August 25, 2013
ఇప్పుడు మేం ఏం చేయాలి? సీమాంధ్రకు చెందిన ప్రధాన రాజకీయ పక్షాల నాయకులను వేధిస్తున్న ప్రశ్న ఇది! కాంగ్రెస్, తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు బయటకు ఏమి చెబుతున్నా తమ రాజకీయ మనుగడపై వారి మనస్సుల్లో ఆందోళన రోజురోజుకు పెరుగుతోంది. దీనికి కారణం- కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుని దాదాపు నెల కావొస్తున్నా, సీమాంధ్రలో సమైక్య ఉద్యమం జోరు తగ్గకపోగా పెరగడం. ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమం చేపట్టడంతో వారితో శ్రుతి కలపవలసిన పరిస్థితి ఆయా రాజకీయ పార్టీల నేతలకు ఏర్పడింది. మిగతా పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సీమాంధ్రలో మరీ దయనీయంగా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నందున రాష్ట్ర విభజనపై తుది నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపైన పడింది.
దీంతో నిన్నటివరకు తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ఎన్నో అవమానాలు భరిస్తూ వచ్చారు. ఇప్పుడు విభజన నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకుల ముఖాల్లో నవ్వులు పూస్తున్నాయి. ఇక తమ రాజకీయ భవిష్యత్తుకు ఢోకా లేదన్న భరోసాతో వారున్నారు. అదే సమయంలో విభజన నిర్ణయంతో సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది. విభజనకు వ్యతిరేకంగా ఆ ప్రాంత ప్రజలలో ఇంత భారీ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ కారణంగానే విభజన విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ నాయకులు చెబుతూ వచ్చారు. అయితే విభజన ప్రకటన తర్వాత క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు.
తెలంగాణతో పోల్చితే సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులలో సీనియర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆరు పర్యాయాలు ఎం.పి.లుగా గెలిచిన వారున్నారు. వారంతా ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తుపై తీవ్రంగా కలత చెందుతున్నారు. దీంతో ప్రజల మనోభావాలకు అనుగుణంగా అంటూ పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. ఈ పరిణామం అంతిమంగా ఏ మలుపులకు దారితీస్తుందో వేచిచూడాలి. అటు కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సీమాంధ్రలో ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించలేదు. దీంతో విభజన విషయంలో తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కు వెళ్లలేక, అలాగని ముందుకూ వెళ్లలేక సతమతమవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నట్టుగా విభజన విషయంలో ఇప్పుడు వెనక్కు వెళితే రాష్ట్రంలో కాంగ్రెస్ దుకాణాన్ని శాశ్వతంగా మూసుకోవలసి రావడమే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా ఆ పార్టీ ప్రతిష్ఠ మంటగలుస్తుంది.
దీంతో 'ఇప్పుడు ఏమి చేయాలో, మీకు ఏమి కావాలో చెప్పండి' అని తమ పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులను కాంగ్రెస్ అధిష్ఠానం అడుగుతోంది. గురువారంనాడు పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసినప్పుడు ఆమె నుంచి వచ్చిన ఈ ప్రశ్నకు కేంద్రమంత్రి చిరంజీవి ఇచ్చిన సమాధానం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. "మేడం! ఏమి కావాలో చెప్పే పరిస్థితిలో మేం లేము. ప్రజలను అనుసరించడం మినహా ప్రస్తుతానికి మా ముందు మరో మార్గం లేదు. సీమాంధ్ర ప్రజలు ఏమి కోరుకుంటే అదే మేం చెప్పవలసిన పరిస్థితి. అందుకు భిన్నంగా మాట్లాడితే ప్రజలలోకి వెళ్లలేం'' అని చిరంజీవి బదులిచ్చారు. హైదరాబాద్‌ను తెలంగాణకు పరిమితం చేయడం వల్ల తమ విద్య, ఉద్యోగ అవకాశాలపై సగటు సీమాంధ్రులలో కూడా ఆందోళన నెలకొంది. ఈ కారణంగానే అక్కడ ఎవరూ ఊహించని రీతిలో ఆందోళనలు జరుగుతున్నాయి.
ప్రజాగ్రహం తగ్గుముఖం పట్టాలంటే హైదరాబాద్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. సీమాంధ్రులకు భరోసా కల్పించండి అని చిరంజీవి తమ పార్టీ అధినాయకురాలికి సూచించారు. నిజానికి కాంగ్రెస్ అధిష్ఠానం విభజన ప్రకటన చేసే సమయంలో చేసిన కొన్ని తప్పుల వల్ల తనకు తానే ముందరి కాళ్లకు బంధం వేసుకుంది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతుందని గతంలో చేసిన ప్రకటనను పునరుద్ఘాటించకుండా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తామనీ, హైదరాబాద్ తెలంగాణ సొంతమనీ, పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందనీ ప్రకటించడంతో ఇప్పుడు న్యాయ, రాజకీయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాజధాని అంటే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి. అప్పుడు హైదరాబాద్ పరిధిలో శాసనసభ్యులు ఉండరు. ఇందుకు మజ్లిస్ పార్టీనే కాదు, ఇతర పార్టీలకు చెందిన హైదరాబాద్ నాయకులూ ఒప్పుకోరు. దీంతో గండం గట్టెక్కడం ఎలా అన్నదానిపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది.
వివిధ వర్గాల నుంచి సేకరించిన సలహాలు, సూచనల ప్రకారం హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భద్రత కల్పించడానికై రెవెన్యూ, శాంతిభద్రతలను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పరిధిలో చేర్చాలన్న ప్రతిపాదనను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుంది. అయితే, ఎవరికివారే రాజకీయ ప్రయోజనాలకు పాకులాడుతున్నందున ఇటువంటి ప్రతిపాదనకు బి.జె.పి. మద్దతు ఇస్తుందో లేదో తెలియదు. ఈ కారణంగానే కేబినెట్ నోట్ తయారీలో కూడా జాప్యం జరుగుతోంది. తెలంగాణలో కూడా టి.ఆర్.ఎస్. వంటి పార్టీలు అదను కోసం కాచుకుని కూర్చున్నాయి. విభజన ప్రక్రియ సజావుగా సాగడానికి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సహకరించే పరిస్థితి లేదు. తమకు రాజకీయ ప్రయోజనం దక్కనప్పుడు తామెందుకు సహకరించాలన్నది ఆయా పార్టీల భావన.
ఈ నేపథ్యంలోనే టి.ఆర్.ఎస్. నాయకులు ఇటీవలి కాలంలో స్వరం పెంచుతున్నారు. హైదరాబాద్ విషయంలో ఉదారంగా ఉండాలని తొలుత భావించినా, పదేళ్లకు పైగా తెలంగాణ కోసం ఉద్యమించిన తమను మాట మాత్రంగానైనా సంప్రదించకుండా విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రకటించినందుకు టి.ఆర్.ఎస్. నాయకులు కుతకుతలాడుతున్నారు. విభజన ప్రక్రియ సాఫీగా పూర్తి అయితే ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. దీంతో భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంతో పాటు బి.జె.పి.ని కూడా టి.ఆర్.ఎస్. నాయకులు ఇప్పుడు టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఆ రెండు పార్టీలు లేకపోతే తెలంగాణలో ప్రధాన రాజకీయపక్షంగా మిగిలిపోవచ్చుననీ, అప్పుడు కాంగ్రెస్‌లో విలీనం అవ్వక తప్పని పరిస్థితి నుంచి తాము బయటపడతామన్నది టి.ఆర్.ఎస్. నాయకుల ఆలోచన. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నాయకుల నోటి నుంచి రెచ్చగొట్టే ప్రకటనలు మళ్లీ మొదలయ్యాయి.
విభజన ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి అవ్వాలన్న సదుద్దేశంతో రాజకీయ జె.ఎ.సి., ఉద్యోగ సంఘాలు చేపట్టిన సద్భావన ర్యాలీలు, శాంతి దీక్షలు కూడా దారి తప్పుతున్నాయి. ఈ ర్యాలీలు, దీక్షలలో ప్రసంగిస్తున్న టి.ఆర్.ఎస్. నాయకులు సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడటం మొదలెట్టారు. నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు అవసరం లేదు. హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రులకు భరోసా కల్పించే క్రమంలో చేస్తున్న వ్యాఖ్యలు కూడా పుండు మీద కారం రాస్తున్నట్టుగా ఉంటున్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్‌లోనే ఉండి కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చునని టి.ఆర్.ఎస్. అధినేత చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలు, ఆయనకు తెలంగాణవాదుల నుంచి చప్పట్లు తెచ్చిపెట్టి ఉండవచ్చుగానీ, తమను అవమానించడంగా సీమాంధ్రులు భావిస్తున్నారు.
బతుకుదెరువులో భాగంగా ఎంటర్‌ప్రైజింగ్ నేచర్ ఉన్నవారు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. ఈవెంట్ల నిర్వహణ ఇప్పుడో పెద్ద వ్యాపారం అయ్యింది. ఇవన్నీ కాలానుగుణంగా వస్తున్న మార్పులు. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్న ఈ రోజుల్లో వంట చేసుకోవడం కష్టం కనుక కుక్కర్‌లో ఇంత అన్నం వండుకుని, కర్రీ పాయింట్స్ నుంచి కూరలు తెచ్చుకుంటున్నారు. జీవన శైలిలో వచ్చిన ఈ మార్పుకు అనుగుణంగా కర్రీ పాయింట్‌తో పాటు డోర్ డెలివరీ వంటి వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి. సీమాంధ్రుల మనస్సులను కష్టపెట్టడం వల్ల తెలంగాణ ఏర్పాటు సులువు అవుతుందని కె.సి.ఆర్. అండ్ కో భావిస్తే చెప్పేదేమీ లేదు. కొంతమంది తెలంగాణవాదుల విపరీత పోకడలు, వ్యాఖ్యల వల్ల హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రులలో భయాందోళనలు ఏర్పడుతున్న విషయం వాస్తవం.
దీన్ని పోగొడతామని చెబుతూనే, "మర్యాదగా మా దారికి రండి. లేదా మీ దారి మీరు చూసుకోండి'' వంటి హెచ్చరికలు చేయడంలో ఔచిత్యం ఏమిటో అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నవారే ఆలోచించుకోవాలి. సీమాంధ్ర నాయకులు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు కూడా అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. తెలంగాణవాదులను నరరూప రాక్షసులని నిందిస్తూ ఆనం వివేకానందరెడ్డి చేసిన వ్యాఖ్యలు గర్హనీయం. నాయకుల సంగతి ఏమోగానీ, తెలంగాణ ప్రజలు మాత్రం సాత్వికులు. ఉభయ ప్రాంతాల్లో భావోద్వేగాలు నెలకొన్నందున ప్రస్తుతానికి కొంత విజ్ఞత లోపిస్తున్నా త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఆశిద్దాం.
ఇప్పుడు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం విషయానికి వద్దాం. విభజన ప్రకటనానంతరం సీమాంధ్రలో ఉద్యమం పెచ్చరిల్లడంతో అన్ని పార్టీలూ ఆత్మరక్షణలో పడ్డాయి. సి.పి.ఐ. కార్యదర్శి నారాయణ అన్నట్టు పరిస్థితులు ఇలాగే కొనసాగితే, రాజకీయ పార్టీల మనుగడే దెబ్బతినే ప్రమాదం ఉంది. మిగతా పార్టీల నాయకులలో కూడా ఇదే అభిప్రాయం ఉంది. అయితే పిల్లి మెడలో ఎవరు గంట కట్టాలన్నదే ప్రశ్న! రాష్ట్రం సమైక్యంగా ఉండటం జరిగే పని కాదని అన్ని రాజకీయ పక్షాలకూ తెలుసు. అయితే సీమాంధ్ర ప్రజల వద్దకు వెళ్లి ఆ మాట చెప్పడానికి ఏ పార్టీకీధైర్యం చాలడం లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు కొద్ది రోజుల క్రితం నన్ను కలిసి, "పరిస్థితులు బాగా లేవు. విభజన నిర్ణయాన్ని మా పార్టీ వెనక్కు తీసుకోదు. ఈ పరిస్థితులలో మీలాంటి వారైనా చొరవ తీసుకుని ప్రధాన రాజకీయ పక్షాల ప్రతినిధులను కూర్చోబెట్టి సీమాంధ్రకు ఏమి కావాలన్న దానిపై చర్చ పెడితే బాగుంటుంది'' అని సూచించారు.
ఆయన నిజాయతీగానే ఈ సూచన చేశారు. అయితే సీమాంధ్రలో విభజన నిర్ణయం తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా మారినందున ఆ పార్టీతో జతకట్టి తాము కూడా ఎందుకు ఊబిలో పడాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం వంటి పార్టీలు ఉన్నాయి. సీమాంధ్రలో పెల్లుబుకుతున్న ప్రజాందోళనలకు అన్ని రాజకీయ పార్టీలూ భయపడుతున్నాయి. దీంతో విభజన విషయంలో తాము గతంలో చేసిన ప్రకటనలకు నేతలు కట్టుబడి ఉండలేకపోతున్నారు. గతంలో సమన్యాయం చేయాలని కోరిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సమైక్యవాదాన్ని భుజానికెత్తుకుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్మోహన్ రెడ్డి జైలులోనే ఆదివారం నుంచి నిరాహారదీక్ష చేపట్టబోతున్నారు. ఆయన తల్లి శ్రీమతి విజయలక్ష్మి నాలుగు రోజులపాటు గుంటూరులో దీక్ష చేశారు.
తెలంగాణ ప్రాంతంలో చతికిలబడటంతో ఆ పార్టీ సమైక్యవాదాన్నే నమ్ముకోవాలని నిర్ణయించుకుంది. దీంతో మిగతా పార్టీలు కూడా ఆత్మరక్షణలో పడ్డాయి. సమైక్యవాదాన్ని ఎంత గట్టిగా వినిపించినా ఫలితం ఉండదని తెలిసి కూడా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆ నినాదాన్ని లంకించుకున్నందున తామెందుకు వెనకబడాలన్న ఉద్దేశంతో సమైక్యవాదాన్ని వినిపించడం మొదలెట్టాయి. సమ న్యాయానికి, సమైక్యవాదానికి పొంతన లేదు. సమైక్యవాదమంటే తెలంగాణవాదాన్ని కాదన్నట్టే. అయినా సరే సీమాంధ్రలో రాజకీయ భవిష్యత్తును వెతుక్కోవడం కోసం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ఈ వైఖరి తీసుకుంది. దీంతో తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉంటామని చెబుతూనే, సీమాంధ్రకు న్యాయం చేయాలని కొంతసేపు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కొంతసేపు వాదించడం మొదలుపెట్టింది.
మిగతా రాజకీయ పార్టీలన్నీ తమను దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నించడంతో తెలుగుదేశం, వై.సి.పి.లు విభజనకు అనుకూలమేనని చెప్పడం వల్ల కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎదురుదాడికి దిగారు. ఈ మూడు పార్టీలదీ ఒకే పరిస్థితి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించకపోతే సీమాంధ్రలో పుట్టగతులు ఉండవు. అందుకే ఎవరికి వారు తమ ఒళ్లు కాపాడుకోవడానికి అనుగుణంగా రకరకాల పల్లవులు అందుకుంటున్నారు. మరో ఎనిమిది మాసాల్లో ఎన్నికలు ఉండి ఉండకపోతే పరిస్థితి మరోలా ఉండేది. కాంగ్రెస్ పార్టీ కూడా రానున్న ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికే విభజన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఆ పార్టీ ప్రయోజనం పొందబోతున్నది కనుక, సీమాంధ్రలో ఆ పార్టీని దోషిగా నిలబెట్టడానికి మిగతా పార్టీలు సహజంగానే ప్రయత్నిస్తాయి.
ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్ఠానం తమను దారుణంగా మోసం చేసిందన్న అభిప్రాయానికి సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ముఖ్యులు వచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టడంతో పాటు, కాంగ్రెస్ పార్టీని కాపాడటానికి తాము విధేయులుగా ఉంటే, తమ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి తెలంగాణలో వచ్చే సీట్లపై ఆశతో తమ పార్టీ అధిష్ఠానం విభజన నిర్ణయం తీసుకుందని వారు వాపోతున్నారు. సీమాంధ్రులకు ఉపశమనం కలిగించడానికై కొన్ని చర్యలు తీసుకున్నా వచ్చే ఎన్నికలలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావన్న అభిప్రాయానికి వారు వచ్చారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం ఉవ్వెత్తున ఉన్నప్పుడు తాము ఎదురొడ్డి పోరాడామనీ, ఆ రోజే ఆయనతో చేతులు కలిపి ఉంటే రాష్ట్రంలో ప్రభుత్వం పతనం అవ్వడమే కాకుండా ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉండేవారనీ, కాంగ్రెస్ కోసం త్యాగాలకు సిద్ధపడ్డ తమకు పార్టీ అధిష్ఠానం నుంచి ఇటువంటి ప్రతిఫలం దక్కుతుందని భావించలేదని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. "సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది.
ఇంకా పార్టీని పట్టుకుని వేలాడుతూ మా రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోదల్చుకోలేదు'' అని కాంగ్రెస్‌కు చెందిన ఒక ముఖ్యుడు వ్యాఖ్యానించారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల అంతరంగాన్ని బట్టి వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం వెనక్కు తీసుకోకపోతే సమైక్యవాదం పేరిట కొత్త పార్టీ పెడతామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వంటివారు చేస్తున్న ప్రకటనలను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. కాంగ్రెస్ అధిష్ఠానానికి తన ప్రయోజనాలు ముఖ్యమైనప్పుడు, సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులకు కూడా వారి ప్రయోజనాలే ముఖ్యమవుతాయి. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కూడా రాజకీయ వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు.
వచ్చే ఎన్నికలలో పోటీ చేయకూడదన్న నిర్ణయానికి ఆయన దాదాపుగా వచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి విభజన పూర్తి అయితే రాజకీయాలకు స్వస్తి చెప్పి బెంగళూరులో స్థిరపడాలన్న ఆలోచనకు కిరణ్‌కుమార్ రెడ్డి వచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొంతకాలం క్రితం తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉండేవారు. కాంగ్రెస్‌కు చెందిన కొంతమంది ఎం.పి.లు, ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే ఆలోచన చేయగా, ఆ పార్టీలో చేరడం ఇష్టంలేని మరికొందరు తెలంగాణ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీ పెటి, టి.ఆర్.ఎస్.తో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేయాలన్న ఆలోచన చేశారు. ఇప్పుడు సీమాంధ్రకు చెందిన నాయకులు కూడా ఇటువంటి ఆలోచనే చేస్తున్నారు. అయితే తెలంగాణకు చెందిన వారు టి.ఆర్.ఎస్.లో చేరడానికి అవకాశం ఉన్నట్టుగా, తమకు అటువంటి అవకాశం కూడా లేదని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వారు సుముఖంగా లేరు.
"ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి అవినీతిని విమర్శించిన మేము ఆయనతో చేతులు కలపలేం. అదీగాక జగన్ నైజం తెలిసిన మేము ఆయనతో ఎలా కలుస్తాం'' అని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ ఎం.పి. ఒకరు వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితులలో రాష్ట్ర విభజన నిర్ణయం అమలులో జాప్యం జరిగేలా, చేయగలిగినదంతా చేయాలన్న నిర్ణయానికి సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు వచ్చారు. తమ పార్టీ అధిష్ఠానం విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోదని వారికి తెలుసు. అందుకే పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందడంలో అడ్డంకులు సృష్టించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో పార్లమెంట్‌లో కొన్ని రాజకీయ పక్షాల మద్దతు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ముందుగా సమాజ్‌వాదీ పార్టీని సంప్రదించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకమైన సమాజ్‌వాదీ పార్టీ మద్దతు వారికి లభించింది.
వచ్చే నెల ఏడవ తేదీన హైదరాబాద్‌లో జరపతలపెట్టిన సమైక్యాంధ్ర సభకు ములాయం సింగ్ యాదవ్ లేదా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను ఆహ్వానించాలన్న నిర్ణయానికి సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు వచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ లేదా డిసెంబర్‌లో జరుగుతాయనీ, అప్పటివరకు విభజన ప్రక్రియ జాప్యం జరిగేలా చూడగలిగితే ఆ తర్వాత సీమాంధ్రలో పరిస్థితులను బట్టి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కొత్త పార్టీ ఏర్పాటుచేసే నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. ఈ విషయంలో తాము ఏదో ఒక తీవ్ర నిర్ణయం తీసుకోని పక్షంలో సీమాంధ్రలో తమకు పుట్టగతులు ఉండవనీ, అక్కడ పోటీ తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ మధ్య ఉంటుందని వారు భావిస్తున్నారు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడిగా పార్టీని వదిలిపెడితే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది.
ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తారన్న నమ్మకంతో కాంగ్రెస్ అధిష్ఠానం తమను ముంచిందనీ, జగన్ సంగతి వాళ్లకు తెలియదనీ, కాంగ్రెస్ అధిష్ఠానం అంచనా వేస్తున్నట్టుగా తెలంగాణలో కాంగ్రెస్‌కు పదిహేను సీట్లు లభించవనీ, జగన్‌కు బెయిల్ లభించి బయటకు వస్తే తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలలో రెడ్డి సామాజికవర్గం అండగా నిలబడుతుందనీ, అప్పుడు కాంగ్రెస్‌కు ఎనిమిది సీట్ల కంటే ఎక్కువ దక్కవనీ సీమాంధ్ర కాంగ్రెస్ ముఖ్యులు పార్టీ పెద్దలకు వివరించారు. అనుకోని పరిస్థితులలో జగన్‌కు 25 వరకు ఎం.పి. సీట్లు దక్కితే కాంగ్రెస్ ముఖం కూడా చూడడని, అలాంటి జగన్‌ను నమ్ముకుని మాకు ద్రోహం చేయడం ఏమిటని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు అధిష్ఠానం పెద్దల వద్ద ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. రాష్ట్రం విడిపోతే వందల సంఖ్యలో నాయకులు, లక్షల సంఖ్యలో కార్యకర్తల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది కనుక, తాము ఏదో ఒక తీవ్ర నిర్ణయం తీసుకోకతప్పదన్న ఆలోచనతో వారున్నారు. ఈ ఆలోచనలు మున్ముందు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.
సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు సొంత పార్టీ పెట్టుకుంటే దాని ప్రభావం తెలుగుదేశం పార్టీపై కూడా పడుతుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికీ విభజనకు అనుకూలంగా తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెబుతూ, సీమాంధ్రకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు సొంత పార్టీ ఆలోచన చేస్తే సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం నాయకులు చంద్రబాబు అదుపులో ఉండే అవకాశం లేదు. ఎవరి రాజకీయ భవిష్యత్తు వారికి ముఖ్యం. కాంగ్రెస్ నాయకుల దారిలో తెలుగుదేశం నాయకులు కూడా సొంత పార్టీ ఆలోచన చేయరని చెప్పలేం. అదే జరిగితే చంద్రబాబు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారుతుంది.
ఇటు తెలంగాణలోనూ, అటు సీమాంధ్రలోనూ అధికారం దక్కకపోతే ఆయన రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పడుతుంది. నిజంగా ఈ పరిస్థితి ఏర్పడితే చంద్రబాబుకు కూడా సమైక్యవాద నినాదం అందుకోక తప్పని పరిస్థితి. మొత్తంమీద విభజన నిర్ణయం రాష్ట్ర రాజకీయాలలో ఎంతో మంది తలరాతలను తలకిందులు చేయబోతున్నది. నిన్నటివరకు తమకు తిరుగులేదనుకున్నవారు చతికిలబడుతున్నారు. ఇదివరకే చతికిలబడి ఉన్నవారు పైకి లేస్తున్నారు. రాజకీయాలలో ఇవ్వాళ ఉన్నట్టు రేపు ఉండదు అంటే ఇదే మరి! ఈ రాష్ట్రంలో రేపు ఏమి జరుగుతుందో తెలియదు. ఇప్పుడున్న పార్టీలు ఇలాగే ఉంటాయా? కొత్త పార్టీలు పుట్టుకువస్తాయా? అన్నది కాలమే చెప్పాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నాయకులకు రాష్ట్రం ఒక్కటిగా ఉండటమా? విడిపోవడమా? అన్నదానికంటే తమ రాజకీయ భవిష్యత్తు ముఖ్యంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజలలో ఆగ్రహావేశాలు వ్యక్తమై ఉండకపోతే సమైక్యవాదం మరుగునపడిపోయేది.
ఇటు తెలంగాణలో గానీ, అటు సీమాంధ్రలో గానీ ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్న నాయకులు అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అయితే వారు ఇప్పుడు నోరు విప్పలేని పరిస్థితి. ఉభయ ప్రాంతాల ప్రజలలో నెలకొన్న భావోద్వేగాలకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు గానీ, నిజం చెప్పే పరిస్థితి గానీ రాష్ట్రంలో ఇప్పుడు లేదు. ఈ కారణంగా రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పట్లో చల్లబడే అవకాశం లేదు. రాష్ట్రం కలిసి ఉండటం సాధ్యం కాదు కనుక ప్రాక్టికల్‌గా ఆలోచించి హక్కుల కోసం పోరాడమంటే సీమాంధ్రులకు కోపం. విభజన ఇవ్వాళ కాకపోతే రేపు జరుగుతుంది. సంయమనం పాటించండి. రెచ్చగొట్టే ప్రకటనలకు దూరంగా ఉండమంటే తెలంగాణవాదులకు కోపం. దీంతో మాట్లాడగలిగిన వారు కూడా మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ పరిణామం ఉభయ ప్రాంతాల ప్రజలకు మంచిది కాదు.
అయినా భావోద్వేగాలకు ఎదురెళ్లి ఎదురుదెబ్బలు తినడానికి ఎవరు మాత్రం సిద్ధపడతారు? ప్రస్తుత పరిస్థితికి రాజకీయ పార్టీలను కూడా పూర్తిగా నిందించడానికి లేదు. పార్టీలకు కూడా వాటి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమవుతాయి. ప్రజలలో నెలకొన్న భావోద్వేగాలకు విరుద్ధంగా విభజన నిర్ణయానికి కట్టుబడి ఉండలేని పరిస్థితి. రాజకీయాలతో సంబంధం లేనివాళ్లు చాలా చెబుతారు. క్షేత్రస్థాయిలో ఉండే మా ఇబ్బందులు మీకేమి తెలుస్తాయని ఆయా ప్రాంతాల నాయకులు నిష్టూరమాడుతున్నారు.
అదీ నిజమే! పీత కష్టాలు పీతవి మరి! అన్ని పార్టీలకు, ఆ పార్టీలలో ఉన్నవారందరికీ రాజకీయ భవిష్యత్తుపై ఎవరూ భరోసా ఇవ్వలేరు. అందుకే ఎవరికి తోచిన దారిని వారు వెతుక్కుంటున్నారు. మొత్తానికి రాష్ట్రాన్ని రాజకీయాలు కమ్మేశాయి. మరో ఎనిమిది నెలలపాటు ప్రజలకు ఈ వేదన తప్పదు. 2014 ఎన్నికల తర్వాత అయినా రాష్ట్రం ఒక్కటిగా ఉన్నా, రెండుగా ఉన్నా పరిస్థితులు కుదుటపడి తెలుగు జాతి సఖ్యతతో మెలగాలని ఆశిద్దాం!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి