30, ఆగస్టు 2013, శుక్రవారం

సమన్యాయానికి సరే!



8/29/2013 12:07:36 AM
రాష్ట్ర విభజన తప్పదని తెలిసిన తరువాత సీమాంధ్ర నాయకులు కొత్త పాట అందుకున్నారు. అది తమకు ‘సమ న్యాయం’ కావాలని! వారికి తెలువకుండానే ఒక మంచి పదాన్ని ఇప్పుడు వాడుకలోకి తెచ్చినందుకు వారిని అభినందించాల్సిందే. సమన్యాయం అంటే చట్టం ముందు సమాన న్యాయం ఉండాలనే న్యాయ సూత్రంగా ప్రసిద్ధికెక్కింది. కానీ సీమాంధ్ర నేతలు అంత కచ్చితంగా కాకుండా కొంచెం విస్తృతార్థంలో తేలికగా వాడుతున్నారు. విభజన సందర్భంగా రెండు ప్రాంతాలలో తమకు అన్యాయం జరగ కూడదనేది వారు పైకి వినిపిస్తున్న వాదన. తమ ప్రాంతానికి నిజంగా నష్టమేమీ జరగడం లేదని వారికి తెలుసు. కానీ తమకు న్యాయం జరగాలని ఇక్కడి నుంచి ఢిల్లీ దాన్క రోజూ కీకలు పెడితే, నిజంగా వీళ్ళకేదో కడుపునొప్పి ఉన్నదని చూసే వాడికి జాలి పుడుతది.

దీని వల్ల విభజనను కొంత కాలం ఆపడమో, హైదరాబాద్‌పై మెలికలు పెట్టడమో జరగవచ్చుననేది వారి ఎత్తుగడ. ఈ కుట్రల సంగతెట్లా ఉన్నా నిజంగా సమన్యాయం జరిగితే అందుకు తెలంగాణ వారు కూడా సంతోషిస్తారు. నిజానికి ఈ డిమాండ్ తెలంగాణ వారి నుంచే రావలిసింది. సమన్యాయానికి సీమాంధ్ర నాయకులు ఇచ్చే నిర్వచనం ఎట్లా ఉన్నా- విభజన సందర్భంగా రెండు ప్రధానాంశాలను పరిగణనలోకి తీసుకోవాలె. ఒకటి- విలీనం నుంచి ఇప్పటి వరకు ఎవరికి అన్యాయం జరిగిందో వారికి పరిహారం ఇవ్వడం సాధ్యమా? సాధ్యమైనా కాకపోయినా అందాజా లెక్కలు తీస్తే ఎట్లా ఉంటుంది? రెండు- విభజన సందర్భంగా సీమాంధ్ర ప్రాంతీయులు ఎంత లబ్ధి పొందుతున్నారో లెక్కించి తెలంగాణ వారికి అంతే లబ్ధి చేకూర్చడంలో తప్పేముంది? ఇందుకు సీమాంధ్ర నాయకులు సిద్ధంగా ఉన్నారా?

దాదాపు ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతానికి నిధుల్లో, నీళ్ళలో, కొలువుల్లో అన్యాయం జరిగింది. సీమాంధ్ర వారు హైదరాబాద్‌లోని ఉద్యోగాల్లో అక్రమంగా చేరి జాగలు కొన్నారు. పిల్లా జెల్లతో సుఖంగా బతికారు. నీళ్ళ దోపిడీ ద్వారా సీమాంధ్ర భూస్వామ్య వర్గం బలిసిపోయింది. సినిమా, మీడియా మొదలుకొని అనేక రంగాల్లో తమ పెత్తనం సృష్టించుకున్నది. నిధుల దోపిడీ ద్వారా సీమాంవూధలోని భిన్న వర్గాలు ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనం పొందాయి. ఇక్కడి రైతులు, బీద బిక్కి ఊళ్ళు విడిచి బొంబాయి, దుబాయి పోయి దిక్కులేని బతుకులు ఈడ్వాల్సి వచ్చింది. సీమాంధ్ర వలస దోపిడీ వల్ల తెలంగాణ సమాజం అనుభవించిన క్షోభ ఏ లెక్కలకు అందనిది. మరి ఇప్పుడు దీనికి ఎంత నష్టపరిహారం లెక్క కట్టి ఇస్తారో సీమాంధ్ర నాయకులు చెప్పాలె. గడిచిందేదో గడిచి పోయింది మరిచి పోదామని తెలంగాణ వారు అనుకుంటున్నారు. ఇక్కడి సీమాంధ్ర వారిని తమలో భాగంగా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు సీమాంధ్ర నాయకులు తమకు తామే సమన్యాయం అంటున్నారు కనుక- విభజన సందర్భంగా ఏమైనా నష్టాన్ని చక్కదిద్దుతారా అనేది చర్చించుకోవడం మంచిది.

విభజన తరువాత ఒంగోలు లోనో, మంగళగిరిలోనో ఏదో ఒక చోట సీమాంధ్ర ప్రాంతానికి రాజధాని ఏర్పడుతుంది. ‘సమన్యాయం’ ప్రకారం- హైదరాబాద్‌లో ఎంత మంది ఆంధ్రా ఉద్యోగులు ఎంత కాలం ఉన్నారో , అంత మంది తెలంగాణ వారికి సీమాంవూధలో ఉద్యోగాలు ఇవ్వాలె. హైదరాబాద్‌లో ఆంధ్ర పెద్దలు ఎకరాల కొద్ది భూములు కబ్జా పెట్టారు. సీమాంధ్ర రాజధానిలో మళ్లీ అంత విలువైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తెలంగాణలోని పేద ప్రజలకు ఇవ్వాలె.

ఆదిలాబాద్ మొదలుకొని హైదరాబాద్ వరకు అన్ని జిల్లాల్లో సీమాంవూధులు కాంట్రాక్టులు, వ్యాపారాలు చేజిక్కించుకున్నారు. అధికార బలంతో అది సాధ్యమైంది. ఇప్పుడు సమన్యాయం ప్రకారం- సీమాంవూధలోని అన్ని జిల్లాల్లో అంతే లెక్కన తెలంగాణ వారికి కాంట్రాక్టులు, వ్యాపారాలు అప్పగించాలె. ఉమ్మడి రాష్ట్రంలో సంపాదించిన డబ్బుతో జాతీయ స్థాయిలో కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకుంటున్న సీమాంవూధులు ఉన్నారు. తెలంగాణ వారికి అందులో వాటా ఇవ్వాలె. నీటి ప్రాజెక్టుల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులను, కుంటలు, చెరువుల మరమ్మత్తులను ఉమ్మడి వ్యయంతో పూర్తి చేయాలె. పాత ప్రాజెక్టులతో సంబంధం లేకుండా కొత్త పంపకాలు చేయాలె. హైదరాబాద్‌ను ఎంత కాలం సీమాంవూధులు వాడుకున్నారో, తెలంగాణ వారికి మళ్లీ అంత కాలం సీమాంధ్ర రాజధానిపై హక్కు కల్పించాలె.

సీమాంధ్ర నాయకులు చెబుతున్న సమన్యాయ వాదన చాలా విచివూతంగా ఉన్నది. తమకు కొత్త రాజధాని నిర్మించి ఇవ్వాలట, దానితో పాటు హైదరాబాద్ కూడాకావాలట! హైదరాబాద్ తమకు ఇవ్వకున్నా సరే తెలంగాణ వారికి ఉండకూడదట! కేంద్ర పాలితంగా, దేశ రెండవ రాజధానిగా పెట్టి తెలంగాణ నుంచి విడదీయాలట! వీరి దృష్టిలో సమన్యాయం అంటే- తెలంగాణ ఆదాయాన్ని ఇంత కాలం దోచుకున్నాం, ఇక ముందు కూడా దోచుకుంటాం అనే కదా! ఇంత కాలం అక్రమంగా, అణచిపెట్టి కొల్లగొట్టాం, ఇప్పుడు ఒప్పందాలకు బద్ధులని చేసి ఇంకా కొల్లగొడతాం అనే కదా! ఈ వాదనను ప్రపంచంలో మెడకాయ మీద తలకాయ ఉన్నవాడెవడైనా మెచ్చుకుంటాడా? సమన్యాయం అనే ఆధునిక నీతికి, సామాజిక ఆదర్శానికి అత్యంత నీచమైన దోపిడీ నిర్వచనం ఇచ్చిన ఘనులుగా సీమాంధ్ర నాయకులు చరివూతలో నిలిచిపోతారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి