August 16, 2013
తెలంగాణ! ప్రప్రథమ భాషాప్రయుక్త రాష్ట్రంలోని ఆ ప్రాంతానికి ప్రత్యేక
రాష్ట్ర ప్రతిపత్తి (లేదూ, పూర్వపు స్వతంత్ర రాష్ట్ర ప్రతిపత్తి
పునరుద్ధరణ) కల్పన ఇప్పుడు యావద్భారతీయుల మనసులను ఆవరించివున్న సమస్య.
తెలంగాణీయుల ఆకాంక్ష నెరవేరే దిశలో చోటుచేసుకొంటున్న సానుకూల, ప్రతికూల
పరిణామాలను జాతీయ, సామాజిక మాధ్యమాలు నిమిష నిమిషానికి మనకు
తెలియజేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా
ఏర్పాటు చేయడానికి (కాంగ్రెస్ నాయకత్వంలోని) కేంద్ర ప్రభుత్వం
అంగీకరించడంతో ఈ అంశంపై మీడియా శ్రద్ధాసక్తులు పరాకాష్ఠకు చేరాయి. అయితే ఈ
గడబిడ అంతా దేనిగురించి? 2000 సంవత్సరంలో చివరిసారి మూడు కొత్త రాష్ట్రాలను
ఏర్పాటు చేసినప్పుడు ఇటువంటి ఆర్భాటమేమీ లేదు. మరి ఇప్పుడు ఎందుకీ వివాదం?
ఇది, నిజంగా హైదరాబాద్ నగరం గురించేనని పలువురు భావిస్తున్నారు. 1990ల్లో
ఐ.టి. బూమ్ (వ్యాపార విజృంభణ) నాటి నుంచీ ఈ నగరం ఒక ప్రధాన ఆర్థిక
కేంద్రంగా వర్ధిల్లుతోంది.ఇటీవలి సంవత్సరాలలో, ఐ.టి. బూమ్, కులం, ప్రాంతీయ రాజకీయాల మధ్య అపవిత్ర సంబంధాలపై ఆధారపడి అమితంగా బలపడిన రియల్ ఎస్టేట్ మాఫియాకు ఆ నగరం ఒక పెద్ద పెన్నిధి అయిపోయింది. తెలంగాణ ఏర్పాటుతో తమకు అన్యాయం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ విభజనపై సంతోషంగా లేని వారు స్పష్టంగా విమర్శిస్తున్నారు. వివిధ రంగాలలో హైదరాబాద్ ప్రశస్త విజయాలకు తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల వారి సంయక్త కృషి కారణమని, కనుక తమకూ ఈ నగరంలో వాటా కల్పించాలని తెలంగాణేతర తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ అనే రత్నానికి తామూ హక్కుదారులమేనని వారు అంటున్నారు. అయితే ఇటువంటి అభిప్రాయాలు హ్రస్వ దృష్టితో కూడుకున్నవిగాను, చారిత్రకతను ప్రశ్నించిన దృక్పథంగాను మాత్రమే అర్థం చేసుకోవాలి.
తెలంగాణ వెలుపలి ప్రాంతాలవారికి అంత బాగా తెలియని సత్యం ఒకటి ఉంది. హైదరాబాద్ సఫలత ఆధునిక పరిణామం కాదు; 1990ల ఐ.టి. బూమ్‌తోనే దాని ప్రశస్తత ప్రారంభం కాలేదు. తొలుత ఖుతుబ్షాహి సుల్తానుల, పిదప నిజాం నవాబుల పాలనలో ఉన్న హైదరాబాద్ మధ్యయుగాలలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి. బ్రిటిష్ వలస పాలనాయుగంలో చివరివరకు స్వతంత్ర ప్రతిపత్తితో విలసిల్లిన సంస్థానం హైదరాబాద్. భారత స్వాతంత్య్ర సిద్ధి అనంతరం హైదరాబాద్ రాజధానిగా గల తెలంగాణ ప్రాంతం దక్షిణ భారతావనిలో ప్రభుత్వానికి చాలా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చే సంపన్న ప్రాంతాలలో ఒకటిగా వెలుగొందింది. 1948లో భారత ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రాన్ని అంటే తెలంగాణను విలీనం చేసుకొంది. 1952లో మొట్ట మొదటి ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ నాయకుడు బూర్గుల రామకృష్ణరావు తెలంగాణకు ప్రజలు ఎన్నుకొన్న తొలి పాలకుడు అయ్యారు. కోస్తాంధ్ర, రాయలసీమ ఈ రాష్ట్రంలో భాగాలుగా లేవన్న విషయాన్ని గుర్తించాలి. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి వేరుపడి, కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో అవి భాగాలుగా ఉండేవి. 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మరి రెండు వేర్వేరు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ (హైదరాబాద్ రాష్ట్రం) ఎప్పుడు, ఎందుకు, ఎలా ఒకే రాష్ట్రంగా ఏర్పడ్డాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు (లేదూ పునఃఏర్పాటు)ను అర్థం చేసుకోవడానికి చాలా కీలకమైనవి.
తెలంగాణ, ఆంధ్రలు 1956 నవంబర్ 1న విలీనమై ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవించాయి. 'విడాకులు తీసుకోవడానికి స్వేచ్ఛ ఉన్న వైవాహిక బంధంగా' ఈ విలీనాన్ని ప్రధాని నెహ్రూ పేర్కొన్నారు. విలీనం జరిగిన మొదటిరోజు నుంచి కొద్ది రోజుల క్రితం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకునేంతవరకు ఆ వైవాహిక బంధం నుంచి తనకు స్వేచ్ఛ కల్పించాలని కోరుతూ తెలంగాణ నుంచి పిటిషన్లు దాఖలవుతూనే ఉన్నాయి. ఈ విలీనానికి మూలమేమిటో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం (1955) నివేదిక ఇలా పేర్కొంది: 'ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పటి నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర తలసరి రాబడి తక్కువ. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం తెలంగాణకు తక్కువ'. ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడేందుకు తెలంగాణ ప్రజలు విముఖులుగా ఉన్నారన్న వాస్తవాన్ని ఆ నివేదిక గుర్తించింది. 'ఆంధ్ర కంటే తామే ప్రగతిశీలంగా ఉన్నామని, పాలనాపరమైన దృక్కోణం నుంచి చూసినప్పుడు ఆంధ్రతో విలీనమై సమైక్య తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు దోహదం చేయడం వల్ల తమకు ఏమీ లబ్ధి ఉండదని తెలంగాణ అభిప్రాయపడుతున్నదని' ఆ నివేదిక పేర్కొంది.
తెలంగాణ ప్రజల ఆదుర్దాను ఆ నివేదిక ఇంకా ఇలా తెలిపింది: 'విద్యా పరంగా వెనుకబడి ఉన్న తెలంగాణ ప్రజలు, ఈ విషయంలో బాగా ముందున్న కోస్తాంధ్ర వారి ఆధిపత్యంలో అణగిపోవలసి వస్తుందనే భావం తెలంగాణ వారిలో బాగా ఉన్నది. విశాలాంధ్ర ఏర్పాటుపై వారి వ్యతిరేకతకు ప్రధాన కారణాలలో ఇదొకటి. హైదరాబాద్ నగరం వెలుపల తెలంగాణ జిల్లాల్లో విద్యారంగం పూర్తిగా వెనుకబడివుంది. తత్కారణంగా ఆంధ్రలో కంటే తక్కువ విద్యార్హతలు ఉన్నవారు తెలంగాణలో ప్రభుత్వోద్యోగాలకు అర్హులవుతున్నారు. ఆంధ్రతో కలిస్తే ఈ ప్రయోజనాన్ని తాము కోల్పోవలసివస్తుందని, ప్రధాన భాగస్వామే అధిక లబ్ధి పొందగలదని తెలంగాణ వారు భయపడుతున్నారు. వ్యవస్థాపనా సామర్థ్యం కల కోస్తాంధ్ర వారికి తమ ప్రాంతం ఒక వలసగా మారిపోవచ్చని కూడా వారు భయపడుతున్నారు'. ఆంధ్ర, తెలంగాణల విలీనం వల్ల ప్రధాన ప్రయోజనాలు నదీపరీవాహక ప్రాంతాలపై నియంత్రణతో పాటు ఆర్థిక పరమైనవని ఎస్సార్సీ నివేదిక పేర్కొంది.
అయితే రెండు ప్రాంతాల విలీనాన్ని ఆ నివేదిక సిఫారసు చేయకపోవడం గమనార్హం. అందుకు బదులుగా ఇలా స్పష్టం చేసింది. 'అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం తెలంగాణను ప్రస్తుతానికి ప్రత్యేక రాష్ట్రంగా ఉంచడమే అటు ఆంధ్రకు, ఇటు తెలంగాణకు లాభకరమని మేము అభిప్రాయపడుతున్నాం. అయితే 1961 ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర శాసన సభలో మూడింట రెండువంతుల మంది రెండు తెలుగు రాష్ట్రాల ఏకీకరణకు అంగీకరిస్తే సమైక్య తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి'. తెలంగాణ ప్రజలు అంతిమంగా విలీనానికి అంగీకరిస్తారనే ఆశాభావాన్ని ఆ నివేదిక వ్యక్తం చేసింది. ఒకవేళ విలీనానికి వారు విముఖులుగా ఉంటే వారి అభిప్రాయాలను గౌరవించాలని ఆ నివేదిక స్పష్టం చేసింది.
అయితే పార్రిశామికీకరణకు ప్రాధాన్యమిస్తూ దేశ సర్వతో ముఖాభివృద్ధికి సంకల్పం వహించిన నెహ్రూ ప్రభుత్వం తెలంగాణ-ఆంధ్రల విలీనానికే నిర్ణయం తీసుకొంది. తెలంగాణ ప్రజల భయాందోళనలను తొలగించడానికై వారి ప్రయోజనాలకు 'రక్షణలు' కల్పిస్తూ 'పెద్ద మనుషుల ఒప్పందం' నొకదాన్ని రూపొందించి ఆమోదాన్ని సాధించారు. అయితే ఈ 'రక్షణల' పట్ల అప్పుడే పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. 'రాజ్యాంగ బద్ధంగా మాట్లాడితే ఈ రక్షణలు అర్థం లేనివి, వాటి అమలుకు భరోసా లేద'ని ఆనాటి పీసీసీ అధ్యక్షుడు జె.వి.నరసింగరావు వ్యాఖ్యానించడం గమనార్హం.
గమనార్హమైన మరో విషయమేమిటంటే హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు కూడా విలీనాన్ని వ్యతిరేకించారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడికి రాసిన లేఖలో బూర్గుల వారు ఇలా పేర్కొన్నారు: 'తెలంగాణ తప్పనిసరిగా ఆంధ్రతో విలీనం కావలసివస్తే దాని వల్ల సరైన ప్రయోజనం సమకూరే అవకాశం లేనందువల్ల తెలంగాణ ప్రజలు తీవ్ర మనస్తాపానికి గురవుతారు'. తెలంగాణలో సాపేక్షంగా ఆధునిక విద్యావంతులు చాలా తక్కువ మంది ఉండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడికి రాసిన లేఖలోనే ఆయనిలా పేర్కొన్నారు: 'ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ విద్యారంగంలో పూర్తిగా వెనుకబడివుంది. ముఖ్యంగా ఆంగ్ల విద్యాభ్యాసానికి ఎటువంటి నవీన సదుపాయాలు లేవు. కనుక పెద్ద రాష్ట్రంలో ప్రభుత్వోద్యాగాల విషయంలో తెలంగాణ వారు భారీగా నష్టపోయే అవకాశముంది. ఆంధ్రలో వేలాది పట్టభద్రులు ఉండగా ఇక్కడ కేవలం హైదరాబాద్‌లో కొద్ది వందల మందే ఉన్నారు. ఏ హమీలూ ఈ లోటును పూడ్చలేవు. కనుకనే విలీనంతో తమ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ప్రభుత్వోద్యోగులు కలవరపడుతున్నారు'. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు తెలుగు ఉమ్మడి భాష అయినప్పటికీ రెండు ప్రాంతాల మధ్య సామాజిక, సాంస్కృతిక అంతరాలు చాలా ఉన్నాయని అన్నారు.
వీటి కారణంగా రెండు ప్రాంతాల మధ్య పొసిగే పరిస్థితులు లేవని బూర్గుల వారు పేర్కొన్నారు. నిజాం నవాబుల పాలనలో ఉన్న 175 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు తమదైన జీవన విధానాన్ని నిర్మించుకున్నారని ఆయన తమ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రలోని తెలుగువారి జీవన శైలికి తెలంగాణలోని తెలుగు వారి జీవన విధానం పూర్తిగా భిన్నమైనదని ఆయన అన్నారు. విలీనం వల్ల తెలంగాణ వారి విలక్షణ జీవన విధానం నాశనమవుతుంది. ఈ విషయం గురించే తెలంగాణ వారు అమితంగా కలవరపడుతున్నార'ని బూర్గుల వారు తమ లేఖలో పేర్కొన్నారు. తెలుగుతో పాటు ఉర్దూ భాష కూడా తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో ఒక అంతర్భాగంగా ఉందని పేర్కొంటూ బూర్గులవారు అదే లేఖలో ఇలా రాశారు: 'తెలంగాణ ప్రజల్లో చాలామంది ఉర్దూ భాషతో మంచి పరిచయమున్నవారు. వారు ఆ భాషను చదువుతారు, మాట్లాడుతారు. వంద సంవత్సరాలకు పైగా ఆ భాష వారి జీవితాలలో ప్రధాన పాత్ర వహిస్తోంది.
పాలనా వ్యవహారాలన్నీ ఉర్దూలోనే జరుగుతాయి. రికార్డులు కూడా అదే భాషలో ఉంటాయి. కోర్టుల కార్యకలాపాలు కూడా ఉర్దూలోనే నిర్వహిస్తారు. న్యాయవాదులే కాక ఇతర వృత్తి నిపుణులు సైతం తమ కార్యకలాపాలను ఉర్దూలోనే జరుపుకుంటారు. విలీనం వల్ల తమ జీవితాలలో ఉర్దూకు ప్రస్తుతమున్న విశిష్ట పాత్రను కోల్పోవలసివస్తుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఉర్దూను ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోవడానికి వారు సిద్ధంగా లేరు'. రెండు ప్రాంతాల వారి మధ్య సంబంధాలలో అపశ్రుతుల గురించి బూర్గులవారు తమ లేఖలో ప్రస్తావించారు. దురదృష్టవశాత్తు ఆ పొరపొచ్చాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 'మాట్లాడే భాష ఒకటే అయినప్పటికీ ఇరు ప్రాంతాల వారి మధ్య ఆత్మీయ సంబంధాలు కొరవడ్డాయి. ఇందుకొక ఉదాహరణ రజాకారుల ఆరాచకాల కాలంలోను, హైదరాబాద్‌ను భారత్‌లో విలీనం చేసుకున్న అనంతరమూ ఆంధ్ర ప్రాంత అధికారులు ప్రదర్శించిన వైఖరి. మరాఠీ, కన్నడ భాష మాట్లాడే అధికారులు హైదరాబాద్ ప్రజల పట్ల ఉదాత్తంగా వ్యవహరించగా ఆంధ్ర ప్రాంతపు అధికారులు చాలా కఠినంగా వ్యవహరించారు. ఈ అధికారుల తీరుతెన్నులు తెలంగాణ ప్రజల్లో చేదు జ్ఞాపకాలను మాత్రమే మిగిల్చాయి. తెలుగు వారే అయినా తాము ఆంధ్రప్రాంతం వారి ఆధిపత్యంలో ఉండకూడదన్న అభిప్రాయం తెలంగాణ ప్రజల మనసుల్లో పాదుకున్నది'.
తెలంగాణ, ఆంధ్రల విలీనాన్ని వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణ రావు పూర్తిగా సహకరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పలు సంశయాలు వ్యక్తం చేసినప్పటికీ అదే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ఆంధ్ర, తెలంగాణలను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకోవడం యాదృచ్ఛికమే. యాదృచ్ఛిక ఘటనలకు ఇదొక ప్రామాణిక ఉదాహరణ కాదూ? తెలంగాణ-ఆంధ్రల విలీనం, ఆనాటి నాయకులు చాలామంది ఊహించిన విధంగానే, సఫలమవలేదు. పరస్పర అపనమ్మకాలతో ఆంధ్రప్రదేశ్ మనుగడ సాగించింది. కోస్తాంధ్ర ప్రాంతం వారు హైదరాబాద్‌కు వలసవచ్చి తెలంగాణ ప్రాంత సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలపై పెత్తనం చేయసాగారు. మొదటినుంచీ ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళనలు ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి. 1969లో తెలంగాణ తనకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా లేచి నిలబడింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం మహోధృతంగా జరిగింది. ఆ ఆందోళనలో 300 మం దికి పైగా యువజనులు అమరులయ్యారు.
2009నుంచి కొనసాగుతున్న నిర్ణయాత్మక ఉద్యమానికి టీఆర్ఎస్ నాయకత్వం వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ చరిత్ర వెలుగులో ఆ రాష్ట్రాన్ని ఆంధ్ర, తెలంగాణలుగా విభజించడం మరింత అర్థవంతమవుతుంది. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వెనుక చారిత్రక ప్రతిక్రియే ఏకైక ప్రేరణ అయితే అది ప్రశ్నార్థకమవుతుంది. రాజకీయ అగత్యంతోనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నదని ప్రజలు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను యథాతథంగా కొనసాగిస్తే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కనీస స్థాయిలో కూడా సీట్లు వచ్చే అవకాశం లేదు. తెలంగాణపై నిర్ణయం కనీసం ఆ ప్రాంతంలోనైనా ఆ పార్టీ విజయావకాశాలు మెరుగుపడడానికి తోడ్పడవచ్చు. హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్, ఇతర లాభదాయక వ్యాపార ప్రయోజనాలు ఉన్న కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల నాయకులు విభజనకు వ్యతిరేకంగా తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు.
సీమాంధ్రకు చెందిన సంపన్నులు, విధ్యాధికులు, అగ్రకులాలవారు విభజనను తీవ్రంగా వ్యతికిస్తున్నప్పటికీ దళితులు, ఇతర బడుగు వర్గాలకు చెందిన పలువురు ఆంధ్రప్రదేశ్ విభజనను సమర్థిస్తున్నారు. కోస్తాంధ్రకు చెందిన ప్రముఖ రచయిత, సామాజిక ఉద్యమకారుడు కత్తి పద్మారావు ఇందుకొక ఉదాహరణ. తెలంగాణ చరిత్రలో హైదరాబాద్ నగరానికి గల చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యమే తమ ఉద్యమానికి కీలకమని తెలంగాణీయులు మరింత గట్టిగా చెబుతారు. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐ.టి., ఇతర వృత్తినిపుణులతో సహా సామాన్య పౌరులకు జీవితం యథావిధిగా కొనసాగుతోంది. ఆర్థిక పండితులు జోస్యం చెప్పినట్టు సమీప భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ ధరలు తగ్గడం జరిగితే వారి జీవితాలు మరింత సుసంపన్నమయ్యే అవకాశముంది.
- మయూరికా చక్రవర్తి
అటావా విశ్వవిద్యాలయం, కెనడా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి