17, ఆగస్టు 2013, శనివారం

కాంగ్రెస్ కౌటిల్యం - యనమల రామకృష్ణుడు


August 17, 2013
ఆంధ్రప్రదేశ్ స్వార్థ, అవకాశవాద రాజకీయ సుడిగుండంలో చిక్కుకుపోయింది. ప్రజలు, ఉద్యోగులు గుడ్డిగా నమ్మి ఓట్లేసి గెలిపించిన పార్టీయే ఈ పాపానికి బాధ్యత వహించాలి. ఒక రాజకీయ పక్షాన్ని దెబ్బతీయడం కోసం ప్రజల జీవితాలను, రాష్ట్రాన్ని బలిపెట్టారు. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరి చెప్పనక్కర లేదు. 1969, 72లలో వేర్పాటువాద ఆందోళనలు నడిపించడంలోనూ కాంగ్రెస్ వాదులే ముందున్నారు. 1969లో ప్రత్యేక తెలంగాణ పేరిట ఉద్రిక్తత పెంచిన చెన్నారెడ్డి, రాజకీయ ఒప్పందం కుదరగానే సమైక్య రాష్ట్ర గద్దెపై కూర్చున్నారు.

1969, 72 ప్రాంతీయ ఉద్యమాల తరువాత సమసిపోయిన సమస్యకి బీజం ఎందుకు వేశారు? ఎలా వేశారు? అనేది ముందు చెప్పుకోవాలి. 1994, 1999లో రాష్ట్రంలో వరుస పరాజయాలతో కాంగ్రెస్ చతికిల పడింది. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని ఓడించలేమన్న భావనతో, అధికారం దక్కదన్న దుర్బుద్ధితో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి వికృత క్రీడను ఆరంభించారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. టీడీపీని రాజకీయంగా ఎదుర్కోవడానికి 42 మంది ఎమ్మెల్యేలతో టీఆర్‌సీసీ ఏర్పాటు చేయించారు. 2000 ఆగస్టు 10న లేక్ వ్యూ అతిథి గృహంలో చిన్నారెడ్డి నాయకత్వంలో సోనియా గాంధీకి ఒక మెమోరాండం ఇప్పించారు వైఎస్.

ఆ సమయంలో ఈ వాదనలకు దూరంగా కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తరువాత చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కలేదన్న అక్కసుతో 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి నేర్పాటు చేసి తెలంగాణ నినాదాన్ని కేసీఆర్ నెత్తికెత్తుకున్నారు. 2004 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు లేకుండా తెలుగుదేశం పార్టీని ఓడించలేమని భావించిన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌తో పొత్తు పెట్టుకొంది. ఏ విధంగానైనా అధికారంలోకి రావడమే ఈ పొత్తు వెనుక ఉన్న లక్ష్యం. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టారు. ఆనాడు రాష్ట్ర విభజనకు అంగీకరించిన కాంగ్రెస్‌తో సీపీఐ, సీపీఎం, ఎంఐఎం పార్టీలు కూడా 2004 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జై తెలంగాణ అన్న పార్టీతో అందరూ చేతులు కలిపారు.

సీపీఎం వారు మేము మాత్రమే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటున్నారు. కానీ ఇది వాస్తవం కాదు. 2004లో విభజన పార్టీతో చేతులు కలిపిన వారందరూ విభజనకు అంగీకరించినట్లే. అందుకే రాష్ట్రం ఇప్పుడు ఇంత సంక్షోభంలో పడింది. జై తెలంగాణ అన్న పార్టీతో చేతులు కలిపిన పార్టీకి అధికారం ఇస్తే ఇది ఎటుదారి తీస్తోందో అని ఏ కొంచెమైనా ఆలోచన చేయకుండా ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించారు. ఆ రోజు పనిచెయ్యమని ఒత్తిడి పెంచినందుకు ఉద్యోగులు చంద్రబాబుపై కోపంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. ఆ పార్టీ గెలుపునకు దోహదపడ్డారు. విభజనకు అంగీకరించిన పార్టీకి మద్దతు తెలిపితే అధికారంలోకి వచ్చాక విభజనకు పూనుకొంటే పరిస్థితి ఏమిటని ఉద్యోగులు ఆలోచించలేదు. ఈ రోజు గగ్గోలు పెడుతున్న వారందరూ 2004లో ఓటు వేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా? 2004లో ఒక్క తెలుగుదేశం పార్టీయే సమైక్యాంధ్ర నినాదంపై ఎన్నికల్లో పోటీ చేసింది.

అయితే అధికారం కోల్పోయింది. సమైక్యాంధ్ర అన్న పార్టీని ఓడించి జై తెలంగాణ అన్న పార్టీని ప్రజలు గెలిపించారు. ఇక్కడ ప్రజల్ని తప్పుపట్టాలన్న ఉద్దేశం కాదు. కానీ ఆ రోజు సమైక్యాంధ్ర నినాదంతో పోటీచేసిన పార్టీకి మద్దతు పలికి జై తెలంగాణ అన్న పార్టీతో చేతులు కలిపిన పార్టీని ఓడించి ఉంటే నేడు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు కదా. ఇది నా అభిప్రాయం.

2004లో టీఆర్ఎస్‌తో అన్ని పార్టీలు పొత్తుపెట్టుకున్న నాడే రాష్ట్ర విభజనకు బీజం పడిందని చెప్పాలి. ఆనాడే కాంగ్రెస్ పార్టీ కుట్ర బయటపడింది. 2004లో బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొన్నది. ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ వ్యతిరేకించింది. రాజధాని ఉన్న ప్రాంతాన్ని విభజించి ప్రత్యేక రాష్ట్రం చేయాలని కోరడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదని అద్వానీ అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన యూపీఏ తెలంగాణ ఇస్తామని రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చింది. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో ప్రస్తావించింది. 2004 ఎన్నికల ప్రచారానికి వచ్చిన సోనియా గాంధీ టీఆర్ఎస్ కండువా కప్పుకొని కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ బహిరంగ సభల్లో మాట్లాడుతూ 'తెలంగాణ ప్రజల మనసుల్లో ఏముందో నాకు తెలుసు. అధికారంలోకి రాగానే మీ కోరిక తీరుస్తానంటూ' ప్రసంగించారు.

ఇన్ని నిర్ణయాలు తీసుకున్న నాడు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఒక్కరూ వ్యతిరేకించలేదు. నోరెత్త లేదు. ఆనాడు అధికారంలోకి రావడానికి ఆడిన వికృత క్రీడ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసింది. తరువాత పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలుగు వారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేమిటని మాట్లాడినప్పుడు ఎవరూ ప్రశ్నించ లేదు. 2004లో అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ను, ఆలె నరేంద్రను కేంద్రంలో మంత్రులుగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ వారిని మంత్రి వర్గంలో చేర్చుకున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మూడేళ్ళు కలిసి అధికారం పంచుకున్నాయి. 2009 ఎన్నికలు దగ్గర పడినప్పుడు కాంగ్రెస్ మోసం చేసిందంటూ కేంద్ర, రాష్ట్ర మంత్రి వర్గాల నుంచి టీఆర్ఎస్ వైదొలిగింది.

తమ డిమాండ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీపై తెలంగాణ ప్రజలు ఒత్తిడి తెచ్చారు. దీంతో 2008లో తెలంగాణకు తాము అనుకూలమని తెలుగుదేశం పార్టీ కేంద్రం నియమించిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చింది. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొంది. ఫలితాలు రాకముందే బీజేపీతో జత కట్టింది. తెలంగాణకి మేమే న్యాయం చేస్తామని, మహా కూటమి కాదని 2009 ఎన్నికల ప్రచారంలో వైఎస్ పదే పదే చెప్పారు. తెలంగాణలో పోలింగ్ ముగిసిన వెంటనే క్షణమైనా ఆగకుండా కర్నూలు జిల్లా నంద్యాల బహిరంగ సభలో మాట్లాడుతూ తెలుగుదేశానికి ఓటు వేస్తే తెలంగాణ వస్తుంది, హైదరాబాద్ వెళ్ళాలంటే వీసా తీసుకొని వెళ్ళాల్సి వస్తుందంటూ ఆ ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందారు. ఇలా ప్రజల జీవితాలతో చెలగాటమాడారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తరువాత తెలుగువారి పట్ల కాంగ్రెస్ హైకమాండ్ వైఖరి నిరంకుశమే. చరిత్రను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తన ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చింది తప్ప విశాల ప్రజా ప్రయోజనాలు ఎన్నడూ పట్టించుకోలేదు.

తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడం కోసం, 2014లో రాహుల్ గాంధీకి కిరీట ధారణ చెయ్యడం కోసం రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అంతేగానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి మాత్రం కాదు. ఏమైనా రాష్ట్ర విభజనపై కీలక నిర్ణయం జరిగిపోయింది. కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ అక్షయపాత్రగా ఉపయోగపడింది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్‌లో తగినన్ని సీట్లు రాకపోతే 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందన్న భయంతో ఐక్యంగా ఉంచితే రెండు చోట్ల నష్టపోతాం, విభజించి ఒక చోటనైనా లాభపడాలన్న ఆలోచననతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సరే, నాలుగేళ్ళుగా విడిపోయి వ్యవహారాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు క్రమశిక్షణ గల కాంగ్రెస్ వాదులుగా అధిష్ఠాన నిర్ణయాన్ని శిరసావహిస్తామన్నారు.

నిర్ణయం వచ్చాక సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సమైక్యాంధ్ర అంటూ రాజీనామాలకు దిగారు. పైగా తెలుగుదేశం పార్టీ లేఖ వల్లే రాష్ట్ర విభజనకి దారితీసిందని నిందలు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యక్తమవుతున్న ఆగ్రహం నుంచి బయటపడడానికి రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడానికి ఈ చదరంగం ఆడుతున్నారు. తెలంగాణకి అనుకూలంగా ప్రజల మనోభావాలు గుర్తించి లెటరు ఇచ్చామని దానికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు నిజాయితీతో కూడిన ప్రకటన చేశారు. తెలుగు ప్రజలు సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని ఆయన ఆకాంక్షించారు.

అందరూ ఏకాభిప్రాయానికి వచ్చాకనే నిర్ణయం తీసుకుంటామన్న కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం ఉందా? కేంద్ర మంత్రులు ఒక విధంగా, సీమాంధ్ర ఎంపీలు మరో విధంగా, అధిష్ఠానం మరో విధంగా వ్యవహరిస్తూ వారి గుద్దులాటను ఇతరులపై రుద్దడం ఏమిటి? తెలంగాణలో మా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని రాజకీయ ప్రయోజనం పొందుతున్నారు, సీమాంధ్రలోనేమో తెలుగుదేశం పార్టీ ఇవ్వడం వల్లనే తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఇలా తెలుగుదేశంపై నిందవేస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఇది కాంగ్రెస్ అధిష్ఠానం ఆడిస్తున్న అంతర్నాటకంలో భాగం కాదా?

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. రాజకీయనాయకులు ప్రజలకు సేవకులుగా ఉండాలే తప్ప నిరంకుశంగా ప్రజలపై స్వారీ చేయకూడదు. ప్రజలు కూడా స్వార్థ రాజకీయాల వైపు పరుగులు తీయడం మానాలి. ఎన్ని దారుణాలకు పాల్పడినా మాకు తప్ప మరొకరికి ఓటు వేసే పరిస్థితి లేదని భావిస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలి. ప్రత్యేక రాష్ట్ర వాదాన్ని, ప్రజల్లో ఉన్న సెంటిమెంటు తీవ్రతను ఎవరూ తక్కువ చేయలేరు. దానిని ఎవరూ శంకించలేరు. డిమాండ్ అంగీకరించే ముందు దాని వల్ల ఏర్పడబోతున్న చిక్కులను పరిగణనలోకి తీసుకోలేదు. కోస్తా, రాయలసీమ ప్రజల సందేహాలను, భయాలను తొలగించలేదు. వారి ప్రయోజనాలకు ఎటువంటి ముప్పు ఉండదన్న భరోసా కల్పించ లేదు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పట్టించుకోనే లేదు. మరి ఇప్పుడు సీమాంధ్ర ఇలా తగలపడుతుండడానికి ఇవన్నీ కారణాలు కాదా? అధికారం కొరకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆంధ్రప్రదేశ్‌ని ఒక ఆటస్థలం చేసింది. కావున ఈ సంక్షోభానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంది.
- యనమల రామకృష్ణుడు
శాసనమండలి ప్రతిపక్ష నేత

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి