3, ఆగస్టు 2013, శనివారం

ఆటలో అరటిపండు !


August 03, 2013
హైదరాబాద్,ఆగస్ట్ 2 : రాజ్యాంగ నిబంధనల ప్రకారం... రాష్ట్ర విభజనపై రాష్ట్రపతి శాసనసభ అభిప్రాయమేమిటో తెలుసుకుంటారు. విభజనకు అసెంబ్లీ అంగీకరించవచ్చు. నిరాకరించవచ్చు. సవరణలు సూచించవచ్చు. అయితే... శాసనసభ అభిప్రాయాలను రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోవచ్చు. తీసుకోకపోనూ వచ్చు. అంటే... విభజనపై అసెంబ్లీ పాత్ర లాంఛనప్రాయం (తూతూమంత్రం) మాత్రమే. ఏదిఏమైనా అసెంబ్లీ అభిప్రాయం మాత్రం తీసుకోవాల్సిందే.


మరి... ఎమ్మెల్యేలు లేకపోతే!
విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర మంత్రులు రాజీనామాలబాట పట్టారు. అంతిమంగా ఇది రాజకీయ సంక్షోభానికి దారితీసే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే విభజనపై అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోవడం సాధ్యమౌతుందా? సభను నిర్వహించే పరిస్థితి ఉంటుందా? అసెంబ్లీ జరగని పక్షంలో విభజన బిల్లు పార్లమెంటు ముందుకు ఎలా వెళ్తుంది? ఈ సమస్యకు కూడా చట్టబద్ధమైన పరిష్కారాలున్నాయని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర కేబినెట్ రాష్ట్ర విభజనపై ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్రపతికి పంపిస్తుంది. ఈ ప్రతిపాదనపై శాసనసభ తన నిర్ణయాన్ని నిర్దిష్ట కాలవ్యవధి లోపల పంపాలని రాష్ట్రపతి శాసనసభను ఆదేశిస్తారు. ఆ గడువులోపు అసెంబ్లీ తన నిర్ణయాన్ని తెలియజేయాల్సిందే. ఆ లోపు చెప్పకపోయినా... చెప్పినట్లుగానే (డీమ్డ్) రాష్ట్రపతి పరిగణిస్తారు.


అసలు సభే లేకుంటే..
రాజీనామాలు, ఆందోళనలతో సంక్షోభం మరీ ముదిరిపోతే... అనివార్య పరిస్థితులే తలెత్తితే శాసనసభను రద్దు చేయాల్సి వస్తే! అప్పుడేం జరుగుతుంది? అప్పుడు... కేంద్రం పని మరింత సులువు అవుతుంది. శానససభ రద్దయిన పక్షంలో సభకు ఉండే అధికారాలన్నీ ఆటోమేటిక్‌గా గవర్నర్‌కు దఖలు పడతాయి. బడ్జెట్ ఆమోదంతో సహా ఏ నిర్ణయాన్ని అయినా గవర్నర్ తీసుకోవచ్చు. అందువల్ల శాసనసభ తరఫున గవర్నర్ తన నిర్ణయాన్ని కేంద్రానికి చెప్పవచ్చునని... దానిని అసెంబ్లీ నిర్ణయంగానే రాష్ట్రపతి పరిగణలోకి తీసుకుంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఏ లెక్కన చూసినా, శాసనసభ సమావేశాలు జరగక పోయినా, జరిగి ఏ నిర్ణయం ప్రకటించలేక పోయినా, మొత్తానికి సభ రద్దయినా... కేంద్రం అనుకుంటే విభజన బిల్లు ఆమోదం పొందడం ఖాయం.


వాదనలకు సరైన వేదిక...
శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రొరోగ్ కాలేదు. స్పీకర్ ఒక సాధారణ బులెటిన్ జారీ చేయడం ద్వారా ఏ రోజైనా సభను సమావేశ పరచవచ్చు. అసెంబ్లీ అభిప్రాయం కోసం రాష్ట్రపతి పంపితే... సభను సమావేశపరచకుండా ఆలస్యం చేయడానికి వీల్లేదు. స్పీకర్ నిర్ణయించిన తేదీన శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రపతి పంపిన రాష్ట్ర విభజన ప్రతిపాదనపై చర్చించి అభిప్రాయాలను ఒక తీర్మానం రూపంలో రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే రాష్ట్ర విభజన ఎలా ఉండాలి? ఆయా ప్రాంతాల ప్రజల హక్కుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి అంశాలపై సభ్యులు చేసిన సూచనలను క్రోడీకరించి కేంద్రానికి పంపించవచ్చు. వెరసి... సీమాంధ్ర ప్రజల ఆందోళనలు, అవసరాలు, డిమాండ్లను కేంద్రానికి పంపేందుకు ఇదే చక్కని వేదిక అని ముఖ్యమంత్రి కిరణ్ భావిస్తున్నారు.

అందుకే... 'రాజీనామాలు వద్దు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టేదాకా ఓపికపడదాం' అని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు సూచిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణదీ అదే మాట. సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసుకుంటూ పోతే సభలో చర్చ, అభిప్రాయాలు ఏకపక్షంగా ఉంటాయని వారు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశపరిస్తే దీనికి ముందే కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చని... ఆ భేటీకి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను పిలిపించి, ఆయా ప్రాంతాల వైఖరిని నేరుగా చెప్పవచ్చునని ఎమ్మెల్యేలకు నచ్చచెబుతున్నారు. 'నిర్ణయం జరిగిపోయింది. ఇక ఏం చేసినా లాభంలేదు. కనీసం, మనకు ఏం కావాలో సాధించుకుందాం!' అనేదే కిరణ్, బొత్సల అభిప్రాయంలాగా కనిపిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి