా వేరువేరుగా గుర్తింపు పొందిన
సామాజిక వర్గాలు ఉన్నాయి. 1931 జనగణన తర్వాత వీరి జనాభా లెక్కించడం జరగలేదు
గనుక ఈ కులాల జనసంఖ్య ఎంతో కచ్చితంగా చెప్పలేం గాని, మొత్తంగా జనాభాలో
వీరు 46 శాతం నుంచి 60 శాతం దాకా ఉండవచ్చునని అంచనా. వనరుల మీద అధికారంలో
గాని, నిర్ణయాధికారంలో గాని వీరికి మొత్తంగా ఎంతో కొంత వాటా అందుతున్నదని
చెప్పవచ్చు గాని, జనాభా నిష్పత్తికి సమానంగా న్యాయం జరుగుతున్నదని మాత్రం
చెప్పలేం.
అంతేకాదు, వృత్తికులాలు అనే చారిత్రక
వాస్తవాన్నో, వెనుకబడిన కులాలు అనే రాజ్యాంగ నిర్వచనాన్నో ప్రాతిపదికగా
తీసుకుని వీరినందరినీ స్థూలంగా ఒకే ముద్దగా చూసినా, సూక్ష్మ పరిశీలనలోకి
వెళితే ఈ ముద్దలో కొన్ని కులాలు సాపేక్షికంగా ఎక్కువ అవకాశాలను అనుభవిస్తూ,
మెరుగైన స్థితిలో ఉండగా, మరికొన్ని కులాలు ఇప్పటికీ ఎటువంటి అవకాశాలు
అందకుండా, దుర్భరమైన ఆర్థిక, సామాజిక స్థితిలో ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ
వృత్తుల మీద ఆధారపడిన వడ్రంగి, కమ్మరి వంటి కులాలు వ్యవసాయంలోకి యాంత్రీకరణ
ప్రవేశించడం వల్ల జీవనోపాధి కోల్పోయాయి. చెరువులు, గ్రామ ఉమ్మడి అడవులు,
తోటలు ధ్వంసం కావడం వల్ల మత్స్యకారులు, బోయ, తెనుగు వంటి కులాల జీవనోపాధి
రద్దయింది. వస్త్ర పరిశ్రమ పెరుగుదల వల్ల, పారిశ్రామిక వస్త్రాలు చౌకగా
రావడం వల్ల, నేత కార్మికుల సహకార ప్రయత్నాలు సరిగా సాగకపోవడం వల్ల, చేనేత
కట్టడం నామోషీ అనే సామాజిక విలువల వల్ల సాలెల వృత్తి ధ్వంసమయింది.
జీవనోపాధి కోల్పోయిన స్థితిలో ఈ వృత్తిపనివారు ఆత్మహత్యలు చేసుకోవడం కూడ
సర్వసాధారణమయింది. మద్యం వ్యాపారంలో భీకరమైన పోటీ వల్ల, ప్రభుత్వమే
పారిశ్రామిక, విదేశీ మద్యాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టినందువల్ల
కల్లుగీత పనివారి జీవితాలు ధ్వంసమయ్యాయి. గ్రామీణ ఆర్థిక సామాజిక జీవనంలో
వచ్చిన అనేక మార్పుల వల్ల కుమ్మరి, కంసాలి, మేర వంటి వృత్తులకు కనీస
ప్రాధాన్యత కూడ లేకుండా పోయింది. వ్యవసాయ అనుబంధంగా కాకుండా కేవలం
సేవావృత్తి కులాలుగా ఉన్న చాకలి, మంగలి వంటి కులాలు ఎంతో కొంత గ్రామంలో
ఉండే పరిస్థితి ఉంది గాని అది కూడ చాల తక్కువ స్థాయిలోనే. మొత్తంగానే
గ్రామీణ జీవితంలో ఈ వృత్తుల, కులాల ప్రజలకు ప్రాధాన్యత తగ్గిపోవడంతో వారు
గ్రామంలో ఉంటే నిరుద్యోగంలో మగ్గిపోవడమో, లేదా పొట్ట చేత పట్టుకుని
పట్టణాలకు వలస వెళ్లడమో చేయవలసి వస్తోంది.
మొత్తంగా చూస్తే, అటు సాపేక్షికంగా ఎక్కువ
అవకాశాలు అనుభవిస్తున్న కులాలవారయినా, ఇటు ఇంకా దుర్భర స్థితిలో
ఉన్నవారయినా సమస్యల వలయంలోనే ఉన్నారు. ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన
వృత్తి కులాలవారు, వ్యవసాయం చితికిపోవడం వల్ల, యాంత్రీకరణ వల్ల జీవనోపాధి
కోల్పోగా, ఇతర వృత్తులలోకి, ఉద్యోగాలలోకి, ఉపాధి అవకాశాలలోకి
ప్రవేశించడానికి తగిన విద్యావకాశాలు కూడ వారికి అందడం లేదు. ఈ సమస్యలను
పరిష్కరించుకోవడానికి పోరాట రూపాలు ఎన్నుకోవడం, ఏదో ఒకస్థాయిలో పోరాటాలు
నిర్వహించడం కూడ ఈ సామాజిక వర్గాలు చాలకాలంగా సాగిస్తున్నాయి.
ఇక అగ్రవర్ణాలుగానో, అతిశూద్రులుగానో
గుర్తింపు పొందుతూ ఉన్న కులాలలో చాలమంది వనరుల మీద, ముఖ్యంగా భూమి మీద
ఆధిపత్యాన్ని, నిర్ణయాధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ, మొత్తం జనాభాతో
పోలిస్తే వాళ్ల సంఖ్య స్వల్పమే. ఈ సామాజిక వర్గాలలో కూడ ఉద్యోగాలలోనో,
వృత్తులలోనో ఉండి సమస్యల భరితమైన జీవనాన్ని గడుపుతున్న వారి సంఖ్య ఎక్కువే.
మొత్తం మీద అతిచిన్న పాలకవర్గ సమూహం తప్ప
ఆంధ్రప్రదేశ్ సమాజమంతా సమస్యలను అనుభవిస్తూనే ఉంది. వనరుల వినియోగం మీద
ప్రజాస్వామిక అధికారం లేకపోవడం, సామాజిక వనరులను ఎలా వినియోగించాలనే
నిర్ణయాధికారంలో సమాజానికి మొత్తంగా భాగస్వామ్యం లేకపోవడం ఈ సమస్యలకు
మూలకారణాలు.
ప్రజాసమస్యలు
వనరుల వినియోగం ప్రజోపయోగకరంగా జరగాలంటే ఆ
వనరులను యథాతథంగా ఉంచితే సాధ్యం కాదు. ఆ వనరులను ఉపయోగించి చేయగల వేరువేరు
శ్రమలను, కృషిని, వృత్తులను, ఉపాధి అవకాశాలను మానవజాతి వేల ఏళ్ల పరిణామంలో
అభివృద్ధి చేసింది. వాటిని ఇవాళ సామాజిక శాస్త్రవేత్తలు ప్రధానంగా
వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగం అనే మూడు విభాగాల కింద గుర్తిస్తున్నారు. ఈ
మూడు విభాగాల శ్రమలలో, కార్యక్రమాలలో ఏ ఒక్కటి కూడ మౌలిక ప్రకృతి వనరులు
లేకుండా జరగవు. అంటే మౌలిక ప్రకృతి వనరులకు వర్తించే సామాజిక ప్రయోజనం అనే
సూత్రమే ఈ మూడు విభాగాలకు కూడ వర్తించాలి. కాని కొనసాగుతున్న వర్గ వ్యవస్థ
వల్ల, సొంత ఆస్తి పద్ధతి వల్ల ఈ మూడు విభాగాలలో కూడ కోట్లాది మంది
శ్రామికులు శ్రమ చేసినప్పటికీ, ఫలితంలో అత్యధిక భాగాన్ని “యజమానులు”
వ్యక్తిగతంగా పోగు వేసుకోవడం అనే పద్ధతే అమలవుతున్నది.
భూసంబంధాలు
భూమి మీద యాజమాన్యం విషయం చూస్తే ఇది
స్పష్టమవుతుంది. రెండు, మూడు సార్లు పంటలు తీసేదానితో సహా మొత్తం
సాగుభూమిగా ప్రభుత్వం చెపుతున్న మూడున్నర కోట్ల ఎకరాలు ఒక కోటీ ఇరవై లక్షల
కమతాల (సులభంగా అర్థం కావడం కోసం కుటుంబాలు అనుకోవచ్చు) చేతుల్లో ఉన్నది. ఆ
లెక్క ప్రకారం సగటున ఒక్కో కుటుంబం చేతిలో మూడు ఎకరాల భూమి ఉన్నదని
అనుకోవచ్చు. ఆమేరకు ఒక కుటుంబ జీవనానికి అది సరిపోతుందని కూడ అనుకోవచ్చు. ఈ
ఒక కోటీ ఇరవై లక్షల కుటుంబాలలో పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధారపడిన
శ్రమజీవులు ఎంత మంది, వ్యవసాయ భూమి సొంతదారులుగా, యజమానులుగా,
పట్టాదారులుగా లెక్కలోకి వచ్చి, వ్యవసాయంతో ఏమీ సంబంధం లేకుండా వృత్తో,
ఉద్యోగమో, వ్యాపారమో చేసుకుంటూ, భూమిని కౌలుకు ఇచ్చి, కేవలం సొంతదారు అనే
పేరుతో కౌలు ఆదాయం పొందుతున్న వారెందరు అనే చర్చను కాసేపు పక్కన పెడదాం.
నిజానికి రాష్ట్రంలో మొత్తం ఒక కోటీ డెబ్బై లక్షల కుటుంబాలు ఉండగా, గ్రామీణ
కుటుంబాల సంఖ్య ఒక కోటీ ఇరవై ఆరు లక్షలు అని ప్రభుత్వం చెపుతోంది. మరి
వ్యవసాయ కమతాలు కూడ గ్రామీణ కుటుంబాల సంఖ్యతో సమానంగా ఉన్నాయంటే గ్రామీణ
ప్రాంతాలలో ప్రతిఒక్క కుటుంబానికీ భూమి ఉందని ఒప్పుకోవలసి వస్తుంది! అది
ఎంత అబద్ధమో అందరికీ తెలుసు.
ఈ లెక్కను మరొకవైపు నుంచి కూడ చూడాలి. ఒక
చివరన ఏడు వేల కుటుంబాల చేతిలో ఆరు లక్షల ఎకరాలు ఉండగా మరొక చివరన నలభై ఆరు
లక్షల కుటుంబాల చేతిలో ముప్పై లక్షల ఎకరాలు ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలే
చెపుతున్నాయి. అంటే అతికొద్ది కుటుంబాలకేమో ఒక్కో కుటుంబానికి సగటున 85
ఎకరాలు ఉండగా అత్యధిక సంఖ్యాక కుటుంబాలకు సగటున ఒక్కో కుటుంబానికి ముప్పావు
ఎకరం కూడ లేదు. ఆ మాత్రం భూమిలో సాగుచేసుకుని, జీవనం గడపడం అసాధ్యం.
ఇప్పటికీ రాష్ట్రంలో భూమి లేని నిరుపేదల
సంఖ్య గణనీయంగానే ఉంది. గ్రామీణ జనాభాలో కనీసం ముప్పై శాతం ఈ వర్గీకరణ
కిందికి రావచ్చు. దారిద్య్రరేఖ కింద ఉన్న జనాభా అంచనాలు వేరువేరుగా
జరిగాయి. అవి కనిష్టంగా 26 శాతం నుంచి గరిష్టంగా 40 శాతం వరకు ఉన్నాయి. ఈ
దారిద్ర్యరేఖ కింద ఉన్న జనాభాలో పట్టణ ప్రాంతపు నిరుద్యోగులు,
చిరుద్యోగులు, మురికివాడల వాసులు కూడ ఉంటారు గాని అత్యధికులు గ్రామీణులే
అయి ఉంటారు. వారు భూమి మీద, అడవి మీద, నీటి మీద అధికారం లేనివారే అయి
ఉంటారు.
వ్యవసాయరంగంలోని ఈ అసమానత మొత్తంగా రాష్ట్ర
వ్యవసాయ రంగపు అస్తవ్యస్త స్థితికి ఒకానొక సూచన మాత్రమే. పారిశ్రామిక,
సేవా రంగాలలో ఈ అవ్యవస్థ ఇంకా పెద్ద ఎత్తున ఉన్నది. రాష్ట్ర ప్రజల అవసరాలను
తీర్చగల పరిశ్రమలు, సేవా రంగాలు ఏమిటి, రాష్ట్రంలో ఉన్న వనరులను సక్రమంగా
ఉపయోగించాలంటే ఏర్పరచవలసిన పారిశ్రామిక, సేవా రంగాలు ఏమిటి అనే ఆలోచన
ఎంతమాత్రం లేకుండా రాష్ట్ర పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధి జరిగింది.
ప్రజల అవసరాలతో, లభ్యమయ్యే వనరులతో ఏమీ సంబంధం లేకుండా కేవలం సంపన్నుల,
పారిశ్రామికవేత్తల, పాలకుల, వారి ఆశ్రితుల బొక్కసాలు నింపడంకోసం మాత్రమే
పారిశ్రామిక, ఆర్థిక, వాణిజ్య విధానాలు అమలయ్యాయి. వనరులను తమ వారికి
దోచిపెట్టడమే ఈ ఐదు దశాబ్దాల పాలకులందరూ ఉమ్మడిగా సాగించిన కార్యక్రమం. అ
ప్రధాన కార్యక్రమపు కొసరుగానో, ఐదేళ్లకోసారి ఎన్నికల అవసరాల కోసమో సాధారణ
ప్రజలకు తాత్కాలిక, స్వల్పస్థాయి ప్రయోజనాలు ఏవైనా అందినా అవి వ్యవస్థ
స్థితిని మార్చగలిగినవి కావు.
పారిశ్రామిక రంగం
ఎప్పుడైనా పారిశ్రామిక రంగ అభివృద్ధికి
మూడు ప్రాతిపదికలు ఉండాలి. ఒకటి, వ్యవసాయ రంగ అభివృద్ధి జరిగి అక్కడ
పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకులు, ఆ సరుకులను కొనగల మిగులు ఆదాయం ఏర్పడాలి.
వాటితో పారిశ్రామిక సరుకులకు తగిన మార్కెట్ రూపొందాలి. రెండు, వ్యవసాయరంగం
ఉత్పాదకత వల్ల గాని, సాంకేతిక విధానం వల్లగాని తన దగ్గర మిగిలిపోయిన
మనుషులను సృష్టించి వారిని పరిశ్రమలో పనిచేయడానికి తగిన కార్మిక జనాభాగా
తయారు చేయాలి. మూడు, ఆ పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకుల సరఫరా ఆ ప్రాంతంలోనే
ఉండాలి. ఈ మూడు ప్రాతిపదికలు సక్రమంగా ఉన్నప్పుడు వ్యవసాయం, పరిశ్రమ రెండు
కాళ్లమీద నడక లాగ సక్రమంగా సాగుతాయి. మొదట వ్యవసాయాధార పరిశ్రమలతో
ప్రారంభించి, ఇతర పరిశ్రమలకు విస్తరించడానికి అవకాశం వస్తుంది.
నిజానికి అటు మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర
ప్రాంతంలోనూ, ఇటు హైదరాబాద్ రాజ్యంలోని తెలంగాణలోనూ 1950 ల వరకూ ప్రధానంగా
ఏర్పాటయినవి వ్యవసాయాధార పరిశ్రమలే. కాని 1950ల తర్వాత ముడిసరుకులు ఉన్నాయా
లేవా, తగిన కార్మికులు ఉన్నారా లేరా, స్థానిక మార్కెట్ ఉందా లేదా అనే
ప్రశ్నలతో సంబంధం లేకుండా కేవలం బహుళజాతి సంస్థల, బడావ్యాపారవేత్తల,
రాజకీయవేత్తల ప్రయోజనాల కోసం, ఇష్టాయిష్టాల ప్రకారం పారిశ్రామికీకరణ
జరుగుతూ వచ్చింది. ఒక ఉదాహరణ చెప్పాలంటే పత్తి పంటలో ఏడురెట్ల విస్తీర్ణం
పెరిగినా, నేత పనిలో నైపుణ్యం ఉన్న లక్షలాది కార్మికులు సిద్ధంగా ఉన్నా,
రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ కొత్తగా పెరగలేదు సరిగదా, 1920 లనుంచి
రాష్ట్రంలో ఏర్పడుతూ వచ్చిన వస్త్ర పరిశ్రమలన్నిటినీ మూసివేయడం మొదలయింది.
క్రమక్రమంగా వ్యవసాయాధార పరిశ్రమలను ధ్వంసం చేస్తూ, దిగుమతి చేసుకున్న
రసాయనిక ముడిసరుకులను వాడే పరిశ్రమలను పెంచారు. స్థానిక ప్రజల అవసరాలను
తీర్చే సరుకులను తయారుచేసే పరిశ్రమల స్థానంలో అంతర్జాతీయ మార్కెట్ కు చౌక
ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలను పెంచారు. ఇటువంటి పారిశ్రామికీకరణ వల్ల
స్థానిక వ్యవసాయోత్పత్తులను వినియోగించుకునే పరిశ్రమలు రాలేదు. వ్యవసాయం
నుంచి బయటికి తోయబడిన జనాభాకు పరిశ్రమలలో ఉపాధి దొరకలేదు. స్థానిక
ముడిసరుకుల వినియోగం జరిగినా స్థానిక మార్కెట్ పెరగలేదు.
తెలుగు సమాజంలో పారిశ్రామికీకరణకు మరొక
ముఖం తీవ్రమైన కేంద్రీకరణ. పరిశ్రమల ఏర్పాటును వికేంద్రీకరిస్తే, వనరులు
ఉన్న అన్ని చోట్లా పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేస్తే స్థానిక ప్రజలకు
అవకాశాలు పెరిగేవి. స్థానిక అవసరాలు తెలిసేవి. స్థానిక మార్కెట్ల
అభివృద్ధి జరిగేది. నిజానికి 1960లలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ పారిశ్రామిక
వాడలను ఏర్పాటు చేసి స్థానిక, చిన్న తరహా, మధ్యంతర, అనుబంధ పరిశ్రమలను
నెలకొల్పాలనే ప్రయత్నం జరిగింది. కాని, మాతృ పరిశ్రమకు సామీప్యత, రవాణా
సౌకర్యాలు, విమానాశ్రయం, ఓడరేవు, నిపుణులయిన కార్మికుల లభ్యత, అంతర్జాతీయ
సలహాదారుల, మార్కెటింగ్ నిపుణుల లభ్యత, భూమి, బ్యాంకుల, అధికారుల సౌకర్యం
వంటి అనేక కారణాలు, సాకులు చూపి పరిశ్రమలన్నీ కూడ హైదరాబాదు, విశాఖపట్నం
చుట్టూ కేంద్రీకృతమయ్యాయి. అందువల్ల పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలు కోరుకునే
వారందరూ ఈ నగరాలకే వలస రావలసి వచ్చింది.
సేవారంగం
వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి
చెందిన కొద్దీ ఆయా రంగాలలో పనిచేసే జనాభాకు అవసరమైన సేవలను అందించే
సేవారంగం పెరుగుతుంది. విద్యా, వైద్య, రవాణా, ద్రవ్య, సమాచార, వినోద, పాలనా
తదితర రంగాలుగా ఈ రంగం అభివృద్ధి చెందుతుంది. అంటే వ్యవసాయ, పారిశ్రామిక,
సేవా రంగాల మధ్య ఒక సమతుల్యత అవసరమవుతుంది. కాని ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఈ
సమతుల్యత లోపించి, సేవారంగం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. నిజంగా ప్రజలకు
అవసరం లేని సేవలు కూడ సేవలుగా గుర్తింపు పొంది సమాజపు వనరులను, సమయాన్ని,
శక్తిని దుర్వినియోగం చేయడం ప్రారంభించాయి. లేదా, అంతర్జాతీయ మార్కెట్ లో
సేవలకు చాల గిరాకీ ఉంది గనుక, ఆంధ్రప్రదేశ్ లో ఆ సేవల ఖరీదు చాల చౌక గనుక
ఇక్కడి సేవారంగాన్ని బహుళజాతి సంస్థలు వాడుకోవడం మొదలుపెట్టాయి. అలా
సేవారంగంలో కనబడిన వాపును నిజమైన ఆర్థిక వ్యవస్థ బలంగా పాలకులు ప్రచారం
చేయడం మొదలుపెట్టారు. కాని ఈ రకంగా పెరిగిన సేవారంగం వల్ల ఆంధ్రప్రదేశ్
సమాజానికి, ముఖ్యంగా ఇప్పటికీ ప్రధానంగా గ్రామీణ సమాజంగా, వ్యవసాయ సమాజంగా,
నిరక్షరాస్య సమాజంగా, నిరుపేద సమాజంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమాజానికి
ఒరిగిందేమీ లేదు.
ఈ విషయాన్ని మరొక వైపు నుంచి చూడాలంటే
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వివిధ రంగాల వాటాను చూడాలి. రాష్ట్ర స్థూల
ఉత్పత్తి 2008-09 నాటికి రు. 3,71,229 కోట్లు ఉండగా ప్రాథమిక (వ్యవసాయ,
తదితర) రంగం వాటా రు. 91,433 కోట్లు (24.6 శాతం), పారిశ్రామిక రంగం వాటా
రు. 95,900 కోట్లు (25.8 శాతం), సేవారంగం వాటా రు. 1,83,896 కోట్లు (49.5
శాతం) గా ఉన్నాయి. ఇక్కడ రెండు విషయాలు నిశితంగా చూడాలి.
ఒకటి, రాష్ట్రంలో గ్రామీణ జనాభా 73 శాతం
ఉండగా, అందులో కనీసం 60 శాతం అయినా వ్యవసాయ రంగంలో ఉన్నారని అనుకోవచ్చు.
అంటే రాష్ట్ర జనాభాలో 60 శాతం శ్రమ ఫలితం రాష్ట్ర సంపదలో 25 శాతంగా మాత్రమే
ఉందన్నమాట. ఇందుకు రెండు కారణాలు ఉండవచ్చు. ఒకటి, వ్యవసాయ రంగంలో
సాగుతున్న ఉత్పత్తికి న్యాయంగా కట్టవలసిన విలువ కట్టకుండా ఉండవచ్చు. రెండు,
వ్యవసాయ రంగం మీద ఆధారపడవలసిన జనాభా కన్న ఎక్కువ ఆధారపడుతూ ఉండవచ్చు.
వారికి బయట ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేనందువల్ల తగిన పని ఉన్నా
లేకపోయినా వ్యవసాయ రంగాన్నే అంటి పెట్టుకుని ఉండవచ్చు. కాదని బయటికి వస్తే
నిరుద్యోగం అనుభవించవలసి రావచ్చు. రెండు, ఈ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి
ఇవాళ్టికి జరిగిన మార్పును తులనాత్మకంగా చూడాలి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి
1956-57 నాటి లెక్కలలో ఈ మూడు రంగాల మధ్య విభజన నిర్దుష్టంగా లేదు.
అందువల్ల ఆ లెక్కలు దొరుకుతున్న 1960-61లో చూస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి
మొత్తం రు. 1319 కోట్లు ఉండగా, ప్రాథమిక రంగం వాటా రు. 659 కోట్లు (49.9
శాతం), పారిశ్రామిక రంగం వాటా రు. 186 కోట్లు (14.1 శాతం), సేవారంగం వాటా
రు. 474 కోట్లు (35.9 శాతం) ఉంది. ఈ వాటాలో తారతమ్యాలు అలా ఉండగా, మొత్తం
అంకెలను చూస్తే స్థూల ఉత్పత్తి 281 రెట్లు పెరగగా, వ్యవసాయం వాటా 138
రెట్లు, పారిశ్రామిక రంగం వాటా 515 రెట్లు, సేవారంగం వాటా 387 రెట్లు
పెరిగాయి.
ఈ అంకెలన్నీ తెలిపే విషయమేమంటే
ఆంధ్రప్రదేశ్ వనరుల వినియోగం ప్రజానుకూలంగా గాని, హేతుబద్ధంగా గాని,
సక్రమంగా గాని, సమతుల్యంగా గాని జరగలేదు. అలాజరగకపోవడానికి సంపూర్ణ బాధ్యత
పాలకవర్గాలదే. రాష్ట్రంలోని వనరుల వినియోగం, వనరుల వాడకపు నిర్ణయాధికారం
ఇలా ప్రజా వ్యతిరేకంగా, పిడికెడు మంది ప్రయోజనాల కోసం సాగుతూ ఆర్థిక
అంతరాలను పెంచి పోషిస్తుండగా, చారిత్రికంగా కొనసాగుతున్న సామాజిక
వ్యవస్థలోని అంతరాలు వాటిని బలోపేతం చేశాయి. ఆర్థిక, సామాజిక అంతరాలు
జమిలిగా సాగుతూ వచ్చాయి. ఈ అంతరాలను తగ్గించడానికి, సామాజిక జీవనాన్ని
సౌకర్యవంతం చేయడానికి, పాఠ్య పుస్తకాల ప్రకారం తటస్థంగా ప్రయత్నించవలసిన
పాలన ఆ ప్రయత్నం చేయలేదు సరిగదా, ప్రజలకు అదనపు సమస్యలను సృష్టంచింది. ఈ
ఐదు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర నిండా ఈ సమస్యలు కనబడతాయి.
పాలన వల్ల, పాలనావిధానాల వల్ల ఏర్పడిన
సమస్యలు అనేకం ఉన్నాయి. వనరుల వినియోగంలో అసమానతను పాలనా విధానాలే ఎలా
పెంచి పోషించాయో పైన చూశాం. వనరుల వినియోగానికి అవసరమైన ఏర్పాట్లలో
ముఖ్యమైనవి రహదారులను, రైలు మార్గాలను ఏర్పాటు చేయడం, విద్యుత్తు సరఫరా
చేయడం, గృహ వసతి కల్పించడం, వనరుల వినియోగాన్ని సులభతరం చేయగల ప్రయాణ
సౌకర్యాలను కల్పించడం, వనరుల గురించి అవగాహన పెంచడానికి తగిన విద్యావకాశాలు
కల్పించడం, ప్రజల ఆరోగ్య సంరక్షణకు అవసరమైన పనులు చేపట్టడం, ప్రజల వినోద
అవసరాలు తీర్చడం వంటివి పాలకుల బాధ్యతలు. కాని ఈ ఐదు దశాబ్దాల పాలనలో ఈ
పనులన్నీ ఎంత గందరగోళంగా, హేతురహితంగా, ప్రజావ్యతిరేకంగా సాగుతూ వచ్చాయో, ఏ
ఒక్క రంగం తీసుకుని చూసినా వందలకొద్దీ ఉదాహరణలు కనబడతాయి. అవన్నీ సహజంగానే
ప్రజల సమస్యలకు దారితీశాయి.
ఒక్కొక్క రంగం గురించీ వివరంగా కూడ
చర్చించవచ్చు గాని స్థూలంగానైనా ప్రస్తావించాలంటే రహదారుల నిర్మాణం
ప్రజోపయోగం కోసం, ఉత్పత్తి శక్తుల అభివృద్ధిలో భాగంగా జరగలేదు. పాలకులు
రహదారులను ప్రధానంగా ముడి సరుకుల రవాణా మార్గాలుగా, సరుకులను మారుమూల
మార్కెట్లకు చేర్చేవిగానే చూశారుగాని ప్రజల ప్రయాణ సౌకర్యానికో, బయటి
ప్రపంచానికి కిటికీ గానో చూడలేదు. రాష్ట్రం ఏర్పడేనాటికి రహదారులు అన్నీ
కలిపి 17,000 కి మీ ఉన్నవల్లా 2008-09 నాటికి 1,98,365 కి.మీ. అయ్యాయి.
కాని ఇందులో సగం మొరం రోడ్లు (75,711 కి.మీ.), కంకర రోడ్లు (29,537). అంటే
వర్షాకాలంలో పనికిరాని రోడ్లు. ఈ అంకెలను జిల్లాలవారీగానూ, ముడిసరుకులు
ఉన్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు అనే విభజనవారీగానూ పరిశీలిస్తే ఇంకా
ఆశ్చర్యకరమైన సంగతులు బయటపడతాయి. ఇక రైలుమార్గాలయితే 1956 నాటికి 4,544
కి.మీ. ఉన్నవల్లా, 2009 నాటికి 4,998కి చేరాయి. అంటే రాష్ట్రం ఏర్పడ్డాక
యాభై సంవత్సరాలలో కొత్తగా వచ్చిన రైలు మార్గం కేవలం 454 కి.మీ.
మాత్రమేనన్నమాట.
విద్యారంగాన్ని ప్రాధాన్యతా రంగంగా చూసి,
ప్రజలందరికీ విద్యావకాశాలు కల్పిస్తే, వారి సృజనాత్మకత, చొరవ పెరిగి, నూతన
సాంకేతిక పరిజ్ఞానం అంది, ఉత్పత్తి శక్తులుగా వారు మెరుగైన స్థానానికి
చేరుతారని ఆధునిక ఆలొచనాపరులు భావిస్తారు. (చదువు లేనివారికి ఉత్పత్తి
శక్తిసామర్థ్యాలు లేవని కాదు, చదువు వల్ల అవి మెరుగు పడతాయని మాత్రమే).
కాని విద్య అనే కొత్త వనరును ప్రజల చేతుల్లో పెట్టడానికి ఆంధ్ర ప్రదేశ్
పాలకులు కనీస ప్రయత్నాలు కూడ చేయలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఇవాళ్టికీ
అక్షరాస్యత 60 శాతం దాటలేదు. ఈ అంకె కూడ వాస్తవికమైనది కాదు.
విద్యుత్తు, గృహ వసతి, ప్రయాణ సౌకర్యాలు,
వైద్య ఆరోగ్య సౌకర్యాలు, వినోద విజ్ఞాన సాంస్కృతిక అవసరాలు తీర్చడం వంటి ఏ
రంగం తీసుకుని చూసినా ఈ సమస్యలు, అంతరాలు, అవకతవకలు కనబడతాయి.
మరొకవైపు, తరతరాలుగా ఎప్పటినుంచో సాగి
వస్తున్న సమస్యలు – పేదరికం, భూసంబంధాల అసమానత, సామాజిక అణచివేత,
నిరక్షరాస్యత, నిరుద్యోగం వంటివి ఉండనే ఉన్నాయి. నీటిపారుదల సౌకర్యాల కొరత,
సొంత నీటివసతి కల్పించుకున్నా అవసరమైన విద్యుత్తు కొరత, విత్తనాల కొరత,
పశుసంపద కొరత, ఎరువుల కొరత, పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, మార్కెట్
దళారీ వ్యవస్థ సృష్టిస్తున్న సమస్యలు వంటి వ్యవసాయాభివృద్ధి సమస్యలు అనేకం
ఉన్నాయి. అవసరమైన చోట, అవసరమైన పరిశ్రమలు లేకపోవడం, ఉన్న పరిశ్రమలలో కూడ
ఉద్యోగ కల్పన సరిగా లేకపోవడం, పరిశ్రమలలో ఉపాధి దొరికినచొట కార్మిక స6క్షేమ
చర్యలు అమలు కాకపోవడం, పారిశ్రామిక కాలుష్యం, పట్టణీకరణ, పారిశ్రామిక
ప్రమాదాలు, వంటి పారిశ్రామికాభివృద్ధి సమస్యలు ఎన్నో ఉన్నాయి.
నిజానికి యాభై సంవత్సరాల ఆంధ్రప్రదేశ్
చరిత్రలో అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజలు ఎదుర్కొన్న సామాజిక సమస్యల
జాబితా తయారు చేస్తే కొన్ని వేల సమస్యలను నమోదు చేయవలసి ఉంటుంది.
సహజమైన ప్రజాపోరాటాలు
ఇన్ని సమస్యలతో సతమతమయ్యే ప్రజలు
తప్పనిసరిగా ఆ సమస్యల నుంచి బయటపడేందుకు తమంత తామే ప్రయత్నాలు చేయకతప్పదు.
ఇన్ని సమస్యలు ఉన్న సమాజంలో ఆయా సమస్యల పరిష్కార ప్రయత్నాలు జరగకపోతే
ఆశ్చర్యపోవాలి గాని జరిగితే కాదు. ప్రజలు తమంత తాముగానే తమ సమస్యల
పరిష్కారం కోసం అనేక అన్వేషణలు చేశారు. కొన్ని సార్లు ఈ అన్వేషణలు
సంఘటితంగా, ప్రజాసంస్థల నాయకత్వంలో, రాజకీయ పక్షాల నాయకత్వంలో సాగాయి. కాని
చాల సార్లు రాజకీయ పక్షాలు తమ తాత్కాలిక, స్వార్థ ప్రయోజనాలకోసం ఈ
ప్రయత్నాలను మధ్యలో దారి తప్పించాయి. అలా ఎన్నోసార్లు విద్రోహాలను, వంచనను
ఎదుర్కొన్న ప్రజలు కోలుకుని మళ్లీ ఆ అన్వేషణను కొనసాగించారు. ఈ ప్రయత్నాలు
పాలకవర్గాలకు విజ్ఞప్తులు చేయడం, మహజర్లు పెట్టుకోవడం, పాలకవర్గ రాజకీయ
నాయకులను, అధికార వర్గాలను ఒప్పించి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం
దగ్గరినుంచి ప్రదర్శన, సభ, చర్చ, రాస్తా రోకో, రైల్ రోకో, ధర్నా, ఘెరావ్,
బంద్, సమ్మె, విధ్వంసకాండ దాకా అన్ని రూపాలనూ సంతరించుకున్నాయి. స్థానిక,
తాత్కాలిక, చిన్న సమూహాల సమస్యలు అప్పుడప్పుడూ ఎంతో కొంత పరిష్కారం
కావడానికి కూడ అవకాశం వచ్చింది గాని, రాష్ట్రవ్యాపిత, దీర్ఘకాలిక, సామాజిక
సమస్యలు సమగ్ర పరిష్కారం కోసం ఇంకా వేచి చూస్తూనే ఉన్నాయి.
మొత్తంగా ఆంధ్రప్రదేశ్ సమాజం ముందు ఉన్న
సమస్యలను, ఆ సమస్యలకు వ్యతిరేకంగా ప్రజలు సాగిస్తున్న పోరాటాలను ఐదు
రకాలుగా గుర్తించవచ్చు. అవి 1. స్థానిక సమస్యలపై పోరాటాలు. 2. సామాజిక
అణచివేతకు వ్యతిరేక పోరాటాలు. 3. పాలకవర్గ విధానాలకు వ్యతిరేక పోరాటాలు. 4.
అభివృద్ధి కొరకు, అభివృద్ధి ఫలాలలో వాటా కొరకు పోరాటాలు. 5. సామాజిక
మార్పు కొరకు పోరాటాలు.
స్థానిక సమస్యలపై పోరాటాలు
స్థానిక సమస్యలపై పోరాటాలలో ఒక పట్టణంలోనో,
గ్రామంలోనో పారిశుధ్య సౌకర్యాలు, తాగునీటి సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు
కల్పించాలనే దగ్గరినుంచి, స్థానిక అధికారుల, పెత్తందారుల ప్రవర్తన
ప్రజానుకూలంగా లేదనే ఆందోళనల నుంచి, ఆ ప్రాంతానికి అదనపు గుర్తింపు
కావాలనే, అదనపు నిధులు కేటాయించాలనే వరకు అనేకం ఉన్నాయి. తమ ప్రాంతంలో
అడవినుంచి ఏనుగులు బయటికి వచ్చి తమ పంటలను పాడు చేస్తున్నాయని, ప్రభుత్వం,
అటవీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన చిత్తూరు రైతులు ఒక
ఉదాహరణ అయితే, తమ ప్రాంతానికి నీటి పారుదల సౌకర్యాలు కల్పించాలని, చెరువు
గండి పూడ్చాలని ఎక్కడికక్కడ రైతులు చేస్తున్న ఆందోళనలు ఎన్నో ఉన్నాయి.
సుదూరంగా ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్లడం ఇబ్బందిగా ఉందని అందువల్ల
జిల్లాను తూర్పు, పశ్చిమ జిల్లాలుగా విభజించాలని విశాలమైన ఆదిలాబాద్ లో
ఆందోళన సాగుతుంటే, విశాఖపట్నం రైల్వే విభాగాన్ని భువనేశ్వర్ అధికారం నుంచి
స్వతంత్రం చేయాలని ఆందోళన సాగుతోంది. ఉత్తరాదికీ దక్షిణాదికీ ప్రధాన లంకె
గా ఉన్న కాజీపేటలో వాగన్ వర్క్ షాప్ ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగ సమస్య
తీర్చాలని దశాబ్దాలుగా ఆందోళన సాగుతోంది. బహుశా ఇటువంటి స్థానిక ప్రజా
ఆకాంక్షలు, పోరాటాలు ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి మండలంలోనూ ఉంటాయి.
అణచివేతకు వ్యతిరేక పోరాటాలు
పైన వివరించినట్టు తెలుగు సమాజం అంతరాల మీద
ఆధారపడి ఉన్నది గనుక, ఆ అంతరాలలో వివక్షకూ అన్యాయానికీ గురయిన సమూహాలు
ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉన్నాయి. భూస్వామ్య, పెత్తందారీ అణచివేతకు
వ్యతిరేకంగా, దళితులు అనుభవిస్తున్న అస్పృశ్యతకూ అవమానానికీ వ్యతిరేకంగా,
వెనుకబడిన కులాలన్నీ అనుభవిస్తున్న కుల అణచివేతకు వ్యతిరేకంగా, స్త్రీ
పురుష అసమానతకు వ్యతిరేకంగా, మత పునాదిపై సాగే వివక్షకు వ్యతిరేకంగా,
తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, పల్నాడు ప్రాంతాలు అనుభవిస్తున్న ప్రాంతీయ
వివక్షకూ, అణచివేతకూ వ్యతిరేకంగా – ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలోని
ఎన్నో సమూహాలు తమ ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాయి. వీటిలో దీర్ఘకాలంగా
సాగుతున్న పోరాటాలూ ఉన్నాయి, అప్పటికప్పుడు తలెత్తిన సమస్యలపై నడుస్తున్న
పోరాటాలూ ఉన్నాయి. పాత అణచివేత రూపాలు మార్చుకుంటూ కొత్త అణచివేతగా
తలెత్తినకొద్దీ పోరాటాలు కూడ కొత్త వ్యక్తీకరణలు పొందుతున్నాయి.
పాలకవర్గ విధానాలకు వ్యతిరేక పోరాటాలు
సమస్యలలో పుట్టి, సమస్యలలో పెరుగుతూ ఆ
సమస్యల పరిష్కారం కోసం తమకు తోచిన మార్గాలలో ప్రయత్నిస్తున్న ప్రజలకు పాలక
విధానాలు అదనపు సమస్యలను కల్పిస్తున్నాయి. ఏదో ఒక రాజకీయార్థిక విధానమో,
ఏదో ఒక పాలక ఉత్తర్వో, చర్యో తప్పనిసరిగా ఏదో ఒక సమూహానికి ఇబ్బందికరంగా,
ప్రాణాంతకంగా కూడ ఉంటోంది. చాలసార్లు మొత్తం సమాజానికే హానికరమైన
పాలకవిధానాలు అమలవుతున్నాయి. మరీ ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా సాగుతున్న
నూతన ఆర్థిక విధానాల వరుసలో అనేక పాలక చర్యలు ప్రజలను తీవ్రంగా
ఇబ్బందులపాలు చేస్తున్నాయి. ఆయా సమస్యలపట్ల ప్రజల చైతన్యం కూడ
విస్తరిస్తోంది గనుక వాటికి వ్యతిరేకంగా పోరాటాలు కూడ పెద్దఎత్తునే
పెల్లుబుకుతున్నాయి. ఒకప్పుడు ప్రజలు మౌనంగా ఆమోదించిన ప్రభుత్వ
ఉత్తర్వులను కూడ ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, నిలువరించడానికి
ప్రయత్నిస్తున్నారు.
అభివృద్ధి ఫలాలలో వాటా కొరకు పోరాటాలు
తమ విధానాలకు, చర్యలకూ ప్రజలలో సమ్మతిని
తయారు చేసుకునేందుకు పాలకులు అభివృద్ధి భావజాలాన్ని ఉపయోగించడం ఎప్పటినుంచో
ఉన్నదే. ఈ భావజాలం సాధారణంగా మధ్యతరగతిని నమ్మిస్తుంది. ఆకర్షిస్తుంది. ఈ
అభివృద్ధి మంత్రజపానికి లోబడిన మధ్యతరగతి దానికి అనుకూల వాదనలు చేస్తూ,
అశేష ప్రజానీకానికి నష్టదాయకమైన విధానాలు నల్లేరుమీద బండినడకలా సాగడానికి
వీలు కల్పిస్తుంది. పాలకులు చెప్పేది నిజమైన అభివృద్ధి కాకపోయినా, అది
ఉద్దేశపూర్వకమైన అబద్ధమైనా, ఆ వాదననే వాడుకుని, ‘ఆ అభివృద్ధిలో మా వాటా
ఏది’ అని ప్రశ్నిస్తూ కొన్ని ప్రజాసమూహాలు పోరాటాలు ప్రారంభించాయి.
ప్రాంతీయ ఉద్యమాలు, చాల కుల ఉద్యమాలు ఈ ఆకాంక్షతోనే పోరాడుతున్నాయి. వర్గ
వ్యవస్థ కొనసాగినంతకాలం నిజమైన ప్రజల అభివృద్ధి సాధ్యం కాదని తెలిసినా,
కళ్ళముందర పిడికెడు మందయినా పాలకులు, సంపన్నులు, వారి ఆశ్రితులు, కొంతవరకు
మధ్యతరగతి అభివృద్ధి చెందినట్టు కనబడుతున్నది గనుక, ఈ అభివృద్ధి ఫలాల వాటా
కొరకు పోరాటాలకు కూడ విస్తృత మద్దతు దొరుకుతున్నది. ఈ వాటా పోరాటాలు
సామాజిక అణచివేత అంశాన్ని కూడ చాల వరకు తమలో కలుపుకుంటున్నాయి గనుక వీటి
విస్తృతి పెరుగుతున్నది.
సామాజిక మార్పు కొరకు పోరాటాలు
దాదాపుగా పై నాలుగు రకాల పోరాటాలు
సమాజాన్ని, వ్యవస్థను, రాజకీయార్థిక విధానాలను యథాతథంగా ఉంచుతూనే, తమ
సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని అనుకుంటాయి. కాని, అసలు ఈ వ్యవస్థ, ఈ
రాజకీయార్థిక విధానాలు సాగినంతకాలం సమస్యలు ఉంటాయని, పెరుగుతుంటాయని,
వ్యవస్థ మార్పు మాత్రమే నిజమైన పరిష్కారమని భావించే పోరాట దృక్పథం కూడ
ఉంది. తెలుగునేల మీద ఈ దృక్పథం 1930ల చివరినుంచే ఉంటూ, పోరాటాలు
నిర్వహిస్తూ ఉంది. అంతిమ పరిశీలనలో అన్ని సమస్యలకూ వర్గవ్యవస్థే కారణమనీ,
వర్గపోరాటం ద్వారా అధికారవర్గాన్ని కూలదోసి, ప్రజల రాజ్యాధికారం
స్థాపించిననాడే సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుందనీ ఈ దృక్పథం
భావిస్తుంది. ఆ ఆలోచనతో వర్గపోరాట నిర్మాణం, అభివృద్ధి కూడ తెలుగు సమాజంలో
సాగుతూ ఉంది. దేశం మొత్తానికీ ఇటువంటి పోరాట మార్గం చూపిన తెలంగాణ రైతాంగ
సాయుధ పోరాటం ఈ నేల మీదనే జరిగింది. అధికారమార్పిడి తర్వాత రెండు
దశాబ్దాలకు కూడ సమస్యల పరిష్కారం కాలేదనీ, అసలు వ్యవస్థ మారితే తప్ప
సమస్యలు పరిష్కారం కావనీ మళ్లీ శ్రీకాకుళం గిరిజన రైతాంగం మరొకసారి ఈ పోరాట
మార్గాన్ని ముందుకు తీసుకు వచ్చింది. ఈ మార్గంలో సాగుతున్న పోరాటాలు కూడ
ఆంధ్రప్రదేశ్ సమాజంలో అత్యంత ప్రధానమైనవి.
ముగింపు
ప్రజాసమస్యల చరిత్ర, వ్యాప్తి, స్వభావం
భిన్నంగా ఉన్నాయి గనుక ఆయా సమస్యల పరిష్కార ప్రయత్నాలు, పోరాటాలు కూడ
భిన్నంగా ఉండక తప్పదు. బహుశా అందువల్లనే ప్రజాపోరాటాలలో తీవ్రమైన వైరుధ్యం
కనబడుతున్నది. కాని ఎంత వైరుధ్యం ఉన్నప్పటికీ, ఆయా ప్రజా సమూహాలు ఒకదానితో
ఒకటి చాల తీవ్రమైన, పరుషమైన భాషలో మాట్లాడుకుంటున్నప్పటికీ, వేరువేరు భాషలు
మాట్లాడుతున్నప్పటికీ ఈ అన్ని రకాల ప్రజా పోరాటాలకూ ఒకదానితో మరొకదానికి
సన్నిహిత సంబంధం ఉంది. వీటి మధ్య సమన్వయం అవసరం ఉంది. ఇవన్నీ మౌలికంగా
ప్రజలకు చెందినవి, ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్నవి, ప్రజల అభ్యున్నతిని
కోరుకుంటున్నవి. ఇవన్నీ ఒక చారిత్రిక నియమం ప్రకారం సాగుతున్నవి. ఆ చరిత్ర
పక్షాన ఇవన్నీ ఏకం కావలసి ఉన్నది. ఈ అన్ని ఉద్యమాల మౌలిక స్వభావం ఉన్న
స్థితి మారాలనే ఆకాంక్ష. ఈ అన్ని ఉద్యమాల ప్రత్యర్థి స్వభావం ఉన్న స్థితి,
తన దోపిడీ పీడనలు యథాతథంగా కొనసాగడం. అంటే ఈ పోరాటాల మధ్య ఉన్నది వైవిధ్యం
మాత్రమే గాని వైరుధ్యం కాదు. వీటి మధ్య ఘర్షణ ఉండనవసరం లేదు. తమ తమ
ప్రత్యేకతలు వదులుకోకుండానే ఉమ్మడి ప్రత్యర్థిని గుర్తించి ఆ ఉమ్మడి
ప్రత్యర్థికి వ్యతిరేకంగా ఈ ప్రజాపోరాటాలన్నీ ఏకం కావలసి ఉన్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి