30, ఆగస్టు 2013, శుక్రవారం

భూ సేకరణ బిల్లు (సంపాదకీయం)

August 30, 2013
యూపీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మరో బిల్లుపై గురువారం నాడు లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. రూపా యి భారీ పతనంతో విలవిల్లాడుతున్న దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని ప్రకటన కోసం సభ్యులు ఆందోళన చేస్తున్న సమయంలోనే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేశ్ సమగ్ర భూ సేకరణ బిల్లును లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రైవేట్ ప్రాజెక్టుల విషయంలో 80 శాతం మంది, అదే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల కోసం 70 శాతం మంది భూ యజమానుల అంగీకారం అవసరమని భూసేకరణ చట్టం కీలకంగా చెబుతోంది. ఇప్పటికే లోక్‌సభలో ఆహార భద్రత బిల్లుకు ఆమోదం పొందిన యూపీఏ-2 ప్రభుత్వం పార్లమెంట్‌లో తీవ్ర గందరగోళం నడుమ అత్యంత వివాదస్పదమైన 'భూ సేకరణలో న్యాయబద్ధ పరిహార హక్కు, పారదర్శకత, పునరావాస, పరిష్కార బిల్లు'ను ప్రవేశపెట్టడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు ఈ బిల్లును విమర్శిస్తూ దాదాపు 116 సవరణలు ప్రతిపాదించాయి.


దేశానికి అవసరమైన రోడ్లు, రైలు మార్గాల వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం 1894లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన భూ సేకరణ చట్టమే ఇప్పటికీ అమలులో ఉంది. భారీ ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల నుంచి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల దాకా పలు ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ప్రజలనుంచి బలవంతంగా భూములను స్వాధీనం చేసుకున్న అనేక కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. పచ్చని క్షేత్రాలతో సహా ప్రైవేటు భూములను అత్యధిక విస్తీర్ణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించాయి. భూ సేకరణకు నిర్వాసితుల ప్రతిఘటనకు ప్రతీకగా నందిగ్రామ్ పోరాటం చరిత్ర కెక్కింది.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నుంచి, ఆగ్రాకు నిర్మించిన యమున ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం, మన రాష్ట్రంలో వాన్‌పిక్ భూములు, హైదరాబాద్‌లో సెజ్‌ల పేరుతో జరిగిన బలవంతపు భూ సేకరణల దాకా వివాదాస్పదంగా మారాయి. మన రాష్ట్రంతో సహా దేశంలో అనేక చోట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ప్రజల నుంచి నేరుగా కారుచౌకగా భూమిని సేకరించి వేలాది ఎకరాలను దేశ, విదేశ బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాయి. ప్రాజెక్టుల బాధితులు, హక్కుల సంస్థలు, వివిధ రాజకీయ పక్షాలు, ఆదివాసీలు చేసిన సంఘటిత ఉద్యమాలు ప్రభుత్వ భూసేకరణను నిలిపివేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. దాంతో దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులు పూర్తి స్థాయి నిర్మాణానికి నోచుకోలేదు. ఈ అనిశ్చిత పరిస్థితి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం వేస్తోంది.


బలవంతపు భూ సేకరణ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో 119 ఏళ్ళ నాటి కాలం చెల్లిన భూ సేకరణ చ ట్టాన్ని పక్కన బెట్టేందుకు రంగం సిద్ధమైంది. పారిశ్రామిక అవ సరాల కోసం భూమిని సేకరించే సందర్భాల్లో నిర్వాసిత కుటుంబాలకు న్యాయమైన, సముచితమైన రీతిలో పరిహారం చెల్లించేందుకు ఈ భూ సేకరణ బిల్లు వీలు కల్పిస్తుంది. గ్రామీణ ప్రాంత నిర్వాసితులకు భూమి మార్కెట్ విలువను నాలుగు రెట్లు, పట్టణ ప్రాంత నిర్వాసితులకు రెండు రెట్లు నగదు పరిహారం చెల్లించాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది. దేశాన్ని శీఘ్రగతిన పారిశ్రామికం చేయడానికి అవసరమయ్యే భూమిని సమకూర్చడమనే లక్ష్యంగా కాకుండా భూమి యజమానులకు, ఇతరత్రా దానిపై ఆధారపడి బతుకుతున్న వారందరికీ తగు రీతిలో పరిహారం అందించి, ఆ అభివృద్ధి ఫలాల్లో భాగస్వాములను చేయవలసిన అవసరం ఉంది. భూమిని సేకరించిన తర్వాత భూ యజమానులకు, దానిపై ఆధారపడి జీవిస్తున్న ఇతరులకు కూడా నిర్దేశిత మొత్తంలో జీవన భత్యం చెల్లించాలని బిల్లు చెబుతోంది.

సాగునీటి ప్రాజెక్టు కోసం భూమిని సేకరించిన సందర్భంలో, దాని ఆయకట్టులో 20 శాతం భూమిని నిర్వాసితుల కోసం కేటాయించాలని, సేకరణ సమయానికి పదేళ్ళ తర్వాత పెరిగిన భూమి ధరలో 20 శాతాన్ని భూ యజమానికి చెల్లించాలని బిల్లు చెబుతోంది. భూ నిర్వాసిత కుటుంబాల్లోని ఒకరికి వారి భూముల్లో నిర్మించే ప్రాజెక్టుల్లో ఉద్యోగం ఇవ్వాలి లేదా నగదు రూపంలో పరిహారం చెల్లించాలని బిల్లు నిర్దేశిస్తోంది. ప్రాజెక్టు నిర్వాసితుల కష్టనష్టాలను పరిగణనలోకి తీసుకొని ఒక ప్రయత్నంగా ముందుకొచ్చిన ఈ బిల్లు ఆహ్వానించదగినదే. అమలయ్యే క్రమంలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని నిర్దిష్ట కాలపరిమితిలో ఆ అనుభవాలను సమీక్షించి భూ సేకరణ చట్టాన్ని మరింతగా బలోపేతం చేయవలసి ఉంటుంది.


ప్రాజెక్టుల ప్రాంతాన్ని ముందే పసిగట్టి పేదల నుంచి కారుచౌకగా కొనుగోలు చేసి కోట్లు గడించే భూ దందా దారుల వల్ల వాస్తవ భూ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. భూ వాస్తవ యజమానులకు పరిహారంపై బీజేపీ సూచించిన సవరణ నేపథ్యంలో 2011 సెప్టెంబర్ 5 తేదీ తర్వాత సేకరించిన భూములకు చెల్లించిన పరిహారంలో 40 శాతాన్ని అసలు భూ యజమానులకు దక్కేలా బిల్లును రూపొందించారు. అయితే భూ సేకరణ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి నూతన భూ సేకరణ చట్టంలోని నిబంధన ల అమలు తీరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం, పౌర సమాజం భాగస్వామ్యంతో కూడిన, రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన నిఘా యంత్రాంగం అవసరం ఉంది.

సార్వత్రక ఎన్నికల నేపథ్యంలో 1975 నాటి భూ గరిష్ఠ పరిమితి చట్టాన్ని సవరించి భూ కమతాల పరిమాణాన్ని కుదించేందుకు కేంద్రం ముసాయిదాను ఈమధ్యనే సిద్ధం చేసింది. అయితే గరిష్ఠ పరిమితికి మించి యజమానుల వద్ద ఉన్న మిగులు భూములను పేదలకు పంపిణీ చేయాలన్నది గతంలో ప్రభుత్వ లక్ష్యంగా ఉండేది. పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకోసం భూసేకరణను మరింత పగడ్బందీగా చేసే రహస్య ఎజెండాతో కేంద్రం భూ గరిష్ఠ పరిమితిని మరింతగా కుదిస్తున్నదన్న అనుమానాలున్నాయి. భూసేకరణ, భూ గరిష్ఠ పరిమితులపై దేశవ్యాప్తంగా లోతైన చర్చ జరగాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి