17, ఆగస్టు 2013, శనివారం

తెలుగు జాతిపై ఢిల్లీ పగ


August 18, 2013
భావోద్వేగాలు ఏర్పడినప్పుడు హితబోధలు పని చేయవు. విజ్ఞతకు తావు ఉండదు. నిన్నటిదాకా ప్రత్యేకవాదం పేరిట తెలంగాణలో, ఇప్పుడు సమైక్యవాదం పేరిట సీమాంధ్రలో భావోద్వేగాలు పెచ్చరిల్లాయి. పెచ్చరిల్లుతున్నాయి. ఈ విభజన, సమైక్యవాదాలతో రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు అనాథలుగా మారారు. ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలిపోయింది. రాజకీయ వ్యవస్థ చేయవలసిన పని ఉద్యోగులు చేస్తున్నారు. వారు చేయాల్సిన అసలు పని చేయడంలేదు. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ విశ్వసనీయత కోల్పోవడంతో ఎవరికివారే నాయకులుగా చలామణి అవుతున్నారు. సందట్లో సడేమియా అన్నట్లుగా భావోద్వేగాలను పెంచిపోషించడానికి అసత్య ప్రచారాలు కూడా మొదలయ్యాయి. కడచిన 17 రోజులుగా సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమాల వల్ల జనజీవనం అతలాకుతలం అవుతున్నది.

రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చీమ కుట్టినట్టు కూడా లేదు. విభజన ప్రకటనానంతర పరిణామాలు ఎవరి చేతుల్లోనూ లేకుండా పోతున్నా రాజకీయ నాయకత్వం చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతున్నది. ఎంతకాలం ఇలా? సమైక్యరాష్ట్రం కోసం రాజీనామాలు చేస్తున్నామని ప్రకటనలు చేసిన సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు ప్రజల్లో భావోద్వేగాలు పెంచి ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. రాష్ట్ర విభజన విషయంలో వెనక్కి మళ్లేదిలేదని కాంగ్రెస్ అధిష్ఠానం పదే పదే స్పష్టంచేస్తున్నా, ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులు ప్రజలను శాంతింప చేయడానికి కనీస ప్రయత్నాలు చేయకపోగా, అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.

రాష్ట్ర మంత్రులు పోటీపడి మరీ రాజీనామాలు ప్రకటించారు. రాజీనామాలు చేసిన వాళ్లు అధికార హోదాకు దూరంగా ఉంటున్నారా? అంటే అదీ లేదు. మంత్రులుగా దర్జా అనుభవిస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రకటనలను నమ్ముకుని ఏపీఎన్‌జీవోలు సమ్మెలోకి దిగారు. తెలంగాణ ఉద్యమం జోరుమీద ఉన్నప్పుడు సకల జనుల సమ్మెను నెలరోజులకు పైగా చేసి ఏమి సాధించినట్టు? ఇప్పుడు సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యోగుల సమ్మె ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఈ సమ్మెలు, ఆందోళనల వల్ల అప్పుడు తెలంగాణ ప్రజలు, ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ఆందోళనలలోని హేతుబద్ధత విషయానికి వద్దాం! రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో భావోద్వేగాలు లేవని చెప్పలేం. అయితే, విభజన ప్రకటన వచ్చేవరకు మౌనంగా ఉండి ప్రకటన చేసిన తర్వాత ఉద్యమాలు చేయడంలో ఔచిత్యం ఏమిటన్నదే ప్రశ్న! విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్వార్థంతో ఏకపక్షంగా వ్యవహరించిన విషయం వాస్తవం.

ఇదేదో తమ సొంత పార్టీ వ్యవహారమన్నట్టుగా కాంగ్రెస్ ఇప్పటికీ భావిస్తోంది. అయితే, విభజన అంశం తెల్లవారేసరికల్లా తెరమీదకు వచ్చింది కాదు. విభజన ప్రకటన వెలువడటానికి నెలరోజుల ముందు నుంచి రాష్ట్రాన్ని విడగొట్టబోతున్నారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. విభజన వల్ల నష్టపోతామని ఇప్పుడు ఆందోళన చెందుతున్నవాళ్లు అప్పుడు నోరు ఎందుకు మెదపలేదన్నదే ప్రశ్న! చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదుకదా? విభజన వల్ల తమకు అన్యాయం జరుగుతుందని తొలుత ఆందోళన ప్రారంభించిన ఏపీఎన్‌జీవోలు ఇప్పుడు సమైక్యం కోసం పోరాడతామంటున్నారు. విభజించడమా? సమైక్యంగా ఉంచడమా? అనేది రాజకీయపరమైన నిర్ణయం. ఇందులో ఉద్యోగులు పరోక్షపాత్ర పోషిస్తే అభ్యంతరం లేదుగానీ ప్రత్యక్షపాత్ర పోషించడం ఏమిటి? తెలంగాణ కోసం ఆ ప్రాంత ఉద్యోగులు కూడా అలాగే చేశారు. వారిని చూసి ఇప్పుడు సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్నారు. రాజకీయ నాయకులకంటే తామేం తక్కువ అన్నట్టుగా ఉద్యోగ సంఘాల నాయకులు వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులను అదుపుచేయగల స్థితిలో రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ కూడా లేదు.

తోకే కుక్క తలను ఆడించినట్టుగా రెండు వైపులా ఉద్యోగ సంఘాల నాయకులే రాజకీయ పార్టీలను ఆడిస్తున్నారు. అయితే, ఆయా సంఘాల నాయకులు ఇక్కడ ఒక్క విషయం గుర్తించుకోవాలి. తమ ఆందోళనలు, చర్యల వల్ల రాజకీయ పార్టీలు మాత్రమే లబ్ధిపొందుతాయిగానీ, ఉద్యోగులు కాదు. తెలంగాణలో రాజకీయ జేఏసీ నాయకుల వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి లాభపడింది తప్ప జేఏసీ నాయకులు కాదు. రాజకీయంగా ఎదగాలనుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు టీఆర్ఎస్ పంచన చేరవలసి వచ్చింది. రేపు సీమాంధ్రలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అయినా, జరగనిదాన్ని పట్టుకుని వేలాడుతూ, జరగవలసిన వాటిని విస్మరించడం అవివేకం అవుతుంది. సీమాంధ్ర ప్రజలు కూడా ఈ చేదునిజాన్ని అర్థం చేసుకోవాలి. "రాష్ట్రం సమైక్యంగా ఉండటం అయ్యే పని కాదని మాకూ తెలుసు- అయితే పోరాటం చేయడం వల్ల హైదరాబాద్‌ను శాశ్వత ప్రాతిపదికన యూటీగా ప్రకటింపచేయవచ్చునన్నది మా ఆలోచన'' అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎంపీ అన్నారు. హైదరాబాద్ నగరం మాత్రమే రాష్ట్ర విభజనకు అడ్డుగోడగా ఉన్న విషయం అందరికీ తెలుసు.

హైదరాబాద్‌ను మినహాయించి తెలంగాణ ఏర్పాటుచేస్తే సీమాంధ్రలో ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు చెబుతున్న సమైక్యవాదమంతా హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం అన్నమాట! హైదరాబాద్ మీద అంత మమకారం ఉన్నవాళ్లు విభజన ప్రకటన వెలువడటానికి ముందే, హైదరాబాద్ సంగతి తేల్చిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోండి అని స్పష్టం చేయవలసింది. అటు సీమాంధ్ర ప్రజలు గానీ ఇటు ఏపీఎన్‌జీవోలుగానీ తమనుతాము శిక్షించుకునే ఆందోళనలకు స్వస్తిచెప్పి వాస్తవంలోకి రావాలి. తమకు న్యాయం చేయడానికి ఏమిచేయాలో కోరాలి. కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యవహారంలో అరాచకంగా వ్యవహరిస్తోంది. సీమాంధ్రకు అన్యాయం జరగకుండా తాము తీసుకోబోయే చర్యలు ఏమిటో మాట మాత్రంగానైనా చెప్పకుండా విభజన ప్రకటన చేయడం వల్లనే పరిస్థితి ఇంతదూరం వచ్చింది. ఇప్పుడు 20 రోజులుగా రాష్ట్రంలో ముఖ్యంగా సీమాంధ్రలో ప్రభుత్వం స్తంభించిపోయినా కాంగ్రెస్ పార్టీకి చీమకుట్టినట్టు అయినా లేదు. ఎంతకాలం ఆందోళన చేస్తారో చేసుకోండి అన్నట్టుగా కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి ఉంది.

అదేమంటే ఆంటోని కమిటీని వేశాం! మీరు ఏమైనా చెప్పుకోవాలంటే వచ్చి చెప్పుకోండి అంటున్నారు. ఇది నిజంగా సీమాంధ్రులను అవమానించడమే! ఈ ధోరణి వల్లనే ఉద్యమం ఉధృతం అవుతున్నది. మేమంటే అంత లెక్కలేని తనమా అని సీమాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. మన కన్నును మన వేలితోనే పొడిపించాలన్నది కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దల వ్యూహంగా కనిపిస్తున్నది. విభజించి పాలించు అన్న బ్రిటిష్‌వాడి సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా నమ్ముతున్నట్టు ఉంది. సందట్లో సడేమియా అన్నట్టుగా ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి కొందరు ప్రయత్నాలు మొదలెట్టారు. జరగని సంఘటనలను జరిగినట్టుగా ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో సీమాం«ద్రులపై దాడులకు ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం ఆంధ్రాలో జరుగుతోంది.

రెండు వైపుల నుంచీ అపోహలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. విభజన నిర్ణయం జరిగిపోయిన నేపథ్యంలో తమ రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడుతుందన్న ఉద్దేశంతో సీమాంధ్రుల పట్ల తెలంగాణ ప్రజల్లో విద్వేషం రగిలించడానికి టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్య నాయకులు స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తూఉంటే టీఆర్ఎస్ నాయకులు చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం జోరుమీద ఉన్నప్పుడు సీమాంధ్రులను ఉద్దేశించి కేసీఆర్ అండ్ కో ఎన్నో మాటలు అన్నారు. అప్పుడు వాటన్నింటినీ సీమాంధ్రులు మౌనంగా భరించారు.

ఇప్పుడు విభజన ఆటలో ఓడిపోయినందున సీమాంధ్రుల నుంచి కూడా కవ్వింపు చర్యలు, వ్యాఖ్యలు మొదలయ్యాయి. అయితే చర్యకు ప్రతిచర్య పరిష్కారం అవ్వదన్న విషయం తెలంగాణ నాయకులు గుర్తించాలి. 'మేం దంచుడు మొదలెడితే ఒక్కరు కూడా మిగలరు' వంటి రెచ్చగొట్టే ప్రకటనలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉపకరించవు. విద్వేషాలు పెచ్చరిల్లి ఘర్షణలు జరిగితే ఉభయులూ నష్టపోతారు. ఈ వాస్తవాన్ని గుర్తించి ఉభయ ప్రాంతాలకు చెందిన నాయకులు సంయమనంతో వ్యవహరించడం తక్షణ అవసరం. విభజన తర్వాత కూడా ఇచ్చిపుచ్చుకోక తప్పదు. సమైక్యం పేరిట ఆందోళన చేస్తున్న ఉద్యోగులుగానీ, ప్రజలుగానీ ఆ ఒక్కటి కాకుండా తమకు ఏమి కావాలో కోరడం మంచిది. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా తెలుగుజాతిపై పగబట్టినట్టుగా కాకుండా పరిస్థితి తీవ్రతను గుర్తించి సీమాంధ్రులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలి.
ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంటోంది. ముందుగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. విభజన నిర్ణయం తీసుకున్నది ఆ పార్టీనే అయినప్పటికీ, ప్రకటన వెలువడిన తర్వాత సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడం మొదలెట్టారు. ఉత్తుత్తి రాజీనామాలతో ప్రజలను గందరగోళంలో పడేయడం మినహా ఒరిగింది ఏమైనా ఉందా? ఉద్యోగులు- ప్రజలు కూడా వేలంవెర్రిగా ప్రజాప్రతినిధుల రాజీనామాలు కోరడం మొదలెట్టారు. ఆయా పార్టీలకు చెందిన వారు ప్రకటిస్తున్న రాజీనామాలకు విలువ ఏమైనా ఉందా? అని ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. రాష్ట్రం విడిపోయినట్టుగానే కాంగ్రెస్ పార్టీ కూడా రెండుగా చీలిపోయింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజనను వ్యతిరేకించారు.

దీంతో మంత్రులంతా తాము రాజీనామాలు చేస్తున్నట్టు పోటీపడి ప్రకటించారు. సొంత పార్టీ నాయకులను అదుపుచేయలేని స్థితిలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉందనుకుంటే పప్పులో కాలేసినట్టే! ఉభయ ప్రాంతాలలోనూ రాజకీయంగా లబ్ధిపొందాలన్నది ఆ పార్టీ వ్యూహం. ప్రజలే అమాయకంగా రాజీనామాల ప్రకటనలను నమ్మి మోసపోతూ రోడ్లపైకి వచ్చి తమకు తాము అసౌకర్యం కల్పించుకుంటున్నారు. న్యాయం కావాలని నినదిస్తున్న సీమాంధ్రుల మొర వినిపించుకోవలసిందిపోయి 'మీరేమి చేసుకుంటారో చేసుకోండి. మా పని మేం చేసుకుపోతాం!' అని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రకటించడం బాధ్యతారాహిత్యం కాదా? ఆంటోనీ కమిటీతో సంబంధం లేకుండా విభజనకు సంబంధించి రాజ్యాంగ ప్రక్రియ సాగిపోతుంటుంది అని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

అలాంటప్పుడు ఆంటోనీ కమిటీని వేయడం ఎందుకో ఆయనే చెప్పాలి. ఈ కమిటీ ప్రజల కోసమా? పార్టీ కోసమా? సీమాంధ్రుల ఆందోళనలను అర్థంచేసుకుని న్యాయం జరిగిందన్న నమ్మకం వారిలో కల్పించకుండా విభజన ప్రక్రియ పూర్తిచేస్తే తెలుగుజాతి మధ్య శాశ్వతంగా తంపులు పెట్టినట్టు కాదా? ఆందోళన బాటపట్టిన ఉద్యోగులకు నచ్చచెప్పే బాధ్యత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై లేదా? ప్రభుత్వ పెద్దలు కాడి పారేసి కూర్చోవడం వల్ల సమస్య తీవ్రమవ్వడం మినహా ప్రయోజనం ఏమైనా ఉంటుందా? రాజీనామాలు ప్రకటించిన మంత్రులు, శాసనసభ్యులు అధికారిక విధులకు హాజరవుతూ జీతభత్యాలు పొందడం ప్రజలను వంచించడం కాదా? ప్రతిపక్షాలను ఆడిపోసుకునే బదులు జరగవలసిన దానిపై కాంగ్రెస్ నాయకులు దృష్టిపెట్టడం మంచిది. సీమాంధ్రలో నష్ట నివారణ కోసం రాజీనామాల తంతుకు శ్రీకారం చుట్టినప్పటికీ దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించి చెప్పలేనివారు నాయకులే కాదు.

రాజకీయ ప్రయోజనం లేకుండా కాంగ్రెస్ పార్టీనే కాదు, ఏ పార్టీ కూడా ఏ నిర్ణయం తీసుకోదన్నది అందరికీ తెలుసు. సీమాంధ్రలో సమైక్యమంటలను ఎగదోయడం వల్ల ప్రజలకు నష్టంచేయడమే తప్ప ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని కాంగ్రెస్ నాయకులు గుర్తించాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నది తమ పార్టీనే కనుక సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయడానికి ఏమి సాధించుకోవాలో వాటిపై కాంగ్రెస్ నాయకులు దృష్టి సారించడం అవసరం. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా మొండివైఖరి విడనాడి విభజనానంతరం సీమాంధ్ర ప్రాంతానికి ఏమిచేయబోతున్నారో ముందుగానే నిర్ణయించి ప్రజలకు వివరించాలి. కొత్త రాజధానిని ఎక్కడ ఏర్పాటుచేస్తారు వంటి అంశాలు కూడా తేల్చకుండా పదేళ్ల వరకు హైదరాబాద్‌లో ఉండండి. ఆ తర్వాత మీ చావేదో మీరు చావండి అన్నట్టుగా వ్యవహరిస్తే ఎవరికైనా మండుతుంది.

విభజన కంటే, విభజన ప్రకటన చేసిన తీరు ప్రస్తుత ఆందోళనలకు ప్రధాన కారణం. ఉద్యోగులకు ఎలా న్యాయం చేయబోతున్నారో చెప్పరు? ఏ విషయమూ ఏమీ తెలియజేయకుండా ఢిల్లీలో కూర్చుని నిర్ణయాలు తీసుకోవడానికి ఇదేమన్నా సోనియాగాంధీ జాగీరా? ఒకటి రెండు పార్టీలు మినహా మిగతా పార్టీలన్నీ విభజనకు అంగీకరించిన విషయం వాస్తవం. అంతమాత్రాన విడిపోతున్న ప్రాంత ప్రజలకు వారి భవిష్యత్తు పట్ల భరోసా కల్పించవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉండదా? కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి ఈ రాష్ట్ర ప్రజలు చేసిన పాపం ఏమిటి? సీమాంధ్ర ప్రజల మొర వినే తీరిక కూడా లేకపోతే ఎలా? అధికారం ఉందని ఇష్టంవచ్చినట్టు వ్యవహరిస్తే సీమాంధ్రలో ఆ పార్టీ దుకాణాన్ని శాశ్వతంగా మూసుకోవలసి వస్తుంది. ఏదో ఒక విధంగా ఎన్నికల వరకు విభజన నిర్ణయం అమలును వాయిదా వేయించాలని కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు ప్రయత్నిస్తున్నారు.

ఇటువంటి చర్యల వల్ల ఆ పార్టీకి ఇరు ప్రాంతాల్లో నష్టం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వల్ల విభజన చేయవలసి వచ్చిందని సీమాంధ్రలో, సోనియాగాంధీ వల్ల తెలంగాణ వచ్చిందని తెలంగాణలో చెప్పుకోవడం ద్వారా ఉభయ ప్రాంతాల్లో ప్రయోజనం పొందాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలి. విభజన వల్ల తెలంగాణలో ప్రయోజనం పొందుతున్నారు కనుక సీమాంధ్రలో నష్టపోవడానికి కాంగ్రెస్ నాయకులు మానసికంగా సిద్ధంకావాలి. ఇందుకు భిన్నంగా సీమాంధ్రలో కూడా ప్రయోజనం పొందాలన్న ఉద్దేశంతో ఆచరణ సాధ్యంకాని సమైక్య నినాదాన్ని భుజానవేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. దీనికి బదులు సీమాంధ్రకు మంచి ప్యాకేజీ సాధించడానికి కృషి చేయగలిగితే ఆ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకునే అవకాశం ఉంది.

ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వద్దాం! తమను లక్ష్యంగా చేసుకునే కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. తెలంగాణలో నిలదొక్కుకుని, సీమాంధ్రలో అధికారంలోకి రావడం ఎలా అన్నదానిపై ఇప్పుడు ఆ పార్టీ దృష్టి సారించింది. ఇవ్వాళ కాకపోతే రేపు అయినా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది. లేదంటే టీఆర్ఎస్ నాయకులను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమ పార్టీలో కలుపుకొని టీఆర్ఎస్ దుకాణం ఖాళీ అయ్యే విధంగా కాంగ్రెస్‌పార్టీ వ్యూహరచన చేస్తున్నది. సమైక్య నినాదం చేపట్టడంతో తెలంగాణలో వైసీపీ దుకాణం బంద్ అయ్యింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్‌కు పోటీగా తమ పార్టీ మాత్రమే మిగులుతుందని తెలుగుదేశం నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించకుండా సీమాంధ్రకు న్యాయంచేయాలన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆందోళనలకు శ్రీకారంచుట్టింది. విభజనను వ్యతిరేకించకపోవడం వరకు ఆ పార్టీ నిబద్ధతగానే ఉన్నట్టు చెప్పవచ్చు.

ఎటొచ్చీ సీమాంధ్రలో ప్రజాందోళనలో పాలుపంచుకోకపోతే గల్లంతు అవుతామన్న దిగులు ఆ పార్టీని పట్టి పీడిస్తున్నది. సమైక్యవాదంతో జగన్ పార్టీ ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టినందున ఆ పార్టీని తట్టుకుని నిలబడాలంటే పోటీగా ఆందోళనలు చేపట్టవలసిన పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ చిక్కుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నందున సీమాంధ్రలోనైనా వచ్చే ఎన్నికలలో అధికారం దక్కించుకోలేకపోతే పార్టీ మనుగడే ప్రమాదంలో పడుతుందన్నది ఆ పార్టీ నాయకుల ఆలోచనగా ఉంది. విభజన ఎలాగూ ఆగదు కనుక నూతనంగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి చంద్రబాబు అనుభవం అవసరం అవుతుందనీ, వచ్చే ఎన్నికలలో దాన్ని ఒక ప్లస్ పాయింట్‌గా ప్రచారం చేసుకుని అధికారంలోకి రావాలన్నది ఆ పార్టీ అంచనా.

ఈ ఉద్దేశంతోనే విభజనను వ్యతిరేకించకుండా, అదే సమయంలో సీమాంధ్రలో ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడకుండా ఆందోళన కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ శ్రీకారంచుట్టింది. సీమాంధ్ర ప్రజల్లో ప్రస్తుతం సమైక్యవాదం సెంటిమెంట్ ఉన్న మాట నిజమే! అయినప్పటికీ వారికి వాస్తవ పరిస్థితులను వివరించే బాధ్యతను చంద్రబాబు నాయుడు తీసుకోవాలి. సీమాంధ్రులలో ఉన్న భయాందోళనలను తొలగించడానికి తాను ఏమిచేయబోయేది చెబుతూ, అందుకు అవసరమైన చర్యలు కేంద్రప్రభుత్వం తీసుకునేలా ఒత్తిడి తెస్తూనే రాష్ట్ర విభజనకు సహకరించడం ద్వారా ఉభయ ప్రాంతాల ప్రజల అభిమానం చూరగొనడానికి చంద్రబాబు కృషిచేయాలి. ఇందుకు భిన్నంగా తప్పటడుగులు వేస్తే పార్టీ భవిష్యత్తే కాదు- ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో మరో ఉపప్రాంతీయ పార్టీగా కుదించుకుపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం! మొదటినుంచి తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమేనన్న ప్రచారం జరిగింది. ఇందుకు అనుగుణంగానే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో తెలంగాణలో ఆ పార్టీ పూర్తిగా చతికిలబడింది. దీంతో అప్పటివరకు తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని, అందరికీ సమన్యాయం చేయాలంటూ పరోక్షంగా తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 'యూ టర్న్' తీసుకుని సీమాంధ్రలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న ఉద్దేశంతో సమైక్యవాదం నినాదాన్ని తలకెత్తుకుంది. ఈ నెల 19 నుంచి సమైక్యరాష్ట్రం కోసం నిరవధిక నిరాహారదీక్షను చేపట్టాలని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి నిర్ణయించుకున్నారు. వాస్తవానికి విభజన ప్రకటన వెలువడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా అని చెబుతూ ఆ పార్టీకి చెందిన పదహారు మంది శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

అయినా ఈ చర్య రాజకీయంగా ఆ పార్టీకి లాభించలేదు. దీంతో తాడోపేడో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో నేరుగా సమైక్యరాష్ట్రం నినాదాన్ని అందుకున్నారు. ఒక్క విజయలక్ష్మి మాత్రమే కాదు, వందమంది విజయలక్ష్మిలు నిరాహారదీక్ష చేపట్టినా రాష్ట్రం సమైక్యంగా ఉండటం జరిగే పనికాదు. జరగనిదాని కోసం దీక్షలను వృథా చేసే బదులు సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలని కోరడం మేలు. ఇక మిగిలిన టీఆర్ఎస్ విషయానికి వద్దాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేసిన తర్వాత ఆ పార్టీకి చేయడానికి ఏమీ మిగలలేదు. అప్పటిదాకా కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీలు ఖాళీ అవ్వబోతున్నాయనీ, తన పార్టీలో చేరదలచుకున్నవాళ్లు ఫలానా తేదీలోపు చేరాలనీ, గడువు దాటిన తర్వాత తలుపులు మూసివేస్తామని ప్రకటనలు చేసిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఇప్పుడు తన పార్టీ నుంచి వలసలను అరికట్టడం ఎలా అని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు. బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవ్వడం అంటే ఇదే మరి! విభజన ప్రక్రియ సందర్భంగా ఏదో ఒక మెలిక పెట్టి మళ్లీ బలం పుంజుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తారని కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలకు తెలుసు కనుకే హైదరాబాద్‌ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా లేదా శాశ్వతంగా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు.

కేసీఆర్ కూడా పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటు బిల్లు పెట్టేవరకు కాంగ్రెస్ పార్టీని ఏమీ అనకుండా బిల్లులోని అంశాలను చూసిన తర్వాతే నోరు విప్పాలన్న ఆలోచనతో ఉన్నారు. కాంగ్రెస్-టీఆర్ఎస్‌లకు ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు కనుక వారి మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు పాము-ముంగిస ఆటలా సాగుతున్నాయి. అదే సమయంలో తెలంగాణలో తన అస్తిత్వం ప్రమాదంలో పడకుండా చూసుకోవడానికై విభజన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవలసిందేనని టీఆర్ఎస్ నాయకులు ప్రకటనలు చేయడం మొదలెట్టారు. విభజన జరిగినప్పుడు నిబంధనల ప్రకారం ఏమి జరగాలో అదే జరుగుతుంది. ఫలానా వాళ్లు వెళ్లిపోవలసిందేనని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ సంగతి సీమాంధ్రకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా తెలుసు. అటుగానీ, ఇటుగానీ ఎవరైనా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారంటే రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికేనని ప్రజలు గుర్తించాలి.
రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడతాయి. ఈ క్రమంలో ప్రజలే పావులుగా మారతారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది అదే! సమైక్య రాష్ట్రం కావాలంటూ ఉద్యమిస్తున్న సీమాంధ్ర ప్రజలు వాస్తవిక దృక్పథంతో వ్యవహరించడం అవసరం. రాష్ట్రం విడిపోవడం వల్ల తమకు కలిగే నష్టాలను ఏకరువు పెట్టుకుని వాటి నివారణకు కృషి చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ విషయంలో విజ్ఞత ప్రదర్శించాలి. మూకుమ్మడిగా సమ్మెలోకి దిగడం కొన్ని రోజుల పాటు వినడానికి, చూడటానికి బాగానే ఉంటుంది. అంతిమంగా నష్టపోయేది వారే! రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేయాలనుకోవడం సరికాదు.

విభజన వల్ల ఎదురయ్యే సమస్యలేమిటో వివరించి వాటి పరిష్కారానికి కేంద్రప్రభుత్వం నుంచి హామీ పొందడానికి కృషిచేయాలేగానీ సమైక్యరాష్ట్రం కోసం ఎంతకాలమైనా సమ్మె చేయాలనుకోవడం దుస్సాహసమే అవుతుంది. సకల జనుల సమ్మె విఫలం అయిన ఉదంతం కళ్ల ముందే ఉంది. అయినా మాకు ఇవేమీ పట్టవు. మేం సమ్మె చేస్తూనే ఉంటాం అంటే అది వారి ఇష్టం. కలిసి ఉన్నవారు విడిపోవడం, విడిపోయిన వారు కలిసిపోవడం కాలంలో వచ్చే మార్పులను బట్టి జరుగుతూ ఉంటుంది. రెండుగా విడిపోయిన జర్మనీ మళ్లీ ఒక్కటి కాలేదా? పరస్పరం కత్తులు నూరుకున్న ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మళ్లీ ఒక్కటయ్యే ఆలోచనలు చేయడం లేదా? ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నది. భవిష్యత్తులో మళ్లీ ఒక్కటి కావచ్చు. హైదరాబాద్‌పై మమకారంతో ఎంతకాలమని ఆందోళనలు చేస్తారు? ఏ నగరానికి ఉండే ప్రత్యేకతలు ఆ నగరానికి ఉంటాయి. హైదరాబాద్, హైదరాబాద్ అంటూ రాష్ట్రంలోని మిగతా నగరాల అభివృద్ధిని ఇప్పటికే విస్మరించారు.

ఇప్పటికైనా వివేకంతో వ్యవహరించడం ద్వారా కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంపై సీమాంధ్రులు దృష్టి కేంద్రీకరించడం మంచిది. హైదరాబాద్‌పై మమకారం పెంచుకుని ఎంతకాలమని పరాయివాళ్లలాగ బతుకుతారు? అంత ఖర్మ ఎందుకు? రాష్ట్రం విడిపోయినంత మాత్రాన హైదరాబాద్‌లో ఉండాలనుకునేవాళ్లని ఎవరూ వెళ్లగొట్టలేరు. టీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతానికి రెచ్చగొట్టే ప్రకటనలు చేయగలరుగానీ ఒక్కసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. వాస్తవ పరిస్థితులను ఆకళింపు చేసుకుని సమ్మెబాట పట్టిన సీమాంధ్ర ఉద్యోగులు పట్టువిడుపుల ధోరణి ప్రదర్శించాలి. ఈ రాష్ట్రంలో మేధావులకు, విజ్ఞులకు కొదవ లేదు. తెలుగుజాతి రాష్ట్రాలుగా విడిపోయి ఒక్కటిగా కలిసి ఉండాలని కాంక్షించేవారు ఉభయ ప్రాంతాల్లో ఉన్నారు. వారంతా ముందుకు వచ్చి సమస్య మరింత ముదరకుండా ఉభయ పక్షాలకు న్యాయం జరిపించడానికి చొరవ తీసుకోవాలి. విడిపోవడం బాధాకరమే! కుటుంబ వ్యవస్థలో కూడా విడిపోయి కలిసి ఉంటున్నారు.

కలిసి ఉండి పరస్పరం నిందించుకుంటూ బతికే బదులు విడిపోయి కలిసి ఉండటం ఎప్పటికైనా ఎవరికైనా శ్రేయస్కరం. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా మొండివైఖరి విడనాడి సీమాంధ్రుల జీవితాలకు భరోసా ఇవ్వడానికి ఏమి చేయబోతున్నదో చెప్పాలి. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారం అయ్యేలా పరస్పరం సహకరించుకోవాలి. భావోద్వేగాల పేరిట మనల్ని మనం ఎంతకాలం శిక్షించుకుంటాం? పొరుగు రాష్ట్రాల ముందు మనం ఇప్పటికే పలుచన అయ్యాం. ఇలాంటి సందర్భాలలో పెద్దమనిషి తరహాలో మధ్యవర్తిత్వం వహించగలిగే రాజకీయ పార్టీ ఒక్కటి కూడా లేకపోవడం మన దురదృష్టం. గతంలో ఇలాంటి చారిత్రక సందర్భాలలో కమ్యూనిస్టులు కీలకపాత్ర పోషించే వాళ్లు. ఇప్పుడు రాష్ట్రంలోని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఉత్తర దక్షిణ ధ్రువాలుగా చీలిపోయాయి కనుక ఆ ఆశ కూడా లేదు. తమ గోడు పట్టించుకునే రాజకీయ పార్టీ ఒక్కటి కూడా లేదన్న భావం సీమాంధ్ర ప్రజలలో ఏర్పడితే అన్ని పార్టీల పుట్టి మునుగుతుంది. సీమాంధ్ర ప్రజలకు ఒక సలహా- మీరు పోరాడవలసింది సమైక్య రాష్ట్రం కోసం కాదు. మీ హక్కుల కోసం పోరాడండి. ఫలితం ఉంటుంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి