5, ఆగస్టు 2013, సోమవారం

ప్రతి అక్షరం ప్రజాద్రోహం

ప్రముఖ జర్నలిస్టు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ రాసిన “ప్రతి అక్షరం ప్రజాద్రోహం” పుస్తకం మొదటి భాగం ఇక్కడ చదవండి:
పుస్తక ప్రచురణకర్తలు: తెలంగాణ ఆత్మగౌరవ వేదిక
****

ప్రవేశిక

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక గురించి చర్చించబోయేముందు అసలు ఆ కమిటీ ఏర్పడిన తీరును, దాని విధివిధానాలు నిర్ణయమైన తీరును, దాని పనివిధానాన్ని పరిశీలించాలి. ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీకి సంబంధించిన దురాలోచనలు, పొరపాట్లు, తప్పులు, అన్యాయాలు అన్నీకూడ నివేదికతో మాత్రమే ప్రారంభం కాలేదు, అసలు కమిటీ వేయాలనే ఆలోచన దగ్గరే ప్రారంభమయ్యాయి. ఆ కమిటీ నివేదికకు భూమికగా నిలిచిన కేంద్ర ప్రభుత్వ ఆలోచనే దురాలోచన. ఆ కమిటీకి మార్గదర్శకంగా కేంద్ర ప్రభుత్వమో, కేంద్ర హోంమంత్రో, కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పాలకవర్గాలో నిర్దేశించిన దృక్పథంలోనే, అవగాహనలోనే లోపాలున్నాయి, ప్రజావ్యతిరేకత ఉంది. అదంతా చాల పెద్ద కథ. సుప్రసిద్ధమైన కేంద్ర్ర హోంమంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 9న చేసిన మొదటి ప్రకటన, డిసెంబర్ 23న చేసిన రెండో ప్రకటనల గురించి కొత్తగా చెప్పనక్కరలేదు గాని శ్రీకృష్ణ కమిటీకి పూర్వరంగాన్ని చెప్పడానికి ఈ కథ అక్కడే మొదలుపెట్టాలి.
.
డిసెంబర్ 23 తలకిందుల ప్రకటన
.
కేంద్రప్రభుత్వం తరఫున హోంమంత్రి పళనియప్పన్ చిదంబరం 2009 డిసెంబర్ 9 అర్ధరాత్రికి కొద్దిముందు చేసిన ఒక చరిత్రాత్మక ప్రకటనలో “తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతున్నది” అని అన్నారు. కాని ఆ ప్రక్రియ ప్రారంభించకుండానే పదమూడు రోజుల తర్వాత డిసెంబర్ 23న ఆయనే మరొక ప్రకటన చేశారు. “తెలంగాణ సమస్యపై డిసెంబర్ 7న ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయపక్షాలతో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఏకాభిప్రాయం వ్యక్తమయింది. ఆ సమావేశపు మినిట్స్ అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున డిసెంబర్ 9న హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. కాని ఆ ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మారిపోయాయి. చాల రాజకీయ పార్టీలలో ఈ సమస్యపై విభజన జరిగింది. ఈ మారిన పరిస్థితులలో విస్తృత సమాలోచనలు అవసరమని కేంద్ర ప్రభుత్వం భావించింది. దానికొరకు రాజకీయపార్టీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం” అని ఈ రెండో ప్రకటనలో చిదంబరం అన్నారు.
.
డిసెంబర్ 23న చేసిన ఈ రెండో ప్రకటన పచ్చి అబద్ధాల కుప్ప. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా డిసెంబర్ 9కీ డిసెంబర్ 23కూ మధ్య ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మారాయనే మాట నిజం కాదు. “మారిన పరిస్థితులు” అనేవేవైనా ఉంటే అవి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవడానికి తగినంత బలమైనవీ కావు, విస్తృత సమాలోచనలు జరపవలసిన అవసరాన్ని కల్పించేవీ కావు. రాజకీయ పార్టీలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయి ఉండవచ్చు గాని ఆయన చెప్పినట్టుగా “విభజన” జరగలేదు. డిసెంబర్ 7 అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన రాజకీయ పార్టీలలో ఒక్క ప్రజారాజ్యం పార్టీ మినహా మరే ఇతర పార్టీ కూడ ఆ అఖిలపక్ష తీర్మానం నుంచి వైదొలగలేదు. ప్రజారాజ్యం పార్టీ మాత్రమే తాను ఆ తీర్మానంతో విభేదిస్తున్నట్టూ, ఆంధ్రప్రదేశ్ యథాతథంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టూ అధికారికంగా డిసెంబర్ 16న ప్రకటించింది.  ఆయా పార్టీలలో భిన్నస్వరాలు వినిపించి ఉంటే అది ఆయా పార్టీల అంతర్గత సమస్యే తప్ప, ఏ ఒక్క పార్టీ కూడ 2009 డిసెంబర్ 23 నాటికి మాత్రమే కాదు, ఇది రాస్తున్న 2011 మార్చ్ రెండోవారానికి కూడ అధికారికంగా తమ వైఖరిని మార్చుకోలేదు. డిసెంబర్ 7 అఖిలపక్ష తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ప్రజారాజ్యం పార్టీ మినహా మరే ఇతర పార్టీలూ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు.
.
ఆ రెండు తేదీల మధ్య కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కొందరు శాసనసభ్యులు రాజీనామా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏమి జరుగుతుందోనని తమ ప్రాంతాలలో కొందరు ప్రజలలో ఉన్న భయ సందేహాలను నివృత్తి చేసి, తమ తమ పార్టీల అధికారిక నిర్ణయాన్ని ప్రచారం చేసే బాధ్యతను నెరవేర్చేబదులు, ఆయా రాజకీయ నాయకులే ప్రజలను రెచ్చగొట్టి సమస్య సృష్టించడానికి ప్రయత్నించారు. ప్రజలలో అనవసరమైన అనుమానాలను సృష్టించి పెంచి పోషించారు. అందువల్ల కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో విద్యార్థులు ఆందోళనలకు దిగారు. ఆరకంగా ఆ రాజకీయ నాయకులు చేసినది అఖిలపక్ష సమావేశపు ఉమ్మడి తీర్మానానికి ద్రోహం. అలా వారు కేంద్ర ప్రభుత్వ ప్రకటనను కూడ ఉల్లంఘించారు. తమ సొంతపార్టీ విధానాల పట్ల కూడ క్రమశిక్షణ తప్పి ప్రవర్తించారు.
.
అటువంటి సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలలో కొందరిలోనైనా ఏర్పడిన భయ సందేహాలను నివృత్తి చేసి, తన డిసెంబర్ 9 నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవలసింది. విద్యా, ఉద్యోగావకాశాల గురించి ఆ ప్రాంతాలలో కొందరు విద్యార్థులలో, నిరుద్యోగులలో ఏర్పడిన భయాలను, నీటి పారుదల సౌకర్యాల గురించి కొందరు రైతులలో కలిగిన సందేహాలను కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే చాల సులభంగా నివృత్తి చేయగలిగి ఉండేది. లేదా రాజకీయ నాయకులు ఆ పని చేయగలిగి ఉండేవారు. కాని అటు కేంద్ర ప్రభుత్వం గాని, ఇటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు గాని ఆ పని చేయలేదు. అలాగే, డిసెంబర్ 7 తీర్మాన స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్న సభ్యులను అధుపు చేయమని ఆయా రాజకీయ పార్టీలకు కేంద్ర ప్రభుత్వం సూచించి ఉండవలసింది. కాని దానిబదులు కేంద్ర ప్రభుత్వం “విస్తృత సమాలోచనలు” అవసరమనే పేరుతో తన అధికారిక ప్రకటనకు తానే తూట్లు పొడుచుకుంది. ఈ దేశంలో అత్యున్నత అధికారం ఉన్న కేంద్ర ప్రభుత్వపు మాటకు విశ్వసనీయత లేదని, కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి చేసిన ప్రకటనను నమ్మనక్కరలేదని, కేంద్ర ప్రభుత్వ వాగ్దానానికే దిక్కులేదని ఈ డిసెంబర్ 23 ప్రకటన తేల్చి చెప్పింది.
.
మళ్లీ ఆ “విస్తృత సమాలోచనలు” కూడ డిసెంబర్ 7 అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న పార్టీలతోనే జరపాలని తలపెట్టారు. ఆ ఎనిమిది పార్టీలలో ఒక్క ప్రజారాజ్యం పార్టీ మినహా మిగిలిన పార్టీలేవీ తమ అభిప్రాయం మార్చుకోలేదు గనుక వాటిని సమాలోచనలకు పిలవడమే అనవసరం, అర్థరహితం, హాస్యాస్పదం. కాని ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను పంపమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2009 డిసెంబర్ 30న అన్ని పార్టీలకూ ఉత్తరం రాసింది. రాజకీయ పార్టీ అంటేనే లోపల సభ్యులమధ్య భిన్నాభిప్రాయాలెన్ని ఉన్నా, అవి అంతర్గతంగానే చర్చించుకుని, కావాలంటే మైనారిటీ మెజారిటీకి లోబడి, బైటికి ఏకాభిప్రాయాన్ని ప్రకటించేవి అని అర్థం. ఒకవేళ లోబడి ఉండడం ఇష్టం లేకపోతే ఆ మైనారిటీ అభిప్రాయం కలవారు బయటికి వచ్చి మరొక రాజకీయపార్టీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పార్టీ అధికారిక అభిప్రాయం ఒకటి ఉండగానే, ఆ అభిప్రాయాన్ని అధికారికంగా డిసెంబర్ 7 అఖిలపక్ష సమావేశంలో ప్రకటించిన తర్వాతనే, పార్టీలో కొందరు భిన్నాభిప్రాయాన్ని ప్రకటించడం, పార్టీ అధికారిక అభిప్రాయాన్ని బహిరంగంగా ఖండిస్తున్నవారిమీద ఆ పార్టీ నాయకత్వం ఎటువంటి చర్యా తీసుకోకపోవడం, చివరికి కేంద్ర ప్రభుత్వం కూడ ఒక్కొక్క పార్టీనుంచి రెండు అభిప్రాయాలవాళ్లనూ పిలవడం జరిగాయి. ఇంత హాస్యాస్పదమైన, అసాధారణమైన దివాళాకోరు రాజకీయ ప్రవర్తన ప్రపంచంలో అతి తక్కువ సందర్భాలలో జరిగి ఉంటుంది. తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు ద్రోహం చేసే విషయంలో ఎంత అసాధారణ సన్నివేశాలైనా జరుగుతాయనడానికి ఇది నిదర్శనం.
.
కమిటీకి బీజం వేసిన జనవరి 5 అఖిలపక్ష సమావేశం
.
అలా రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఎనిమిది రాజకీయపార్టీల ప్రతినిధులు పదహారు మందితో 2010 జనవరి 5న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశం లోనే తెలంగాణ రాష్ట్ర విభజనను వాయిదావేసే, రద్దుచేసే, అంటే 2009 డిసెంబర్ 9 ప్రకటన స్ఫూర్తికి తూట్లు పొడిచే కుట్ర మొదలైంది. ఆ సమావేశంలో రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కె. రోశయ్యతో పాటు కాంగ్రెస్ తరఫున కావూరి సాంబశివరావు, ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం తరఫున యనమల రామకృష్ణుడు, రేవూరి ప్రకాశరెడ్డి, ప్రజారాజ్యం తరఫున కె చిరంజీవి, సి రామచంద్రయ్య, భారతీయ జనతా పార్టీ తరఫున బండారు దత్తాత్రేయ, కె హరిబాబు, భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున కె. నారాయణ, గుండా మల్లేశ్, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తరఫున బి వి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ తరఫున అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ, తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కె. చంద్రశేఖర రావు,  ప్రొ. కె. జయశంకర్ పాల్గొన్నారు.
.
ఆ సమావేశానికి స్వాగతోపన్యాసంగా చిదంబరం చదివిన ప్రసంగంలో తెలంగాణ ఆకాంక్ష ఎంత బలమైనదో, దానికి ఎంత సుదీర్ఘ చరిత్ర ఉన్నదో వివరణా ఉంది. ఆ ఆకాంక్ష మీద ఉద్యమాన్ని ప్రజల చేతుల్లోకి పోనివ్వవద్దని పార్లమెంటరీ రాజకీయ పక్షాలకు చేసిన హెచ్చరికా ఉన్నది. నిజానికి ఆ హెచ్చరిక ద్వారా, ఉద్యమాన్ని మళ్లీ రాజకీయ నాయకుల చేతుల్లోకి, పార్లమెంటరీ ఎన్నికల రాజకీయాల వలయంలోకి తేవడానికి అవసరమైన వ్యవధి చిక్కించుకోవడానికే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నియామకం జరిగింది.
.
ఆ పది పేరాగ్రాఫుల స్వాగతోపన్యాసంలో చిదంబరం రెండో పేరాగ్రాఫులో తన డిసెంబర్ 9 ప్రకటన మీద రాష్ట్రంలో కొన్ని పార్టీలు, కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. అది ఒకరకంగా కోస్తాంధ్ర, రాయలసీమ రాజకీయ నాయకులు అప్పటివరకూ ఆడుతున్న అబద్ధాలకు, చేస్తున్న వక్రీకరణలకు ఖండన, చెంపదెబ్బ. ఆ తర్వాత మూడు పేరాగ్రాఫులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు ఉన్న “సుదీర్ఘ  చరిత్ర”ను  చెప్పడానికి వినియోగించారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (1955) నివేదిక నాటి నుంచి 2009 డిసెంబర్ 7 అఖిలపక్ష సమావేశం దాకా సాగిన ప్రధానమైన మైలురాళ్లన్నిటినీ ప్రస్తావించారు. విస్తృత సమాలోచనలు జరపడానికి విధివిధానాలను రూపొందించవలసిన అవసరం గురించి చెప్పడానికి రెండు పేరాలు కేటాయించారు. చివరిగా తొమ్మిదో పేరాలో ఆయన చెప్పిన రెండు కీలకమైన విషయాలే (శాంతి భద్రతలను పునరుద్ధరించడం, ఉద్యమాన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాల అధీనంలోనే ఉంచడానికి ప్రయత్నించడం) శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుకు పునాది వేశాయి.
.
“మనం ఈ సమస్యల గురించి చర్చిస్తూ, సమాలోచనల ప్రక్రియను ముందుకు తీసుకుపోతున్నప్పుడే, ఆంధ్రప్రదేశ్ లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించవలసిన మౌలిక ప్రాధాన్యతను గుర్తించాలి. ఆందోళనలకూ బంద్ లకూ ముగింపు పలకాలి. శాంతి భద్రతలను కాపాడాలి. పిల్లలు పాఠశాలలకూ కళాశాలలకూ వెళ్ళాలి. ప్రజలు తమ రోజువారీ కార్యక్రమాలు జరుపుకునే వీలు కలగాలి. ప్రభుత్వం అభివృద్ధి మీదా, ప్రజాసంక్షేమం మీదా దృష్టి నిలిపే అవకాశం రావాలి. సమాలోచనలు జరుగుతుండగా శాంతి సామరస్యాలు నెలకొనడం ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అవసరం. పార్లమెంటరీ ప్రజాస్వామిక రూపాన్ని అపహాస్యం చేసే శక్తులు పొంచి కూచుని ఉన్నాయని నేను రాజకీయ పార్టీలన్నిటినీ హెచ్చరించ దలచుకున్నాను. మనను చికాకు పరుస్తున్న సమస్యలకు జవాబులు కనిపెట్టడంలో మనం విఫలమైతే వారు సంతోషిస్తారు. ఆ శక్తులు బలపడడానికి గాని, వారి మాట చెల్లడానికిగాని మనం ఎటువంటి అవకాశం ఇవ్వగూడదు” అని ఆయన ఆ పేరాలో అన్నారు.
.
“పార్లమెంటరీ ప్రజాస్వామ్యరూపాన్ని అపహాస్యం చేసే శక్తులు పొంచి కూచున్నాయ”ని హెచ్చరించడంలో కేంద్ర హోంమంత్రి స్పష్టంగానే మావోయిస్టు పార్టీనో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న ఇతర విప్లవ ప్రజాశక్తులనో బూచిగా చూపి అక్కడ కూచున్నవారందరినీ భయపెట్టదలిచారు. మావోయిస్టు పార్టీ చేతులలోకో, ఇతర పార్లమెంటరీయేతర రాజకీయ పక్షాల చేతులలోకో ఉద్యమాన్ని వెళ్లనివ్వగూడదని ఆయన హెచ్చరించదలిచారు. అంటే, మరో మాటల్లో ప్రజా ఉద్యమాన్ని ప్రజల చేతుల్లోంచి లాక్కొమ్మని ఆయన పార్లమెంటరీ రాజకీయ పార్టీలకు బెదిరింపుతో కూడిన హితబోధ చేశారు. లోపల కూచున్న ఎనిమిది పార్టీలకు చెందిన పదహారు మందీ పార్లమెంటరీ రాజకీయాలకు చెందినవాళ్లే గనుక ఆయన వాళ్లను ప్రజలనుంచి, ప్రజల న్యాయమైన ఆగ్రహ ప్రకటన నుంచి దూరం చేయడానికి పార్లమెంటరీ ప్రజాస్వామిక ఎత్తుగడ వేశారు. “మొదట శాంతిభద్రతలు నెలకొనాలి” అనే తప్పుడు వాదనను ముందుకు తెచ్చారు. “తెలంగాణలో శాంతి భద్రతలు ఏర్పడాలంటే రాష్ట్ర విభజన జరగవలసిందే” అని గాని, కనీసం “మీరు డిసెంబర్ 9న చేసిన ప్రకటనను అమలు చేయడమే శాంతి భద్రతలను నెలకొల్పుతుంది” అని గాని అక్కడ పాల్గొన్న తెలంగాణ వాదులు కూడ అనలేదు. లోపల అన్నారో లేదో తెలియదుగాని బయటికి వచ్చాకనైనా అనలేదు.
.
ఆ “శాంతి భద్రతల ఎత్తుగడ”ను చర్చించబోయే ముందు చిదంబరం చూపిన మావోయిస్టు బూచి గురించి కాస్త చెప్పాలి. నిజానికి అక్కడ కూచున్న పార్టీలలో తెలంగాణ కోసమే ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి మినహా మిగిలిన ఏ పార్టీతో పోల్చినా తెలంగాణ గురించి మాట్లాడే, పోరాడే అర్హత ఉన్నది మావోయిస్టు పార్టీకే. ఎందుకంటే ఆ పార్టీలకన్న ఎక్కువగా, ఆ మాటకొస్తే తెరాస పుట్టడానికి ముప్పై సంవత్సరాల ముందు నుంచీ కూడ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును కోరుతున్నదీ, సమర్థిస్తున్నదీ మావోయిస్టు పార్టీయే. ఆ పార్టీ పేర్లు ఆయా కాలాలలో మారి ఉండవచ్చుగాని, 1969 తెలంగాణ ఉద్యమం నాటినుంచీ కూడ నిర్విరామంగా, దృఢంగా తెలంగాణ ఆకాంక్షలను సమర్థిస్తున్న పార్టీ అది. అక్కడ కూచున్న మిగిలిన పార్టీలన్నీ 1969 నుంచీ ఇప్పటివరకూ అనేక పిల్లి మొగ్గలు వేసినవే. లేదా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినవే. తెరాస అప్పటికి పుట్టనే లేదు. “పార్లమెంటరీ రాజకీయాలను అపహాస్యం చేసే శక్తులు” అనే పేరిట మావోయిస్టు పార్టీ వంటి దృఢమైన తెలంగాణ సమర్థక శక్తిని పక్కకు తొలగించాలనే దురుద్దేశం తోనే చిదంబరం ఈ ఎత్తుగడ వేశారు.
.
ఇక శాంతి భద్రతల మంత్ర జపం చూస్తే, ప్రజల న్యాయమైన ఆగ్రహ ప్రకటనలన్నిటినీ, ప్రజలు పరిష్కారం కోరే సమస్యలన్నిటినీ శాంతి భద్రతల పేరు చెప్పి అణచివేయడం ఈ దేశ పాలకవర్గాలకు తరతరాలుగా అలవాటయిన విద్య. ప్రజల ఆందోళనకు మూలమైన సమస్యలను పరిష్కరించకుండా శాంతి భద్రతల గురించి మాట్లాడడమంటే ఆ సమస్యలను పరిష్కరించే ఉద్దేశం తమకు లేదని చెప్పడమే. శాంతి భద్రతల పేరుతో ఆ ఆకాంక్షలను, ఆందోళనలను అణచివేస్తామని చెప్పడమే. ఆ పదహారు మందిలో ఐదారుగురికి తెలంగాణ ప్రజా ఆకాంక్షల పట్ల గౌరవమే లేదు, అణచివేసి అయినా సరే శ్మశాన శాంతిని నెలకొల్పాలని వారి కోరిక. కాని తెలంగాణ ఆకాంక్షలకు నాయకత్వం వహిస్తున్న వారు, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించినవారు కూడ ఈ “శాంతి భద్రతల” కుట్రను గుర్తించలేకపోయారు. అందుకే తెలంగాణ విషయంలో పరస్పర విరుద్ధమైన అభిప్రాయం ప్రకటించినవాళ్లందరూ కూడ శాంతిని నెలకొల్పాలనే ప్రకటన మీద మాత్రం ఉమ్మడిగా సంతకం చేశారు.
.
ఆ సమావేశం తర్వాత “విస్తృత సమాలోచనల కోసం ఒక కమిటీ ఏర్పడుతుంద”నే ప్రకటన వెలువడింది. ఆ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారో ఆరోజే ఊహాగానాలు సాగాయి. కాని దాదాపు నెలరోజులు ఏ పనీ జరగలేదు. చివరికి ఫిబ్రవరి 3న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి ఎన్ శ్రీకృష్ణ నాయకత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ (కమిటీ ఫర్ కన్సల్టేషన్స్ ఆన్ ది సిచువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్) ఏర్పాటు జరిగింది. కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మాజీ కార్యదర్శి వి కె దుగ్గల్ కార్యదర్శిగా, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్, న్యాయశాస్త్ర నిపుణుడు ప్రొ. రణబీర్ సింగ్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రిసర్చ్ (ఎన్ సి ఎ ఇ ఆర్) ప్రధాన అర్థశాస్త్రవేత్త డా. అబుసలే షరీఫ్, ఢిల్లీ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ ఐ టి) సామాజికశాస్త్ర ప్రొఫెసర్ డా. రవీందర్ కౌర్ సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ విచారణాంశాలను ఫిబ్రవరి 12న ప్రకటించారు.
.
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటే ఒక కుట్ర
.
ఈ చరిత్ర మొత్తం చూస్తే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ 9 ప్రకటన స్ఫూర్తికి కొనసాగింపు కాదని, డిసెంబర్ 23 ప్రకటనకు కొనసాగింపు అనీ స్పష్టంగానే అర్థమవుతుంది. అంటే మౌలికంగానే ఈ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి, వాయిదా వేయడానికి, తప్పకపోతే తెలంగాణ ఇచ్చినా చెడగొట్టి ఇవ్వడానికి మార్గాలు సూచించడమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పాటయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలా, సమైక్య రాష్ట్రం కొనసాగాలా అనే చర్చ చేయడానికే తప్ప, “రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ”లో భాగమైన చర్యలు చేపట్టడానికి శ్రీకృష్ణ కమిటీ ఏర్పడలేదు. అంటే కేంద్రప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన తన ప్రకటనకు తానే కట్టుబడి ఉండదలచుకోలేదని స్వయంగానే, స్పష్టంగానే ప్రకటించిందన్నమాట.
.
అలా ప్రాథమికంగానే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు అనుమానాస్పదంగా ఉండగా, ఆ క్రమంలో సాగిన కాలయాపన మరిన్ని అనుమానాలకు దారితీసింది. విస్తృత సమాలోచనలు అవసరమని ప్రకటించిన తర్వాత రెండు వారాలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా, ఆ సమావేశంలో కమిటీ వేయాలని నిర్ణయించినా, కమిటీ పేర్లు ప్రకటించడానికి మరొక నాలుగు వారాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ కమిటీ విచారణాంశాలు ప్రకటించడానికి మరొక పది రోజులు తీసుకున్నారు. ఆ కమిటీ విచారణకు పది నెలల గడువు పెట్టారు. ఇదంతా చూస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు పరిష్కారం వెతకడం కన్న, తాత్సారం చేసి, నానబెట్టి, వాయిదావేసి అసలు సమస్యలనుంచి దృష్టి మళ్లించడమే, ఈలోగా శాంతిభద్రతల సాకుచెప్పి ఉద్యమాన్ని అణచివేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టమవుతుంది. అప్పటికే ఒక మాజీ పోలీసు అధికారిని గవర్నర్ గా పంపించారు. తెలంగాణ ప్రజాందోళన మీద దమనకాండ అమలుచేయడం ప్రారంభించారు. ఆ ఆందోళన పూర్తిగా చల్లారిందని అనుకున్న తర్వాతనే, కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులు, నాయకులు కోరుకున్న పద్ధతిలోనే సమస్యను పరిష్కరించడానికి ఢిల్లీ పాలకులు పన్నాగాలు పన్నారనడానికి ఈ కమిటీ ఏర్పాటు ఒక ఉదాహరణ.
.
కమిటీ విచారణాంశాల తయారీ మరొక కుట్ర
.
కమిటీ ఏర్పాటులోనే దురుద్దేశ్యం ఉన్నదనుకుంటే, ఆ కమిటీ విచారణాంశాల ప్రకటనలో అది మరింత స్పష్టంగా బయటపడింది. చిదంబరం డిసెంబర్ 23 ప్రకటనలో “విస్తృత సమాలోచనలు” అవసరమని అన్నారు. విచారణాంశాలు రూపొందేటప్పటికి ఆ విస్తృతం మరీ విస్తృతమైపోయి యాభై ఏళ్ల చరిత్ర పరిశీలనగా మారింది. అసలు డిసెంబర్ 9 ప్రకటనలో చెప్పిన “రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ” కొరకు సమాలోచనలు అవసరమై ఉండగా, విచారణాంశాలలో ఆ “ప్రక్రియ” ఊసే మాయమైపోయి, “ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి గురించి సమాలోచనలు” ముందుకొచ్చాయి.
హోం మంత్రిత్వ శాఖ 2010 ఫిబ్రవరి 12న చేసిన ప్రకటన ప్రకారం ఆ విచారణాంశాలు ఏడు. అవి తెలంగాణ ప్రజా ఆకాంక్షలను అవమానించేలా, సమైక్యాంధ్ర కొనసాగింపును బలపరిచేలా, తెలంగాణ ప్రజాందోళనలో చీలికలు తెచ్చేలా, అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయి. పేరుకు ఏడు విచారణాంశాలు అని లెక్క చెప్పారు గాని ఆ మొత్తం విచారణాంశాలను రెండుగానో, మూడుగానో చెప్పవచ్చు.
.
మొదటి అంశం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, సమైక్యాంధ్రప్రదేశ్ కొనసాగింపు ఉద్యమాల వల్ల ఏర్పడిన పరిస్థితిని పరీక్షించడం; రెండవ అంశం, రాష్ట్రం ఏర్పాటు అయినప్పటినుంచి జరిగిన అభివృద్ధిని, వివిధ ప్రాంతాల మీద ఆ అభివృద్ధి ప్రభావాన్ని సమీక్షించడం; మూడవ అంశం, విభిన్నవర్గాల ప్రజలపైన ఇటీవలి పరిణామాల ప్రభావాన్ని పరీక్షించడం అని రాసి, నాలుగవ అంశంగా “పై మూడు అంశాలలో ముఖ్యమైన అంశాలను గుర్తించడం” అని రాశారు. మరి పై మూడు అంశాలను పరీక్షించడమే నాలుగవ అంశం అయితే, పై మూడు అంశాలలో చేసే పని ఏమిటి? ఎంత తెలివితక్కువ రచయిత అయినా ఇంత హాస్యాస్పదమైన, అర్థరహితమైన వాక్యాలు రాయలేడు, హోంమంత్రిత్వశాఖ తప్ప. కనీస ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరయినా ఈ మాయను గుర్తించగలరు. కాని కేంద్ర ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖ, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రజలను ఘోరంగా అవమానించదలిచారు. ఆ అంశాలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు కితాబులు ఇచ్చి తమ కుటిలత్వాన్ని బహిర్గతం చేసుకున్నారు.
.
ఇక ఐదవ అంశం, విభిన్న వర్గాల ప్రజలను, ప్రత్యేకించి రాజకీయ పార్టీలను సంప్రదించడం అని రాసి, ఆరవ అంశంగా పౌర సమాజ సంస్థలను సంప్రదించడం అని రాశారు. నిజానికి విభిన్నవర్గాల ప్రజలు అనే మాటలోనే ఈ పౌరసమాజ సంస్థలు అన్నీ ఉంటాయి. అది ఒకటే అంశం. అంటే ఐదో అంశం, ఆరో అంశం కలిపి రాయవలసినవే, లేదా ఆరో అంశం రాయనవసరమే లేదు. ఇక ఏడో అంశం కమిటీ తలచుకున్న ఇతర సూచనలకు, సిఫారసులకు సంబంధించినది. అది విచారణాంశం కాదు, కమిటీ అదనంగా చేయవలసిన పని అవుతుంది.
.
అంటే మొత్తం మీద “పిల్లి అంటే మార్జాలం అంటే బిల్లీ అంటే క్యాట్ అని నాలుగు చెప్పాను చూసుకో” అని ఒక్క సంగతే చెప్పినట్టుగా, శ్రీకృష్ణ కమిటీ విచారణాంశాలు ఏడు అని చెప్పినా మౌలికంగా ఉన్నవి రెండే – ఒకటి, 1956 నుంచి జరిగిన అభివృద్ధిని, విభిన్న ప్రాంతాల మీద దాని ప్రభావాన్ని అంచనా కట్టడం, రెండు, రాష్ట్ర విభజన – ఐక్యత మీద వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించడం. ఇవి కచ్చితంగా డిసెంబర్ 9 ప్రకటనను ముందుకు తీసుకుపోయే అంశాలు కావు.
.
ఇందులో మొదటి పని గత యాభైనాలుగు సంవత్సరాలలో వందలాది అధ్యయనాలలో, పరిశోధనలలో, పుస్తకాలలో, నివేదికలలో, ప్రభుత్వ పత్రాలలో జరిగింది. దానికోసం కొత్త కమిటీ అవసరం లేదు. కొందరు గుమస్తాలకు ఆ పుస్తకాలన్నీ అప్పగించి ఒక వారంలోనో, రెండు వారాలలోనో పూర్తి చేయగల మదింపు అది. రెండవ పని 1969 నుంచి నలభై సంవత్సరాలలో మొత్తంగానూ, 1996 నుంచి ప్రత్యేకంగానూ, 2009 నవంబర్ నుంచి మరింత ఉధృతంగానూ అన్ని ప్రచార, ప్రసార సాధనాలలో విస్తృతంగా వెలువడిన విషయమే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఎంత బలమయినదో వివరించే పుస్తకాలు, వ్యాసాలు, కళారూపాలు వందలాదిగా ఉన్నాయి. ఎవరయినా వారం, పది రోజులు పరిశోధిస్తే, పత్రికలూ, టివి ఛానళ్లూ చూస్తే తెలంగాణ ఆకాంక్ష ఎంతగా వ్యక్తమయిందో అర్థమవుతుంది. ఈ పనుల కోసం పది నెలల సమయమూ, ఇరవై కోట్ల రూపాయల బడ్జెటూ అవసరం లేదు.
.
అసలు మొదటి అంశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరికనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలనే కోరికనూ సమానం చేసి చూడడమే వాస్తవ విరుద్ధం. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఉండాలనే కోరిక 1954-55ల్లోనే వ్యక్తమయి, ఫజల్ అలీ కమిషన్ ఆమోదం పొందింది. అది 1956లో ప్రత్యేక రక్షణల ఒప్పందం వల్ల షరతులతో కూడిన ఐక్యతగా వ్యక్తమయింది. 1958 నుంచి 1968 వరకు తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఎత్తిచూపిన ప్రాంతీయ మండలి నివేదికల రూపంలో వ్యక్తమయింది. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వ్యక్తమయి 370 మంది ప్రాణాలను బలిఇచ్చింది. 1971 ఎన్నికలలో తెలంగాణ ప్రజా సమితి విజయంలో వ్యక్తమయింది. 1975 రాష్ట్రపతి ఉతర్వులలో వ్యక్తమయింది. 1985లో 610 జి.ఒ.లో వ్యక్తమయింది. 1996 నుంచీ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షగా వ్యక్తమవుతూ 2001 నాటినుంచీ రాజకీయ రంగంలో సంచలనం రేపుతోంది. ఈ కమిటీ ఏర్పడడానికి తక్షణ కారణమైన ఉద్యమం కళ్లముందర ఉధృతంగా సాగుతోంది.
మరి సమైక్య రాష్ట్రం కావాలనే ఆలోచన, “ఉద్యమం” 1953కు ముందు కొందరు ఆలోచనాపరుల రచనల్లో ఉందేమో, 1953-56 మధ్య ‘విశాలాంధ్ర మహాసభ’గా వ్యక్తమయిందేమో, మళ్లీ 2009 డిసెంబర్ 10 నుంచి కనబడిందేమో గాని, ఆ మూడు సందర్భాలలోనూ అది నిజంగా ఉద్యమమేనా? ప్రజాభిప్రాయ ప్రకటనేనా? అయినా సమైక్యంగా ఉండాలని కోరేవారు ఆ సమైక్యత కోసం పాటించవలసిన కనీస ప్రమాణాలను ఎన్నడైనా పాటించారా? లిఖిత రూపంలో ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కరోజయినా అమలు చేశారా? అలా పాటించలేదని, అందువల్లనే యాభై సంవత్సరాలుగా విభజన ఆకాంక్ష ఉందని స్వయంగా హోంమంత్రే జనవరి 5 ఉపన్యాసంలో చెప్పిన తర్వాత, నాలుగు వారాలకు తయారయిన విచారణాంశాలలో రెండు ఉద్యమాలనూ సమానంగా చూసే విచారణాంశం రాశారంటే కేంద్ర ప్రభుత్వ దగుల్బాజీతనం అర్థమవుతుంది.
.
శతకోటి లింగాల్లో బోడిలింగం
.
ఇంతకూ ఈ కమిటీ సిఫారసులకు ఆచరణయోగ్యత ఉందా, ఉంటే ఎంత అనేది కూడ ఆలోచించాలి. ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నది ఒక న్యాయమూర్తే గాని ఇది విచారణ కమిషన్ల చట్టం కింద ఏర్పడిన చట్టబద్ధ న్యాయవిచారణ కమిషన్ కాదు. అటువంటి కమిషన్ల సిఫారసులను కూడ ప్రభుత్వాలు తప్పనిసరిగా ఆమోదించి అమలు చేయాలన్న నియమం లేదు గనుక ఈ కమిటీకి అసలు అర్థమే లేదు. ఈ కమిటీ చేసే పని ఎక్కువలో ఎక్కువగా హోం మంత్రిత్వశాఖకు అవసరమైన సమాచారం అందించడం మాత్రమే. ఈ కమిటీ కన్న ఎక్కువ చట్టబద్ధత ఉన్న, ఎక్కువ విస్తృతమైన కమిటీలు, కమిషన్లు గతంలో తెలంగాణ విషయంలో అనేక సిఫారసులు చేసి ఉన్నాయి. ఆ సిఫారసులలో ముఖ్యమైనవయినా అమలులోకి రాలేదు. నిజానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి సాధికారతా లేదు, ప్రాధాన్యతా లేదు. తెలంగాణ విషయంలో 1954నుంచి ఇప్పటివరకు ఏర్పడిన పది కమిషన్లు, కమిటీలలో ఇది ఒకానొకటి మాత్రమే.
.
ఆ పది: 1. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ – 1954-55). 2. కుమార్ లలిత్ కమిటీ (1969). 3. జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ (1969). 4. కె జైభారత్ రెడ్డి నాయకత్వాన ఏర్పడిన ముగ్గురు అధికారుల కమిటీ (1984). 5. వి. సుందరేశన్ కమిటీ (1985). 6. రేవూరి ప్రకాశరెడ్డి నాయకత్వాన ఏర్పడిన శాసనసభా సంఘం (2001). 7. జె ఎం గిర్ గ్లాని ఏకసభ్య కమిషన్ (2001). 8. ప్రణబ్ ముఖర్జీ కమిటీ (2004). 8. ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన ఏర్పడిన శాసన సభా సంఘం (2006). 9. కె. రోశయ్య కమిటీ (2009). 10. జస్టిస్ బి ఎన్ శ్రీకృష్ణ కమిటీ (2010). వీటిలో ప్రణబ్ ముఖర్జీ కమిటీ, రెండవ శాసనసభా సంఘం, రోశయ్య కమిటీ మూడూ తమకు అప్పగించిన పని చేయలేదు, నివేదికలూ ఇవ్వలేదు. ఇక మిగిలిన ఏడింటిలో, ప్రస్తుత జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని మినహాయిస్తే, మిగిలినవన్నీ కూడ తెలంగాణకు అన్యాయం జరిగిందనీ, తెలంగాణలో తగినంతగా, హామీ ఇచ్చినంతగా నిధులు ఖర్చుపెట్టలేదనీ, ఉద్యోగాలలో తెలంగాణకు రావలసిన న్యాయమైన వాటా రాలేదనీ, తెలంగాణ వాసులకు రావలసిన ఉద్యోగాలలో ఇతరుల నియామకం జరిగిందనీ స్పష్టంగా చెప్పాయి. ఆ అన్యాయాలను సరిదిద్దాలని ఏదో ఒక స్థాయిలో సూచనలు, సిఫారసులు చేశాయి.
.
ఆ నివేదికలను, వాటి సిఫారసులను అన్నిటినీ కూడ చెత్తబుట్టకు దాఖలు చేసిన రాష్ట్ర, కేంద్ర పాలకులు, ఒకవేళ ఇప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలమైన నివేదిక ఇచ్చిఉన్నా దాన్ని అమలు చేస్తారనే హామీ ఏమీలేదు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన చర్యలు చేపట్టడం అనేవి నిజానికి రాజకీయ నిర్ణయాలే గాని, ఏదో ఒక కమిటీ చెపితే జరిగేవీ కావు, చెప్పకపోతే ఆగిపోయేవీ కావు.
.
కమిటీకి సహకరించాలా? బహిష్కరించాలా?
.
జస్టిస్ బి ఎన్ శ్రీకృష్ణ ఎంత నిజాయితీపరుడైనా, ఆ కమిటీలోని ఇతర సభ్యులు ఎంత నిపుణులైనా ఆ కమిటీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తీరుస్తుందనే విశ్వాసం ఉంచడానికి అవకాశం ఎంతమాత్రం లేని స్థితిలో కమిటీ పని మొదలయింది. పదినెలల ఎదురుచూపుల తర్వాత అనుకూల సిఫారసులు చేస్తారో లేదో తెలియని, అనుకూల సిఫారసులు చేసినా అమలుచేస్తారో లేదో తెలియని స్థితిలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ మీద తెలంగాణ ప్రజలు నమ్మకం పెట్టుకోవడం అసాధ్యం. జాతీయోద్యమ క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన అనేక కమిషన్లను, కమిటీలను భారత ప్రజలు వ్యతిరేకించినట్టే, నిరసించినట్టే, బహిష్కరించినట్టే, సహాయ నిరాకరణ చేసినట్టే శ్రీకృష్ణ కమిటీ పట్ల కూడ తెలంగాణ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు, కొంతమంది కమిటీని బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు.
.
అయితే ఇక్కడ ఒక సమస్య ఉండింది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని బహిష్కరించాలనే రాజకీయ డిమాండ్ ను ముందుకు తెస్తూనే అదే సమయంలో ఆలోచించవలసిన విషయాలు కొన్ని తలెత్తాయి. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు మూడున్నరకోట్ల తెలంగాణ ప్రజలలో చాల బలంగా వ్యక్తమవుతున్నప్పటికీ, రాజకీయవర్గాలు అంత బలంగా ఆ ఆకాంక్షలను ప్రకటిస్తున్న పరిస్థితి లేదు. అన్ని రాజకీయపార్టీలూ దివాళాకోరు ఎత్తుగడలతో తమ తమ రాజకీయ స్వప్రయోజనాలకొరకు మాత్రమే తెలంగాణ నినాదాన్ని అరకొరగా తలకెత్తుకున్నాయి. వీలయిన చోటనల్లా మోసం చేయడానికి, ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రాజకీయ విభేదాలు, విభజనలు మాత్రమే కాక, సామాజిక వర్గాల పునాదిపై విభజనలు, చీలికలు బయటపడడం కూడ మొదలయింది. తమ విభేదాలు పక్కనపెట్టి, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా, ఐక్యంగా పనిచేయలేని పరిస్థితి అప్పటికే మొదలయి, క్రమక్రమంగా పెరుగుతూ ఉండింది.
.
అటువంటి పరిస్థితిలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని బహిష్కరించాలనే నినాదానికి సంపూర్ణమైన మద్దతు లభిస్తుందో లేదో అనుమానంగానే ఉండింది. కమిటీ విచారణను నూటికి నూరు శాతం బహిష్కరించ గలిగినప్పుడు మాత్రమే ఆ ప్రభావం కమిటీమీద ఉంటుంది. తెలంగాణ నుంచి ఒక్క వ్యక్తి హాజరయినా, ఒక్క మహజరు సమర్పణ జరిగినా, తెలంగాణవాదులు పాల్గొన్నాకనే, వారి భాగస్వామ్యంతోనే నివేదిక తయారయినట్టుగానే కమిటీ చెప్పుకుంటుంది. సంపూర్ణ బహిష్కరణ జరిగినప్పుడు మాత్రమే ఆ కమిటీ నివేదికను, సిఫారసులను ఏకపక్షమైనవని కొట్టివేసే వీలుంటుంది.
.
అలా సంపూర్ణంగా బహిష్కరించలేనప్పుడు, బహిష్కరించే బృందాలు, వర్గాలు కొన్ని బహిష్కరించినా, పాల్గొనదలచిన వ్యక్తులు, రాజకీయపక్షాలు, బృందాలు తెలంగాణ వాదనలను బలంగా కమిటీ ముందు వినిపించడం ఉచితం కదా అనే వాదన వచ్చింది. అలా వాదించిన వారు, సమైక్యాంధ్రప్రదేశ్ పాలకవర్గాలు తెలంగాణ ప్రజాజీవితాన్ని యాభైనాలుగు సంవత్సరాలుగా ఎట్లా ధ్వంసం చేస్తూ వచ్చాయో సమగ్రమైన నివేదికలు కమిటీ ముందు ఉంచాలనుకున్నారు. గణాంకాలతో, ఉదాహరణలతో, వివరణలతో, సమగ్రమైన సమాచారంతో, విశ్లేషణలతో, వాదనలతో కమిటీ ముందు బలమైన వ్యక్తీకరణలు వినిపించాలనుకున్నారు. ఆ సమాచారాన్ని కమిటీ ముందు పెట్టి వాదించడం మాత్రమే కాక, దేశవ్యాప్తంగా ప్రచారంలో పెట్టాలనుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎంత న్యాయమైనదో మొత్తం దేశంలోని ప్రజాస్వామిక శక్తులు అంగీకరించి, తెలంగాణ తరఫున వాదించేలా చేయాలనుకున్నారు.
.
ఇలాంటి ఆలోచనతో కమిటీ ముందుకు వెళ్లి నివేదికలు, మహజరులు సమర్పించిన వారు ఎందరో ఉన్నారు. కమిటీ నివేదిక తెలంగాణకు ఏదో ఒరగబెడుతుందని గాని, దాని ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలకు బలం చేకూరుతుందని గాని వారేమీ అనుకోలేదు. కమిటీ ఒక వాస్తవమై, దాని ముందు కేవలం సమైక్య, కోస్తాంధ్ర, రాయలసీమ వాదనలు మాత్రమే వినిపించడం జరిగితే, దాని నివేదిక వాస్తవాలను ప్రతిబింబించదు గనుక, తెలంగాణ వాదనలు వినిపించడానికి ఈ కమిటీని కూడ ఒక వేదికగా వినియోగించుకోవాలని మాత్రమే అనుకున్నారు. అందువల్లనే అన్ని తెలంగాణ జిల్లాలలోనూ ప్రజలు, ప్రజాసంఘాలు, విశ్లేషకులు, రాజకీయపార్టీలు ఈ కమిటీ విచారణలకు సహకరించారు. ఇప్పటికే తెలంగాణకు అనుకూలంగా వచ్చిన ఏడెనిమిది కమిటీలకు తోడుగా వాస్తవాలను గుర్తించే, అవసరమైన పరిష్కారాలను సూచించే మరొక కమిటీగానైనా ఇది ఉంటుందని భావించారు. తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు వెలిబుచ్చిన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను ఈ కమిటీ గుర్తిస్తుందని అనుకున్నారు. కమిటీ సభ్యులు తెలంగాణలో విస్తృతంగానే తిరిగి చూశారు గనుక కళ్ల ఎదుట కనిపించే దోపిడీ, పీడన, అన్యాయం, వివక్ష గాథలను కమిటీ నమోదు చేస్తుందేమోనని ఆశించారు.
నిలువెల్లా కపటత్వం నిండిన నివేదిక
కాని ఆ కనీసమైన ఆశలను కూడ వమ్ముచేస్తూ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తిమ్మిని బమ్మిని చేసి, మసిపూసి మారేడుకాయ చేసి తెలంగాణ ప్రజల మీద, ప్రజల సమస్యల మీద, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మీద చాల అన్యాయంగా, దుర్మార్గంగా దాడి చేసింది. ఒక న్యాయమూర్తి అధ్యక్షుడుగా, ఒక ఆర్థికశాస్త్రవేత్త, ఒక సామాజికశాస్త్రవేత్త, ఒక న్యాయనిపుణుడు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఆ నిపుణులకు తగిన మేధోస్థాయిలో నివేదిక రాయలేదు. కమిటీకి కార్యదర్శిగా పనిచేసిన మాజీ హోంశాఖ కార్యదర్శికి సహజమైన పోలీసు బుద్ధితో, ప్రతి ప్రజాసమస్యనూ శాంతిభద్రతల సమస్యగా చూసే పోలీసు వైఖరితో నివేదిక తయారయింది. సమైక్యాంధ్రవాదులూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వమూ ఎంతో కాలంగా చెపుతూ వస్తున్న అబద్ధాలనే, అసత్యాల, అర్ధసత్యాల గణాంకాలనే ఈ కమిటీ నివేదిక యథాతథంగా స్వీకరించి, చిలకపలుకుల్లా వల్లించింది. తెలంగాణ ప్రజా ఆకాంక్షలను వ్యతిరేకించడానికి తెలంగాణ ప్రత్యర్థులకు మరొక ఆయుధంగా నిలిచింది.
కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖ అధికారికంగా వేసిన ఈ కమిటీ నివేదిక, సిఫార్సులు, స్వయంగా కేంద్ర హోంమంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 9న ప్రకటించిన, ఆ మర్నాడు పార్లమెంటులో కూడ పునరుద్ఘాటించిన రాజకీయ నిర్ణయాన్ని అమలుచేయడానికి ఉపయోగపడేలా తయారు కావలసి ఉండింది. ఆ రాజకీయ నిర్ణయాన్ని త్వరితం చేయడానికి, అటువంటి నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి చేయడానికి ఇటువంటి విజ్ఞుల కమిటీల అధ్యయనాలు, సిఫారసులు పనికి వస్తాయనే ఆశతోనే ఈ కమిటీ విచారణకు తెలంగాణ ప్రజలు సహకరించారు. కాని ఆ సహకారాన్ని గుర్తించారో లేదో, తమకు అందిన లక్షకు పైగా అభ్యర్థనలను చదివారో లేదో, పది జిల్లాలలో ప్రజలు వినిపించిన గోడును విన్నారో లేదో తెలియని అయోమయ స్థితిలో తప్పులతడకగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక తయారయింది.
నివేదిక సమర్పించడానికి 2010 డిసెంబర్ 31 వరకు గడువు ఉండగా, ఒకరోజు ముందే డిసెంబర్ 30న కమిటీ హోంమంత్రికి నివేదిక ఇచ్చింది. హోం మంత్రిత్వశాఖ 2011 జనవరి 6న నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక మొదటి సంపుటం 461 పేజీల్లో, తొమ్మిది అధ్యాయాలలో (1. ఆంధ్రప్రదేశ్ పరిణామాలు – ఒక చారిత్రక నేపథ్యం. 2. ప్రాంతీయ ఆర్థిక, సమానత్వ విశ్లేషణ. 3. విద్యా, ఆరోగ్య రంగాలు. 4. నీటి వనరులు, నీటిపారుదల, విద్యుత్ రంగాల అభివృద్ధి. 5. ప్రభుత్వ ఉద్యోగాల సమస్యలు. 6. హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన సమస్యలు. 7. సామాజిక, సాంస్కృతిక సమస్యలు. 8. శాంతి భద్రతలు, ఆంతరంగిక భద్రతా కోణాలు. 9. ముందడుగు) సమస్యలను చర్చించి, సూచనలు చేసింది. రెండవ సంపుటంలో 174 పేజీలలో ఆంధ్రప్రదేశ్ చరిత్రకు, తెలంగాణ సమస్యలకు సంబంధించిన కీలకపత్రాలలో కొన్నిటిని అనుబంధంగా చేర్చారు.
నివేదిక మొత్తంగానే అనేక అసత్యాలతో, అర్ధసత్యాలతో, వక్రీకరణలతో, తప్పుడు వాదనలతో నిండి ఉంది. వాస్తవాల గురించి కనీసమైన శ్రద్ధ కూడ లేకుండా, క్షమించరాని నిర్లక్ష్యంతో, తామే ఒకచోట చెప్పినదాన్ని మరొకచోట విస్మరిస్తూ, ఖండిస్తూ అనేక అబద్ధాలను చారిత్రక, గణాంక వాస్తవాలుగా రాశారు. ప్రతి ప్రజా సమస్యనూ శాంతిభద్రతల సమస్యగా చూసే పోలీసు భాషలో, అంకెల గారడీనే అభివృద్ధిగా చూపే పాలకవర్గ దృక్పథంతో నివేదికను నింపేశారు. చారిత్రక, సామాజిక, రాజకీయార్థిక వాస్తవాలలోనుంచి తమ దృక్పథానికి, నిర్ధారణలకు అవసరమైనవాటిని, అవసరమైనంతమేరకు మాత్రమే ఉటంకిస్తూ మేధోపరమైన నిజాయితీ లేమిని ప్రదర్శించారు. గత యాభై ఐదు సంవత్సరాలలోని ప్రముఖ ఘట్టాలకు సంబంధించి అందరికీ తెలిసిన విషయాలను, అచ్చయి నలుపు తెలుపుల్లో ఉన్న విషయాలను కూడ తారుమారు చేస్తూ, ఉన్నది లేనట్టూ, లేనిదీ ఉన్నట్టూ రాశారు. మూడున్నర కోట్ల ప్రజలను, వారి ఆకాంక్షలను, తెలంగాణను పక్కనపెట్టి, పిడికెడు మంది బహుళజాతి సంస్థల, సంపన్నవర్గాల, రియల్ ఎస్టేట్ వ్యాపారుల, రాజకీయ దళారీల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ను ప్రధానం చేస్తూ నివేదిక రాశారు.
ఏ పేజీ తెరిచినా పొరపాట్లే పొరపాట్లు
శ్రీకృష్ణ కమిటీ నివేదికలో డజన్లకొద్దీ పొరపాట్లు దొర్లాయి. అంకెలలో, పేర్లలో, స్థలాలలో, తేదీలలో, వాస్తవాలలో దొర్లిన ఈ పొరపాట్లు అచ్చుతప్పులయినా కావచ్చు, కిందిస్థాయి సిబ్బంది చేసిన పొరపాట్లయినా కావచ్చు. నేరుగా కమిటీ అధ్యక్షుడు జస్టిస్ బి ఎన్ శ్రీకృష్ణకు గాని, ఆయా రంగాలలో నిపుణులయిన ఇతర సభ్యులకు గాని ఆ పొరపాట్లతో సంబంధం లేకపోవచ్చు. కాని మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును, ఎనిమిది కోట్ల తెలుగు ప్రజల భవిష్యత్తును తేల్చే అధికారం ఉన్న, ఇరవై కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పదినెలలపాటు శ్రమించిన కమిటీ నివేదిక ఇంత పెద్ద పొరపాట్లను సరిచూడకుండా ప్రచురించడం క్షమించడానికి వీలులేని నిర్లక్ష్య వైఖరిని సూచిస్తుంది. ప్రజల పట్ల జవాబుదారీతనం లేమిని సూచిస్తుంది. మేధోపరమైన అనైతికతను, అసంబద్ధతను, అజ్ఞానాన్ని, అవగాహనారాహిత్యాన్ని సూచిస్తుంది. కమిటీ నివేదికలో పొరపాట్లలో కొన్ని చూడండి:
• మొదటి అధ్యాయం (‘ఆంధ్రప్రదేశ్ పరిణామాలు – ఒక చారిత్రక పూర్వరంగం’) ప్రారంభం నుంచీ కూడ వాస్తవాలను వక్రీకరణ మొదలయింది. చారిత్రక వాస్తవాలను సమకాలీన ఆధారాలతో నిష్పాక్షికంగా ప్రస్తావించి, తమ అభిప్రాయం రాయడానికి ఎవరికైనా హక్కు ఉంది. కాని అసలు ఆ వాస్తవాలనే తప్పుగా చూపడం ద్వారా ఈ పూర్వరంగం ఒక తప్పుడు నిర్ధారణకు అవసరమైన భూమికను తయారు చేసింది. ఉదాహరణకు పే. 2 లోనే “ఇంగ్లిషు గాని, రాజ్యంలోని ప్రజల భాషగాని పాలనాభాషగా లేని ఏకైక స్వదేశ సంస్థానం నిజాం పాలనలోని హైదరాబాద్” అని రాశారు. హైదరాబాద్ 1948 వరకు పాలనాభాషగా ఉండిన ఉర్దూ ప్రజల భాషే. దాన్ని ప్రజల భాష కాదని అనడం భాషాప్రయుక్త రాష్ట్రం పేరు మీద సమైక్య ఆంధ్రప్రదేశ్ ను సమర్థించడానికి మాత్రమే. నిజానికి 1948 వరకూ హైదరాబాద్ రాజ్యంలో ఇతర ప్రజా భాషలు తెలుగు (48 శాతం ప్రజలు మాట్లాడేది), మరాఠీ (26 శాతం), కన్నడం (12 శాతం) లకు ఇవ్వని స్థానాన్ని 10 శాతం ప్రజలు మాత్రమే మాట్లాడుతుండిన ఉర్దూకు ఇచ్చారని అప్పటి సామాజిక, రాజకీయ నాయకులు వాదించేవారు. అలా ఉర్దూను పాలనా భాషగా చేయడం కూడ ఆ భాష మీద, ఆ భాష మాట్లాడే ప్రజల మీద ప్రేమతో కాదని, అత్యధిక సంఖ్యాక ప్రజలను అణగదొక్కడానికేనని ఆ నాయకులు వాదించేవారు. ప్రస్తుతం శ్రీకృష్ణ కమిటీ ఆ వాదనలను ఇలా వక్రీకరిస్తున్నది.
• పే. 3లో ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు గురించి రాస్తూ “భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ఒక హేతుబద్ధ పరిష్కారాన్ని పరీక్షించి సూచించేందుకు” ఆ కమిషన్ ను ఏర్పాటు చేశారని రాశారు. ఇది పూర్తిగా అబద్ధం. ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ 1953 డిసెంబర్ 29న విడుదల చేసిన ప్రకటనలో “భాషా సంస్కృతులు ముఖ్యమైనవే అయినప్పటికీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో దేశ సమగ్రతను, భద్రతను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల”ని, “ద్రవ్య, ఆర్థిక, పాలనా పరమైన అంశాలు కూడ అంతే ముఖ్యమైనవ”ని, “ఈ అన్ని అంశాలను జాగ్రత్తగా, నిష్పాక్షికంగా పరీక్షించడానికే కేంద్ర ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేస్తోంద”ని రాశారు. (రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదిక, 1955, పే. 264-265)
• విలీనం గురించి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో 1955 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 3 వరకు జరిగిన చర్చను ప్రస్తావించి, ఆ చర్చలో అనుకూలంగా మాట్లాడినవారి సంఖ్య, వ్యతిరేకంగా మాట్లాడిన వారి సంఖ్య అంటూ ఈ కమిటీ రాసింది (పే. 9) గాని జరిగినది చర్చ మాత్రమేనని, వోటింగ్ జరగలేదనే విషయాన్ని మాత్రం చెప్పకుండా దాటవేసింది. ఆ చర్చా క్రమంలో ఎవరు ఏమి మాట్లాడినా, వోటింగ్ జరిగితే ఎలా వోటు వేసి ఉండేవారో తెలియదు. ఒక్కొక్కరు సుదీర్ఘంగా ఇచ్చిన ఉపన్యాసాలలో ప్రస్తావించిన అనేక విషయాలనుబట్టి వారిని అటో ఇటో తేల్చివేయడం సాధ్యం కూడ కాదు.
• పే. 44లో పాదసూచికలో ఉటంకించిన పుస్తకం ‘తెలంగాణ – డైమెన్షన్స్ ఆఫ్ అండర్ డెవలప్ మెంట్’ సంపాదకులు ఎస్ సింహాద్రి, పి ఎల్ విశ్వేశ్వర రావు కాగా, శ్రీకృష్ణ కమిటీ నివేదిక మాత్రం “ఎస్ శేషాద్రి (సంపాదకుడు)” అంటుంది.
• తాను ప్రత్యక్షంగా చూడని ఎన్నో విషయాలను ఘంటాపథంగా చెప్పిన కమిటీ, తాను చూసిన విషయాలమీద తెరలు కప్పి వక్రభాష్యాలు చెప్పిన కమిటీ, హఠాత్తుగా 2009 డిసెంబర్ 7 అఖిలపక్ష సమావేశం విషయం వచ్చేసరికి మాత్రం “ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు గురించి రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలనే ప్రతిపాదనకు, ఒక్క సిపిఐ-ఎం మినహా మిగిలిన పార్టీలన్నీ అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తున్నది (ఇట్ ఈజ్ లర్న్ ట్)” (పే. 56) అని రాసింది. నిజానికి ఇలా “తెలుస్తున్నది” అని సందిగ్ధంగా రాయనవసరం లేదు. ఆ మాట అధికారికంగా ప్రకటించారు, డిసెంబర్ 7న అన్ని ఛానళ్లలోనూ, 8న అన్ని పత్రికలలోనూ ఆ వార్త వచ్చింది. ఆ సమావేశపు మినిట్స్ ఆధారంగానే డిసెంబర్ 9 ప్రకటన చేశామని కేంద్ర హోం మంత్రి ప్రకటనలో ఉంది. శ్రీకృష్ణ కమిటీ ఈ ఆధారాలలో ఏదైనా చూసి తానే నిర్ధారణ చేసుకోవచ్చు, లేదా ప్రభుత్వం దగ్గరినుంచి ఆ మినిట్స్ సంపాదించి తానే తేల్చుకుని ఉండవచ్చు. కాని “తెలుస్తున్నది” అని సగం అనుమానంగా రాసింది. తెలంగాణకు అనుకూలమైన విషయాలేమో ఇలా సందిగ్ధంగా రాయడం, తెలంగాణకు వ్యతిరేకమైన విషయాలేమో కుండబద్దలు కొట్టినట్టు రాయడం ఈ నివేదిక అంతటా చేసిన పని. బహుశా నివేదిక రచయితలకు అందిన ఆదేశం అదేనేమో.
• తలసరి ఆదాయం, జాతీయోత్పత్తి లేదా రాష్ట్ర స్థూల ఉత్పత్తి, ఆ రెండిటి పెరుగుదల రేట్లు సామాజిక స్థితికి ఉజ్జాయింపు సూచికలే తప్ప వాటి ఆధారంగానే ప్రజల జీవితాలలో అభివృద్ధిని లెక్కించడం సాధ్యం కాదు. ఈ మాట ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం (యు ఎన్ డి పి) నివేదికలు, అమర్త్యసేన్ వంటి ఆర్థికశాస్త్రవేత్తలు గత మూడు దశాబ్దాలుగా చెపుతూనే ఉన్నారు. కాని శ్రీకృష్ణ నివేదిక మాత్రం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను దెబ్బతీసే లక్ష్యంతో, తెలంగాణ అభివృద్ధి చెందిందనే తప్పుడు అభిప్రాయాన్ని కలిగించడం కోసమే ఈ సూచికలను వాడుకుంది. “తలసరి ఆదాయ అభివృద్ధి రేటు హైదరాబాద్ తో కలిసిన తెలంగాణలో 77 శాతం, హైదరాబాద్ మినహా మిగిలిన తెలంగాణలో 60 శాతం, రాయలసీమలో 58 శాతం, కోస్తా ఆంధ్రలో 54 శాతం ఉన్నదని, అంటే తెలంగాణ మిగిలిన ప్రాంతాలకన్న ఎక్కువ అభివృద్ధి చెందినట్టేనని” నివేదిక రాసింది (పే. 67). ఇవన్నీ సగటు అంకెలు. ఎన్నో రెట్లు ఆస్తి పెంచుకున్న సంపన్నులనూ, నిజంగా బతుకు దిగజారి ఆత్మహత్యలకు సిద్ధపడిన అభాగ్యులనూ కలిపి తయారు చేసిన సగటు అంకెలు ఇవి. వీటి ఆధారంగా సమాజ దృశ్యాన్ని సక్రమంగా పట్టుకోవడం అసాధ్యం.
• “వాస్తవ సమాచారం దొరుకుతున్న గత ప్రాతిపదికలను చూసినప్పుడు, ఉదాహరణకు 1961 జనగణననో, 1956నో, 1974నో ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు, తెలంగాణకు అందిన వాటాలు తక్కువగా ఉన్న మాట నిజమే. కాని ఇటీవలి సంవత్సరాలలో, చాల ఉమ్మడి అభివృద్ధి సూచికలలో తెలంగాణ వాటాలు తెలంగాణ జనాభా/విస్తీర్ణం వాటా కన్న ఎక్కువ ఉండడం కనబడుతుంది” అంటూనే, “కొన్ని కీలకమైన సూచికలలో తెలంగాణ వెనుకబడి ఉన్నమాట నిజమే, కాని అవి ఆర్థిక వ్యవస్థలోని వ్యవస్థాత్మక కారణాలవల్ల, హైదరాబాద్ నగరంలో ఆర్థిక కార్యకలాపాల కేంద్రీకరణ జరిగినందువల్ల తలెత్తినవి మాత్రమే” అంటుంది. (పే. 117) ఈ మాటల గారడీ వెనుక, “ఔను కాదు ఔను కాదు ఔను కాదు” అని వరుసగా అంటూ గందరగోళం సృష్టించడం వెనుక అసలు ఉద్దేశం వాస్తవాలను మరుగు పరచడమే.
• “తెలంగాణలో నికర నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమి విస్తీర్ణం 0.7 మిలియన్ హెక్టార్ల నుంచి 1.8 మిలియన్ హెక్టార్లకు పెరిగి, రెట్టింపు అయింది. అంటే గణనీయంగా 113 శాతం పెరుగుదల ఉంది. కాగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు 30 శాతం, 55 శాతం పెరుగుదలను మాత్రమే నమోదు చేశాయి” అని పే. 88 అంటుంది. (ఇక్కడ లెక్క తప్పు. ఒక వాక్యంలో రెట్టింపు అని తర్వాతి వాక్యంలోనే 113 శాతం పెరుగుదల అనడాన్ని పక్కన పెట్టినా, 0.7 నుంచి 1.8 గా మారితే పెరుగుదల శాతం 157 అవుతుంది గాని, రెట్టింపూకాదు, 113 కాదు!) కాగా, అంకెలేమీ ఇవ్వకుండానే “రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టులద్వారా కల్పించిన నీటిపారుదల సౌకర్యాలు తెలంగాణలో 713 శాతం, రాయలసీమలో 390 శాతం, కోస్తాంధ్రలో 101 శాతం పెరిగాయి” అని పే. 192 అంటుంది. ఈ రెండు రకాల అంకెలలో ఏది సత్యం, ఏదసత్యం? ఇంతకూ భారీ, మధ్యతరహా అని కూడ అన్నారు గనుక ఇది కేవలం కాలువల ద్వారా కలిగిన నీటి సౌకర్యం లెక్కనా అని చూద్దామంటే పే. 189లో వాళ్లే ఇచ్చిన లెక్క ప్రకారం తెలంగాణలో కాలువల కింద భూమి 1955-56లో ఒక లక్ష హెక్టార్లు ఉన్నదల్లా, 2008-09 నాటికి 2.5 లక్షల హెక్టార్లకు మాత్రమే పెరిగింది. అంటే అలా చూసినా పెరుగుదల 150 శాతం మాత్రమే. మరి కమిటీకి 713 శాతం అభివృద్ధి ఎక్కడ ఎట్లా కనబడింది?
• “ఆంధ్రప్రదేశ్ ఇటీవలి కాలంలో పెద్దఎత్తున నదుల ఎత్తిపోతల పథకాలు, ముఖ్యంగా గోదావరి నది మీద, చేపట్టింది. వాటిలో కొన్నిటి వివరాలు” అంటూ “కల్వకుర్తి, భీమా- 1, భీమా-2, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎ ఎం ఆర్ పి సింగిల్ స్టేజి, ఎ ఎం ఆర్ పి లో లెవెల్” అని పట్టిక ఇచ్చారు (పే. 184-185). ఇవన్నీ గోదావరి మీద కాదు, కృష్ణా నది మీద పథకాలు. గోదావరి ఎక్కడుందో, కృష్ణ ఎక్కడుందో తెలియని మహామేధావుల రచన ఇది!
• ఈ నివేదిక రచన ఎంత నిర్లక్ష్యంతో, అశ్రద్ధతో, అజాగ్రత్తతో రాయబడిందో చూడడానికి ‘ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ అభివృద్ధి’ అనే ఉప అధ్యాయమే పెద్ద నిదర్శనం. ఈ ఉప అధ్యాయం “ఆంధ్రప్రదేశ్ అనగా…” అనే సాధారణ పరిచయంతో మొదలవుతుంది. నిజానికి అలా రాసిన ఒక పేజీ అంతా ఇక్కడ శుద్ధ అనవసరం. అదంతా మరెక్కడి నుంచో కత్తిరించి, ఇక్కడ ఉచితమా కాదా అనే ఆలోచన కూడ లేకుండా అతికించారన్నమాట (పే. 217).
• ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (ఎపిఎస్ ఇ బి) ని 1956 చివరిలో ఏర్పరచారు అని రాశారు (పే. 218). 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయింది గనుక ఇది కూడ అప్పుడే కాకపోయి ఉంటుందా అనుకున్నట్టున్నారు. కాని అది ఏర్పాటయింది 1959 ఏప్రిల్ 1న.
• “ఆంధ్రప్రదేశ్ ఏర్పడే సమయానికి తెలంగాణలో థర్మల్ విద్యుదుత్పత్తి లేదు” అని (పే. 218) నివేదిక రాసింది. కాని 1920లో ప్రారంభమైన హుసేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ 1983 వరకు కూడ పని చేస్తూ ఉంది.
• “రాయలసీమలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్” అంటుంది నివేదిక (పే. 222). కొత్తగూడెం తెలంగాణలో ఉందో, రాయలసీమలో ఉందో తెలియని తెలివిమంతులు రాసిన నివేదిక ఇది!
• పే. 342లో “1972లో అప్పటి ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ తీసుకువచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు విభజన ఆకాంక్షలకు ముగింపు పలికాయి” అని రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినది 1972లో కాదు, 1975లో! రాష్ట్రపతి ఉత్తర్వులను రాష్ట్రపతి వెలువరిస్తారు, ప్రధానమంత్రి కాదు! ప్రధానమంత్రి 1973లో ప్రకటించిన ఆరుసూత్రాల పథకాన్ని ఆచరణలోకి తీసుకు రావడానికి ప్రభుత్వం 1974లో రాజ్యాంగ సవరణ (అధికరణం 371 డి చేర్పు) ప్రతిపాదించింది. ఆ సవరణ ప్రకారం రాష్ట్రపతికి ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలోని ఉద్యోగాలను స్థానికులకు రిజర్వ్ చేసే అధికారం సంక్రమించింది. దాని సాయంతో 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి.
• ఈ నివేదికలోనే పే. 3లో “భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కొరకే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పడింది” అని రాసిన విషయం మరచిపోయి, పే. 344లో ఆ కమిషన్ ప్రాతిపదికలుగా ఉండిన ఏడు అంశాల జాబితా ఇచ్చారు. ఆ ఏడిటిలో భాష-సంస్కృతి ఒకానొకటి మాత్రమే. ఈ సరైన ఉటంకింపులో కూడ పొరపాటు ఏమంటే కమిషన్ నివేదిక అని బ్రాకెట్లో 1956 అని రాశారు. కమిషన్ తన నివేదికను 1955లో సమర్పించింది, 1956లో కాదు.
• “మొదట అన్నిరాజకీయ పార్టీలూ ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) లో సభ్యులుగా చేరాయి. కాని ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితితో సహా చాల రాజకీయ పార్టీలు జాక్ నుంచి బయటికి వచ్చాయి” (పే. 349) అని అప్పటికీ ఇప్పటికీ జరగని పనిని కమిటీ నివేదిక ఊహించి రాసింది!
• “తెలంగాణకూ కోస్తా ఆంధ్రకూ మధ్య ఉండే జిల్లా అయిన ఖమ్మం పట్టణంలో…” (పే. 350) అని కమిటీ రాసింది. రెంటి మధ్యా ఉండడం ఏమిటి? అంటే రెంటికీ చెందకుండా ఉందనా? తెలంగాణలో భాగమైన జిల్లాను రెంటికీ కాని జిల్లాగా రాయడమేమిటి?
• ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల పట్టికలో తెలంగాణనుంచి ఆరుగురు ముఖ్యమంత్రులయ్యారని కమిటీ రాసింది. (పే. 407) జలగం వెంగళ రావును కలిపి చూసినా, మర్రి చెన్నారెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు గనుక రెండు అని లెక్క వేసినా, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రులు అయిన వారు ఐదుగురు మాత్రమే. అసలు ఈ పట్టిక ఎంత తప్పుల తడక అంటే దీని ప్రకారం ఇప్పటికి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసినవారు 25 మంది! వాస్తవంగా ముఖ్యమంత్రులు 21 మంది మాత్రమే. అందులోనూ ఎన్ టి రామారావు మూడు సార్లు, నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి తలా రెండు సార్లు ఆ పదవిలోకి వచ్చారు గనుక ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు పదహారు మందే అనుకోవాలి. అలాగే రాయలసీమ నుంచి ఎనిమిది మంది ముఖ్యమంత్రులు కాగా, కమిటీ తొమ్మిది మంది అంటుంది. కోస్తాంధ్ర నుంచి ఎనిమిది మంది కాగా, కమిటీ పది అంటుంది. కమిటీ తెలివి ఇలా తెల్లారింది!!
అజ్ఞానం, ధూర్తత్వం, దాటవేత, అతితెలివి
ఆ తప్పులూ, పొరపాట్లూ, అవగాహనా రాహిత్యమూ అలా ఉంచినా, అవన్నీ అచ్చుతప్పులుగానో, సమాచారం సేకరించే బాధ్యత ఉన్న కిందిస్థాయి అధికారుల పొరపాట్లుగానో అంగీకరించినా, కమిటీ బాధ్యత వహించవలసిన అంశాలు ఇంకెన్నో ఉన్నాయి. కమిటీకి మొత్తంగానో, ఆయా అధ్యాయాలు రాసిన నిపుణులకో, లేదా అన్ని అధ్యాయాలూ రాయడానికి అవకాశం ఉన్న కార్యదర్శి వి కె దుగ్గల్ కో ఉన్న అజ్ఞానాన్నీ, ధూర్తత్వాన్నీ, దాటవేత వైఖరినీ, అతితెలివినీ, అవగాహనారాహిత్యాన్నీ అవి తెలియజేస్తాయి. అటువంటి అంశాలలో కొన్ని చూడండి:
• పే. 3 లో ఫజల్ అలీ కమిషన్ గురించి రాస్తూ “ప్రజాభిప్రాయం భాషా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరణకు అనుకూలంగా ఉన్నదని కమిషన్ భావించినట్టు తెలుస్తున్నది” అని ‘కేంద్ర-రాష్ట్ర సంబంధాల కమిషన్ నివేదిక’ రాసినట్టుగా కమిటీ ఉటంకించింది. స్వయంగా ఫజల్ అలీ నివేదిక అందుబాటులో ఉన్నప్పుడు, ఆ నివేదిక ఏమి చెప్పిందో తెలుసుకోగలిగినప్పుడు, అసలు ఆ నివేదిక చెప్పని విషయాన్ని చెప్పినట్టుగా రాసిన మరొక కమిషన్ నివేదికను ఉటంకించడం ఎందుకు?
• పే. 4 లో “భాషా ఏకత్వమే రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాతిపదికగా కమిషన్ ఏకగ్రీవంగా నిర్ణయించి, సిఫారసు చేసింది” అని మరొక అబద్ధం రాశారు. ఈ అబద్ధాన్నే పే. 429లో పునరుద్ఘాటించారు. కాని ఫజల్ అలీ కమిషన్ నివేదిక “సమస్యకు సంబంధించిన అన్ని అంశాలనూ సంపూర్ణంగా పరిశీలించిన మీదట మేం చేస్తున్న నిర్ధారణ ఏమంటే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను భాష లేదా సంస్కృతి అనే ఏకైక ప్రమాణం ఆధారంగా తేల్చడం సాధ్యమూ కాదు, వాంఛనీయమూ కాదు. జాతీయ ఐక్యత దృష్ట్యా మొత్తం సమస్య పట్ల ఒక సమతుల్యమైన వైఖరి తీసుకోవలసి ఉంటుంది” అని చాల స్పష్టంగానూ, వివరంగానూ రాసింది. (పే. 45-46). ఇంత స్పష్టంగా నలుపు తెలుపుల్లో ఉన్న విషయాలను ఇప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ మసిపూసి మారేడుకాయ చేయడం, వక్రీకరించడం ఏ ప్రయోజనం కోసం?
• పే. 6 నుంచి పే. 9 వరకూ ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల విలీనానికి అనుకూలంగా 1953-56 మధ్య వాదనలను వివరంగా పేజీల కొద్దీ రాసిన నివేదిక, ప్రతికూల వాదనలను మాత్రం ఊరికే ప్రస్తావించి వదిలేసింది. “విస్తృత సమాలోచనల” కోసం ఏర్పడిన కమిటీ ఇలా ఒక పక్షపు వాదనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందంటే అర్థం ఏమిటి?
• అప్పటి కేంద్ర మంత్రి మౌలానా అజాద్ విలీనాన్ని వ్యతిరేకించారని చెపుతూ “ఆంధ్ర నాయకత్వం, హైదరాబాద్ రాష్ట్రంలోని అత్యధిక ప్రజాభిప్రాయం విలీనానికి అనుకూలంగా ఉండడంతో” (పే. 10) విలీనం జరిగిందని శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాసింది. అత్యధిక ప్రజాభిప్రాయం విలీనానికి అనుకూలంగా ఉన్నదని అనడానికి ఆధారమేమిటో మాత్రం రాయలేదు. అటువంటి ఆధారమేమీ లేదు. హైదరాబాద్ శాసనసభ చర్చను బట్టి ఎన్నికైన ప్రజాప్రతినిధులలో అత్యధికులు విలీనాన్ని సమర్థించారని అనుకున్నా, వారు ఎన్నికైనది అసలు విలీనం గురించి ఆలోచనే లేని 1952 ఫిబ్రవరిలో. ఆ తర్వాత ఏడాదిన్నరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాతనే విలీన ఆలోచన మొదలయింది. మూడు సంవత్సరాల కింద తాము వోట్లు వేసి తమ ప్రతినిధులుగా ఎన్నుకున్నవారు ఇవాళ మాట్లాడిన మాటలన్నీ తమ అభిప్రాయాలే అని ప్రజలు అనుకున్నారో లేదో తెలియదు. అలా అనుకోవడానికి ఎంత అవకాశం ఉందో అనుకోకపోవడానికీ అంతే అవకాశం ఉంది. మొత్తంగా చెప్పాలంటే విలీనం పట్ల ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉందని చెప్పగల పరిస్థితి మాత్రం లేదు. మరి యాభై సంవత్సరాల తర్వాత ఏ ఆధారమూ లేకుండా ఈ అబద్ధాన్ని, లేదా అర్ధసత్యాన్ని వండవలసిన అవసరం శ్రీకృష్ణ కమిటీకి ఏం వచ్చింది?
• 1956 ఫిబ్రవరి 20న కుదిరిన ‘పెద్దమనుషుల ఒప్పందం’ గురించి చాల వివరంగానే రాసిన కమిటీ ఆ ఒప్పందంలోని 14 అంశాలలో నాలుగు అంశాలు ప్రాంతీయ మండలి ఏర్పాటు గురించే మాట్లాడాయనీ, అది అంత ముఖ్యమైనదనీ గుర్తించనేలేదు. అంత ముఖ్యమైన ప్రాంతీయ మండలిని 1956 ఆగస్టు నాటికే ఎట్లా బలహీనపరచడం జరిగిందో, తెలంగాణ ప్రాంతీయ మండలి (కౌన్సిల్) కావలసిందల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ సమితి (కమిటీ)గా ఎలా కుదించబడిందో, ఆ తర్వాత పన్నెండు సంవత్సరాలలో ఆ ప్రాంతీయ సమితి మరెంతగా దగాకు, చిన్నచూపుకు, నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురయిందో కనీసంగానైనా గుర్తించలేదు. ప్రాంతీయ మండలికి సంబంధించి ‘పెద్దమనుషుల ఒప్పందం’లోని అంశాలను తొలగించడం వల్ల “అప్పటికే తెలంగాణ ప్రజలలో ఉన్న అసంతృప్తి పెరిగింది” అని రాశారు (పే. 22) గాని, అలా తొలగించడంలోని దురుద్దేశ్యాల గురించి, ప్రయోజనాల గురించి మాత్రం మాట్లాడలేదు.
• తెలంగాణ అదనపు నిధుల పరిమాణాన్ని లెక్కించడానికి ఏర్పడిన మొట్టమొదటి అధికారిక కమిటీ అయిన కుమార్ లలిత్ కమిటీ గురించి గాని, ఆ నాటికి లెక్కించిన తెలంగాణ మిగులు నిధుల గురించి గాని రావలసిన దగ్గర (పే. 23) ప్రస్తావనే లేదు.
• ఉద్యోగాలలో తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి, ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రిక్వైర్ మెంట్ యాజ్ టు రెసిడెన్స్) చట్టం 1957’ ఉల్లంఘనల గురించి తెలంగాణ ప్రాంతీయ మండలి తన అసంతృప్తిని వ్యక్తం చేసిందని రాస్తూ, “చాల సందర్భాలలో ప్రభుత్వం వీలయిన చర్యలు తీసుకుంది” (పే. 30) అని సమర్థించింది. ఉద్యోగ నిబంధనలను పాటించి ఉంటే, “వీలయిన చర్యలు” తీసుకుని ఉంటే ఆ తర్వాత జై భారత్ రెడ్డి కమిటీ గాని, జి. ఓ. 610 గాని, గిర్ గ్లాని కమిషన్ గాని, సభాసంఘాలు గాని, ఇప్పటిదాకా ఆందోళనలు గాని అవసరమే ఉండేవి కావనే కనీస తర్కం కూడ కమిటీకి తట్టలేదు.
• “1969 జై తెలంగాణ ఉద్యమపు అనుకూల ఫలితాలు – తెలంగాణ ప్రాంతీయ సమితిని ప్రభుత్వం బలోపేతం చేయడం, తెలంగాణ ఆదాయ మిగులును హేతుబద్ధంగా మదింపు వేయడం, తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ విద్యాసంస్థలను నెలకొల్పడం, ఆరు తెలంగాణ జిల్లాలలోనూ, రెండు రాయలసీమ జిల్లాలలోనూ పరిశ్రమలకు ప్రత్యేక సబ్సిడీలు ఇవ్వడం” అని కమిటీ రాసింది (పే. 33). ఇవన్నీ పచ్చి అబద్ధాలు. వీటిలో ఏ ఒక్కటీ జరగలేదు. నిజానికి ఇక్కడ చెప్పిన వాటికి వ్యతిరేకమైన పనులు జరిగాయి.
• కొన్నిచోట్ల చాల అనవసరమైన, చిన్న చిన్న వివరాలు ఇవ్వడానికి పేజీలకు పేజీలు ఖర్చుపెట్టిన నివేదిక ఆరు సూత్రాల పథకం వంటి ముఖ్యమైన పరిణామాన్ని అరకొరగా ముగించేసింది. ఆరు సూత్రాల పథకం తెలంగాణకు మేలు చేసే విధంగా అమలు కాలేదన్న అసలు సంగతిని దాటవేసింది. మొదటి ఐదు సూత్రాలు అమలయితేనే అమలులోకి రావలసిన ఆరో సూత్రం (ముల్కీ నిబంధనల రద్దు, ప్రాంతీయ కమిటీ రద్దు), ఆ ఐదూ అమలు జరగకపోయినా జరిగిపోయింది. కాని ఆ ఆరో సూత్రం అమలు కావడమే ముఖ్యమైన ఫలితంగా కమిటీ నివేదిక అభిప్రాయపడుతున్నది (పే. 37).
• “రాయలసీమలో అటువంటి భయాలు చాల ఉన్నాయి. ఒక మార్కెట్ గమ్యంగానూ, సరఫరాల వనరుగానూ ఉన్న హైదరాబాద్ తో తమ సంబంధం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత తెగిపోతుందేమోనని వారు అనుమానిస్తున్నారు. కోస్తా ఆంధ్ర కూడ హైదరాబాద్ నగరంలో ఉన్న సహజమైన జనాభా, వ్యాపార, మార్కెట్ కేంద్రీకరణల వల్ల ఒక ప్రధానమైన మార్కెట్ ను కోల్పోతుంది. ఈ రకంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధిని అడ్డుకునే ప్రతికూల అంశంగా ఉంటుంది” అని నివేదిక రాసింది. (పే. 122) ఇది హైదరాబాద్ ను కేవలం మార్కెట్ గా చూసే దృక్పథమే తప్ప, ప్రజల గురించిన దృక్పథం కాదు. విభజన వల్ల రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా, వాటిని పరిష్కరించడం ఎలా, తెలంగాణ ప్రజలు యాభై నాలుగు సంవత్సరాలుగా కోల్పోయిన అవకాశాలను కల్పించడానికి, చారిత్రక అన్యాయాలను సరిదిద్దడానికి ఎటువంటి దృక్పథం తీసుకోవాలి అని అటయినా ఇటయినా ప్రజల గురించి చర్చ ఉంటే ఈ మేధావుల కృషి సార్థకమయ్యేది. కాని “మార్కెట్ గమ్యం, సరఫరాల వనరు, ప్రధానమైన మార్కెట్” అనే భాష వాడడం దుర్మార్గం. అయినా ఇతర రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధికి ప్రతికూల అంశంగా ఉంటుందనే పేరుతో ఒక ప్రాంతం తన ఆకాంక్షలను అణచివేసుకోవాలని కమిటీ సూచిస్తోందా? మరి భారతదేశాన్ని వదలడం బ్రిటన్ ఆర్థికాభివృద్ధి మీద ఎంతటి ప్రతికూల ఫలితాన్ని వేసింది, పాపం! అందువల్ల భారత జాతీయోద్యమం పొరపాటని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అని ఉండేదేనా? ఇదే లెక్కన ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్న చత్తీస్ ఘడ్ విభజనతో మధ్య ప్రదేశ్, జార్ఖండ్ విభజనతో బీహార్ ఎంతగా నష్టపోయి ఉంటాయో, శ్రీ కష్ణ కమిటీయే చెప్పాలి.
• తెలంగాణలో అక్షరాస్యతా శాతం మిగిలిన రెండు ప్రాంతాల కన్న తక్కువ ఉన్నదని గుర్తిస్తూనే కమిటీ దానికి చారిత్రక కారణాలను చూపుతుంది. “తెలంగాణ మిగిలిన రెండు ప్రాంతాలకన్న వెనుకబడి ఉన్నప్పటికీ, అది గణనీయమైన అభివృద్ధి సాధించింది. కోస్తాకూ తెలంగాణకూ మధ్య అక్షరాస్యతా శాతంలో తేడా 1971 తర్వాత క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. తెలంగాణ ప్రాంతం అక్షరాస్యతలో అతి ఎక్కువ వృద్ధి రేటును నమోదు చేస్తోంది” (పే. 127) అనీ, తెలంగాణ జిల్లాల్లో అక్షరాస్యతా శాతం అతి తక్కువగా ఉందనీ, కిందినుంచి పది జిల్లాల్లో ఆరు జిల్లాలు తెలంగాణవేననీ, మొత్తం అక్షరాస్యతలో మాత్రమే కాక, మహిళా అక్షరాస్యత, పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల శాతం, ప్రత్యేకంగా ఎస్ సి, ఎస్ టి విద్యార్థుల శాతం వంటి విషయాలలో కూడ తెలంగాణ వెనుకబడి ఉందనీ గుర్తించిన కమిటీ, అందుకు కారణాలను మాత్రం దాటవేసింది.
• తెలంగాణ విద్యారంగంలో వెనుకబడి ఉండడానికి చారిత్రక, సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయని కమిటీ మరో రెండు సందర్భాలలో (పే. 129, 146) కూడ చెప్పింది. తెలంగాణ నిజాం పాలనలో ఉండడం వల్ల విద్యారంగంలో వెనుకబడిందని అనుకుంటే, నిజాం పాలన తొలగిపోయి అరవై సంవత్సరాలు దాటింది. తెలంగాణలో విద్యావకాశాల రక్షణ కల్పిస్తామని ‘పెద్దమనుషుల ఒప్పందం’లో వాగ్దానం చేసి యాభై నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఈ కాలమంతా పాలకులు ఏంచేశారో చెప్పకుండా ఆ పాత చారిత్రక కారణాల పాట పాడడం దగుల్బాజీతనం. ఆ చారిత్రక కారణాల గురించి ఒక పదేళ్లో, ఇరవై ఏళ్లో చెపితే అర్థం ఉంటుందేమో గాని, మూడో తరం నడుస్తుండగా ఆ కారణాలే చెప్పడంలో అర్థం లేదు. ఆ వెనుకబాటుతనాన్ని సవరించడానికి యాభై నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం ఏం చేసిందో, ఎందుకు విఫలమయిందో కనిపెట్టడానికి ప్ర్రయత్నించి ఉంటే కమిటీకి తెలంగాణ ఆకాంక్షలు అర్థమై ఉండేవి.
• ప్రభుత్వం దగ్గరినుంచి ఆర్థిక సహాయం పొందుతున్న ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు 2008-09లో తెలంగాణలో 17 (హైదరాబాద్ తో కలిపి చూస్తే 53) ఉండగా, రాయలసీమలో 25, కోస్తాంధ్ర లో 101 ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలే చెపుతుండగా (పే. 145) ఈ అసమానతకు కారణమేమిటనే ప్రశ్న కమిటీకి తట్టనేలేదు. పైగా “ఇది రాష్ట్రం ఏర్పడినప్పుడు కోస్తాంధ్ర ప్రాంతంలో చాల ఎయిడెడ్ కాలేజీలు ఉండడం వంటి చారిత్రక కారణాల వల్ల జరిగింది” అనీ “ఉన్నత విద్యలోకి తెలంగాణ ఆలస్యంగా ప్రవేశించడం వల్ల, ఎయిడెడ్ కాలేజీలకు నిధులు అందజేసే విధానం మారినందువల్ల” ఈ తేడా ఉందనీ సాకులు చెప్పడానికి ప్రయత్నించింది.
• తెలంగాణలోని ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థి-అధ్యాపకుల నిష్పత్తి చాల ఎక్కువగా, ఉండగూడనంత ఎక్కువగా ఉందని కమిటీ గుర్తించింది. మరి ఇదే ప్రభుత్వ విధానమైతే కోస్తాంధ్ర జిల్లాలలో ఈ నిష్పత్తి 50 కన్న తక్కువ ఎలా ఉందనీ, ఆదిలాబాద్ లో 82గా, కరీంనగర్ లో 61గా ఎందుకున్నదనీ మాత్రం ఆలోచించలేదు. (పే. 146)
• ప్రభుత్వ లెక్కల ప్రకారమే కోస్తాంధ్రలో ఎయిడెడ్ కాలేజీలకు రు. 224 కోట్లు అందుతుండగా, తెలంగాణకు రు. 93 కోట్లు, రాయలసీమకు రు. 91 కోట్లు అందుతున్నాయనీ, కోస్తాంధ్రలోనూ, తెలంగాణలోనూ కాలేజికి వెళ్లే వయసున్న యువకుల సంఖ్య సమానమనీ, రాయలసీమలో అందులో సగమనీ కమిటీ రాసింది (పే. 153). కాని విద్యార్థుల సంఖ్య సమానంగా ఉన్నప్పుడు నిధులు మాత్రం సగానికన్న తక్కువ రావడమేమిటనీ, విద్యార్థుల సంఖ్య సగమే ఉన్న ప్రాంతానికి వచ్చినన్ని నిధులు రావడమేమిటనీ ప్రశ్నలు కమిటీకి తట్టనేలేదు. ఇది ఉద్దేశపూర్వకమైన, పాలనా విధాన పరమైన వివక్ష అని మాత్రం గుర్తించలేదు.
• ఇటువంటి ఎన్నో నగ్నసత్యాలను చూసి, నమోదు చేసిన తర్వాత కూడ కమిటీ “విద్యా సంస్థల నిధులు, వాటిని ఏర్పాటు చేసిన ప్రాంతాల గురించి తెలంగాణవాదులు కమిటీ ముందు చేసిన ఫిర్యాదులన్నిటినీ సాకల్యంగా విశ్లేషించిన తర్వాత మేము చేసిన నిర్ధారణ ఏమంటే, వారి ఫిర్యాదులలో కొన్ని సరైనవే అయినప్పటికీ, వారు చెప్పిన స్థాయిలో మాత్రం జరగలేదు” (పే. 161) అని రాసింది. కళ్లు మూసుకుని కూచుంటే, చూసినదాన్ని, తామే రాసినదాన్ని కూడ నిర్ధారణలో భాగం చేయవద్దని ఆదేశాలుంటే మాత్రమే ఇటువంటి నిర్ధారణ వస్తుంది. “విద్యాసంస్థలు ఎక్కడ పెట్టాలనే విషయంలో కొన్ని అవకతవకలు జరిగినప్పటికీ ప్రజాస్వామిక వ్యవస్థలోని రాజకీయ ఒత్తిళ్లవల్ల అటువంటివి తప్పవ”ని కమిటీయే సమాధానం చెప్పడానికి ప్రయత్నించింది.
• పే. 163లో విద్యారంగ స్థితి గురించి రాసిన ముగింపు వాక్యాలలో తెలంగాణ ఉద్యమంలో దళిత, వెనుకబడిన కులాల విద్యార్థులు ఎక్కువగా పాల్గొనడానికి, ఆత్మహత్యలు కూడ ఎక్కువగా చేసుకోవడానికి వారిలో ఉన్న నిరాశా నిస్పృహలే కారణమని కమిటీ రాసింది. కాని “తగిన ఉద్యోగాలు రాకపోవడానికి వివక్షత అనేది అరుదయిన కారణం మాత్రమే” అనీ, “తగిన శిక్షణ లేకపోవడమే ప్రధానకారణం” అనీ తెలంగాణ యువజనులకు ఉద్యోగాలు రాకపోవడానికి అసలు కారణం పైనుంచి దృష్టి మళ్లించడానికి ప్రయత్నించింది.
• నీటి పారుదల రంగానికి సంబంధించిన అధ్యాయంలో, పే. 205లో “తెలంగాణ ఫిర్యాదులు” అని ఆరు ఫిర్యాదులు ఉటంకించి, వాటన్నిటికీ కమిటీయే జవాబులు చెప్పడానికి ప్రయత్నించింది. ఈ జవాబు చెప్పవలసిన అవసరం కమిటీకి లేదనేది ఒక ఎత్తయితే, ఆ జవాబులు కూడ సాకులు, అబద్ధాలు, అక్రమాలు కావడం మరొక ఎత్తు. (పే. 205-207)
• కృష్ణా, గోదావరీ జలాలలో తెలంగాణకు రావలసినంత వాటా రాలేదనే వాదనకు తెలంగాణ ఎత్తున ఉండడం వల్ల అది సాధ్యం కాదనీ, అయినా పరీవాహకప్రాంతం అనే ఒక్క ప్రాతిపదిక మీదనే నీటి వాటా రాదనీ కమిటీ చెప్పింది. ఈ ఎత్తున ఉండడం అనే అబద్ధం గోదావరికి కొంతయినా వర్తిస్తుంది గాని కృష్ణకు వర్తించదు. గోదావరి నుంచి ఎత్తిపోతల పథకాల ద్వారానైనా, కృష్ణ నుంచి నైసర్గికంగానైనా తెలంగాణకు నీళ్లు ఇచ్చి ఉండవచ్చు.
• విలీనం కన్నముందరి హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణకు ఉండిన జల వనరుల వాటాను, విలీనం వల్ల కోల్పోవడం జరిగిందనే వాదనకు, “1956లో జరిగిన పునర్వ్యవస్థీకరణ ఇప్పుడు చరిత్రలో భాగం, ఆ చర్చలను మళ్లీ తెరవడం అసాధ్యం” అని కమిటీ జవాబిచ్చింది. ఒక అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నానికి ఆ అన్యాయం ఎప్పుడు జరిగిందనేదానితో నిమిత్తం లేదనే ఇంగిత జ్ఞానం కూడ నివేదిక రచయితలకు లేకపోయింది. కనీసం న్యాయశాస్త్రంలో ఎప్పటికైనా సవరించగలిగినవి, నిర్ణీతవ్యవధి తర్వాత సవరించలేనివి అనే విభజన ఉంటుంది. జలవనరుల పంపిణీని సమీక్షించడానికి, సవరించడానికి న్యాయశాస్త్రం అవకాశం ఇస్తుందనే విషయం కూడ ఈ న్యాయకోవిదులకు తట్టలేదు.
• శ్రీశైలం ఎడమ కాలువ తవ్వకం పనిని కావాలని దశాబ్దాలుగా తాత్సారం చేస్తున్నారనే వాదనకు జవాబు చెపుతూ, దీని 40 కి.మీ. సొరంగం తవ్వవలసి ఉందనీ, అందువల్ల చాల సమయం పడుతుందనీ కమిటీ ఆలస్యాన్ని సమర్థించడానికి ప్రయత్నించింది.
• ఒకవైపు తెలంగాణలో చెరువులను, కుంటలను నిర్లక్ష్యం చేసి, మరొకవైపు కాలువల నీరు కూడ ఇవ్వనందువల్ల తెలంగాణ రైతులు విపరీతమైన ఖర్చుతో బోరుబావులు తవ్వుకోవలసి వస్తున్నదనే వాదనకు జవాబుగా “మొత్తంగా ఈ వాదన తప్పుడు అభిప్రాయాల మీద ఆధారపడినప్పటికీ, గొట్టపుబావులకు ఎక్కువ ఖర్చు అవుతుందనే మాట నిజమే” అంటూ రైతులకు రుణ సౌకర్యం పెంచమని ప్రభుత్వానికి ఉచిత సలహా ఇచ్చింది. అవి “తప్పుడు అభిప్రాయాలు” ఎలా అయ్యాయో మాత్రం వివరణ లేదు.
• పోలవరం ప్రాజెక్టు పట్ల తెలంగాణ వాదుల అభ్యంతరాలను ప్రస్తావించి వాటికి జవాబులు చెప్పే పని కమిటీయే తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు రూపకల్పన ఎప్పుడో జరిగిందనీ, పోలవరం నుంచి కృష్ణకు తరలించే 80 టిఎంసి నీటిలో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ లకు వాటాలు వస్తాయనీ, అంటే తెలంగాణకు వచ్చినట్టేననీ, ఇంతకీ ప్రస్తుత స్థితిలో పోలవరం ఆపమని కోరడం తప్పుడు అవగాహన అనీ కమిటీ రాసింది. నిజానికి కమిటీయే తప్పుడు అవగాహనతో ఉంది. తెలంగాణ వాదులు లేవనెత్తుతున్న శాస్త్రీయమైన, సాంకేతికమైన, ప్రాంతీయ న్యాయానికి సంబంధించిన వాదనలకు కమిటీ ఇచ్చిన జవాబులు అర్థరహితమైనవి.
• మరొకపక్క, ఇంచంపల్లి ప్రాజెక్టు తెలంగాణకు లబ్ధి చేకూరుస్తుంది గనుకనే ఆలస్యం చేస్తున్నారనే తెలంగాణ వాదుల ఆరోపణకు జవాబు చెపుతూ కమిటీ “ఇంచంపల్లి ఆనకట్ట అటవీ భూములను ముంచివేస్తుంది, గిరిజన ప్రజానీకాన్ని నిరాశ్రితులను చేస్తుంది. అందువల్ల పర్యావరణ, అటవీ అనుమతులు సంపాదించడం సాధ్యం కాదు. కనుక తెలంగాణవాదుల ఫిర్యాదు తప్పుడు అవగాహన” అని రాసింది. అటవీ భూముల ముంపు, ఆదివాసులు నిరాశ్రితులు కావడం అనేవే కారణాలయితే, పోలవరానికి కూడ అనుమతులు రాగూడదు. ఒకే రకమైన రెండు ప్రాజెక్టుల విషయంలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నదంటే కమిటీకే తప్పుడు అవగాహన ఉన్నదన్నమాట.
• పోతిరెడ్డిపాడు అక్రమం గురించి ప్రస్తావించి, దాని మీద విమర్శ సరైనదే అనే ధ్వని కూడ ఇచ్చి, “రానున్న కృష్ణాజల వివాదాల ట్రిబ్యునల్ ఈ సమస్యను పరిశీలించవచ్చు” అని సరిపెట్టింది. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ రూపకల్పన తెలంగాణకు నష్టదాయకంగా జరిగిందనే ఫిర్యాదును ప్రస్తావించి “ఈ ఫిర్యాదును అర్థం చేసుకోవచ్చు” అని సరిపెట్టింది.
• జూరాల, రాజోలిబండ మళ్లింపు పథకాల మీద ఫిర్యాదుల గురించి ప్రస్తావించి, అవి సరైనవేననిపిస్తుంది అని రాస్తూనే రాజోలిబండతో ఏమీ సంబంధం లేని తుంగభద్ర బోర్డుతో ఈ సమస్యను సరిగా చర్చించలేదనే తప్పుడు వాదనతో సరిపెట్టింది.
• తన పరిధిలో లేకపోయినా నీటి పారుదల/జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేయమని సూచిస్తూ కమిటీ ఉచిత సలహా ఇచ్చింది (పే. 214-216).
• “తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుత స్థాపిత విద్యుదుత్పాదనా శక్తి కోస్తాంధ్రతో పోలిస్తే తక్కువగానే ఉంది. కాని ఇది ఆందోళన పడవలసిన విషయం కాదు. ఎందుకంటే తెలంగాణకు అవసరమైన విద్యుచ్ఛక్తిని ఆంధ్రప్రదేశ్ గ్రిడ్ నుంచి తీర్చడం జరుగుతోంది. (పే. 223) అని రాసింది. తెలంగాణ విద్యుత్తు అవసరాలను తీర్చడం జరుగుతున్నదా లేదా అనేదానికన్న ముఖ్యం ఆ విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు తెలంగాణలో ఉండగా అ బొగ్గును మరొకచోటికి తరలించి అక్కడ విద్యుదుత్పత్తి చేసి మళ్లీ వెనుకకు సరఫరా చేయడం సాంకేతికంగానైనా, ఆర్థికంగానైనా సరైనదేనా అనే ప్రశ్నకు జవాబును కమిటీ దాటవేసింది.
• ‘సామాజిక, సాంస్కృతిక అంశాలు’ అనే ఏడో అధ్యాయం దానికదిగా ఆంధ్రప్రదేశ్ గురించి ఒక సామాజిక శాస్త్ర అధ్యయనంలా ఉంది గాని దానికీ మిగిలిన నివేదికకూ పెద్ద సంబంధం లేదు. ఈ అధ్యాయంలో కూడ ఒక అనవసరమైన ఉపోద్ఘాతం, ముఖ్యమైనవే అయినా ఇక్కడ ఎంతమాత్రం సంబంధంలేని ఏవేవో విషయాలు ఉన్నాయి. తప్పులు, పొరపాట్లు సరేసరి.
• “తెలంగాణ ప్రాంతపు మొత్తం ఆర్థికాభివృద్ధి ధోరణి సుదృఢంగా ఉన్నప్పటికీ (విలీన సమయంలో అభివృద్ధి చాల తక్కువ స్థాయిలో ఉందని గమనించాలి), కొన్ని సందర్భాలలో, సాంప్రదాయికంగా సమృద్ధమైన ఆంధ్ర ప్రాంతం కంటె అభివృద్ధి రేటులో అధిగమించినప్పటికీ, ప్రభుత్వోద్యోగాలలో, నీటిపారుదల సౌకర్యాలలో, విద్యావకాశాలలో వాటా విషయంలో సుదీర్ఘ కాలంగా ఉన్న అసంతృప్తులలో కొంత నిజం ఉంది. కాని, తెలంగాణ నాయకులు చెపుతున్నట్టుగా, వాగ్దానం చేస్తున్నట్టుగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే నీటి లభ్యతలో, ప్రభుత్వోద్యోగాలలో, విద్యలో హెచ్చు అవకాశాలకు హామీ ఇవ్వదు” అని కమిటీ రాసింది (పే. 343) రెండే రెండు సంకీర్ణ వాక్యాలలో నాలుగు అనుకూల వ్యాఖ్యలూ నాలుగు ప్రతికూల వ్యాఖ్యలూ ముద్ద చేసి, చివరికి తెలంగాణ వాదుల మాటలను ఖండించడమే ఈ కమిటీ చేసిన పని.
• “ఒక ఉప-ప్రాంతీయ ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం జాతీయ ఐక్యతకు ప్రమాదకరం కాదు” అని అంటూనే, “దీనికి జాతీయ పర్యవసానాలు ఉంటాయి” అని సన్నాయి నొక్కు నొక్కింది. (పే. 344). ఆ మాటకొస్తే దేశంలో ఏ మూల ఏం జరిగినా, ఏ రాష్ట్రంలో ఏ విధాన నిర్ణయం జరిగినా జాతీయ పర్యవసానాలు ఉంటాయి. అలాంటి పర్యవసానాలు ఉండడం అనే కారణంతో ఆ పరిణామాలను ఆపడం న్యాయమేనా?
• రాష్ట్ర విభజనలో హైదరాబాద్ ప్రత్యేకతను గురించి రాస్తూ, “అది తెలంగాణ ప్రాంతంలో భౌగోళిక భాగమైనప్పటికీ, 1956లో రాజధాని అయినప్పటినుంచీ, దాని అభివృద్ధికి మూడు ప్రాంతాలూ దోహదం చేశాయి. హైదరాబాద్ లో తమ ప్రయోజనాల పరిరక్షణ, హైదరాబాద్ తో తమ సంబంధం గురించి మూడు ప్రాంతాలూ పడుతున్న ఆందోళనే ప్రస్తుత ఘర్షణలో ప్రధానాంశం” (పే. 344-345) అని రాసింది. ఎప్పుడైనా రాష్ట్ర రాజధానిగా ఉన్న నగర అభివృద్ధికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ దోహదం చేస్తాయి. విభజన జరిగేటప్పుడు ఆయా ప్రాంతాలు తమ దోహదానికి లెక్కలు కట్టి ఇమ్మనడం ఎక్కడా జరగదు, జరగలేదు. ఆ మాటకొస్తే మద్రాసు అభివృద్ధిలో తెలుగు, కన్నడ, మలయాళీ ప్రజల పాత్ర, బొంబాయి అభివృద్ధిలో గుజరాతీల పాత్ర, భోపాల్ అభివృద్ధిలో చత్తీస్ ఘడ్ పాత్ర, పాట్నా అభివృద్ధిలో జార్ఖండ్ పాత్ర, లక్నో అభివృద్ధిలో ఉత్తరాంచల్ పాత్ర ఎంతో ఉంది. కాని ఆయా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాజధానులు ఏ రాష్ట్రంలో భౌగోళిక, చారిత్రకఅంతర్భాగమో వారికే వదిలేసి వెళ్లిపోయాయి.
• కోస్తా నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారు తమ సౌభాగ్యం వల్ల స్థానిక ప్రజలతో కలివిడిగా కాక దూరంగా ఉంటారనీ, దానితో స్థానికులలో వారిపట్ల అసూయ, వారు తమ వనరులనూ అవకాశాలనూ కొల్లగొడుతున్నారనే నమ్మకం బలపడుతోందనీ కమిటీ రాసింది (పే. 351) ఇది కేవలం అసూయకూ, నమ్మకాలకూ సంబంధించిన విషయం కాదనీ, కళ్ల ఎదుట కనిపించే వాస్తవమనీ పది జిల్లాలలోనూ ప్రజలు వినిపించిన గాథలను పెడచెవిన పెట్టింది. తోటివారు బాగుపడితే అసూయపడే సంకుచిత మనస్తత్వం తెలంగాణ వారికున్నదనే దుర్మార్గపు ఆలోచన ప్రకటించింది. తెలంగాణ సమాజం ఎప్పుడైనా తోటివారు బాగుపడినందుకు అసూయ చెందలేదు, నిజానికి ఎన్నో తెలంగాణేతర జాతులు, వ్యక్తులు తెలంగాణలోనే తమ సౌభాగ్యాన్ని పెంచుకున్నాయి. వారిని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఇక్కడ పరిస్థితి వేరు. ఇక్కడ జరిగినది మోసం. విద్యలో, నీటిపారుదలలో, పాలనావ్యవస్థలలో తమకన్న తక్కువ స్థాయిలో ఉన్న తెలంగాణకు వలస వచ్చి తెలంగాణ వనరులను ఆక్రమించుకోవడం జరిగింది. ఆ వలసకు ఒకే జాతి, సోదరులు అనే మాయమాటలు చెప్పడం జరిగింది. మీ అభివృద్ధికి రక్షణలు కల్పిస్తామని హామీలు ఇచ్చి వాటిని ఉల్లంఘించడం జరిగింది. పోనీ వాటన్నిటినీ సహించినా, తెలంగాణ భాషనూ, సంస్కృతినీ, జీవనవిధానాన్నీ ప్రతిచోటా అవమానిస్తూ, తమ ఆధిపత్యాన్నీ, ఆభిజాత్యాన్నీ చూపుకోవడం జరిగింది. వైమనస్యానికి ఇన్ని కారణాలున్నాయి. అది అసూయ కాదు. దాన్ని అసూయగా చూపడం చరిత్రకూ, తెలంగాణ ప్రజల అమాయకత్వానికీ అవమానం.
• కమిటీకి తెలంగాణలో “తయారు చేసిన భావోద్వేగాలు (ఆర్గనైజ్డ్ ఎమోషన్స్)” చాల ఎక్కువగా కనబడ్డాయట. “నిష్పాక్షిక పరిశోధన చేస్తే ఆ భావోద్వేగాలు నిలవలేదట. తెలంగాణలో దృఢమైన అభివృద్ధి జరిగిందని తేలిందట. ఆంధ్రా వారిని శత్రువులుగా చూపడం ద్వారా, ప్రత్యేక రాష్ట్రం అనే ఐంద్రజాలిక పరిష్కారాల ద్వారా భావోద్వేగాలు బలపడుతున్నాయట (పే. 352). ఏవి తయారుచేసిన భావోద్వేగాలో, ఏవి నిజమైన భావోద్వేగాలో మనసుల్లోకి దూరి అంచనాకట్టే అద్భుతమైన పనిముట్టేదో శ్రీకృష్ణ కమిటీకి దొరికినట్టుంది! ఆ పనిముట్టును ఇతర ప్రాంతాల ఉద్యమాలకు కూడ అన్వయించి చూస్తే బాగుండును!
• ఆంధ్రప్రదేశ్ చరిత్ర పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్ర వివక్షకు గురయిందని తెలంగాణ జాగృతి ఫిర్యాదు చేసిందని ప్రస్తావిస్తూ, “కమిటీ చేసిన పరిశోధనలో ఈ ఫిర్యాదు నిజం కాదని తేలింది. పాఠశాల పాఠ్య పుస్తకాలలో ‘తెలంగాణలో స్వాతంత్ర్యోద్యమం’ అనే భాగం ఉంది. ఆంధ్ర రాష్ట్రంతో కలవక ముందూ, కలిసిన తర్వాత కూడ తెలంగాణ చరిత్రను ఈ భాగంలో చర్చించారు” (పే. 398) అని కమిటీ రాసింది. ఇది పూర్తిగా అబద్ధం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర ప్రత్యేకంగా అధ్యయనం చేసే పైస్థాయి పాఠ్యపుస్తకాలలో ఏ కొద్దిగానో అలా ఉండవచ్చుగాని, పాఠశాల పాఠ్యపుస్తకాలలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలంగాణకు సంబంధించిన చరిత్ర లేదు. పైగా, మద్రాసు రాష్ట్రంలోని తెలుగుజిల్లాల చరిత్రనే, ఆంధ్ర రాష్ట్ర చరిత్రనే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గతంగా చూపడం జరుగుతోంది.
• సాంస్కృతిక అంశాల మీద పన్నెండు పేజీల పాటు ఇరువైపుల వాదనలనూ యథాతథంగా ఉటంకిస్తూ, తెలంగాణ వాదనలను అక్కడక్కడ ఖండిస్తూ సాగిన నివేదిక చివరికి “సాంస్కృతిక భేదాల మీద, ఫిర్యాదుల మీద చర్చను సమన్వయించడానికి కమిటీ దగ్గర తగిన సమయమూ లేదు, నైపుణ్యమూ లేదు. కాని భారతదేశంలోని రాష్ట్రాలన్నీ అన్ని సంస్కృతులూ వాటి వాటి సంపదతో, వైవిధ్యంతో పరిఢవిల్లేలా చూడాలని ఎస్ ఆర్ సి ఇచ్చిన సలహాను మేం పునరుద్ఘాటించదలిచాం” అని ముక్తాయించింది. కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినందువల్ల ఈ సమస్య పరిష్కారం కాదని మరొక సలహా పడేసింది. తమను చిన్నచూపు చూస్తున్నారనీ, వెటకారం చేస్తున్నారనీ ఫిర్యాదు తెలంగాణలో మాత్రమే లేదనీ, దేశంలో చాల చోట్ల ఉందనీ, అది దురదృష్టకరమనీ మొసలికన్నీరు కార్చింది. చిట్టచివరికి “ఆత్మవిశ్వాసం లోపలి నుంచి రావలసిందే గాని చట్టాల ద్వారానో, విధాన నిర్ణయాల ద్వారానో జరిగేది కాదు” (పే. 403) అని దుర్మార్గమైన వ్యాఖ్య చేసింది. తెలంగాణ ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లనే విధాన నిర్ణయం కోసం పోరాడుతున్నదనే ధ్వని వినిపించింది. తనకు సమయమూ నైపుణ్యమూ లేదని తానే గుర్తించిన విషయాల మీద వ్యాఖ్యలు చేయకుండా ఉంటే కమిటీ నిజాయితీ బయటపడేది.
• హైదరాబాద్ లోగాని, ఇతర తెలంగాణ జిల్లాలలోగాని ఎంతోకాలంగా ఉన్నప్పటికీ కోస్తాంధ్ర నుంచి వలస వచ్చిన వారిని “సెట్లర్స్” అని పిలిచి అవమానిస్తున్నారనీ, వారు స్వాభావికంగానే కార్యసాధకులుగా, కష్టపడి పనిచేసేవారుగా ఉండగా వారిని “డబ్బుమనుషులు”గా చూస్తున్నారనీ, ఇది దురదృష్టకరమనీ కమిటీ రాసింది (పే. 404). ఎంతోకాలంగా ఉన్నప్పటికీ సెట్లర్స్ అనే పిలుపు మారలేదంటే, పిలిచేవాళ్లది తప్పయితే, పిలిపించుకునేవాళ్ల ప్రవర్తన వల్ల కూడ అలా జరుగుతోందా, వాళ్ల తప్పుకూడ ఏమైనా ఉందా పరిశీలించడం మధ్యవర్తి బాధ్యత. ‘డబ్బుమనుషులు’ అనే మాటను ఒక వాస్తవానికి చిహ్నంగానూ చూడవచ్చు, విమర్శగానూ చూడవచ్చు, వ్యతిరేకతగానూ చూడవచ్చు. నిజానికి అనేక చారిత్రక, సామాజిక కారణాల వల్ల కోస్తాంధ్ర ప్రజాజీవితంలో తెలంగాణ ప్రజాజీవితం కన్న చాలముందే మార్కెట్ సంబంధాలు, డబ్బును ప్రధానంగా చూసే సంస్కృతి ప్రవేశించాయి. ఆ మార్కెట్ సంబంధాల వల్ల, డబ్బుతో ముడిబడిన సంస్కృతి వల్ల వలస వచ్చినవాళ్లను మార్కెటేతర సంస్కృతిలో ఉన్న తెలంగాణ వాసులు వేరుగా చూశారు. అందులో అసహజమైనదీ లేదు, ప్రత్యేకమైన వ్యతిరేకతా లేదు.
• “సెట్లర్స్” సౌభాగ్యమే వారి పట్ల ఈర్ష్యాసూయలకు కారణమనీ, రాష్ట్ర విభజన జరిగితే వారి రక్షణకు హామీలు ఇవ్వాలనీ కమిటీ రాసింది (పే. 405). సొంత ఇంట్లో అన్యాయానికీ, రక్షణల హామీల ఉల్లంఘనలకూ యాభై నాలుగు సంవత్సరాలుగా గురవుతున్నవారి విషయంలో ఇచ్చిన పాత హామీలు ఏమైపోయాయి అనే ప్రశ్న కమిటీకి తట్టలేదు. కాని రేపు రాష్ట్ర విభజన జరిగితే రక్షణ హామీలు కావాలనే ముందు జాగ్రత్త మాత్రం తట్టింది.
ప్రముఖ జర్నలిస్టు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ రాసిన “ప్రతి అక్షరం ప్రజాద్రోహం” పుస్తకం చివరి భాగం కింద చదవండి.
మొదటి భాగం ఇక్కడ చదవొచ్చు: http://missiontelangana.com/nvenugopal-skc-rebuttal-part1/
రెండవ భాగం ఇక్కడ చదవొచ్చు: http://missiontelangana.com/nvenugopal-skc-rebuttal-part2/
***
తప్పుడు వాదనలు
పాఠకులను, పరిశీలకులను పక్కదారి పట్టించడానికి, తప్పుడు అవగాహనలు కల్పించడానికి, తెలంగాణ ప్రత్యర్థుల చేతికి ఆయుధాలు అందించడానికి కమిటీ అనేక తప్పుడు వాదనలను కూడ ముందుకు తెచ్చింది. వాటిలో కొన్ని ప్రధానమైన తప్పుడు వాదనల గురించి చూద్దాం.
ప్రభుత్వ గణాంకాలు
కమిటీ మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల మీద మాత్రమే ఆధారపడింది. నిజానికి ఈ వివాదం తెలంగాణ వాదులకూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్యనే. తమకు అన్యాయం జరిగిందనీ, ఆ అన్యాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల వల్ల జరిగిందనీ తెలంగాణవాదులు అంటున్నారు. అంటే ఈ వివాదంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేదే ఒక పక్షం. అలా తెలంగాణకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్యన వివాదాన్ని తీర్చడానికి మధ్యవర్తిగా వచ్చిన కమిటీ ఒక పక్షపు వాదనలను యథాతథంగా అంగీకరించి ప్రకటించడం సహజ న్యాయసూత్రాలకే విరుద్ధం. ఆ అంకెలు అబద్ధాలని, ఆ అంకెలను ఉత్పత్తి చేస్తున్న పక్షమే తమ మీద అన్యాయానికి, వివక్షకు కారణమని, ఆ అన్యాయాన్ని, వివక్షను మరుగు పరచడానికే ఆ అంకెలను తయారు చేస్తున్నదని మరొకపక్షం వాదిస్తున్నప్పుడు, మధ్యవర్తిగా ఉన్నవారు తటస్థమైన సమాచారాన్నయినా సేకరించాలి. ఒక పక్షం ఇచ్చిన సమాచారాన్ని మరో పక్షం ఇచ్చే సమాచారంతో పోల్చి చూడడమైనా చేయాలి. ఇది సహజ న్యాయసూత్రం. శ్రీకృష్ణ కమిటీ మాత్రం ఎక్కడా ఈ సహజ న్యాయ సూత్రాన్ని పాటించలేదు. కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెపుతున్న గణాంకాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉన్నప్పుడైనా, స్పష్టంగా అబద్ధాలని అర్థమయ్యేట్టుగా ఉన్నప్పుడైనా కమిటీ వాటిని అనుమానించాలని, ప్రశ్నించాలని అనుకోలేదు. మొత్తంగా ప్రస్తావించిన అంకెలూ గణాంకాలూ అన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినవే తప్ప, స్వతంత్ర పరిశోధకులవీ కాదు, జాతీయ సంస్థలవీ కాదు, తెలంగాణ వాదులవీ కాదు. ఎంత ఏకపక్షపు న్యాయమూర్తులయినా తమ తీర్పులలో ఇటువంటి పద్ధతి పాటించరు.
అసలు అంకెలు వాటికవిగా దేన్నీ ఆమోదించవు, దేన్నీ నిరాకరించవు. అంకెల మూలాన్ని బట్టి, ఎవరు సేకరించారనే దాన్ని బట్టి, ఎవరు చెపుతున్నారనే దాన్ని బట్టి, ఎంత భాగం చెపుతున్నారనే దాన్ని బట్టి, ఏ అంకెలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే దాన్ని బట్టి వాటికి రంగూ రుచీ వాసనా వస్తాయి. వాటికి చరిత్ర ఉంటుంది, వాటి వెనుక మనుషులు ఉంటారు. వాటి వెనుక చూపదలచుకున్న మనుషులూ ఉంటారు, దాచిపెట్టదలఛుకున్న మనుషులూ ఉంటారు. ఈ సంక్లిష్టతను పట్టించుకోకుండా, గుర్తించకుండా అంకెలను నిరపేక్షమైనవిగా, నిష్పక్షపాతమైనవిగా చూడడం అమాయకత్వమైనా అవుతుంది. లేదా కుట్రలో భాగం కావడమైనా అవుతుంది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ మహా మహా మేధావులతో తయారయింది గనుక ఇది అమాయకత్వం కావడానికి వీలు లేదు, కచ్చితంగా కుట్రే అయి ఉంటుంది.
వృద్ధి రేట్ల మాయాజాలం
“మొత్తంగా చూస్తే, మొత్తం నిధులు, అంకెలు, శాతాలు పరిశీలించినప్పుడు తెలంగాణవాదుల ఆరోపణలలో కొన్ని గాని, అన్నీ గాని నిజాల లాగనే అనిపిస్తాయి. కాని, మార్పు రేటు, పెరుగుదల రేటు, రాష్ట్ర ఆర్థికవ్యవస్థలో వాటాలు అంచనా కట్టి అధ్యయనం చేసినప్పుడు అసాధారణమైన స్థితి ఏమీ కనిపించదు” (పే. 117) అని కమిటీ రాసింది.
ఈ సమర్థన సాయంతో వృద్ధి రేట్లు అనే ఒక ఊతకర్రను సాయంగా తీసుకుని తెలంగాణ అభివృద్ధి చెందిందనే అబద్ధాన్ని పదేపదే చెప్పడానికి కమిటీ ప్రయత్నించింది. నిజానికి గణాంకాలనేవే మాయ అయితే, వృద్ధి రేటు అనేది మరింత పెద్ద మాయాజాలం. వృద్ధి రేట్లను గురించి మాట్లాడేవాళ్లెవరయినా గుర్తించవలసిన విషయమేమంటే వృద్ధి రేటు అనేది రెండు వేరు వేరు అంకెలమధ్య, రెండు వేరు వేరు కాలాల మధ్య పోలికను చెపుతుంది. ఆ రెండు అంకెలనూ, కాలాలనూ విస్మరించి వృద్ధి రేటు గురించి మాట్లాడడానికి వీలులేదు. ఆ రెండు అంకెలలో మొదటి అంకె ఎంత చిన్నదిగా ఉంటే వృద్ధి రేటు అంత ఎక్కువగా ఉంటుంది. అర్థశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే దీన్ని ‘బేస్ ఎంత తక్కువగా ఉంటే గ్రోత్ రేట్ అంత ఎక్కువగా ఉంటుంది’ అంటారు. అందువల్ల వేరు వేరు బేస్ లతో జరిగిన వృద్ధి రేట్లను పోల్చడానికే వీలు లేదు. ఒకదాని బేస్ తక్కువగానూ, మరొకదాని బేస్ ఎక్కువగానూ ఉన్న రెండు ప్రాంతాల అంకెలను తీసుకుని వాటికి అదనంగా చేరినదానితో వృద్ధి రేటు లెక్కకట్టి పోలిస్తే తప్పుడు ఫలితాలే వస్తాయి. అప్పుడు రెండు ప్రాంతాలలో అదనంగా చేరినది సమానమే అయినా రెండిటి గ్రోత్ రేట్లు వేరువేరుగా ఉంటాయి.
ఉదాహరణకు ఒక బేస్ 1 గానూ, మరొక బేస్ 10గానూ ఉన్నప్పుడు రెండిటికీ సమానంగా చెరి ఒకటి కలిపితే ఒకటి రెండుగానూ, పది పదకొండుగానూ మారుతాయి. ఇక్కడ రెండు చోట్లా చేరినది సమానమే అయినా ఒకచోట అది 100 శాతం వృద్ధి రేటుగా, మరొకచోట 10 శాతం వృద్ధి రేటుగా ఉంటుంది.
అందువల్ల బేస్ తో సంబంధం లేకుండా వృద్ధిరేట్ల గురించి మాట్లాడడం అర్థరహితం. వృద్ధిరేట్ల గురించి మాట్లాడేటప్పుడు 1956లో తెలంగాణలో ఉన్న స్థితి ఏమిటో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్థితి ఏమిటో చెప్పి, ఆ తర్వాత యాభై ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పవలసి ఉంటుంది. ఆ అభివృద్ధికి కూడ ప్రభుత్వం వైపు నుంచి నిధుల కేటాయింపు రూపంలో జరిగిన దోహదం ఎంతో, వ్యక్తిగత స్థాయిలో జరిగిన దోహదం ఎంతో చెప్పవలసి ఉంటుంది. ఈ రకమైన పునాది గురించి వివరణ లేకుండా వృద్ధిరేట్ల గురించి మాట్లాడడం అంకెల గారడీ, ఆత్మవంచన, పరవంచన. ఈ పనులు చేయడంలో తనకు చాల నైపుణ్యం ఉన్నదని కమిటీ సమర్థంగా చూపుకుంది.
నీటి పారుదల వృద్ధిలో ప్రభుత్వం పాత్ర ఎంత?
నీటి పారుదల సౌకర్యాల గురించి, వాటి పెరుగుదల గురించి మాట్లాడేటప్పుడు కమిటీ చాల తెలివిగా అంకెలు గుప్పిస్తూ పోయింది ఆని ఆ అంకెలకు చరిత్ర ఉంటుందనీ, ఆ అంకెల వెనుక మనుషులూ, మనుషుల ప్రయత్నాలూ ఉంటాయనీ మరచిపోయింది. ఉదాహరణకు తెలంగాణలో కొన్ని జిల్లాలలో నీటి పారుదల సౌకర్యం ఉన్న భూమి విస్తీర్ణం పెరిగిందని మొత్తం అంకెను మాత్రం ప్రకటించింది గాని, ఆ పెరిగిన విస్తీర్ణంలో రైతులు వ్యక్తిగతంగా చేసుకున్న ప్రయత్నాల వాటా ఎంత, పన్నులుగా వసూలు చేసిన ప్రజాధనాన్ని ఉపయోగించి ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఎంత అనే విషయాన్ని దాటవేసింది.
నిజానికి నీటిపారుదల సౌకర్యాల కల్పనలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, విధాననిర్ణయాల పరంగా తెలంగాణకు అన్యాయం చేసిందనేది, వివక్ష చూపిందనేది తెలంగాణ వాదుల వాదనలలోని ప్రధానాంశాలలో ఒకటి. దీనికి జవాబు చెప్పాలంటే 1956 తర్వాత ప్రజాధనంతో ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల, కాలువల కింద కొత్తగా తెలంగాణలో ఎంత భూమికి నీటి సౌకర్యం అందిందో చెప్పవలసి ఉంటుంది. అది పరీవాహక ప్రాంతం, జనాభా, ప్రజల అవసరాలు, రాష్ట్రానికి ఉండే మొత్తం వాటా వంటి అనేక ప్రాతిపదికల మీద ఆధారపడి, తెలంగాణకు న్యాయంగా రావలసిన వాటా కన్న తక్కువా, సమానమా, ఎక్కువా చెప్పవలసి ఉంటుంది.
కాని రైతులు తమ సొంత నిధులు వెచ్చించి బావులు, బోరుబావులు, విద్యుత్ పంపుసెట్లు ఉపయోగించి కొత్తగా నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమి విస్తీర్ణాన్ని పెంచితే, దాన్నంతా ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం అనుచితం, అనైతికం.
ఈ అన్యాయానికి మరొక కోణం కూడ ఉంది. తెలంగాణ రైతు బోరుబావికి, విద్యుత్ పంపుసెట్లకు విపరీతంగా ఖర్చు పెట్టవలసి వస్తోంది. ఇటీవల ఉచిత విద్యుత్తు అందుతున్నప్పటికీ, విద్యుత్ సరఫరా సక్రమంగానూ సరైన సమయాలలోనూ లేనందువల్ల విపరీతంగా మోటర్లు కాలిపోవడం, అందువల్ల ఖర్చు పెరిగిపోవడం కూడ జరుగుతోంది. మరొకపక్క కోస్తా రైతు, ముఖ్యంగా ఉభయ గోదావరులు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో కాలువల కింద వ్యవసాయం సాగించే రైతుకు నీటి తీరువా తప్ప సాగునీటి గురించి మరే ఖర్చూ లేదు. అంటే తెలంగాణ రైతుకూ, కోస్తాంధ్ర రైతుకూ వ్యవసాయ ఖర్చులో గణనీయమైన తేడా విధానపరంగానే ఏర్పడి ఉంది. ఒకే రాష్ట్రంలో రెండు ప్రాంతాల రైతుల మధ్య విపరీతమైన అసమానత ఉంది. తెలంగాణ ఆందోళనలో ఇది ఒక ప్రధానాంశం. దీన్ని విస్మరించి నీటి పారుదల సౌకర్యం ఉన్న భూమి విస్తీర్ణం పెరిగింది అనడం మేధోపరమైన నిజాయితీ రాహిత్యం.
తెలంగాణలో నీటిపారుదల సౌకర్యాల స్థితి గురించి మరొక అంశం కూడ ఉంది. తెలంగాణలో కాకతీయుల నాటినుంచీ కూడ ఇక్కడి నైసర్గిక స్థితిని బట్టి గొలుసు పద్ధతిలో చెరువులు, కుంటల వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఒక వాగుకు అడ్డంగా ఒక చెరువు, ఆ చెరువు మత్తడి నుంచి మొదలైన వాగు మరొక చెరువుకు చేరడం, మధ్యలో ఎక్కడ నైసర్గికమైన అవకాశం ఉంటే అక్కడ ఒక కుంట… ఇలా తెలంగాణ జిల్లాలలో వేలాది చెరువులు, కుంటలు ఏర్పడ్డాయి. 1956 తర్వాత ఈ చెరువులనూ, కుంటలనూ నిరాదరించడం మొదలయింది. మరమ్మతులు చేయడం, పూడిక తీయడం, గండి పడిన చెరువులను పూడ్చడం, చెరువు గర్భం భూముల దురాక్రమణను అడ్డుకోవడం, తూములను, కాలువలను బాగుచేయడం వంటి చర్యలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. మరొకపక్క పట్టణాల నిర్మాణం కొరకు వాగులనుంచి విచ్చలవిడిగా ఇసుక తవ్వుకుపోతూ ఉంటే ప్రభుత్వం చూసీచూడనట్టు ఉండిపోయింది. ఇసుక అక్రమ రవాణానే రాజకీయవాదుల సంపదకు ఒక వనరుగా మారిపోయింది. దానితో వాగులన్నీ క్రమక్రమంగా వట్టిపోయాయి. చెరువులు, కుంటలు నిండడం తగ్గిపోయింది. వాటికింద సాగుభూమి విస్తీర్ణం తగ్గిపోయింది. అలా తెలంగాణలో కాలువల కింద విస్తీర్ణం పెద్దగా పెరగలేదు, చెరువుల కింద విస్తీర్ణం తగ్గిపోయింది. బావుల కింద విపరీతంగా పెరిగింది. కాలువలకూ, చెరువులకూ ప్రభుత్వానిది బాధ్యత. బావులు రైతుల సొంత బాధ్యత. ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వర్తించలేదు అని వాదిస్తుంటే, అది పక్కన పెట్టి, రైతులు చేసిన పనిని ప్రభుత్వానికి ఆపాదించిందిన కమిటీ ఈ పరిణామాలను పరిశీలించింది గాని సరిగా విశ్లేషించడానికి ప్రయత్నించలేదు. అలా విశ్లేషించి ఉంటే, చేసిన తప్పుల ద్వారానూ, చేయని ఒప్పుల ద్వారానూ కూడ తెలంగాణ నీటిపారుదల సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎలా ధ్వంసం చేశాయో అర్థమై ఉండేది.
ఎంత ఎక్కువ కరెంటు తింటే అంత అభివృద్ధి అట!!
తెలంగాణ అభివృద్ధి చెందిందనే అభిప్రాయాన్ని బలపరచడానికి కమిటీ ఉపయోగించిన ఇంకొక వాదన తెలంగాణలో విద్యుత్ వినియోగపు అంకెలు. నిజానికి ప్రశ్న తెలంగాణ అభివృద్ధి చెందిందా లేదా అన్నది కాదు, తెలంగాణ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి చేసిందనేది, తెలంగాణకు రావలసిన న్యాయమైన వాటా ఇచ్చిందా లేదా అనేది, పెద్దమనుషుల ఒప్పందం నాటినుంచీ యాభైనాలుగు ఏళ్లలో తానే ఇచ్చిన హామీలను నెరవేర్చిందా లేదా అనేది. ఆ ప్రశ్నలను పక్కన పెట్టి తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం కోస్తాంధ్రకన్న, రాయలసీమ కన్న ఎక్కువగా ఉంది గనుక తెలంగాణ అభివృద్ధి చెందినట్టే అని వాదించడం కుతర్కమే అవుతుంది గాని హేతుబద్ధ తర్కం కాదు.
తలసరి విద్యుత్ వినియోగం ఎంత ఎక్కువగా ఉంటే అభివృద్ధి అంత ఎక్కువగా ఉన్నట్టు అనేది ప్రపంచబ్యాంకు ప్రచారం చేస్తున్న భావజాలం. అది విద్యుదుత్పత్తి పరికరాల బహుళజాతి సంస్థల కోసం ఈ భావజాలాన్ని తయారుచేసిపెట్టింది. ఒక సమాజంలో అవసరం ఉన్నా లేకపోయినా విపరీతంగా విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆ విద్యుత్ ఉత్పాదనను జనాభాతో విభజించి తలసరి విద్యుత్ వినియోగం అంకెను తయారు చేసి అది ఎంత ఎక్కువైతే అంత అభివృద్ధి అని ప్రపంచబ్యాంకు అంటుంది. ఆ అంకెను ఎక్కువ చేయడానికి విద్యుదుత్పత్తి కేంద్రాలు స్థాపించమనీ, బహుళజాతిసంస్థలనుంచి పరికరాలను కొనుక్కొమ్మనీ, దానికి తాను రుణం ఇస్తాననీ ప్రపంచబ్యాంకు చెపుతోంది. ఇదంతా ఆ సంస్థలు తమ ఉత్పత్తులు అమ్ముకునే ప్రయత్నం తప్ప ప్రజలు కరెంటు తిని, కరెంటు తాగి, కరెంటు పీల్చి బతకరు. కూడు, గూడు, గుడ్డ ఉన్న తర్వాత కరెంటు అవసరమే కావచ్చు, కూడు, గూడు, గుడ్డ ఉత్పత్తి చేయడానికి కరెంటు అవసరమే కావచ్చు. కాని కరెంటు వినియోగం ఎక్కువగా ఉన్నదని సగటు అంకెలు చెప్పినంత మాత్రాన ప్రజలకు అది అందుతున్నదనే హామీ ఏమీ లేదు. దానివల్లనే ప్రజాజీవితం మెరుగుపడుతుందన్న హామీ లేదు.
అంత మాత్రమే కాదు, విదేశాలకు ఎగుమతి కోసం సరుకులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు, అంతర్జాతీయ మార్కెట్ కు అవసరమైన పంటలు పండించే వ్యవసాయ రంగం, విదేశీ సంస్థలకు చౌక శ్రమను అందించే సేవారంగసంస్థలు వాడే కోట్లాది యూనిట్ల కరెంటును, ఇళ్లలో వాడే కరెంటును కలిపి జనాభాతో విభజించడం మరొక నిజాయితీ లేనితనం. ఇలా కనీస మేధో నిజాయితీ లేమితో ఒక విద్యుత్ వినియోగం అంకె తయారు చేసి, అది చూపుతూ తెలంగాణ అభివృద్ధి చెందింది, కనుక ఆ కారణం మీద తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అడగడం సరయినది కాదు అని ఇల్లెక్కి అరవడం భయంకరమైన, క్షమించడానికి వీలులేని ధూర్తత్వం.
ఉద్యమ కారణాలు సాకులట, ఉద్యమకారులు పనిముట్లట!!
“తెలంగాణలోని చాల అణగారిన సమూహాలు కష్టభరితమైన జీవితం గడుపుతున్నాయి. అందువల్ల తీరేవైనా, తీరకుండా ఉండిపోయేవైనా వాగ్దానాల మీద రాజకీయ సమీకరణలు జరపడానికి, ఏదో ఒక సాకు మీద కూడగట్టబడడానికి ఈ జనం సిద్ధంగా ఉన్నారు” (పే. 108) అని నివేదిక రాసింది.
“తెలంగాణలో లోతైన అసమానతలు వేర్పాటు ఉద్యమానికి ఆజ్యం పోయడం మాత్రమే కాదు, దాన్ని ముందుకు నడపడానికీ, తీవ్రతరం చేయడానికీ ఉపయోగపడతాయి. అందువల్ల ప్రజానీకం రాజకీయ పార్టీలతో సహా స్వార్థప్రయోజన శక్తుల ఆందోళనలకు పనిముట్లుగా సులభంగా ఉపయోగపడతారు.” (పే. 119) అని మరొక చోట రాసింది.
ఒకవైపు ప్రజల కష్టభరితమైన జీవితం గురించీ, అసమానతల గురించీ ప్రస్తావిస్తూనే వారు తమ ఇష్టపూర్తిగా చైతన్యయుతంగా ఉద్యమించడంలేదనీ, వారు సాకులమీద ఉద్యమిస్తున్నారనీ, ఇతరులకు పనిముట్లుగా ఉపయోగపడుతున్నారనీ కమిటీ చాల అవమానకరమైన, దుర్మారమైన వ్యాఖ్య చేసింది. గత నలభై సంవత్సరాల చరిత్రను పక్కనపెట్టినా, ఈ పద్నాలుగు నెలల అనుభవాలనే చూసినా, కమిటీ పర్యటించినప్పుడు అన్ని ప్రజాసమూహాలూ, అన్ని వయసులవాళ్లూ కమిటీకి చెప్పినవి సరిగా విని ఉన్నా ఈ మాట అనడం ఆ ప్రజలను ఎంతగా అవమానించడమో, చిన్నచూపు చూడడమో కమిటీకి అర్థమై ఉండేది. నిజానికి ప్రజలు తమ సమస్యల మీద తామే స్వచ్ఛందంగా పోరాడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆ సమస్యలలో కొన్నయినా తీరే అవకాశం వస్తుందని నమ్ముతున్నారు. రాజకీయ పార్టీల అవకాశవాదాన్ని కూడ తోసి రాజంటున్నారు. అందువల్ల వాళ్ల సమస్యలు సాకులనీ, వాళ్లు ఇతరులకు పనిముట్లుగా ఉపయోగపడుతున్నారనీ అనడం దురహంకారం.
తెలంగాణది వెనుకబాటుతనం కాదట!
తెలంగాణలో పేదరికం, వెనుకబాటుతనం ఉన్నాయా లేవా అని చర్చించడానికి, లేవని చెప్పడానికి కమిటీ చేసిన ఒక సర్కస్ ఫీటు చూస్తే చాల ముచ్చట కలుగుతుంది. ఇంతటి మేధావులు ఎంతటి కుటిలత్వానికి దిగజారవలసి వచ్చింది గదా అని జాలి కలుగుతుంది. వెనుకబడిన ప్రాంతాల సహాయ నిధి (బ్యాక్ వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ – బి ఆర్ జి ఎఫ్) అనే శీర్షిక కింద (పే. 80 – 81) కమిటీ చాల దుర్మార్గమైన, హాస్యాస్పదమైన వాదనలు చేసింది.
దేశవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాలను, జిల్లాలను గుర్తించి, ఆ జిల్లాలకు అదనపు సహాయ నిధులు అందించడానికి కేంద్ర ప్రభుత్వానికి బి ఆర్ జి ఎఫ్ పథకం ఉంది. ఈ వెనుకబడిన జిల్లాలను ప్రణాళికా సంఘం గుర్తిస్తుంది. దేశంలోని 27 రాష్ట్రాల నుంచి 250 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించినట్టుగా ప్రణాళికా సంఘం 2010 ఆగస్ట్ 9 న ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకం కిందికి వచ్చిన జిల్లాలు 13 అయితే అందులో తొమ్మిది తెలంగాణ జిల్లాలే. అంటే తెలంగాణలో హైదరాబాద్ జిల్లా మినహా మిగిలిన జిల్లాలన్నీ వెనుకబడిన జిల్లాలేనని ప్రణాళికా సంఘం చెప్పిందన్నమాట. సరిగ్గా శ్రీకృష్ణ కమిటీ చెప్పదలచుకున్నదానికి ఇది వ్యతిరేకం గనుక, దీన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి, వక్రీకరించడానికి కమిటీ నివేదిక ప్రయత్నించింది.
ఈ “వెనుకబడిన జిల్లాల”లో జాతీయ ఉపాధి హామీ పథకం, ఇంటర్ మినిస్ట్రీ టాస్క్ గ్రూప్, రాష్ట్రీయ సమవికాస్ యోజన, జాతీయ పనికి ఆహార పథకం కింద గుర్తించిన జిల్లాలు కూడ కలిసే ఉన్నాయని కమిటీ రాసింది. అందులో నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలను వామపక్ష తీవ్రవాదం ఉన్న జిల్లాలుగా సమవికాస్ యోజన కింద గుర్తించాలని హోంమంత్రిత్వశాఖ కోరిందని కమిటీ రాసింది. కనుక బి ఆర్ జి ఎఫ్ కింద చెప్పినట్టుగా తెలంగాణలోని తొమ్మిది జిల్లాలను, 87 శాతం ప్రజలను వెనుకబడినవారుగా గుర్తించనక్కరలేదని, అందులో ఐదు జిల్లాలు, 46 శాతం ప్రజలు నక్సల్ వ్యతిరేక నిధులు పొందినందువల్లనే బి ఆర్ జి ఎఫ్ కిందికి వచ్చారని వాదించింది. కనుక తెలంగాణలో నిజమైన వెనుకబాటుతనం నాలుగు జిల్లాలలో, 41 శాతం ప్రజలలోనే ఉందని వాదించింది. “అందువల్ల, బి ఆర్ జి ఎఫ్ ను ఇలా విశ్లేషించి చూస్తే, తెలంగాణ ప్రాంతం నుంచి కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని పౌరసమాజ బృందాలు చేసిన వాదనలు సరైనవి కాదని తేలుతుంది” (పే.81) అని ముక్తాయించింది. అబ్బ ఏమి తెలివి, ఏమి తెలివి!!
ఇతర వెనుకబడిన ప్రాంతాలతో పోటీ నివేదికలో చాల చోట్ల పోలికలు చెపుతూ ఉన్నప్పుడు గాని, విడిగా గాని ఆంధ్రప్రదేశ్ లో ఇతర వెనుకబడిన ప్రాంతాలు, అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు, నిరాదరణకు గురయిన ప్రాంతాలు ఉన్నాయని, తెలంగాణ కన్న వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయని రాశారు. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణతో సమానంగా గాని, అటూ ఇటూగా గాని వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయనే విషయంతో ఎవరికీ పేచీ లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, పల్నాడు ప్రాంతాలలో, కోస్తాంధ్రలో కూడ కొన్ని చోట్ల సాధారణ ప్రజల పరిస్థితి దుర్భరంగా ఉన్నదనేది అందరికీ తెలిసిన వాస్తవమే. కాని కమిటీ ఆ వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించడం కోసం చూపడంలేదు. న్యాయమైన తెలంగాణ ఆకాంక్షలను అడ్డుకునే దురాలోచనతో మాత్రమే వాటిని ఎత్తిచూపుతోంది. ఆయా ప్రాంతాల ప్రజల వెనుకబాటు తనానికి బాధ్యత తెలంగాణ ప్రజలది కాదు. ఆ ప్రాంతాల వెనుకబాటు తనానికి కారణాలేమిటో, వాటికి పరిష్కారాలేమిటో కూడ కమిటీ చెప్పడం లేదు. కేవలం ఇతర ప్రాంతాలతో పోటీ పెట్టి తెలంగాణ ప్రాంతపు ప్రజల ఆకాంక్షలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది.
నిజంగా ఆ ప్రాంతాల ప్రజల మీద ప్రేమ ఉంటే వారికి కూడ అన్యాయం చేసిన యాభైనాలుగు సంవత్సరాల పాలకవిధానాలను నిశితంగా పరిశీలించి విమర్శించవలసింది. నిజం చెప్పాలంటే తమకు కోస్తాంధ్ర పాలకుల చేతిలో అన్యాయం జరగబోతుందని తెలంగాణ కన్న పదహారు సంవత్సరాల ముందే గుర్తించి, రక్షణ కోసం శ్రీబాగ్ ఒడంబడిక కుదుర్చుకున్నది రాయలసీమ. ఆ ఒడంబడికలోని రక్షణలు ఎందుకు అమలు కాలేదో శ్రీకృష్ణ కమిటీ ఆలోచించి ఉండవలసింది. రెండు జీవనదులు, అడవి, ఖనిజాలు, సముద్రతీరం, కష్టజీవులైన ప్రజలు – అన్ని వనరులూ పుష్కలంగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలు ఇవాళ్టికీ పొట్ట చేత పట్టుకుని దేశదేశాలు వలస ఎందుకు పోవలసి వస్తున్నదో కమిటీ ఆలోచించి ఉండవలసింది. మధ్యనుంచి కృష్ణానది ప్రవహిస్తూ ఉండగా, నల్లమల అడవి ఉండగా, సిమెంటు పరిశ్రమకు అవసరమైన ఖనిజ నిలువలు ఉండగా, పొరుగున అభివృద్ధి చెందిన కాలువల వ్యవసాయపు భూములు ఉండగా పల్నాడు ఎందుకు దారిద్ర్యంలో మగ్గిపోతున్నదో కమిటీ ఆలోచించి ఉండవలసింది. తెలంగాణ వనరులను కొల్లగొట్టడానికి సమైక్యరాగం ఆలపిస్తున్నట్టు నటిస్తున్న కోస్తాంధ్ర పాలకవర్గాలు తమ ప్రాంతంలోనే దళితులతో ఎన్నడూ సమైక్యంగా ఉండలేదని, ఆ ఘర్షణకు హింసాత్మక నిదర్శనాలుగా కంచికచెర్ల, కారంచేడు, నీరుకొండ, చుండూరు వంటి అనేక దురంతాలున్నాయని కమిటీ గుర్తించవలసింది. అలా ఆలోచిస్తే తెలంగాణ వెనుకబాటుతనానికి, వివక్షకు మాత్రమే కాదు, రాష్ట్రంలోని ఈ అన్ని ప్రాంతాల వెనుకబాటుతనానికి పాలకవర్గాలే, పాలకవిధానాలే కారణమని కమిటీకి అర్థమై ఉండేది. అప్పుడు ఆ పాలకవిధానాలలో ప్రత్యేకంగా ఉన్న ప్రాంతీయ వివక్షకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చేస్తున్న పోరాటపు న్యాయబద్ధత అర్థమై ఉండేది.
హైదరాబాద్ మీద అధికారమే కీలకం
కమిటీ అనేక చోట్ల కోస్తాంధ్రకూ, రాయలసీమకూ హైదరాబాద్ ఎంత కీలకమైనదో ప్రస్తావించింది. ప్రత్యేకంగా ఒక అధ్యాయమే హైదరాబాద్ కోసం కేటాయించింది. చివరికి సిఫారసులలోనూ హైదరాబాద్ ను విస్తరించి కేంద్రపాలిత ప్రాంతంగా చేయమని సూచించింది.
హైదరాబాద్ పట్ల ఈ దృక్పథం ప్రధానంగా కోస్తాంధ్ర, రాయలసీమలకు చెందిన పెట్టుబడిదారులకు, ప్రపంచీకరణ క్రమంలో హైదరాబాద్ ను ఆక్రమించుకోవడం మొదలుపెట్టిన బహుళజాతి సంస్థలకు సంబంధించినది. హైదరాబాద్ మీద తమ అధికారాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం తప్పకపోతే, హైదరాబాద్ ను విడదీసి తెలంగాణను ధ్వంసం చేసి ఇవ్వడానికి, కోస్తాంధ్ర, రాయలసీమ రాజకీయ నాయకులు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. మన్మోహన్ సింగ్, చిదంబరంల దగ్గరినుంచి ప్రపంచీకరణ, బహుళజాతిసంస్థల ప్రతినిధులందరూ ఈ ప్రయత్నాలకు వత్తాసు పలుకుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్ పట్ల తీసుకున్న వైఖరిని ఈ మొత్తం ఆలోచనాసరళిలో భాగంగానే చూడాలి.
హైదరాబాద్ మీద కన్ను ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ రాజకీయ నాయకులలో, సంపన్నులలో ఎక్కువమంది కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు గనుక వారిలో హైదరాబాద్ లోని తమ ఆస్తులకు, వ్యాపారాలకు ఏమి జరుగుతుందోననే ఆందోళన ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమలలోని మామూలు ప్రజలకేమో, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే మహానగరం తమకు దూరమైపోతుందనీ, అటువంటి మహానగరాన్ని నిర్మించుకోవడానికి తమకు ఒక తరమయినా పడుతుందనీ, ఈలోగా తమ అవసరాలు తీర్చే నగరం ఉండదనీ అనుమానాలున్నాయి.
ప్రజలలోని ఈ అనుమానాల్ని ఆసరా చేసుకుని, తమ స్వార్థ ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కొరకు రాజకీయ నాయకులు అనేక అబద్ధాలు, భ్రమలు ప్రచారం చేశారు. తమవల్లనే హైదరాబాదు అభివృద్ధి అయిందని అన్నారు. తాము రాకముందు హైదరాబాదులో తొండలు గుడ్లు పెట్టేవని ఒకరనగా, తాము హైదరాబాదులో చేసిన అభివృద్ధికి తమకు పరిహారం చెల్లించాలని మరొకరన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి 1953 అక్టోబర్ 1 నుంచి 1956 అక్టోబర్ 31 దాకా రాజధానిగా ఉన్న కర్నూలు స్థాయిని త్యాగం చేసి, హైదరాబాద్ ను రాజధాని చేశామని, ఆ త్యాగానికి ప్రతిఫలంగా తమకు లక్ష కోట్ల రూపాయలు ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయాలని కొందరు, కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కొందరు సన్నాయి నొక్కులు నొక్కారు. తమకు దక్కకపోతే ఇతరులకు కూడ దక్కకుండా పాడుచేస్తామని అనే ధూర్తుల లాగ కోస్తాంధ్ర, రాయలసీమ రాజకీయ నాయకులు హైదరాబాద్ చరిత్ర గురించీ, హైదరాబాద్ అభివృద్ధి గురించీ నోటికి వచ్చిన అబద్ధాలు, అవాకులూ చవాకులూ మాట్లాడారు. చరిత్రనూ, వాస్తవాలనూ పరిగణనలోకి తీసుకుని న్యాయం చెప్పవలసిన తీర్పరి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఈ అబద్ధాలకు లొంగిపోయి నివేదిక రాసింది.
హైదరాబాద్ ఏర్పడిన 1591 నుంచి 1687 వరకు రాజధాని కాదు. ఆనాడు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు గోల్కొండ రాజ్యంలో భాగమే అయినా ఆ ప్రాంతాల నుంచి చెప్పుకోదగిన ఆదాయం వచ్చిందనే దాఖలాలు గాని, దాన్ని హైదరాబాదుకు ఖర్చుపెట్టిన దాఖలాలు గాని లేవు. ఆ తర్వాత ఏడు దశాబ్దాల పాటు రాజధానిగా ఔరంగాబాదు ఉండింది గనుక అప్పుడు కూడ హైదరాబాదు అభివృద్ధి ఏమీ జరగలేదు. ఇక 1763లో హైదరాబాదు రాజధాని అయినప్పటికీ ఇవాళ్టి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు, ఈ రాజ్యం నుంచి 1766లో, 1787లో, 1799లో వేరయిపోయాయి. నిజానికి హైదరాబాదు ఆధునిక నగరంగా ఎదిగినది 1850ల తర్వాత ప్రధానిగా సాలార్ జంగ్ అమలు చేసిన సంస్కరణల కాలంలో. అప్పటికి కోస్తాంధ్ర, రాయలసీమలు హైదరాబాదు రాజ్యంలో భాగం కావు గనుక వాటికి ఆ అభివృద్ధిలో భాగం ఉండే అవకాశం లేదు. 1956 నవంబర్ 1 నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ కలిసిన ప్రాంతానికి హైదరాబాదు రాజధానిగా ఉంది గనుక ఈ యాభై నాలుగు సంవత్సరాలలో హైదరాబాదులో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి, వాటికి ఖర్చు పెట్టిన నిధులలో ఏ ప్రాంతం వాటా ఎంత అనే విషయం లెక్కలు వేసుకోవచ్చు. మొత్తంగా మూడు ప్రాంతాల నుంచి వచ్చిన ఆదాయం ఎంత, ఆయా ప్రాంతాలలో జరిగిన ప్రభుత్వ వ్యయం ఎంత అని కూడ లెక్కలు తేల్చవచ్చు.
ఇక ప్రైవేటు పెట్టుబడుల విషయానికి వస్తే నాలుగు శతాబ్దాల హైదరాబాదు చరిత్రలో ఇరానియన్లు, కాయస్తులు, సింధీలు, మార్వాడీలు, గుజరాతీలు, తమిళులు మొదలయిన అనేక జాతులవారు ఇక్కడికి వచ్చి తమ పెట్టుబడులు పెట్టారు. నగరానికి తాము ఇవ్వగలిగింది ఇచ్చారు. ఏ ఒక్కరూ ఈ నగరాన్ని తామే అభివృద్ధి చేశామని గాని, తమ వాటా తమకు ఇమ్మని గాని అడగలేదు. అసలు ప్రపంచ చరిత్రలోనే అన్ని నగరాలూ అనేక జాతుల, ప్రజాసమూహాల కృషితో నిర్మాణమయ్యాయి గాని “ఈ నగరం అభివృద్ధి మావల్లనే అయింది, కాబట్టి వదిలి వెళ్లాలంటే నష్టపరిహారం ఇవ్వండి” అని ఎవరూ ఎక్కడా అడగలేదు. ఏ నగరమయినా భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతానికే చారిత్రకంగా, సాంస్కృతికంగా చెంది ఉంటుంది. తెలుగు వాళ్లు ఎంత అడిగినా మద్రాసు విషయంలో అదే జరిగింది. గుజరాతీలు ఎంత అడిగినా బొంబాయి విషయంలో అదే జరిగింది. ఆమాటకొస్తే ఇంగ్లండ్ భారతదేశాన్ని వలసగా ఆక్రమించకుండా ఉండి ఉంటే, భారత సంపదను దోచుకోక పోయి ఉంటే లండన్ నగరం అభివృద్ధి చెంది ఉండేదే కాదు. కాని భారత జాతీయోద్యమం లండన్ అభివృద్ధిలో తమ వాటా గురించి ఎన్నడూ అడగలేదు.
అంతేకాదు, నిజాం రాజవంశం, ముఖ్యంగా 1913 నుంచి 1948 దాకా పాలించిన ఏడవ నిజాం నిరంకుశ భూస్వామ్యం పునాదిగా పాలించారు గనుక హైదరాబాద్ రాజ్య ప్రజల గోళ్లూడగొట్టి అనేకరకాల పన్నులు వసూలు చేసి హైదరాబాదును అభివృద్ధి చేశారు. అంటే హైదరాబాదు నిండా ఉన్నది హైదరాబాదు రాజ్య ప్రజల నెత్తురూ చెమటా మాత్రమే. అందులో ఐదు మరాఠ్వాడా జిల్లాల, మూడు కన్నడ జిల్లాల ప్రజల భాగస్వామ్యమయినా ఉంది గాని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజల పాత్ర లేదు. అలాగే, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సర్ఫ్ ఎ ఖాస్ అనే పేరు మీద తనకు తానే సొంత భూమి రాసుకున్నాడు. రాజ్యంలోని ఐదు కోట్ల ఎకరాలలో యాభైలక్షల ఎకరాల భూమి ఇలా ఆయన సొంత ఆస్తిగా ఉండేది. అందులో ఇవాళ హైదరాబాదులో చేరిన ఆరు వందల గ్రామాల భూములు ఉన్నాయి. ఆ లక్షలాది ఎకరాల భూమి నిజానికి హైదరాబాద్ రాజ్య ప్రజల శ్రమ ఫలితం. దాన్ని లీజులకు ఇచ్చి, అమ్మి, అన్యాక్రాంతం చేసి, రియల్ ఎస్టేట్ గా మార్చిన పాలకులు ఆ డబ్బుతో హైదరాబాద్ ను “అభివృద్ధి” చేసి, మేమే అభివృద్ధి చేశామని అనడం అనైతికం, అచారిత్రికం.
ఈ సమస్యను మరొకవైపు నుంచి కూడ ఆలోచించవలసి ఉంది. అసలు అభివృద్ధి అంటే ఏమిటి? ఏ ప్రమాణాలు ప్రాతిపదికగా అభివృద్ధిని లెక్కిస్తున్నారు? హైదరాబాద్ అభివృద్ధి అంటే హైదరాబాద్ లో నివసించే ప్రజల అభివృద్ధా, లేక హైదరాబాద్ లో కొన్ని భవనాలు, ఫ్లై ఓవర్లు, విమానాశ్రయం వంటి హంగులు రావడమా? అభివృద్ధి అంటే ప్రజల నిత్యజీవిత జీవన ప్రమాణాలలో కనబడే మెరుగుదలా, కేవలం కొన్ని సగటు అంకెలలో కనబడే పెరుగుదలా? అభివృద్ధి అంటే జీవనోపాధి అవకాశాలు పెరగడమా, జనజీవనంతో సంబంధం లేని తళుకుబెళుకులు పెరగడమా?
హైదరాబాద్ అభివృద్ధి గురించి అటూ ఇటూ సాగుతున్న వాదనలన్నీ ప్రజాజీవితంలోని అభివృద్ధిని కాక, హంగులనే అభివృద్ధిగా చూస్తున్నట్టు కనబడుతున్నది. నిజానికి గత ఐదు దశాబ్దాలలో హైదరాబాద్ లో మురికివాడల సంఖ్య వందలరెట్లు పెరిగింది. హైదరాబాద్ అప్పుడూ ఇప్పుడూ కూడ దేశంలో ఐదవ స్థానంలోనే ఉన్నది. పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా పౌరసౌకర్యాలు పెరగలేదు. విద్యా, వైద్య, ఆరోగ్య, రవాణా, పారిశుధ్య, వినోద, విహార సౌకర్యాలలో ఏ ఒక్కటి చూసినా గత ఐదు దశాబ్దాలలో పెరిగిన జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు పెరగలేదని స్పష్టమవుతుంది. కనుక ఈ పెరుగుదలను అభివృద్ధి అనడం మొదటి తప్పు. ఇది సగటు అంకెలలో పెరుగుదలే తప్ప ప్రజల అభివృద్ధి కాదు.
హైదరాబాద్ అభివృద్ధి గురించి సగటు అంకెలు మాత్రం చూపుతూ, అంకెల గారడీ చేస్తూ, ఇతర సామాజిక పరిణామాలను పరిగణనలోకి తీసుకోకపోవడం అంతకన్న మించిన తప్పు. హైదరాబాద్ లో ప్రభుత్వ భూమిగా ఉండిన, పాత సర్ఫ్ ఎ ఖాస్ భూమి మీద తెలంగాణ ప్రజల ఉమ్మడి యాజమాన్యం ఉండాలి. ఆ భూమిని రాచరిక ప్రభుత్వం హైదరాబాద్ రాజ్య ప్రజల నుంచి కొల్లగొట్టింది గనుక దాన్ని తిరిగి ప్రజలకే అప్పగించాలి. కాని 1956 నుంచి కూడ అన్ని ప్రభుత్వాలూ ఆ భూమిని జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు, ప్రైవేటు పెట్టుబడిదారులకు, సినిమా పరిశ్రమకు, కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులకు లీజు పేరుమీదనో, అతి చౌక ధరలకో, ఉచితంగానో అప్పగించాయి. అలా భూమిని అడ్డగోలుగా పందేరం చేయడమే అభివృద్ధి అని తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేశాయి. అలా అన్యాక్రాంతమైన భూమి కొన్ని లక్షల ఎకరాలు ఉంటుంది.
ఆ రకంగా హైదరాబాద్ భూమిని వాడుకుని ఏర్పాటు చేసిన జాతీయ, అంతర్జాతీయ, ప్రభుత్వ రంగ సంస్థలలో భూమిపుత్రులకు కనీసం న్యాయమైన వాటా ఉద్యోగకల్పన కూడ జరగలేదు. ప్రైవేటు సంస్థలలో భూమిపుత్రుల వాటా గురించి అడగడానికే వీలు లేదు. అంటే భూమి విషయంలో హైదరాబాద్ లో జరిగిందని చెప్పుకుంటున్న అభివృద్ధి ఏమయినా ఉంటే అది తెలంగాణ ప్రజలకు మాత్రం దక్కలేదు. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగానే జరిగింది. పైగా ఇటువంటి వికృత అభివృద్ధి వల్ల రియల్ ఎస్టేట్ ధరలు కృత్రిమంగా విపరీతంగా పెరిగిపోయి, ఇరుగుపొరుగు తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడదలచిన మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు కనీసం చారెడు భూమి దక్కని పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాద్ అభివృద్ధిలో ప్రధానంగా కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారులు చూపుతున్నవి తాము పెట్టిన పరిశ్రమలు. రెడ్డి లాబ్స్, అరబిందో ఫార్మా, సత్యం కంప్యూటర్, నాట్కో, మాట్రిక్స్, శాంతా బయోటెక్, సిరిస్, రాంకీ, రామోజీ ఫిల్మ్ సిటీ, జయభేరి, లాంకో వగైరా అనేక కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారుల పరిశ్రమలు, వ్యాపారాలు వచ్చిన మాట నిజమే. కాని ఈ పరిశ్రమలు, వ్యాపారాలు వాడుకున్నది హైదరాబాద్ భూములను. ఉద్యోగాలు కల్పించినది మాత్రం కోస్తాంధ్ర, రాయలసీమ నుంచి వచ్చిన వారికి. ఆ పరిశ్రమల కాలుష్యం వల్ల నష్టపోయినది హైదరాబాద్ సాధారణ ప్రజలు తాగేనీరు, పీల్చే గాలి, కుంటో సెంటో వ్యవసాయం చేసుకునే భూమి. రసాయన, ఔషధ పరిశ్రమలను అభివృద్ధి చేసి హైదరాబాద్ ను అంతర్జాతీయ చిత్రపటం మీద చేర్చామని గొప్పలు చెపుతున్న వారి అసలు ఉద్దేశ్యం హైదరాబాద్ వనరులను, ప్రజాజీవితాన్ని ధ్వంసంచేసి తాము ఇబ్బడి ముబ్బడిగా లాభాలు సంపాదించడమేనని, వారు తిరిగి హైదరాబాద్ కు గాని, తెలంగాణకు గాని ఇచ్చినది ఏమీ లేదని గత ఐదు దశాబ్దాల చరిత్ర చెపుతుంది.
ఈ పెట్టుబడిదారులకు సర్ఫ్ ఎ ఖాస్ భూమి కూడ చాలక, హైదరాబాద్ లో ఉండిన వందలాది చెరువులను పూడ్చి రియల్ ఎస్టేట్ చేశారు. మూసీనది, నక్కవాగు వంటి సహజసిద్ధమైన సెలయేళ్లను విషపదార్థాల, మురికినీటి ప్రవాహాలుగా మార్చారు. లక్షల ఏళ్లుగా ఉన్న కొండలను పిండి చేసి, భవంతులు కట్టుకున్నారు. నగరమంతా వ్యాపించి ఉన్న తోటలను ధ్వంసంచేసి నగరంలో స్వచ్ఛమైన ప్రాణవాయువు లేకుండా చేశారు. వందల సంవత్సరాలుగా ఉన్న కుతుబ్ షాహి, అసఫ్ జాహి భవనాలను ధ్వంసం చేశారు. నేలమట్టం చేశారు. హైదరాబాద్ తెహజీబ్ గా ప్రఖ్యాతమైన సహజీవన సంస్కృతిని, స్నేహ సౌభ్రాతృత్వాలు విలసిల్లిన సంస్కృతిని ధ్వంసంచేసి కొనుగోలు – అమ్మకాల మార్కెట్ సంస్కృతిని ప్రవేశపెట్టారు.
కనుక హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారిన తర్వాత నిజంగా అభివృద్ధి అయిందా, ధ్వంసం అయిందా లెక్కలు వేయాలంటే, కేవలం పెట్టుబడులు, లాభాలు, జనాభా పెరుగుదల అంకెలు మాత్రమే కాదు. కాలుష్యం, భూమి అక్రమ వినియోగం, పర్యావరణ విధ్వంసం, జనజీవన కాలుష్యం, సంస్కృతీ విధ్వంసం మొదలయిన అనేక సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ పరిణామాలను కూడ లెక్కలోకి తీసుకోవాలి.
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఈ హేతుబద్ధమైన, న్యాయబద్ధమైన, శాస్త్రీయమైన పనిలో సంపూర్ణంగా విఫలమై, హైదరాబాద్ ను ఎన్ టి రామారావు, నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారని రాసింది. ఈ ఒక్క వ్యాఖ్యతోనే ఇది ప్రజాజీవితాన్ని పరిశీలించిన కమిటీ కాదని, విమానాశ్రయాన్ని, ఫ్లై ఓవర్లను, భవనాలను, తళుకుబెళుకులను మాత్రమే చూసిన కమిటీ అని స్పష్టమవుతుంది.
మచ్చుకు ఒక అధ్యాయం చూద్దాం
ఇలా చెపుతూపోతే శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రతిపేజీని జల్లెడ పట్టవచ్చు గాని, ఇక్కడ మచ్చుకు ఉద్యోగుల గురించిన అధ్యాయం మాత్రం చూద్దాం.
నివేదిక మొదటి రెండు అధ్యాయాలలోనూ, చివరి అధ్యాయంలోనూ ప్రభుత్వోద్యోగాల గురించి స్థూలంగా చర్చించడంతో పాటు ఐదవ అధ్యాయంలో యాభై పేజీలలో ప్రత్యేకంగా ప్రభుత్వోద్యోగుల సమస్యలు చర్చించారు. ప్రభుత్వోద్యోగాలలో, విద్యావకాశాలలో రిజర్వేషన్ అనే భావన ఎలా తలెత్తిందో అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా సీనియర్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఫర్ రెగ్యులేషన్ & కాంపిటీషన్ డైరెక్టర్ జనరల్ ముఖేష్ కక్కడ్ తో సాంకేతిక అధ్యయనం కూడ చేయించామని రాసుకున్నారు. కమిటీలో ఉన్న ఐదుగురు నిపుణులు, బయటి నుంచి సహకరించిన మరొక నిపుణుడు కలిసి వండిన ఈ బ్రహ్మ పదార్థం ఎంత రుచీపచీలేని వంటకంగా, ఇంగిత జ్ఞానం ఉన్నవారు నోట పెట్టలేని వంటకంగా తయారయిందో చూద్దాం.
మొదటి అధ్యాయంలోని ఒక మెతుకు పట్టి చూస్తేనే ఈ వంట సంగతి తేలిపోతుంది. ‘ఆంధ్రప్రదేశ్ పరిణామాలు – ఒక చారిత్రక నేపథ్యం’ అనే ఈ అధ్యాయంలో పే. 30 లో “పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రిక్వైర్ మెంట్ యాజ్ టు రెసిడెన్స్) యాక్ట్ 1957 ప్రవేశపెట్టడంతో ముల్కీ నిబంధనలు రద్దయిపోయాయి” అని రాశారు. ఈ మాట అబద్ధం మాత్రమే కాదు, రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం. అధికారికంగా చూస్తే 1975 రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడేదాకా ముల్కీ నిబంధనలు రద్దు కావడానికి అవకాశం లేదు, రద్దు కాలేదు. నివేదికలోనే అనేక చోట్ల ఈ ప్రస్తావన ఉంది. చారిత్రకాంశాలను ఇంత అపసవ్యంగా అర్థం చేసుకున్న నివేదిక, మొదటి అధ్యాయంలో ఇరవై పేజీలు ఉద్యోగుల విషయాలు రాసి, ఆ తర్వాత పే. 48లో “ఈ సమస్య ఇవాళ్టికి కూడ చాల వివాదాస్పదంగా ఉంది. అందువల్ల, ఈ వ్యవహారాన్ని సమగ్రమైన పద్ధతిలో పరిశీలించడానికి ఒక ప్రత్యేక అధ్యాయం కేటాయించాం” అని రాసింది. ఆ “సమగ్రమైన పద్ధతి” ఎంత సమగ్రంగా సాగిందో చూద్దాం.
ఐదో అధ్యాయంలో పే. 246 లో ముల్కీ నిబంధనలు 1919-1959 అని రాసిన పరిచయ వాక్యాలలోనే “ఉర్దూ భాషలో ‘ముల్క్’ అంటే జాతి (నేషన్), అక్కడ నివాసం ఉండేవారిని ‘ముల్కీలు’ అంటారు. ప్రభుత్వోద్యోగాలలో ‘నివాసుల’ ప్రయోజనాలు పరిరక్షించే విధానంగా ముల్కీ నిబంధనలు వచ్చాయి” అని అర్థం పర్థం లేని వాక్యం రాశారు. ముల్క్ అంటే జాతి కాదు, ఆ మాటకు అర్థం దేశం, రాజ్యం, ప్రాంతం. ముల్కీ అంటే దేశీయులు, ప్రాంతీయులు, స్థానికులు, భూమిపుత్రులు అవుతుంది గాని ‘నివాసులు’ కాదు, అక్కడ నివాసం ఉండేవాళ్లందరూ కాదు. ఇది కేవలం భాషా సమస్య కాదు, అసలు హైదరాబాద్ రాజ్యంలో ముల్కీ నిబంధనలు ఏ మౌలిక ప్రాతిపదిక మీద వచ్చాయో అర్థం చేసుకోవడానికి కమిటీ ప్రయత్నించలేదనడానికి ఇది రుజువు. హైదరాబాద్ రాజ్యంలో ప్రభుత్వోద్యోగాలలో అటు ఇరానియన్లు, ఇతర ప్రభువర్గాల బంధువులు, ఇటు ఉత్తరాది నుంచి వచ్చిన కాయస్ఠులు వగైరాలు నిండిపోతున్నప్పుడు ప్రభుత్వోద్యోగాలలో దేశీయులకు, స్థానికులకు, భూమిపుత్రులకు ప్రాధాన్యత ఉండాలనే ఆకాంక్ష ఫలితంగానే ముల్కీ నిబంధనలు వచ్చాయి. ఆ మాటకొస్తే అప్పటికి ఉద్యోగాలు పొందుతున్న వాళ్లు హైదరాబాద్ నివాసులే. కాని హైదరాబాద్ దేశీయులు, స్థానికులు, భూమిపుత్రులు కాదు. “నివాసులు” అనే మాట ద్వారా చూస్తే ఆ ఆకాంక్ష బలం ఏమిటో అర్థం కాదు.
పే. 250లో “విశాలాంధ్ర ఏర్పడాలనే తపనలో, ఆంధ్ర నాయకులు తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు హామీలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు” అని నివేదిక రాసింది. ఈ వాక్యంలో ఆంధ్ర నాయకులు ఏదో హృదయవైశాల్యంతో ఆ హామీలు ఇచ్చారనే ధ్వని, విశాలాంధ్ర ఏర్పరచడం అనే లక్ష్యం కోసం త్యాగం చేశారనే ధ్వని వినిపిస్తోంది. కాని 1953-56 చరిత్ర చూస్తే, విశాలాంధ్ర భావనను తెలంగాణ ప్రజలు అనుమానంతో చూసినప్పుడు, బుజ్జగించి, హామీ ఇచ్చి, ప్రలోభపెట్టి అయినా సరే, విశాలాంధ్ర ఏర్పరచాలనే కుటిల ఎత్తుగడగానే ఆ వాగ్దానాలు వచ్చాయి. తెలంగాణను ఆక్రమించడానికి, హైదరాబాద్ ను కబ్జా చేయడానికి తపనే తప్ప అది విశాలాంధ్ర ఏర్పడాలనే తపన కాదు. జాతి ఐక్యత, భాషా ఐక్యత అనే ఆకర్షణీయమైన ముసుగు నాటి పాలకులకు బాగా ఉపయోగిపడింది. ఆ తర్వాత గడిచిన ఐదు దశాబ్దాల చరిత్ర అది కుటిల ఎత్తుగడ అనీ, అవి చిత్తశుద్ధిలేని వాగ్దానాలనీ రుజువు చేసింది.
పే. 251లో 1956 పెద్దమనుషుల ఒప్పందం గురించి రాస్తూ, “కిందిస్థాయి ఉద్యోగాల నియామకాల విషయంలో ఐదు సంవత్సరాల వరకు తాత్కాలికంగా తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక ప్రాంతంగా గుర్తించాలనుకున్నారు” అని శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాసింది. ఇది పచ్చి అబద్ధం. తప్పు.
ఇక్కడ కమిటీ చేసిన తప్పు గురించి మాత్రమే కాదు, చరిత్రలో జరిగిన మోసం గురించి కూడ చెప్పవలసి ఉంది. కొత్త ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ లో 1956 ఫిబ్రవరి 20న జరిగిన సమావేశంలో ఎనిమిది మంది ‘పెద్దమనుషుల ఒప్పందం’ కుదిరింది. ఆ ఒప్పందంలో ఏడో అంశం “ఒక రకమైన స్థానికతా సూత్రాన్ని, ఉదాహరణకు 12 సంవత్సరాల స్థానిక నివాసాన్ని, ప్రాతిపదికగా తీసుకుని తెలంగాణలో ఉద్యోగ నియామకాలలో నిర్ణీత నిష్పత్తి సాధించాలి” అని చెపుతుంది. నిజానికి అప్పటివరకూ కొనసాగుతున్న ముల్కీ నిబంధనలలో ‘పుట్టుక’, ‘వారసత్వం’తో పాటు ‘15 సంవత్సరాల నివాసం’ అనే ప్రాతిపదికలు ఉండేవి.
హైదరాబాద్ మీద 1948 సెప్టెంబర్ 17న జరిగిన పోలీసుచర్య అనే సైనికదాడి తర్వాత, ప్రధానంగా తమిళ, కోస్తాంధ్ర అధికారులతో కూడిన సైనిక ప్రభుత్వం 1950, 51లలో తెచ్చిన నిబంధనలలో ‘పుట్టుక’, ‘వారసత్వం’ అనే ప్రాతిపదికలు ఎగరగొట్టారు. ఆ తర్వాత 1956లో ‘పెద్దమనుషుల ఒప్పందం’లో 15 సంవత్సరాల ప్రాతిపదికను 12 సంవత్సరాలకు కుదించారు. అక్కడితో ఆగలేదు. 1956 ఫిబ్రవరిలో కుదిరిన 14 అంశాల ఒప్పందం, ఆగస్ట్ 10న లోక సభలో ప్రవేశపెట్టే సమయానికి దానిలో చాల మార్పులు చేశారు. వాక్యాలకు వాక్యాలే మారిపోయాయి. ఆగస్ట్ నాటికి అది 10 అంశాల ‘నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్’ (రక్షణల పత్రం) గా మారిపోయింది. మొదటి ఆరు అంశాలకు ఎ అని, తర్వాత అంశాలకు బి, సి, డి, ఇ అని పేర్లు పెట్టారు. అందులో ‘బి. స్థానికత నిబంధనలు’ కింద “ఐదు సంవత్సరాల కొరకు తాత్కాలిక సౌకర్యం”గా దీన్ని చేర్చారు. ఈ “ఐదు సంవత్సరాల తాత్కాలిక సౌకర్యం” అన్నమాట ‘పెద్దమనుషుల ఒప్పందం’ కాదు. ‘పెద్దమనుషుల ఒప్పందం’లో లేదు.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఈ గందరగోళాన్ని, మార్పులను, వక్రీకరణలను ప్రస్తావించనైనా ప్రస్తావించకుండా, “ఐదు సంవత్సరాల వరకు తాత్కాలికంగా” అని మాత్రం రాసిందంటే దాని దురుద్దేశం అర్థమవుతుంది.
సమగ్రపద్ధతిలో పరిశీలించడానికి ప్రత్యేకంగా కేటాయించిన అధ్యాయంలో పే. 271 లో రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత హఠాత్తుగా గిర్ గ్లాని కమిషన్ ప్రస్తావన వస్తుంది. ఈ మధ్యలో గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర అదృశ్యమై పోతుంది. పోనీ గిర్ గ్లాని కమిషన్ గురించి అయినా సమగ్రంగా రాశారా అంటే అదీ లేదు. గిర్ గ్లాని పరిశీలనలో ఎదుర్కొన్న ఇబ్బందులను, కోస్తా, రాయలసీమ అధికారులు ఆ కమిషన్ కు చేసిన సహాయ నిరాకరణను కమిటీ ప్రస్తావించనే లేదు. నిజానికి ప్రభుత్వం నియమించిన అధికారిక కమిషన్ అయినప్పటికీ, గిర్ గ్లాని కమిషన్ కోరిన సమాచారాన్ని అనేక ప్రభుత్వ శాఖలు ఇవ్వకపోవడంతో పూర్తి నివేదిక రాయలేకపోయానని ఆ కమిషనే చెప్పుకున్నది. ఎన్నో పనికిమాలిన విషయాలను చాల వివరంగా తు.చ. తప్పకుండా రాసిన శ్రీకృష్ణ కమిటీ గిర్ గ్లాని నిర్ధారణలను మాత్రం పైపైన రాసి వదిలేసింది. ఆ నిర్ధారణలను రాయకుండానే “గిర్ గ్లాని నివేదికను ఆమోదించడంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు” అని మళ్లీ సాగదీసింది.
గిర్ గ్లాని నివేదిక సిఫారసులను అమలు చేయడంలో ప్రభుత్వం చేసిన పనులు అని పే. 278-280 లలో ఇరవై అంశాలు రాసింది. దానిలో శాఖాధిపతుల సంఖ్యను 51 నుంచి 102కు పెంచడం జరిగిందని, స్థానికేతరుల సంఖ్యను జిల్లా స్థాయిలో 15 శాతానికి, జోన్ స్థాయిలో 25 శాతానికి పరిమితం చేస్తూ రాష్టపతి ఉత్తర్వులను పాటించడం జరిగిందని రాశారు.
శాఖాధిపతుల సంఖ్యను పెంచడం రాష్ట్రపతి ఉత్తర్వులకు తూట్లు పొడవడానికేనని, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమలు కావలసిన స్థానిక రిజర్వేషన్ నుంచి మినహాయించడానికేనని ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరికయినా అర్థమవుతుంది. కాని శ్రీకృష్ణ కమిటీ మాత్రం అది తెలంగాణ అనుకూల చర్య అన్నట్టుగా రాసింది. అలాగే, రాష్ట్రపతి ఉత్తర్వులలో ఎక్కడా స్థానికేతరుల సంఖ్య గురించి నిబంధన లేదు, స్థానికులకు తప్పనిసరిగా ఉండవలసిన వాటా ఉంది. దాని అర్థం మిగిలినదంతా ఇతరుల వాటా అని కాదు. అటువంటి వ్యాఖ్యానం సరైనది కాదు. గిర్ గ్లాని ఎత్తిచూపిన 18 వక్రీకరణలలో 16 వక్రీకరణలను సరిదిద్దడం జరిగిందనీ, మొత్తంగా అదనంగా ఉన్న 18,856 ఉద్యోగులలో 14,784 మందిని స్వస్థలాలకు పంపించడం జరిగిందనీ శ్రీకృష్ణ కమిటీ రాసింది. కాగితం మీద జరిగిన ఈ బదిలీలు నిజంగా తెలంగాణ ఉద్యమం కోరినట్టుగా జరగలేదు. కాగితం మీద జరిగినవి కూడ న్యాయస్థానాల, ట్రిబ్యునళ్ల వివాదపు చిక్కుముడులలో ఇరుక్కుపోయాయి.
రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయకుండా గడిచిన 26 సంవత్సరాలలో దాన్ని ఎవరూ న్యాయస్థానాలలో సవాలు చేయకపోవడం గుర్తించవలసిన విషయం (పే. 281) అని శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేకంగా రాసింది. అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని, దాన్ని సాగనిచ్చిన అధికారవర్గాలను ప్రశ్నించడం లేదు. దాన్ని ప్రజలు గాని, బాధితులు గాని న్యాయస్థానాలలో ప్రశ్నించలేదు గనుక వారి మీదనే తప్పు నెట్టడానికి కమిటీ ప్రయత్నించింది. అహా, ఏమి తర్కం!
హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదుల నియామకంలో జరిగిన అన్యాయాల గురించి ఇటీవల జరిగిన ఆందోళన గురించి అవసరమైనదానికన్న ఎక్కువ వివరంగా రాసి, ఆ సమస్యను మంత్రుల కమిటీ ఎంత అద్భుతంగా పరిష్కరించిందో కితాబునిచ్చింది. ఆ 69 ఉద్యోగాలలో మూడు ప్రాంతాల మధ్య, సామాజిక వర్గాల మధ్య పంపిణీ ఎంత బాగా జరిగిందో అవసరం లేకపోయినా వివరంగా చెప్పి మరీ ప్రశంసించింది. 69 ఉద్యోగాల విషయంలో ఇంత జాగ్రత్త చూపిన కమిటీకి రాష్ట్రంలోని పన్నెండు లక్షల ఉద్యోగాల గురించీ, తెలంగాణ బిడ్డలు కోల్పోయిన రెండున్నర లక్షల ఉద్యోగాల గురించీ మాట్లాడడానికి మాత్రం నోరు పెకలలేదు.
ఇంకా హాస్యాస్పదమైన సంగతి: న్యాయమూర్తుల నియామకాలలో జరిగిన అన్యాయాల గురించి తెలంగాణ వాదుల సందేహాల నిజానిజాలు తెలుసుకోవడానికి కమిటీ ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులతో “పిచ్చాపాటిగా” మాట్లాడిందట. వాళ్లు ఆ దురభిప్రాయానికి తావు లేదన్నారట! (పే. 288). ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసినవారి జాబితా హైకోర్టులో దొరుకుతుంది. ఆ న్యాయమూర్తులు ఏ ప్రాంతానికి చెందినవారో సమాచారం కూడ దొరుకుతుంది. ఇంత అధికారికమైన కమిటీ తానే స్వతంత్రంగా ఆ సమాచారం సేకరించి నిర్ధారణకు రావాలని అనుకోలేదు. ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులను కలిసి “పిచ్చాపాటిగా” మాట్లాడిందట. వాళ్లు చెప్పినమాట నిజమే అనిపించిందట. తాను పరిశోధిస్తున్న విషయం పట్ల ఈ కమిటీకి ఉన్న తీవ్రత అదన్నమాట. కనీసం ఆ ఇద్దరు మాజీ న్యాయమూర్తులు ఏప్రాంతానికి చెందినవారో చెపితే సరిపోయేది!!
ఈ అధ్యాయం చివరన, “ఇకముందు ఏమైనా సవరణ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందా” అనీ, “ప్రభుత్వోద్యోగాలలో రిజర్వేషన్ అవసరమనే డిమాండ్ సమంజసమైనదేనా” అనీ రెండు ముఖ్యమైన ప్రశ్నలను తానే వేసుకుని కమిటీ జవాబు చెప్పింది. “గత నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం చాల సవరణ చర్యలు తీసుకున్నది గనుక ఇకముందు సవరణ చర్యల అవసరమేమీ లేద”ని నిర్ధారించింది. ఇక రెండో ప్రశ్నకు జవాబుగా ప్రభుత్వోద్యోగులు మొత్తం రాష్ట్ర జనాభాలో1.7 శాతం మాత్రమేననీ, పనిచేసేవారి జనాభాలో 3.6 శాతం మాత్రమేననీ కనుక అది అంత పెద్ద సమస్య కాదనీ (పే. 291) కమిటీ తేల్చి చెప్పింది.
ఇలా ప్రభుత్వోద్యోగాలలో స్థానికులకు రిజర్వేషన్ అవసరమా లేదా అనే తప్పుడు చర్చను శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రారంభించింది. కనీస ప్రజాస్వామిక సూత్రాలకు, రక్షణ కోసం విచక్షణ (ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్) అనే రాజ్యాంగ ఆదర్శానికి తూట్లు పొడిచే ఈ చర్చను సాగించడానికి రాజ్యాంగంలోని రెండు అధికరణాల మధ్య పోటీ పెట్టి వాదించే కుటిలత్వానికి కూడ కమిటీ పాల్పడింది. అంతేకాదు, రాజ్యాంగ అధికరణం 16లో చెప్పిన ఉద్యోగావకాశాల సమానత్వం గురించి తన వాదనను బలపరచుకోవడానికి అసందర్భంగా కేంద్రప్రభుత్వ ఉద్యోగ, శిక్షణా శాఖకు ఒక ఉత్తరం రాసి, వారి జవాబును నివేదికలో భాగం చేసింది. (పే. 255-256)
దేశపౌరులు ఎక్కడికైనా వెళ్లి ఉద్యోగం చేసుకోవచ్చునని రాజ్యాంగంలోని అధికరణం 16 చెపుతుండగా, తెలంగాణలో ఉద్యోగాలు తెలంగాణ స్థానికులకే కేటాయించడం కష్టం కావచ్చుననే ఉద్దేశంతోనే ఏడవ రాజ్యాంగ సవరణ జరిగింది. కేంద్ర ప్రభుత్వమే 1957లో ప్రభుత్వోద్యోగాల (స్థానికతా అర్హతల) చట్టం తీసుకు వచ్చింది. ఈ చరిత్రను, తెలంగాణ ప్రత్యేకతను ప్రస్తావిస్తూ కూడ, ఆ ప్రత్యేకత ఆ తర్వాత ఎందుకు కొనసాగలేదనే ప్రశ్నను మాత్రం కమిటీ పక్కనపెట్టింది. ఆ ప్రత్యేక నిబంధనలను ఎప్పటికప్పుడు తొక్కి పడుతూ, ఉల్లంఘిస్తూ, వక్రీకరించి అమలుచేస్తూ వచ్చినందువల్ల, ఆ అన్యాయాలను ఎత్తిచూపుతూ ప్రాంతీయమండలి లేవనెత్తిన అభ్యంతరాలను కూడ తోసివేయడం వల్ల చివరికి 1969లో తెలంగాణ రక్షణల అమలు కోసం తెలంగాణ ఎన్ జీ వో లు ఉద్యమించవలసి వచ్చింది. ఆ ఉద్యమం వల్లనే వచ్చిన జీ ఓ నం 36 కూడ అమలుకు నోచుకోలేదు. ముల్కీ నిబంధనల ఉల్లంఘన ఎడాపెడా కొనసాగుతూనే వచ్చింది. చివరికి 1972 అక్టోబర్ 3న ముల్కీ నిబంధనలు న్యాయబద్ధమైనవేనని, వాటిని అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వచ్చిన తర్వాత, దాన్ని పక్కదారి పట్టించడానికి ఆరు సూత్రాల పథకం తయారుచేశారు. దానిలో ఆరవ సూత్రంగా “పై ఐదు అమలయితే ముల్కీ నిబంధనలు అనవసరమవుతాయి” అని చేర్చి, అందువల్ల ముల్కీ నిబంధనల రద్దు చట్టం తెచ్చారు. ఆరు సూత్రాల పథకం కొనసాగింపుగా రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చారు. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులలో రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించి, అడగకుండానే తెలంగాణను రెండు జోన్లుగా విడగొట్టి, మిగిలిన రక్షణలనూ, రిజర్వేషన్లనూ వక్రీకరించి, తెలంగాణ బిడ్డలకు న్యాయంగా రావలసిన వాటాను దొంగిలించారు. ఆ దొంగతనాన్ని పది సంవత్సరాల పాటు సహించి, భరించి, చివరికి 1984లో టి ఎన్ జీ వో లు నిలదీస్తే జైభారత్ రెడ్డి కమిటీ వచ్చింది. సుందరేశన్ కమిటీ వచ్చింది. జీవో 610 వచ్చింది. మూడు నెలలలోగా అమలు కావలసిన ఆ జీవో పదిహేను సంవత్సరాలకు కూడ అమలు కాకపోతే మళ్లీ మొదలయిన ఆందోళనలతో శాసనసభా సంఘం, జె ఎం గిర్ గ్లాని కమిషన్ వచ్చాయి. ఆ నివేదికలకు కూడ అతీగతీ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ఒక షరతుగా ఉన్న స్థానికులకు ఉద్యోగ రక్షణ అనే నిబంధన 1956లో మొదటిసారి కాగితం మీదికి ఎక్కి, ఆ తర్వాత కనీసం డజను సార్లు పునరుద్ఘాటన జరిగినా అమలుకు మాత్రం నోచుకోలేదు.
ఈ సుదీర్ఘ, విషాద చరిత్రంతా శ్రీకృష్ణ కమిటీకి పట్టనే లేదు. ఈ చరిత్రలో నుంచి తనకు అవసరమైన మేరకు తీసుకుంటూ, తెలంగాణ స్థానికుల ఆకాంక్షల గుర్తింపును నిరాకరిస్తూ నివేదిక రచన సాగింది. మొదటి అధ్యాయంలో రాసిన చరిత్ర లోనూ, ఐదవ అధ్యాయంలోనూ కూడ ఈ ధోరణే సాగింది. కమిటీ నివేదిక పరిష్కారాల విషయంలోనో, ఇతర విశ్లేషణల విషయంలోనో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉండడం ఒక ఎత్తయితే, అసలు ఉద్యమానికి పునాదిగా ఉన్న నియామకాల విషయంలో అన్యాయాలను వాస్తవికంగా గుర్తించకపోవడం, న్యాయబద్ధమైన పరిష్కారాలు సూచించకపోవడం మరొక ఎత్తు. మొత్తానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడంలో పాలకవర్గాలు గత ఆరు దశాబ్దాలుగా అనుసరిస్తున్న వైఖరికి మరొక నిదర్శనంగా నిలుస్తుంది జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక.
నిర్ధారణలకు తగినట్టే సిఫారసులు
ఇంత ఘనమైన పరిశీలనలు, నిర్ధారణలు చేసిన శ్రీకృష్ణ కమిటీ, వాటి మీద ఆధారపడి ‘ఎక్కువ అంగీకారయోగ్యమైన పరిష్కారాలు/అవకాశాలు’ అనే శీర్షిక కింద ఆరు సిఫారసులు చేసింది. ఎక్కువ అంగీకారయోగ్యమైనవనీ, పరిష్కారాలు అనీ, అవకాశాలు అనీ తానే శీర్షిక పెట్టి చెప్పిన ఆరు సిఫారసులలో నాలుగు పనికి రావని మళ్లీ తానే చెప్పింది. “ఎమితిని సెపితివి కపితము, ఎర్రి పుచ్చకాయ తిని సెపితో” అని తెనాలి రామకృష్ణ కవి చేసిన వెటకారానికి కూడ పనికిరానంత తెలివి తక్కువ కపిత్వం ఇది. లేకపోతే తానే పనికిరానని అనుకుంటున్న అంశాలను సిఫారసులుగా ప్రకటించడం ఉచితమని ఏమాత్రం భాష తెలిసిన వాడయినా, ఇంగిత జ్ఞానం ఉన్నవాడయినా అనుకోవడానికి వీలు లేదు.
ఆ ఆరు సిఫారసులలో మొదటిది, యథాతథ స్థితిని కొనసాగించడం. ఈ సిఫారసు అమలు చేస్తే తెలంగాణలో హింసాత్మక ఆందోళనలు చెలరేగుతాయనీ, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ రాష్ట్ర సమితితో చేతులు కలిపి ఆందోళనలు ఉద్వేగపూరితంగా, తీవ్రంగా మారుతాయనీ కమిటీ రాసింది. రాజకీయ నాయకులమీద ఒత్తిడి పెరిగి ప్రజాప్రతినిధుల రాజీనామాలకు దారితీయవచ్చునని రాసింది. మావోయిస్టు ఉద్యమానికి ప్రోత్సాహం దొరుకుతుందనీ రాసింది. “ఈ సంక్లిష్ట పరిస్థితి వల్ల, తీవ్రతరమైన, సున్నితమైన భావోద్వేగ అంశాలు ఉన్నందువల్ల, సాదాగా యథాతథ స్థితిని కొనసాగించడం అసాధ్యమని కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నది. తప్పనిసరిగా ఏదో ఒక జోక్యం చేసుకోవలసిందే. యథాతథ స్థితిని కొనసాగించడం ఒక అవకాశమే అయినప్పటికీ, దాన్ని చిట్టచివరి అవకాశంగానే చూడాలి” అని రాసింది.
ఈ సిఫారసు ఆచరణ సాధ్యం కాదని కమిటీయే ఏకగ్రీవంగా భావించింది కాబట్టి ఇక చెప్పవలసిందేమీ లేదు. కాని ఇక్కడ కూడ తెలంగాణలో వ్యక్తంకాగల ఆందోళన గురించి, మావోయిస్టుల గురించి కమిటీ రాసిన అభిప్రాయాలు దుర్మార్గమైనవి, అనుచితమైనవి.
ఇక రెండవ సిఫారసు, రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించడం; హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి రెండు రాష్ట్రాలూ తమ రాజధానులను కాలక్రమంలో అభివృద్ధి చేసుకోవడం. హైదరాబాద్ ను ఎందుకు వేరుచేయాలో అనేక తప్పుడు వాదనలతో ఈ సిఫారసును సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. కాని చివరికి “ఈ అవకాశం వల్ల తెలంగాణ ప్రజలు మరొకసారి తీవ్రమైన ఆందోళనకు దిగే అవకాశం ఎక్కువగా ఉంది. హైదరాబాద్ ను తెలంగాణలో భాగంగా ఉంచాలని తెలంగాణవాదులు అడగవచ్చు, దానితో అది కేంద్రపాలిత ప్రాంతంగా పనిచేయడం కష్టతరమవుతుంది … హైదరాబాదు ను తెలంగాణలో అంతర్భాగంగానే ఎల్లప్పుడూ భావించడం జరిగింది గనుక, కొత్త రాష్ట్రంలో అది భాగం కాకపోతే తీవ్రమైన అసంతృప్తి, ఆందోళనలు చెలరేగి సమస్య కొనసాగుతుంది …. అందువల్ల అన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ అవకాశం కూడ ఆచరణ సాధ్యం కాదని కమిటీ భావిస్తోంది” అని రాశారు.
ఈ సిఫారసు కూడ ఆచరణ సాధ్యం కాదని కమిటీయే భావించింది గాని, అసలు ఈ ఆలోచన రావడమే కోస్తాంధ్ర, రాయలసీమ పాలకవర్గాల దృక్పథం. దేశ చరిత్రలో జరిగిన ఏ రాష్ట్ర విభజన లోనూ ఒక ప్రాంతంలో అంతర్భాగంగా ఉన్న రాజధానిని ఆ ప్రాంతం నుంచి విడదీయడం జరగలేదు. అలాగే చారిత్రకంగానే హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం. కోస్తాంధ్రకూ, రాయలసీమకూ కనీసం మద్రాసుతో ఉన్నపాటి అనుబంధమైనా హైదరాబాద్ తో లేదు. గత యాభై నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్ రాజధానిగా ఉన్నందువల్ల, విద్యా, ఉద్యోగావకాశాలను కేంద్రీకరించే పాలక విధానాల వల్ల తప్పనిసరి అయి ఆ ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ కు రావలసి వచ్చిందేమో గాని అది సొంత ఆస్తి భావన కావడానికి వీలు లేదు. కేవలం హైదరాబాద్ లో వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు, ఆస్తులు పోగు చేసుకున్న కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నుల ఇష్టాలను నెరవేర్చడానికే ఈ సిఫారసు చేయడం జరిగింది.
మూడో సిఫారసు: రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తాంధ్ర గా విభజించి, హైదరాబాద్ ను రాయల తెలంగాణలో భాగం చేయడం. ఈ ప్రతిపాదనను రాయలసీమలో కొందరు రెండో ప్రతిపాదనగా ముందుకు తెచ్చారట. మజ్లిస్ కూడ ముస్లిం ప్రజల ప్రయోజనాల రీత్యా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండవలసిందేననీ, అలా కాక, విభజన తప్పకపోతే రాయలసీమనూ, తెలంగాణనూ కలపాలని ప్రతిపాదించిందట. మజ్లిస్ ఎందుకు ఆ ప్రతిపాదన పెట్టిందో, ఇతర రాజకీయ పార్టీలు ఆ ప్రతిపాదనను ఎందుకు వ్యతిరేకించవచ్చునో వివరణ ఇచ్చిన తర్వాత, “ఈ ప్రతిపాదనను తెలంగాణ అనుకూలురు గాని, సమైక్యాంధ్ర వాదులు గాని ఒప్పుకునే అవకాశం లేదు. పైగా ఈ ప్రతిపాదన వల్ల ప్రత్యర్థి రాజకీయ పార్టీలలో, వర్గాలలో ఛాందసవాద శక్తులు తలెత్తడానికి వీలు కలుగుతుంది. ఈ సిఫారసుకు వ్యతిరేకంగా తెలంగాణలో ఆందోళనలు కూడ తలెత్తవచ్చు. కనుక ఈ అవకాశానికి ఆర్థిక సమర్థన ఉన్నప్పటికీ, ఈ పరిష్కారం మూడు ప్రాంతాల ప్రజలకూ అంగీకారయోగ్యం కాదని కమిటీ భావిస్తోంది” అని రాసింది.
మూడు ప్రాంతాల ప్రజలకూ అంగీకారయోగ్యం కాదని గుర్తించిన ఈ ప్రతిపాదన సిఫారసు ఎలా అయిందో కమిటీకే తెలియాలి.
నాలుగో సిఫారసు ఆంధ్రప్రదేశ్ ను సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించి, విస్తరించిన హైదరాబాద్ మహానగరాన్ని ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి నల్లగొండ జిల్లా ద్వారా కోస్తాంధ్రలోని గుంటూరు జిల్లాతో, మహబూబ్ నగర్ జిల్లా ద్వారా రాయలసీమలోని కర్నూలు జిల్లాతో సంబంధం ఉంటుంది. ఈ సిఫారసుకు అనుకూలంగా మూడు వాదనలు చెప్పిన కమిటీ చివరికి “ఈ ప్రతిపాదనకు తెలంగాణ వాదుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురు కావచ్చు. హైదరాబాద్ ను ఎంతో కాలంగా తెలంగాణలో అంతర్భాగంగా చూస్తున్నారు గనుక అన్ని ప్రాంతాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండడాన్ని వాళ్లు ఆమోదించలేరు. తెలంగాణకు చెందిన నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలను పాక్షికంగా విడదీసి హైదరాబాద్ లో కలపడం వారికి అసంతృప్తి కలిగించవచ్చు. (దీర్ఘకాలికంగా చూస్తే ఇలా కలిపినందువల్లనే వారు అతివేగంగా అభివృద్ధి చెందే అవకాశం వచ్చినప్పటికీ)… ఈ అవకాశంలో కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ, దీన్ని అందరికీ ఆమోదయోగ్యం చేయడం, రాజకీయ ఏకాభిప్రాయం సాధించడం ఇబ్బంది కావచ్చు. ప్రత్యేకంగా తెలంగాణ నుంచి తీవ్రమైన ప్రతిఘటన, ఆందోళన వస్తుందని ఊహించవచ్చు. అలాగే హైదరాబాద్ తో కలిసి అయినా కలవకుండా అయినా తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు విజృంభించే అవకాశం ఉందని దృష్టిలో ఉంచుకోవాలి” అని రాసింది.
హైదరాబాద్ ను తెలంగాణ నుంచి వేరుచేసి, దాన్ని పూర్తిగా కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులకూ, దేశదేశాల సంపన్నులకూ, బహుళజాతిసంస్థలకూ అప్పగించడానికి పన్నిన కుట్ర ఇది. పైగా అటు కోస్తాకూ ఇటు రాయలసీమకూ హైదరాబాద్ తో కారిడార్ లు ఏర్పాటు చేయడమంటే దేశంలో ఏ నగరానికీ లేని ప్రతిపత్తిని కల్పించడమైనా కావాలి, తెలంగాణ ప్రజలు పొరుగురాష్ట్రాల ప్రజలను తమ రాష్ట్రంలో తిరగనివ్వరనే దురభిప్రాయం కల్పించడానికైనా కావాలి. తెలంగాణ ప్రజలు అటువంటి ఉద్దేశంతోనే ఉంటే, రాజ్యాంగంలోని మూడో అధికరణాన్నీ, కేంద్ర హోం మంత్రి డిసెంబర్ 9 ప్రకటననూ గౌరవించి ఉండేవాళ్లే కాదు.
ఐదవ సిఫారసు రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాంధ్రలుగా ప్రస్తుత సరిహద్దుల ప్రకారమే విభజించడం, హైదరాబాద్ ను తెలంగాణ రాజధానిగానే ఉంచి, సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేయడం. ఈ సిఫారసు పైకి చూడడానికి తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్టు కనబడుతుంది గాని, లోపలికి వెళితే తెలంగాణకు వ్యతిరేకమైన వ్యాఖ్యలెన్నో ఉన్నాయి. తెలంగాణలోనే ఎక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అకాంక్ష ఉన్నదో, ఎక్కడ ప్రజలు తటస్థంగా ఉన్నారో, ఎక్కడ తెలంగాణ కోరుకోవడం లేదో, కమిటీ ఒక విచిత్రమైన వివరణ ఇచ్చింది. బలమైన తెలంగాణ అనుకూల శక్తులు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో కాక, ఖమ్మం పశ్చిమ ప్రాంతంలో, ఆదిలాబాద్ దక్షిణ ప్రాంతంలో, మెదక్ లో సిద్ధిపేట ప్రాంతంలో, నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డిలలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయట. ఉస్మానియా, కాకతీయ విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, న్యాయవాదులు, ప్రభుత్వోద్యోగులలో ఎన్జీవోలు మాత్రమే బలంగా వ్యక్తీకరిస్తున్న ఆందోళనకారులట.
మిగిలిన సిఫారసులలో ప్రతికూల అంశాలను అరకొరగా ప్రస్తావించి వదిలేయగా, ఈ సిఫారసు కింద మాత్రం ప్రతికూల అంశాలు ఎంత బలమైనవో కమిటీ ఎంతగా నొక్కి చెప్పిందంటే, ఈ సిఫారసును అమలులోకి తేవడం కమిటీకే ఇష్టం లేదని అనిపిస్తుంది. ఒకవైపున “అనివార్యమయితేనే, మూడు ప్రాంతాల ప్రజలు శాంతియుతంగా అంగీకరిస్తేనే ఈ సిఫారసును అమలు చేయాలి” అని ఆటంకాలు తానే కల్పించింది. అయినా ఈ సిఫారసు అమలు చేస్తారేమో అన్నట్టుగా, ఇది అమలు చేస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు కూడ సూచించింది.
ఆరవ సిఫారసుగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, తెలంగాణ ప్రాంత సామాజిక, ఆర్థిక అభివృద్ధికి, రాజకీయ సాధికారత కల్పనకు రాజ్యాంగబద్ధమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. చట్టపరమైన అధికారం ఉన్న తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పరచాలని సూచించింది. ‘పెద్దమనుషుల ఒప్పందం’ స్ఫూర్తితో ఈ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలని అంది. తెలంగాణ ప్రాంతీయ మండలికి ఏ అధికారాలు ఉండాలో, ఏ అధికార పరిధి ఉండాలో కూడ ప్రతిపాదించింది.
ఈ సిఫారసు తయారీలో సంపూర్ణమైన దగుల్బాజీతనం కనబడుతోంది. ముందు వందల పేజీలు తెలంగాణ సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధించిందనీ, ఆ కారణం మీద రాష్ట్ర ఏర్పాటు అవసరం లేదనీ వాదించిన కమిటీ అదంతా మరిచిపోయి, హఠాత్తుగా తెలంగాణ ప్రాంతపు సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం రాజ్యాంగబద్ధ రక్షణలు కావాలని రాస్తోంది. ఈ మాట రాయడంలో మరొక ముఖ్య విషయం కూడ మరచిపోయింది. తెలంగాణ రక్షణల కోసమే ఇప్పటికి రెండు రాజ్యాంగ సవరణలు (మొదటిసారి 1956లో అధికరణం 371 చేర్చిన ఏడవ రాజ్యాంగ సవరణ, ఆ తర్వాత 1974లో ఆ అధికరణం నుంచి ఆంధ్రప్రదేశ్ అనే పదాన్ని తొలగించి, అదనంగా అధికరణం 371-డి చేర్చిన ముప్పైరెండవ రాజ్యాంగ సవరణ) వచ్చాయి. మొదటి సవరణతో ఏర్పడిన ప్రాంతీయ కమిటీ రెండో సవరణతో రద్దయింది. ఇప్పుడు మళ్లీ ఆచరణలోకి రావాలని శ్రీకృష్ణ కమిటీ కోరుతున్న ‘పెద్దమనుషుల ఒప్పందం’ స్ఫూర్తికి అప్పుడే తూట్లు పొడిచారు. ఆ తర్వాత కూడ రక్షణకు ఉద్దేశించిన చర్యలు ఎన్నో జరిగాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు ఎన్నో వచ్చాయి. వాటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదు గనుకనే, రాజ్యాంగబద్ధమైన హామీలు కూడ అమలు కాలేదు గనుకనే, అమలు చేయాలనే ఆలోచన ఆంధ్రప్రదేశ్ పాలకవర్గాలకు లేదు గనుకనే, రాష్ట్ర విభజన తప్ప గత్యంతరం లేదు అని తెలంగాణ సమాజం నినదిస్తోంది, సంఘటితమవుతోంది, పోరాడుతోంది.
కమిటీ దృక్పథం – శాంతి భద్రతల సమస్య
జనవరి 5, 2010 సమావేశం నుంచే, ఆ మాటకు వస్తే 2009 డిసెంబర్ 29న రాష్ట్ర గవర్నర్ గా చత్తీస్ ఘడ్ లో నరమేధానికి రూపకర్తలలో ఒకరైన మాజీ పోలీసు అధికారిని నియమించినప్పటి నుంచే మొత్తం తెలంగాణ అంశాన్ని శాంతిభద్రతల సమస్యగా చూపి దమననీతిని అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర పాలకులు నిర్ణయించుకున్నారు. ఆ శాంతిభద్రతల దృక్పథాన్ని పుణికి పుచ్చుకున్న కమిటీకి కార్యదర్శిగా మాజీ హోంశాఖ కార్యదర్శిని నియమించారంటేనే, కమిటీలోని న్యాయ, అర్థశాస్త్ర, సామాజికశాస్త్ర నిపుణులకన్న ఎక్కువ పాత్ర పోలీసు దృక్పథానికి ఉండాలని నిర్ణయించారన్నమాట. సరిగ్గా ఆ దృక్పథానికి నిదర్శనంగానే నివేదికలో ఎనిమిదో అధ్యాయం తయారయింది.
హోం మంత్రిత్వ శాఖ బైట పెట్టిన నివేదికలో మిగిలిన అధ్యాయాలన్నీ ఒక్కొక్కటి యాభై పేజీల పైన ఉండగా ఈ ఎనిమిదో అధ్యాయం (పే. 423) కేవలం ఒకే ఒక్క పేజీకి, ఆరంటే ఆరు వాక్యాలకు పరిమితమైంది. కమిటీ తన పనిలో భాగంగా తక్షణ శాంతి భద్రతల సమస్యను, మావోయిస్టు/నక్సల్ కార్యకలాపాల పెరుగుదలతో సహా దీర్ఘకాలిక అంతర్గత భద్రతా పర్యవసానాలను పరీక్షించిందట. రాజకీయ పార్టీలు, ఇతర బృందాలు సమర్పించిన విజ్ఞాపనలలో ఈ భయాలు వ్యక్తమయ్యాయట. కమిటీ జిల్లాలను, గ్రామాలను సందర్శించినప్పుడు, విభిన్న భాగస్వామ్య శక్తులతో మాట్లాడినప్పుడు కూడ ఈ భయాలు వెలువడ్డాయట. “వీటన్నిటితోపాటు, (పదిహేడు జిల్లాలలో) రాష్ట్రప్రభుత్వానికి, పోలీసు శాఖకు, స్థానిక అధికారవర్గానికి చెందిన సీనియర్ అధికారులతో కమిటీ కార్యదర్శి ముఖాముఖి చర్చలు జరిపారు. ఇతర వర్గాలనుంచి కూడ అభిప్రాయాలు సేకరించడం జరిగింది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఒక నోట్ తయారు చేసి, హోం మంత్రిత్వ శాఖకు ఒక ప్రత్యేకమైన కవర్ లో విడిగా సమర్పిస్తున్నాం. ‘ముందడుగు’ అనే తొమ్మిదో అధ్యాయం లో పరిష్కారమార్గాలను చర్చించేటప్పుడు కమిటీ ఈ కోణాలను దృష్టిలో పెట్టుకుంది” అని నివేదికలో ఈ అధ్యాయం ముగుస్తుంది.
ఇందులో మూడు దుర్మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఒక బహిరంగ ప్రజావిచారణ జరిపిన కమిటీ, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిన కమిటీ, తన నివేదికలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని ఇలా రహస్యంగా ఉంచడం ఉచితమేనా? ఒకవైపు ప్రభుత్వాలు ప్రజల నుంచి ఏ విషయాన్నీ దాచడానికి, రహస్య సమాచారంగా ప్రకటించడానికి వీలులేదని ప్రపంచ వ్యాప్తంగానే వికీలీక్స్ వంటి పరిణామాలు జరుగుతుంటే, ప్రజాస్వామిక భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఇటువంటి రహస్యానికి ఒడిగట్టడం సమంజసమేనా?
రెండు, కమిటీ మధ్య సాధ్యాసాధ్యాలనుబట్టి పని విభజన జరగవచ్చు గాని, ఒక ముఖ్యమైన అధ్యాయానికి, వారే చెప్పినట్టు పరిష్కార మార్గాలకు పునాది అయిన అధ్యాయానికి అవసరమైన అతి ముఖ్యమైన సమాచార సేకరణ బాధ్యత ఐదుగురిలో ఒక్కరికే ఎలా ఇస్తారు? ఆ ఒక్కరు తెచ్చిన సమాచారమంతా యథాతథంగా స్వీకరించగలిగినదేనని, ఆయన తన ఇష్టాయిష్టాల ప్రకారమో, ఇతరుల ఒత్తిడితోనో ఆ సమాచారాన్ని మార్చి ఉండవచ్చుననే అనుమానం మిగిలిన సభ్యులకు రాలేదా?
మూడు, ఈ అధ్యాయంలోని విషయాలే పరిష్కార మార్గాలను తయారు చేయడానికి ఉపయోగపడ్డాయని కమిటీయే అభిప్రాయపడినప్పుడు, ఆ మార్గాలను మాత్రం బయటపెట్టి, ఆ మార్గాలకు రావడానికి దారితీసిన కారణాలను ప్రజలనుంచి దాచిపెట్టడం ఉచితమా? సమంజసమా? మధ్యవర్తిత్వంలో, న్యాయవిచారణలో ఇలా ఎక్కడైనా జరుగుతుందా?
ఈ దాచిపెట్టిన ఎనిమిదో అధ్యాయాన్ని అలా ఉంచి, అసలు మొత్తం నివేదికలోనూ, సిఫారసులలోనూ ఎన్నో చోట్ల అవసరం ఉన్నా లేకపోయినా శాంతిభద్రతల గురించి, అంతర్గత భద్రత గురించి, మావోయిస్టుల గురించి, ఇస్లామిక్ తీవ్రవాదుల గురించి, విద్యార్థుల హింసాత్మక చర్యల గురించి కమిటీ మాట్లాడింది. ఇది అచ్చంగా ఈ దేశంలో పాలకవర్గాల దృక్పథం. ప్రజలు తాము అనుభవిస్తున్న ఏ సమస్య గురించి మాట్లాడినా శాంతిభద్రతలకు భంగం వాటిల్లినట్టే పాలకవర్గాలకు అనిపిస్తుంది. ఆకలి, అనారోగ్యం, నిరక్షరాస్యత, అవినీతి, ఆధిపత్యం, కుల అణచివేత, వనరుల దోపిడీ – ఏ సమస్య అయినా సరే, ప్రజలు ఆ సమస్యలను పాలకుల ముందుకు తెచ్చి, పరిష్కరించమని కోరితే చాలు, అవి శాంతిభద్రతల సమస్యలుగా మారుతాయి. వాటికి లాఠీలతో, తూటాలతో, నిర్బంధంతో జవాబు చెప్పక తప్పదని పాలకులు అనుకుంటారు. ప్రజలు లేవనెత్తే సమస్యలు మాత్రమే కాదు, చివరికి పాలకులు తామే రాసుకున్న రాజ్యాంగాన్నీ, చట్టాలనూ, చేసిన వాగ్దానాలనూ పాటించాలని ఎవరు కోరినా శాంతి భద్రతల సమస్యగా కనబడే స్థితికి ఇవాళ పాలకులు చేరుకున్నారు.
ఈ శాంతి భద్రతల దృక్పథంలో భాగమే బాధిత ప్రజల హక్కులపట్ల ఎటువంటి సున్నిత భావాలు లేకపోవడం. తమ హక్కుల కోసం ప్రశ్నించే క్రమంలో ప్రభుత్వ దమనకాండలో గాని, నిరాశానిస్పృహలకు లోనై తమంత తామే గాని చనిపోయే, గాయపడే, నష్టపోయే ప్రజల గురించి ఈ శాంతిభద్రతల పాలకులకు పట్టనే పట్టదు. అందుకే 1969 ఉద్యమం సందర్భంగానూ, 2009-10 ఉద్యమంలోనూ జరిగిన అశాంతి గురించి, ఆస్తి నష్టం గురించి, హింస గురించి, విధ్వంసం గురించి మాట్లాడిన కమిటీ అప్పుడు తుపాకి తూటాలకు బలి అయిన 370 మంది విద్యార్థి యువజనుల గురించి గాని, ఇప్పుడు నిరాశతో ఆత్మహత్య చేసుకున్న 600 మంది గురించి గాని ఒక్క సానుభూతి వాక్యం రాయలేదు.
ఒక్కమాటలో చెప్పాలంటే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక శాంతి భద్రతల పాలకనీతితో తయారయింది. అయితే, హోం శాఖ కార్యదర్శిగా పని చేసిన కమిటీ కార్యదర్శికి ఇటువంటి పాలకనీతి వంటబట్టడంలో ఆశ్చర్యమూ అసహజమూ ఏమీ లేదు. కాని ఒక చర్యను నేరంగా భావించేటప్పుడైనా ఆ నేరం ఎలా జరిగిందని ఆలోచించాలని శిక్షణ పొందిన న్యాయకోవిదులు, ఒక సామాజిక చర్య ఏ నేపథ్యంలో సంభవించిందో అధ్యయనం చేయడంలో శిక్షణ పొందిన సామాజిక శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త కూడ ఈ పాలకనీతిని ఔదల దాల్చడమే విషాదకరం. మన మేధావివర్గం ప్రజలకు దూరంగా, పాలకులకు దగ్గరగా ఎలా ప్రయాణిస్తున్నదో ఈ నివేదిక కొట్టవచ్చినట్టుగా చూపుతోంది.
కమిటీ దృక్పథం – అభివృద్ధి మాయాజాలం
కమిటీ ఇటువంటి వైఖరిని తీసుకోవడానికి కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారుల, ఆంధ్రప్రదేశ్ పాలకవర్గాల దృక్పథం మాత్రమే కాక, దేశ పాలకవర్గాల, ప్రపంచీకరణ శక్తుల దృక్పథం కూడ కారణం. ఈ రెండు దృక్పథాలూ అభివృద్ధి మాయాజాలంలో సమైక్యమయ్యాయి. అభివృద్ధి పేరుతో ప్రజలను మాయ చేయడం, ఆ మాయ చాటున తమ ప్రయోజనాలను కొనసాగించుకోవడం, పెంచుకోవడం పాలకవర్గాలకు, సంపన్నవర్గాలకు ఎంతోకాలంగా అలవాటే. 1947 నుంచీ కూడ దేశంలో అమలవుతున్న పాలకనీతి అదే. ఆ పాలకనీతి 1980లమధ్య వరకూ కనీసం ప్రజల పేరు తలుస్తూ ఉండేది. ఆ తర్వాత, మరీముఖ్యంగా 1991 తర్వాత ప్రపంచీకరణ భావజాలంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్నదిదే. ప్రజలను నిరాశ్రితులను చేయడం, ప్రజల ఉపాధి పోగొట్టడం, ప్రజల ఉమ్మడి వనరులను కొల్లగొట్టడం – అదంతా దేశాభివృద్ధికి అవసరమని, మొదట దేశం అలా అభివృద్ధి చెందితే అది ప్రజలకు ఎప్పటికో ఒకప్పటికి ప్రయోజనం కలిగిస్తుందని ఈ భావజాలం ప్రచారం చేస్తుంది. ఈ భావజాలానికి అసమానతలు కొనసాగాలి. ఒక వర్గం, ఒక ప్రాంతం, ఒక దేశం లాభపడడానికి మరొక వర్గం, మరొక ప్రాంతం, మరొక దేశం నిరంతరం దోపిడీ పీడనలకు గురవుతూ లోబడి, పెరడుగా, వలసగా ఉండాలి. ఇది సహజమైన, అనివార్యమైన స్థితి అని, ఇదే అభివృద్ధి అని నమ్మించడానికి ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేయాలి. ఆ అబద్ధాలలో భాగమే ఈ నివేదిక. అందుకే ఈ నివేదిక అతి ఎక్కువ భాగం అంకెల భాషలో, మార్కెట్ భాషలో, హైదరాబాద్ ఆకర్షిస్తున్న సేవారంగ సంస్థల, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల భాషలో, సంపన్నుల సంపదను మరింత పెంచే, పేదలను మరింత పేదరికంలోకి తోసే విధానాల భాషలో మాట్లాడింది. ఇవాళ దేశ పాలకవర్గాలకు నాయకత్వం వహిస్తున్న డా. మన్మోహన్ సింగ్, అంతకుముందు బహుళజాతిసంస్థల న్యాయవాదిగా, ఆ తర్వాత వాణిజ్య, ఆర్థిక శాఖల మంత్రిగా ఉండి ప్రస్తుతం పోలీసు మంత్రిగా మారిన చిదంబరం నమ్మే భావజాలం ఇదే.
పనికొచ్చేది ఏమీలేదా?
నివేదిక తయారీలో భాగంగా ప్రజలను కలవడం జరిగింది కాబట్టి, ఎంత దుర్మార్గంగా తయారయిన నివేదికలోనైనా ప్రజల ఘోషకు బలహీనమైన ప్రతిధ్వనులైనా వినిపించక తప్పదు. అలా ఈ నివేదికలో కూడ అతి జాగ్రత్తగా వెతికితే కనబడే నాలుగైదు పనికొచ్చే అంశాలున్నాయి.
• పే. 73లో రైతులకు అందుతున్న రుణ సౌకర్యాల గురించి మాట్లాడుతూ కోస్తాంధ్రలో అది హెక్టారుకు రు. 32 వేలుగా ఉండగా, రాయలసీమలో రు. 21 వేలుగా, తెలంగాణలో రు. 18 వేలుగా ఉందని కమిటీయే రాసింది. ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించడం మాత్రం చేయలేదనేది వేరే సంగతి.
• పే. 121లో రాష్ట్రం మనగలగడానికి ఉండే ఆర్థిక పరిమాణం గురించి రాస్తూ, “కేవలం ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని మాత్రమే చూస్తే, ఒక కొత్త రాష్ట్రంగా తెలంగాణ హైదరాబాదుతో కలిసిగాని, హైదరాబాదు లేకుండా గాని మనగలుగుతుంది. ఇతర ప్రాంతాల సమ్మేళనం – కోస్తాంధ్ర, రాయలసీమలు కలిసిన రాష్ట్రం కూడ మనగలుగుతుంది. నిజానికి ఆ రెండు ప్రాంతాలూ విడి విడి రాష్ట్రాలుగా కూడ మనగలుగుతాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచాలనే నిర్ణయంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి తటస్థ పాత్రనే వహిస్తుంది” అని రాసింది.
• పే 207 – 209లో తెలంగాణ లేవనెత్తిన నీటి పారుదల ఫిర్యాదులలో కొన్ని వాస్తవమేనని కమిటీ అంగీకరించింది.
• “ఉప ప్రాంతీయ వాదం కులం, భాష వంటి ఎక్కువ మౌలికమైన ఆదిమ అస్తిత్వాల మీద ఆధారపడిన ఉద్యమం కాదు. అది ప్రధానంగా ఆధునికమైనది. సమతుల్యమైన, సమానమైన ఆధునికత దిశలో సాగేది. మా విశ్లేషణలో కులం, మతం, స్త్రీ పురుష భేదం, ఇతర విభజనలనన్నిటినీ అధిగమించిన తెలంగాణ ఉద్యమం ప్రాంతం మొత్తానికీ అబ్భివృద్ధి కావాలనే ఆకాంక్షను వెలిబుచ్చుతోంది. ప్రాంతీయ వనరుల మీద, వాటిని అందుబాటులోకి తెచ్చుకోవడం మీద దృష్టి సారిస్తోంది. ఇంకా చెప్పాలంటే, అది హక్కుల ఆధారిత అభివృద్ధి దృక్పథాన్ని ముందుకు తెస్తోంది. ఈ దృక్పథంలో ఒక విశాల సమానత్వ అభివృద్ధి లో భాగంగానే బృందాలూ, సమూహాలూ తమ కార్యక్రమాలను ముందుకు పెడతాయి” అని నివేదిక విశ్లేషించింది.(పే. 357)
• “తెలంగాణ ఉద్యమాన్ని ఒక రాజకీయ పాలనా ప్రాంతంలో ఇతోధిక ప్రజాస్వామ్యం కొరకు, సాధికారత కొరకు సాగుతున్న ఉద్యమంగా వ్యాఖ్యానించవచ్చు” అని కమిటీ రాసింది (పే. 413). దీనికి కొనసాగింపుగా పే. 357లో చేసిన విశ్లేషణను మళ్లీ ఒకసారి రాసింది.
• “తెలంగాణలో ప్రాంతీయ భావోద్వేగాలు ప్రబలంగా ఉన్నాయి. అవి కుల, తెగ, మత అస్తిత్వాలనూ, సామాజిక వర్గ బృందాలనూ అధిగమించి ఉన్నాయి” అని కమిటీ రాసింది (పే. 414)
• అన్నిటి కన్నా ముఖ్యంగా కమిటీ చేసిన సిఫారసులన్నీ ఆంధ్రప్రదేశ్ ను యథాతథంగా కొనసాగించడం అసాధ్యం అని చెప్పకనే చెప్పాయి. మొదటి సిఫారసు యథాతథం అని మాట మాత్రం అన్నప్పటికీ అది ఆచరణ సాధ్యం కాదని ఏకగ్రీవంగా అభిప్రాయ పడినట్టు కమిటీయే రాసింది. మిగిలిన ఐదు సిఫారసుల సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా, అవన్నీ ఆంధ్రప్రదేశ్ యథాతథంగా ఉండడం కుదరదు అని ప్రకటిస్తున్నాయి.
ముగింపు
ఇది రాస్తున్నంతసేపూ ఇంత విషపూరితమైన, అమానుషమైన, క్రూరమైన, ప్రజావ్యతిరేకమైన నివేదికను, ఈ అశుద్ధాన్ని ఇలా పరీక్షించవలసి వచ్చిందిగదా అని అసహ్యం, ఆగ్రహం కలిగాయి. ప్రజలను ఇంతగా మోసం చేస్తున్న పాలకవర్గాల మీద, పాలకనీతి మీద అసహ్యం, ఆగ్రహం పెరిగిపోయాయి. ఈ దేశంలో పాలకవర్గాలు, అధిపత్యవర్గాలు, ఇతరుల వనరులను, అవకాశాలను కొల్లగొడుతున్న వర్గాలు తమ అక్రమాలు, దోపిడీ పీడనలు కొనసాగడానికి ఎటువంటి అబద్ధాలకు దిగజారుతాయొ అడుగడుగునా కనబడి ఇదంతా ప్రజలు తెలుసుకోవాలనే తపనతోనే ఇది రాయక తప్పలేదు. తెలంగాణ ప్రత్యర్థులు ఎంత బలమైనవారో, ఎంత వంచకులో, ఎంత దుర్మార్గులో, ఎంత అమానుషమైనవారో శ్రీకృష్ణ నివేదిక బయటపెట్టింది. స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణ ప్రత్యర్థులు అంటే కోస్తాంధ్ర, రాయలసీమ సాధారణ ప్రజలు కాదు. ఈ నివేదిక ఆ తెలంగాణేతర ప్రాంతాల ప్రజలకు మేలు చేసేది కూడ కాదు. అసలు ఒక చోట ప్రజలకు ద్రోహం చేసేవారు మరెక్కడయినా ప్రజలకు మేలు చేయలేరు. ఇది కేవలం కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులకు, భూస్వాములకు, పెట్టుబడిదారులకు, రాజకీయ వ్యాపారులకు, ప్రజావ్యతిరేకులకు మేలు చేసే నివేదిక మాత్రమే. వారి నివేదిక మాత్రమే. వారికి మద్దతు ఇస్తున్న దేశ పాలకవర్గాల, ప్రపంచీకరణ శక్తుల నివేదిక మాత్రమే. వారికి రక్షణ కల్పిస్తూ ప్రజల మీద దౌర్జన్యం చలాయిస్తున్న పోలీసుల, భద్రతా బలగాల నివేదిక మాత్రమే. అందువల్ల ఈ నివేదికను వ్యతిరేకించడం, ఎండగట్టడం, ప్రతిఘటించడం తెలంగాణ ప్రజల బాధ్యత మాత్రమే కాదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్నీ, రాజ్యాంగ స్ఫూర్తినీ, చట్టబద్ధ పాలననూ, ప్రాథమిక హక్కులనూ, వనరుల మీద భూమిపుత్రుల హక్కునూ గౌరవించే, ప్రేమించే, పరిరక్షించాలని కోరుకునే ప్రతి ఒక్కరి బాధ్యత అవుతుంది. నా ఈ రచన కూడ ఆ బాధ్యతలో భాగమే.
***
చదవదగిన పుస్తకాలు
నివేదిక మీద అదనపు వ్యాఖ్యలకు, వివరణలకు, విమర్శలకు ఈ కింది పుస్తకాలు, కరపత్రాలు కూడ చదవడం ఉపయోగకరం:
తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజాక్) – విద్యుత్ రంగంపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక – ఒక అబద్ధాల పుట్ట.
సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ – దగాపడ్డ తెలంగాణకు శ్రీకృష్ణ కమిటీ దోఖా.
ఎస్ విజయ కుమార్ (సం.) – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దగాపడ్డ తెలంగాణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం, హైదరాబాద్ ఇంజనీర్ల సంఘం, తెలంగాణ అసెస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల సంఘం ప్రచురణ.
Telangana Development Forum – USA/India & Telangana Vidyavanthula Vedika – Justice Srikrishna’s Injustice.
తెలంగాణ రిసోర్స్ సెంటర్ – ప్రజల్ని విస్మరించిన శ్రీకృష్ణ నివేదిక.


http://missiontelangana.com/nvenugopal-skc-rebuttal-part1/
http://missiontelangana.com/nvenugopal-skc-rebuttal-part2/
http://missiontelangana.com/nvenugopal-skc-rebuttal-part3/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి