21, ఆగస్టు 2013, బుధవారం

రాజ్యాంగబద్ధ సంస్థలు స్వయంప్రతిపత్తి


ప్రజాస్వామ్యం వర్థిల్లడానికి, సామాన్యుడికి మేలు జరగ డానికి అన్నిటికంటే ముఖ్యమైనది పరిపాలన లోపరహితంగా ఉండటం. దీనిలో భాగంగా దేశ పాలనావ్యవస్థలో పలు సంస్థలు మూల స్తంభాలుగా నిలుస్తూ, బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. అయితే వీటికి స్వయం ప్రతిపత్తి కల్పించే అంశంపై విజ్ఞప్తులు వస్తున్నా, తన నియంత్రణలో ఉంచుకోవడంపైనా, మరిన్ని ప్రతిబంధకాలు ఏర్పరచడంపైనే ప్రభుత్వ దృష్టి పెడుతోంది. ఇటీవలి కాలంలో సి.బి.ఐ ‘పంజరంలో చిలుకలాగ’ మారిందని దానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రజా స్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన సంస్థల పనితీరు ఎలా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది? అసలు ఈ స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం ఎందుకు? ఈ సంస్థలు ఎలా పని చేయాలి? విశ్లేషణాత్మకంగా పరిశీలిద్దాం....
icons
బొగ్గు కుంభకోణంపై సర్వోన్నత న్యాయస్థానానికి సి.బి.ఐ నివేదిక సమర్పించక ముందే ఆ నివేదికను న్యాయశాఖ మంత్రి. ప్రధాని కార్యాలయం అధికారులు చూడటంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే అయితే ఎట్టి పరిస్థితులలోను నివేదికలను ప్రభుత్వానికి చూపించకూడదని సుప్రీం కోర్టు సి.బి.ఐకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికి సి.బి.ఐ నివేదికను ప్రధాని కార్యాలయం అధికారులు, న్యాయశాఖ మంత్రి చూడగలిగారంటే సి.బి.ఐ డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అత్యున్నత ప్రజా స్వామ్య సంస్థలకు అధిపతులుగా నియమితులవుతున్నవారు ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తులుగా మాత్రమే తమ విధులు నిర్వర్తిస్తారని అలాంటి వారినే ప్రభుత్వం ఆయా స్థానాల్లో కూర్చోబెడుతుందన్న విమర్శలు పి.జె.ధామస్, నవీన్ చావ్ల, అశ్వనీకుమార్ నియామకాలలో మరింత బలపడ్డాయి. అలాగే సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా నియమకం విషయంలో ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ ‘‘800 కోట్ల పశుదాణానికి సూత్రధారి అయిన లాలూప్రసాద్ యాదవ్‌పై దర్యాప్తు చేసి, అతనికి ఆ కుంభకోణంలో అభిశంసించదగ్గ సంబంధ మేమీ లేదని చెప్పింది రంజిత్ సిన్హా ఆధ్వర్యంలోని బృందమేనని, కాబట్టి ఆ వ్యక్తి సి.బి.ఐ డెరెక్టర్‌గా నియమితు లవడం సబబుకాదని ఆయన నియామకాన్ని వ్యతిరేకించాయి’’.

అలాగే విజిలెన్స్ కమిషనర్‌గా పి.జె థామస్‌ను నియమించి నప్పుడు, ఎలక్షన్ కమిషనర్‌గా నవీన్ చావ్లను నియమించి నప్పుడు కూడా పూర్వాశ్రమంలో ఆయా వ్యక్తులు అధికారపార్టీకి వీరవిధేయులుగా వున్నారు కాబట్టే ఆయా స్థానాలలో నియమించ బడ్డారనే విమర్శలు వినిపించాయి.ఇటీవల కాలంలో సిబిఐ కి చట్ట బద్ధత కల్పించాలని దాని ద్వారా సిబిఐ మరింత నిష్పాక్షికంగా పని చేసే అవకాశం కలుగుతుందని పార్లమెంటరీ కమిటీ సూచించింది. కానీ, ఒక ప్రజా స్వామ్య సంస్థకు చట్టబద్ధ హోదా కల్పించినంత మాత్రాన అది పూర్తి నిష్పాక్షికంగా పని చేస్తుందని భావించలేము. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వ్యవస్థనే బహుళ సభ్య సంఘంగా మార్చడం వల్ల ప్రభుత్వానికి విధేయులైన వారినే ‘కాగ్’ వ్యవస్థలో స్థానం కల్పించి ప్రభుత్వం సంకుచిత ప్రయోజనాలు కాపాడుకొనే ప్రయత్నం చేసిందన్న విమర్శలు మనకు తెలుసు కాబట్టి ప్రజాస్వామ్య సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని అలా స్వతంత్ర ప్రతిపత్తిని సిబిఐకి కూడా కల్పిస్తే రాజకీయ ప్రయోజనాలతో సంబంధం లేకుండా నిష్పాక్షికంగా పని చేసే అవకాశం వుందని ప్రజాస్వామ్య వాదులు ఆకాంక్షిస్తున్నారు.అయితే సి.బిఐ లాంటి ప్రజాస్వామ్యబద్ధమైన సంస్థకాని లేదా ఎలక్షన్ కమిషన్, లాంటి రాజ్యాంగ బద్ధమైన సంస్థకు కాని స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తే పూర్తిగా ప్రజాస్వామ్యం విజయవంత మౌతుందన్న అభిప్రాయలు కూడా వ్యక్త మవుతున్నాయి.
ఎలక్షన్ కమిషన్
ఉదాహరణకు ఎలక్షన్ కమిషన్‌నే తీసుకుంటే ఆర్టికల్ 324 ప్రకారం ఏర్పాటయిన స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థగా పరిగణించాలి. కేంద్ర రాష్ర్ట స్థాయిల్లో (స్థానిక ఎన్నికలు మినహాయించి) నిర్వహించే ఎన్నికల నియంత్రణ, పర్యవేక్షణ అంతా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత దేశంలో ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించడానికి ఈ క్రింది విధంగా స్వయంప్రతిపత్తి కల్పించారు.ఎన్నికల కమిషనర్లను రాష్ర్టపతి నియమిస్తారు. ఎన్నికల కమిషనర్ల వేతనంపై పార్లమెంట్ ఓటు వేయలేదు. ఈ వేతనం భారత సంఘటిత నిధి నుంచి చెల్లించబడుతుంది. దీనిని పెంచవచ్చు కానీ, తగ్గించడానికి వీల్లేదు.ఎన్నికల కమిషనర్లను తొలగించే ప్రక్రియ కూడా క్లిష్టంగా రూపొందించబడింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ను తొలగించాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియను అనుస రించాలి. అలాగే ఇతర కమిషనర్లను ప్రధాన ఎన్ని కల కమిషనర్ సలహాతో రాష్ర్టపతి తొలగించాలి.ఈ విధంగా ఎన్నికల కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి, కమిషనర్లకు పదవీకాలభద్రత, నిష్పాక్షి కంగా పని చేసే అవకాశం లభించింది. ఇలాంటి స్వయంప్రతిపత్తినే సి.బి.ఐ కి కూడా కల్పిస్తే సి.బి.ఐ ప్రభుత్వం కనుసన్నలలో విధినిర్వహణ చేయడం కాకుండా స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ మనం పైన చెప్పిన స్వయంప్రతిపత్తి ఆచరణలో మరో కోణాన్ని స్పృశిస్తుంది. ఎన్నికల కమిషనర్లుగా నియమించబడేవారికి ఎలాంటి అర్హతలూ ఉండాలని నిర్దేశించలేదు. కాబట్టి ఎన్నికల కమిషనర్ల నియామకం కేంద్ర ప్రభుత్వ ఇష్టా యిష్టాలపై ఆధారపడి ఉంటుంది.

అంతేకాక అదనపు కమిషనర్ల నియామకం, తొలగింపు కేంద్ర ప్రభుత్వ విచక్షణ మేరకే కొనసాగింది. ఉదాహరణకు : 1989 అక్టోబర్ 15 వరకు ఏకసభ్య కమిషన్‌గా ఉన్న ఎన్నికల సంఘాన్ని అక్టోబర్, 16 ,1985న త్రిసభ్య కమిషన్‌గా మార్చడం, అలాగే జనవరి 1990లో తిరిగి ఏక సభ్య సంఘంగా మార్చడం మరలా 1993 అక్టోబర్ నుండి త్రిసభ్య సంఘంగా మార్చడం జరిగింది.అంతేకాక ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు గాని ప్రజాస్వామ్య సంస్థకు గాని స్వయంప్రతిపత్తి ఇచ్చినప్పటికీ కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ తనకు విధేయులుగా ఉన్న వారిని సంబంధిత పదవులలో నియమించమని రాష్ర్టప తికి సూచించవచ్చు. అలాంటిది జరిగిన ప్పుడు ఏ సంస్థ కూడ నిష్పాక్షికంగా పని చేయలేదు.ఉదాహరణకు ఎన్నికల కమిషనర్‌గా నవీన్ చావ్ల నియా మకం అదే విధంగా జరిగిందని సర్వత్రా విమర్శించడం మనకు తెలుసు..
కాగ్ నియామకాలు
కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ పదవిని తీసుకున్నట్లయితే ఆర్టికల్ -149 ప్రకారం మరియు 1971 కాగ్ చట్టం ప్రకారం కాగ్‌కి అధికారాలు ఇవ్వబడ్డాయి. కాని ‘కాగ్’ ఇండియాలో కేవలం ఆడిటర్ జనరల్‌గా మాత్రమే వ్యవహరిస్తున్నారు కానీ, కంప్ట్రోలర్‌గా వ్యవహరించడం లేదు. అలాగే కొన్ని రహస్య వ్యయాలను నియంత్రించే అధికారం కాగ్‌కి వుండదు. ముందస్తు ఆడిటింగ్‌కు కూడ అవకాశం లేక పోవడం వల్ల కాగ్ నివేదికలను విమర్శకులు శవపరీక్షతో పోల్చడం జరుగుతోంది.
-దానికి పరిష్కారంగా ‘కాగ్’ కి న్యూజిలాండ్ దేశంలో ఇచ్చినట్లు బాధ్యతలతో పాటు అధికారాలు ఇవ్వాలి. ప్రస్తుతం ‘కాగ్’ కేవలం ఆడిటర్‌గా వ్యవహరించడం మాత్రమే చేస్తున్నారు. అధికారాలు లేకుండా బాధ్యతలు మాత్రమే నిర్వర్తిస్తూ కూడా కామన్ వెల్త్ దేశాలలో భారత ‘కాగ్’ కి సముచిత స్థానం ఉంది. కాబట్టి వ్యవస్థ మరింత ప్రభావశీలంగా పని చేయడం కోసం బ్రిటన్ మాదిరిగా అధికారాలు, విధులు రెండూ కల్పించినట్టయితే ప్రజాధనం వృధాకాకుండా తగిన చర్యలను సమర్ధ వంతంగా చేపట్టే అవకాశం ఉంది.
-అంతేకాకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, ప్రజాసంస్థలు ప్రభావశీలంగా పని చేయడం కోసం సర్కారియా కమిషన్, 2వ పాలనా సంస్కరణల సంఘం, జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలో పనిచేసిన రాజ్యాంగ సమీక్ష కమిషన్ సూచనలను హేతుబద్ధంగా అమలు చేయాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి